జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ప్రజలు ఎదురుచూడడం అలవాటై పోయింది.
నెల్లూరు(పొగతోట), న్యూస్‌లైన్: జిల్లాకు కొత్త కలెక్టర్ వచ్చినప్పుడల్లా తమ సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ప్రజలు ఎదురుచూడడం అలవాటై పోయింది. కానీ ప్రతిసారీ వారికి నిరాశే మిగులుతోంది. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు జిల్లా అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నా వినతులు మాత్రం పేరుకుపోతున్నాయి. ప్రజల సమస్యలను త్వరగా పరిష్కరించేందుకు కలెక్టర్ నూతన విధానాన్ని ప్రారంభించినా.. దాని వల్ల అశించిన ఫలితాలు రావడం లేదు. రోజు రోజుకూ వినతులు పెరుగుతున్నాయే కాని తగ్గడం లేదు. గతంలో గ్రీవెన్స్‌డేకు ఆయా శాఖలకు సంబంధించిన కిందిస్థాయి అధికారులు హాజరయ్యేవారు. కలెక్టర్ శ్రీకాంత్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా అధికారులందరూ తప్పకుండా గ్రీవెన్స్‌డేకు హాజరుకావాలని ఉత్తర్వులు జారీ చేశారు.
కలెక్టర్ ఉత్తర్వుల ప్రకారం జిల్లా అధికారులందరూ గ్రీవెన్స్ డేకు హాజరవుతున్నారు. ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. ఆర్‌డీఓ కార్యాలయంలోను గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నారు. గ్రీవెన్స్ డేలో ప్రజలు సమర్పించిన అర్జీలు వేల సంఖ్యలో పరిష్కారానికి నోచుకోకుండా అలాగే ఉన్నాయి. సుమారు 7 వేలకు పైగా అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. గత ఏడాది నవంబర్ నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఆర్‌డీఓ, తహశీల్దారు కార్యాలయాల్లో ప్రజలు 5,071 వినతి పత్రాలు సమర్పించారు.
వాటిలో 1,948 అర్జీలు మాత్రమే పరిష్కారానికి నోచుకున్నాయి. 3,123 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. నెల్లూరు తహశీల్దార్ కార్యాలయంలో అత్యధికంగా 2,094 వినతి పత్రాలు ప్రజలు సమర్పించారు. వాటిలో కేవలం 4 వినతులను మాత్రమే అధికారులు పరిష్కరించారు. దొరవారిసత్రం మండలంలో అతి తక్కువగా 17 వినతి పత్రాలు సమర్పించారు.
వాటిలో 15 సమస్యలను పరిష్కరించారు. రెండు సమస్యలు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయి. నెల్లూరు డివిజన్ పరిధిలో 2,951 అర్జీల్లో 423 పరిష్కరించారు. 2,528 పెండింగ్‌లో ఉన్నాయి. నాయుడుపేట డివిజన్ పరిధిలో 487కు 446 పరిష్కరించారు. కావలి డివిజన్‌లో 522కు 369 పరిష్కరించారు. గూడూరు డివిజన్‌లో 626కు 349 పరిష్కరించారు. ఆత్మకూరు డివిజన్ పరిధిలో 485కు 361 సమస్యలను పరిష్కరించారు. వివిధ శాఖల జిల్లా అధికారుల వద్ద 4 వేలకు పైగా అర్జీలు పరిష్కారానికి నోచుకోలేదు. సాంఘిక సంక్షేమ శాఖ, బీసీ కార్పొరేషన్, డీఆర్‌డీఏ, హౌసింగ్ తదితర శాఖల వద్ద అధిక సంఖ్యలో అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయి. రెండు నెలల నుంచి ఎన్నికల హడావుడి, కోడ్ ఉండడంతో అర్జీల వైపు అధికారులు దృష్టిసారించలేదు.
మండల స్థాయిలో గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నా ప్రజలు మాత్రం కలెక్టరేట్‌లో బారులుతీరుతున్నారు. కలెక్టర్‌కు వినతి పత్రం సమర్పిస్తే త్వరగా సమస్య పరిష్కారానికి నోచుకుంటుందని ప్రజల నమ్మకం. దీంతో గ్రీవెన్స్ డేకు గ్రామీణప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో హాజరవుతుంటారు. జిల్లా యంత్రాంగం స్పందించి తమ సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
సమస్యలను త్వరగా పరిష్కరించేలా చర్యలు తీసుకుంటాం:
కలెక్టర్ గ్రీవెన్స్‌డేపై ప్రత్యేక దృష్టిసారిస్తున్నారు. నూతన విధానాలను ప్రారంభించారు.గ్రీవెన్స్ డేలో ప్రజలు సమర్పిస్తున్న అర్జీలను త్వరగా పరి ష్కరించేలా చర్యలు తీసుకుంటాం. ఎన్నికల వల్ల సమస్యలు అధికంగా ఉన్నాయి. వాటిని వెంటనే పరిష్కరించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటాం.
- నాగేశ్వరరావు, జిల్లా రెవెన్యూ అధికారి