penna delta
-
శతాబ్ది స్వప్నం సాకారం
సాక్షి, అమరావతి : ఇది పెన్నా డెల్టా రైతుల శతాబ్ది స్వప్నం. సంగం బ్యారేజ్‌ను సీఎం వైఎస్ జగన్ రికార్డు సమయంలో పూర్తిచేసి, జాతికి అంకితం చేయడంతో కల సాకారమైంది. దీంతో.. జీవ నదులైన గోదావరి, కృష్ణా బేసిన్లలోని రైతులతో పెన్నా డెల్టా రైతులు పంటల సాగు, దిగుబడులలో పోటీపడే స్థాయికి చేరుకున్నారు. అలాగే, పెన్నా వరదల ముప్పు పూర్తిగా తప్పడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు.. భూగర్భ జలమట్టం పెరగడంతో తాగు, సాగునీటి కొరత తీరింది. ఇక సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణాకు అడ్డంకులు తీరిపోయాయి. ‘సంగం’ కథాకమామిషు.. నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆ తర్వాత ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వచేసినా నీళ్లందించడం కష్టంగా మారింది. దీని స్థానంలో బ్యారేజ్ నిర్మిస్తే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందుతాయని.. ఆ బ్యారేజ్‌ను నిరి్మంచాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. వందేళ్ల కలను సాకారం చేస్తూ.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను నిజం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006, మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008, మే 21న చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. అప్పట్లో రూ.30.78 కోట్లు వ్యయం చేశారు. ఆయన హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే బాబు ప్రాధాన్యం.. సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ, అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం)ను నిర్మించాలని 2014లో నిపుణుల నివేదిక ఇచ్చింది. దీనిని ఆమోదించడంలో రెండేళ్లపాటు జాప్యంచేసిన టీడీపీ సర్కార్.. 2016, జనవరి 21న ఆ సూచన మేరకు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తిచేస్తామని ఒకసారి.. 2018కి పూర్తిచేస్తామని మరోసారి.. 2019కి పూర్తిచేస్తామని ఇంకోసారి మాటమారుస్తూ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు (ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.88.41 కోట్లను ఖర్చుచేసినా కమీషన్ల కక్కుర్తితో బ్యారేజ్ పనులను కొలిక్కి తేలేకపోయింది. కరోనా తీవ్రత.. వరద ఉధృతితో పోటీపడుతూ పనులు ఈ నేపథ్యంలో.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శరవేగంగా సంగం బ్యారేజ్‌ను పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో.. ♦ గతంలో ఎన్నడూలేని రీతిలో 2019–20లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీలు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసాయంటే పెన్నా నదికి ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ♦ ఓ వైపు కరోనా తీవ్రత.. మరోవైపు పెన్నా వరద ఉధృతితో పోటీపడుతూ బ్యారేజ్ పనులను సీఎం జగన్ పరుగులు పెట్టించారు. ♦ బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిమీల, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిమీల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. ♦ సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తిచేశారు. ♦ కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తిచేశారు. ♦ ఈ పనులను రూ.128.88 కోట్లతో పూర్తిచేసి.. బ్యారేజ్‌ను 2022, సెపె్టంబరు 6న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తద్వారా నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం.. ఇక సంగం బ్యారేజ్ పూర్తవడంతో 2022 నుంచి ఏటా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. దీంతో రైతులు విస్తారంగా పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా రైతులతో పోటీపడుతూ గరిష్టంగా దిగుబడులు సాధిస్తున్నారు. పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దక్కుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీలను నిల్వచేయడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు లభ్యమవుతున్నాయి. అలాగే, సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తిచేయడంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. ఇప్పుడు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి.. పెన్నా డెల్టాలో నాకు 16 ఎకరాల పొలం ఉంది. బ్యారేజ్ పూర్తికాక ముందు నీళ్లందక సాగుచేయడానికి ఇబ్బందిపడేవాణ్ణి. సీఎం జగన్ బ్యారేజ్‌ను పూర్తిచేయడంతో సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. సొంత పొలంతోపాటు కౌలుకు 40 ఎకరాలు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వరి సిరులు కురిపించిన ఘనత సీఎం జగన్‌దే. – మల్లవరం రామకృష్ణారెడ్డి, రైతు, కోవూరు రికార్డు సమయంలో పూర్తిచేశాం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంగం బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తిచేశాం. 3.85 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీళ్లందించడానికి బ్యారేజ్ దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వచేయడంవల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలకు ఇబ్బంది ఉండదు. సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జి పూర్తవడంవల్ల సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ స్వరూపం నిర్మాణం : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై.. (సోమశిల రిజర్వాయర్‌కు 40 కిమీల దిగువన) పరివాహక ప్రాంతం : 50,122 చ.కి.మీ. బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు (12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధంచేసిన స్టాప్‌లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటినిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : 335.80 కోట్లు మహానేత వైఎస్ హయాంలో వ్యయం : రూ.30.78 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.128.88 కోట్లు -
ఆపదలో ‘అన్నపూర్ణ’
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ‘అన్నపూర్ణ’గా భాసిల్లడానికి కారణమైన గోదావరి, కృష్ణా డెల్టాల్లో ఆకలి దప్పులు తప్పడం లేదు. ఈ రెండు డెల్టాలతోపాటు పెన్నా డెల్టాలోనూ సాగునీటి మాట దేవుడెరుగు.. గుక్కెడు తాగునీటికి ఇబ్బందులు పడే పరిస్థితి ముంచుకొస్తోంది. డెల్టాలు ఉప్పునీటి కయ్యలుగా, సాగుకు పనికి రాని భూములుగా మారుతున్నాయి. ఈ కఠోర వాస్తవాన్ని సాక్షాత్తు కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) నివేదిక బట్టబయలు చేసింది. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో భూములు శరవేగంగా చౌడుబారుతుండటం.. సాగుకు పనికి రాకుండా పోతుండటం.. పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతుండటానికి కారణాలను అన్వేషించి.. పరిస్థితిని చక్కదిద్దడానికి చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని 2014 జూన్ 19న ప్రధాని నరేంద్ర మోదీ నిర్వహించిన సమీక్ష సమావేశంలో సీడబ్ల్యూసీని ఆదేశించారు. నాలుగేళ్లపాటు సమగ్ర అధ్యయనం చేసిన సీడబ్ల్యూసీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చింది. దేశానికి తూర్పు, పశ్చిమ తీర రేఖలు, అండమాన్ నికోబార్, లక్షద్వీప్‌లతో కలిపి 7,516.6 కిలోమీటర్ల పొడవునా తీరం విస్తరించి ఉంది. దీవుల తీర రేఖను మినహాయిస్తే.. దేశానికి తూర్పు, పశ్చిమాన 5,422.6 కిలోమీటర్ల పొడవున తీర రేఖ ఉంది. దేశం నుంచి ప్రవహిస్తున్న 102కు పైగా నదులు తూర్పు, పశ్చిమ తీర రేఖల మీదుగా సముద్రంలో కలుస్తున్నాయి. రాష్ట్రానికి 973.7 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉంది. పొట్టి శ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల మీదుగా ఇది విస్తరించి ఉంది. కృష్ణా–గుంటూరు జిల్లాల మధ్యన ప్రవహిస్తున్న కృష్ణా నది, ఉభయ గోదావరి జిల్లాల నడుమ ప్రవహిస్తున్న గోదావరి, నెల్లూరు మీదుగా ప్రవహించే పెన్నా, స్వర్ణముఖి, కండలేరు, శ్రీకాకుళం జిల్లా మీదుగా ప్రవహించే వంశధార నదులు బంగాళాఖాతంలో కలుస్తాయి. ఎల్‌నినో, లానినో ప్రభావం వల్ల సముద్ర మట్టం ఎత్తు కనిష్టంగా 0.6 మీటర్ల నుంచి గరిష్టంగా రెండు మీటర్ల వరకు పెరిగింది. రాష్ట్రంలో సాధారణ వర్షపాతం 903.2 మిల్లీమీటర్లు కురవాలి. ప్రకాశం జిల్లాలో కనిష్టంగా 757 మిల్లీమీటర్లు, తూర్పు గోదావరిలో గరిష్టంగా 1,139 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తోంది. వర్షాభావ పరిస్థితుల వల్ల నదుల్లో ప్రవాహం ఏడాది పొడవునా ఉండటం లేదు. సముద్ర మట్టం ఎత్తు పెరగడం.. నదుల్లో ఏడాది పొడవున ప్రవాహం లేకపోవడం వల్ల తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లోకి నదులు, డ్రెయిన్ల ముఖద్వారాల మీదుగా సముద్రపు నీరు ఎగదన్నుతోందని.. ఇది భూమిని చౌడుబారేలా చేస్తుందని సీడబ్ల్యూసీ తేల్చింది. జాగ్రత్త పడకపోతే అంతే సంగతులు.. తీర ప్రాంతంలో ఇప్పటినుంచే జాగ్రత్తలు తీసుకోకపోతే భవిష్యత్‌లో భూగర్భ జలాలు ఉప్పు బారిపోవడం ఖాయమని, అప్పుడు డెల్టాల్లో సాగునీటి మాట దేవుడెరుగు గుక్కెడు తాగునీరు కూడా కష్టమవుతుందని సీడబ్ల్యూసీ తేల్చింది. భూమి చౌడుబారడం వల్ల సాగుకు పనికి రాకుండా పోతుందని.. పంట దిగుబడులు పూర్తిగా తగ్గుతాయని.. దీనివల్ల ఆకలికేకలు తప్పవని అభిప్రాయపడింది. నదులు, డ్రెయిన్లు సముద్రంలో కలిసే ప్రాంతాల్లో రెగ్యులేటర్లను నిర్మించి.. ఉప్పునీళ్లు ఎగదన్నకుండా చర్యలు తీసుకోవాలని సూచించింది. మడ అడవులను భారీ ఎత్తున పెంచి, తీరంలో జీవ వైవిధ్యాన్ని పెంపొందించాలని పేర్కొంది. భూగర్భ జలాల వినియోగాన్ని తగ్గించాలని.. భూగర్భం నుంచి తోడేసిన నీటిని.. వర్షకాలం అయినా రీఛార్జ్ చేయాలని.. దీనివల్ల ఉప్పు నీరు పైకి ఉబికి వచ్చే అవకాశం ఉండదని నివేదికలో పేర్కొంది. నదుల్లో ఏడాది పొడవునా ప్రవాహాలు కనిష్ట స్థాయిలోనైనా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. చేపల చెరువుల సాగును తగ్గించాలని.. రసాయన, క్రిమి సంహారక మందుల వినియోగాన్ని కనిష్ట స్థాయికి చేర్చాలని సూచించింది. రక్షణ చర్యలు తీసుకోకపోతే కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల సాగు ప్రశ్నార్థకం కావడం ఖాయమని స్పష్టం చేసింది. భూగర్భ జలాలు తోడేయడంతో.. కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో సాగునీటితోపాటు చేపల చెరువుల సాగుకు, తాగునీటి కోసం భారీ ఎత్తున భూగర్భ జలాలను తోడేస్తున్నారు. దీనివల్ల భూగర్భ జలమట్టం కనిష్ట స్థాయికి పడిపోతోంది. బోరుబావుల ద్వారా తోడిన మంచినీటి స్థానంలోకి ఉప్పునీరు చేరుతోందని సీడబ్ల్యూసీ గుర్తించింది. చేపల చెరువుల ప్రభావం వల్ల భూమి శరవేగంగా చౌడుబారుతోందని తేల్చింది. 2004 డిసెంబర్ 26న విరుచుకుపడిన సునామీ తూర్పు తీరాన్ని అతలాకుతలం చేసింది. మడ అడవులను నరికేయడం.. సునామీ దెబ్బకు తీర ప్రాంతం బలహీనపడటం వల్ల సముద్రపు నీరు ఉపరితలానికి బాగా ఎగదన్నింది. వీటి ప్రభావం వల్ల తీర ప్రాంతంలో 38 మండలాలు పూర్తిగానూ.. 26 మండలాల్లో భూములు పాక్షికంగానూ చౌడుబారాయి. తూర్పుగోదావరి జిల్లాలో పది, పశ్చిమగోదావరి జిల్లాలో 14, కృష్ణా జిల్లాలో 13, గుంటూరులో 12, ప్రకాశంలో 13, నెల్లూరు జిల్లాలో రెండు మండలాల్లో భూములు చౌడుబారినట్టు లెక్క తేల్చారు. దేశ వ్యాప్తంగా తీర ప్రాంతంలో 75.92 లక్షల ఎకరాల భూమి చౌడుబారిపోతే.. రాష్ట్రంలో 9.61 లక్షల ఎకరాల భూమి చౌడుబారి సాగుకు పనికి రాకుండా పోయింది. మిగతా ప్రాంతాల్లోనూ నేల చౌడు (క్షార) స్వభావం శరవేగంగా పెరుగుతోంది. ఇది కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపుతోందని.. ఏటా సగటున ఐదు శాతం చొప్పున దిగుబడి తగ్గుతోందని సీడబ్ల్యూసీ అంచనా వేసింది. రాష్ట్రంలోని ఇతర ప్రాంతాలతో పోలిస్తే.. తీర ప్రాంతంలో ప్రధానంగా కృష్ణా, గోదావరి, పెన్నా డెల్టాల్లో రసాయన ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగం 50 శాతం అధికంగా ఉందని, ఇది నేల స్వభావం శరవేగంగా మారడానికి దారితీస్తోందని తేల్చింది. -
సాగునీరివ్వకుంటే రైతుల ఆగ్రహానికి గురవుతాం
డెల్టాకు 26న నీరు విడుదల నాన్ డెల్టా అధ్యయానికి కమిటీ ఏర్పాటు సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను విజయవంతం చేయాలి పింఛన్లు, ఇండ్లు ఇవ్వకుండా ప్రజల్లోకి వెళ్లలేమన్న నాయకులు సభావేదికపైకి పిలవకపోవడంపై అలిగిన నేతలు టీడీపీ సమన్వయ, కార్యవర్గ సమావేశంలో మంత్రులు శిద్దా, నారాయణ సాక్షి ప్రతినిధి, నెల్లూరు : జిల్లాలో రెండోపంటకు నీరివ్వకుంటే రైతుల ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని, ఐఏబీ సమావేశం పెట్టకుండా నీటి విడుదలను జాప్యం చేయడం ఎంతమాత్రం సమంజసం కాదని.. వీలైనంత త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని టీడీపీ జిల్లా సమన్వయ కమిటీ నిర్ణయించింది. జిల్లా నాయకులు నీటి సమస్యను జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా, మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ నెల 26వ తేదిన డెల్టాకు నీరు విడుదల చేయాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో గురువారం సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పలు అంశాలను మంత్రులు జిల్లా నేతలతో చర్చించారు. ప్రధానంగా డెల్టాకు ఈ నెల 26న నీరు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు. అదే విధంగా నాన్‌డెల్టాకు ఎంత నీరు కావాలన్న దానిపై అధ్యయనం చేసేందుకు వ్యవసాయ అధికారులతో కమిటీ ఏర్పటు చేయాలని సూచించారు. కమిటీ ఇచ్చిన రిపోర్టు ఆధారంగా నవంబర్ 1న జరిగే ఐఏబీ సమావేశంలో జిల్లా కలెక్టర్ తగిన విధంగా నిర్ణయం తీసుకోవాలని మంత్రులు శిద్దా, నారాయణలు సూచించారు. జిల్లాలోని మెట్టప్రాంతాల్లో తాగునీరు ఎద్దడి ఏర్పడకుండా ముందుగానే తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. ఎమ్మెల్సీ ఎన్నికలపై చర్చ శాసన మండలి ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నికలకు సంబంధించి ఓటు నమోదు, ఏ విధంగా ముందుకు వెళ్లాలన్న విషయం సమావేశంలో చర్చకు వచ్చింది. పార్టీకి చెందిన ఉపాధ్యాయులు, పట్టభద్రులతో పాటు ఇతర పార్టీçల నుంచి వచ్చేవారిని కలుపుకుని పోయి విజయం కోసం పనిచేయాలని నిర్ణయించారు. సభ్యత్వ నమోదు, జనచైతన్యయాత్రలపై.. సమన్వయ కమిటీ సమావేశం అనంతరం జిల్లా కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నవంబర్ 1వ తేదినుంచి జరుగు పార్టీ సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను ప్రజల్లోకి తీసుకెళ్లి విజయవంతం చేయాలని మంత్రులు శిద్దా, నారాయణలు ఆదేశించారు. ప్రభుత్వం ఏర్పడ్డాక రెండున్నరేళ్ల కాలంలో అమలు చేసిన పథకాలను వివరించి ప్రభుత్వం పట్ల ప్రజల్లో విశ్వాసం కలిగించాలని తెలిపారు. ప్రజల సమస్యలను పార్టీ నాయకత్వం, అధికారుల దృష్టికి తీసుకువచ్చి ఎప్పటికప్పుడు పరిష్కరించే ప్రయతం చేయాలని సూచించారు. దీంతో కొంత మంది నాయకులు జిల్లాలో ఎక్కువ మంది ఫించన్లు, ఇండ్లు లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రుల దృష్టికి తీసుకువచ్చారు. అర్హులకు ప్రభుత్వ పథకాలు మంజూరు చేయడంలో జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లోకి వెళ్లలేకపోతున్నామని.. సభ్యత్వ నమోదు, జనచైతన్య యాత్రలను ఏ విధంగా నిర్వహించాలని మంత్రులను నిలదీశారు. మండలంలో ఏ ఒకరిద్దరకో అందకపోతే అది సాకుగా తీసుకుని చెప్పడం సరికాదని వారు బదులిచ్చారు. రాష్ట్రం అర్థిక ఇబ్బందుల్లో ఉన్నా అభివృద్ధికి సీఎం పాటుపడుతున్న విషయాన్ని ప్రజలకు వివరించాలని మంత్రులు జిల్లా నాయకులను ఆదేశించారు. ఇప్పటికే రెండున్నరేళ్లు గడిచిపోయిందని, పార్టీలో ఒకరి మీద ఒకరూ చాడీలు చెప్పుకుంటూ అంతర్గతంగా కొట్లాడుకుంటే ప్రతిపక్ష పార్టీ దానిని అడ్వాంటేజిగా తీసుకుని బలపడుతుందని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో అందరినీ కలుపుకుని పోయి పనిచేయాల్సిన బాధ్యత నియోజకవర్గ ఎమ్మెల్యేలు, ఇన్చార్జిల మీద ఉంటుందన్నారు. పదవుల విషయాన్ని పక్కన పెట్టి పార్టీ కోసం పనిచేయాలని సూచించారు. ఇప్పటికే అన్ని నియోజకవర్గాల నాయకుల పనీతీరుపై సీఎం చంద్రబాబు ఎప్పటికప్పుడు సర్వే చేయిస్తున్నారని, సర్వే ఆధారంగా వచ్చిన నెగెటివ్ పాయింట్లను ఆయా నియోజకవర్గ నేతలకు తెలియజేశారని, వాటిని సరిదిద్దుకోవాలన్నారు. జిల్లాలో పెండింగ్‌లో ఉన్న మండల కమిటీ సమావేశాలను వెంటనే నిర్వహించాలని ఆదేశించారు. అలిగిన నేతలు జిల్లాస్థాయి కార్యవర్గ సమావేశంలో సభావేదికపైకి పిలవలేదంటూ కొందరు పార్టీ నేతలు సమావేశం నుంచి అలిగి వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. సభా వేదికపై నగర పార్టీ అధ్యక్షుడు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, రమేష్‌రెడ్డిలు రాగా.. జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి చేజర్ల వెంకటేశ్వరరెడ్డి పేర్లు లేవని కిందికి దిగిపోవాలని సూచించారు. ఇదే తరహాలో రాష్ట్ర మహిళా నాయకురాలు తాళ్లపాక అనూరాధ, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ కిలారి వెంకటస్వామి నాయుడికి కూడా అవమానం జరగడంతో నలుగురూ సమావేశం నుంచి అర్ధంతరంగా వెళ్లిపోయారు. ఈ విషయం జిల్లా కార్యవర్గ సమావేశంలో చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో జిల్లా ఇన్చార్జి మంత్రి శిద్దా రాఘవరావు, రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ, ఎమ్మెల్సీలు సోమిరెడ్డి చంద్రమోహన రెడ్డి, బీద రవిచంద్ర, వాకాటి నారాయణరెడ్డి, మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, గూడూరు ఎమ్మెల్యే సునీల్‌కుమార్, నియోజకవర్గ ఇన్చార్జిలు పాల్గొన్నారు. -
డెల్టాకు నీరు నిలిపివేత
సోమశిల: సోమశిల జలాశయం నుంచి పెన్నార్ డెల్టాకు విడుదలవుతున్న నీటిని శనివారం అధికారులు నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా ఈఈ దేశ్ నాయక్ మాట్లాడుతూ జలాశయం నుంచి 2500 క్యూసెక్కుల నీరు విడుదలవుతున్న నేపథ్యంలో డెల్టా ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయన్నారు. దీంతో ఉన్నతాధికారుల ఆదేశాలు మేరకు నీటిని నిలిపామన్నారు. రెండో పంటకు సెప్టెంబర్ 15 తేదీ వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. ఇప్పటి వరకు 23.5 టీఎంసీల నీటిని విడుదల చేశామన్నారు. ఇంకా 4 టీఎంసీల వరకు ఇవ్వాల్సి ఉందన్నారు. పెతట్టు ప్రాంతాల నుంచి జలాశయానికి 569 క్యూసెక్కుల వంతున వరద ప్రవాహం వచ్చి చేరుతోందన్నారు. ప్రస్తుతం జలాశయంలో 7.365 టీఎంసీల నీరు నిల్వ ఉందన్నారు. జలాశయంలో 82.156 మీటర్లు, 269.54 అడుగు మట్టం నీటి మట్టం ఉందన్నారు.