శతాబ్ది స్వప్నం సాకారం | CM YS Jagan completed the Sangam barrage in record time | Sakshi
Sakshi News home page

శతాబ్ది స్వప్నం సాకారం

Published Sat, Jan 20 2024 4:56 AM | Last Updated on Sat, Jan 20 2024 3:10 PM

CM YS Jagan completed the Sangam barrage in record time - Sakshi

సాక్షి, అమరావతి : ఇది పెన్నా డెల్టా రైతుల శతాబ్ది స్వప్నం. సంగం బ్యారేజ్‌ను సీఎం వైఎస్‌ జగన్‌ రికార్డు సమయంలో పూర్తిచేసి, జాతికి అంకితం చేయడంతో కల సాకారమైంది. దీంతో.. జీవ నదులైన గోదావరి, కృష్ణా బేసిన్‌లలోని రైతులతో పెన్నా డెల్టా రైతులు పంటల సాగు, దిగుబడులలో పోటీపడే స్థాయికి చేరుకున్నారు. అలాగే, పెన్నా వరదల ముప్పు పూర్తిగా తప్పడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు.. భూగర్భ జలమట్టం పెరగడంతో తాగు, సాగునీటి కొరత తీరింది. ఇక సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణాకు అడ్డంకులు తీరిపోయాయి.  

‘సంగం’ కథాకమామిషు.. 
నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్‌ సర్కార్‌ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి.

పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆ తర్వాత ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వచేసినా నీళ్లందించడం కష్టంగా మారింది. దీని స్థానంలో బ్యారేజ్‌ నిర్మిస్తే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందుతాయని.. ఆ బ్యారేజ్‌ను నిరి్మంచాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్‌ చేస్తూ వచ్చారు. కానీ, 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. 

వందేళ్ల కలను సాకారం చేస్తూ.. 
నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను నిజం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి 2006, మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008, మే 21న చేపట్టారు. మహానేత వైఎస్‌ హయాంలో బ్యారేజ్‌ పనులు పరుగులు తీశాయి.  అప్పట్లో రూ.30.78 కోట్లు వ్యయం చేశారు. ఆయన హఠాన్మరణం సంగం బ్యారేజ్‌ పనులకు శాపంగా మారింది. 

కమీషన్లు వచ్చే పనులకే బాబు ప్రాధాన్యం.. 
సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ,  అప్పట్లో సెంట్రల్‌ డిజైన్స్‌ ఆర్గనైజేషన్‌ (సీడీఓ) చీఫ్‌ ఇంజనీర్‌ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్‌ (కాంక్రీట్‌ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్‌ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్‌ (కాంక్రీట్‌ కట్టడం)ను నిర్మించాలని 2014లో నిపుణుల నివేదిక ఇచ్చింది. దీనిని ఆమోదించడంలో రెండేళ్లపాటు జాప్యంచేసిన టీడీపీ సర్కార్‌.. 2016, జనవరి 21న ఆ సూచన మేరకు బ్యారేజ్‌ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తిచేస్తామని ఒకసారి.. 2018కి పూర్తిచేస్తామని మరోసారి.. 2019కి పూర్తిచేస్తామని ఇంకోసారి మాటమారుస్తూ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు (ఎస్కలేషన్‌), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.88.41 కోట్లను ఖర్చుచేసినా కమీషన్ల కక్కుర్తితో బ్యారేజ్‌ పనులను కొలిక్కి తేలేకపోయింది. 

కరోనా తీవ్రత.. వరద ఉధృతితో పోటీపడుతూ పనులు 
ఈ నేపథ్యంలో..  సీఎంగా వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శరవేగంగా సంగం బ్యారేజ్‌ను పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో..  
♦ గతంలో ఎన్నడూలేని రీతిలో 2019–20లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీలు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసాయంటే పెన్నా నదికి ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు.  
♦  ఓ వైపు కరోనా తీవ్రత.. మరోవైపు పెన్నా వరద ఉధృతితో పోటీపడుతూ బ్యారేజ్‌ పనులను సీఎం జగన్‌ పరుగులు పెట్టించారు.  
♦  బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిమీల, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిమీల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు.  
♦   సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జిని పూర్తిచేశారు.  
♦ కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్‌లను పూర్తిచేశారు.  
♦ ఈ పనులను రూ.128.88 కోట్లతో పూర్తిచేసి.. బ్యారేజ్‌ను 2022, సెపె్టంబరు 6న సీఎం జగన్‌ జాతికి అంకితం చేశారు. తద్వారా నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు.  

సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం.. 
ఇక సంగం బ్యారేజ్‌ పూర్తవడంతో 2022 నుంచి ఏటా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. దీంతో రైతులు విస్తారంగా పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా రైతులతో పోటీపడుతూ గరిష్టంగా దిగుబడులు సాధిస్తున్నారు. పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దక్కుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీలను నిల్వచేయడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు లభ్యమవుతున్నాయి. అలాగే, సంగం బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జిని పూర్తిచేయడంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది.  

ఇప్పుడు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి.. 
పెన్నా డెల్టాలో నాకు 16 ఎకరాల పొలం ఉంది. బ్యారేజ్‌ పూర్తికాక ముందు నీళ్లందక సాగుచేయడానికి ఇబ్బందిపడేవాణ్ణి. సీఎం జగన్‌ బ్యారేజ్‌ను పూర్తిచేయడంతో సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. సొంత పొలంతోపాటు కౌలుకు 40 ఎకరాలు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వరి సిరులు కురిపించిన ఘనత సీఎం జగన్‌దే.  – మల్లవరం రామకృష్ణారెడ్డి, రైతు, కోవూరు 

రికార్డు సమయంలో పూర్తిచేశాం.. 
సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంగం బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తిచేశాం. 3.85 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీళ్లందించడానికి బ్యారేజ్‌ దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వచేయడంవల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలకు ఇబ్బంది ఉండదు. సంగం బ్యారేజ్‌ కమ్‌ బ్రిడ్జి పూర్తవడంవల్ల సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది.    – సి. నారాయణరెడ్డి, ఈఎన్‌సీ, జలవనరుల శాఖ 

మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్‌ స్వరూపం
నిర్మాణం : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై.. (సోమశిల రిజర్వాయర్‌కు 40 కిమీల దిగువన) 
పరివాహక ప్రాంతం : 50,122 చ.కి.మీ. 
బ్యారేజ్‌ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్‌ బ్రిడ్జి) 
గేట్లు : 85 గేట్లు (12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్‌ స్లూయిజ్‌ గేట్లు) 
గేట్ల మరమ్మతుల కోసం సిద్ధంచేసిన స్టాప్‌లాగ్‌ గేట్లు : 9 
గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్‌ లిఫ్ట్‌ 
గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు 
గరిష్ట నీటి మట్టం     : 35 మీటర్లు 
గరిష్ట నీటినిల్వ     : 0.45 టీఎంసీలు 
కనీస నీటి మట్టం     : 32.2 మీటర్లు 
ఆయకట్టు     : 3.85 లక్షల ఎకరాలు 
అంచనా వ్యయం     : 335.80 కోట్లు 
మహానేత వైఎస్‌ హయాంలో వ్యయం : రూ.30.78 కోట్లు 
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.128.88 కోట్లు 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement