Penna River
-
పెన్నమ్మకు గర్భశోకం
సాక్షి టాస్క్‌ఫోర్స్: వైఎస్సార్ జిల్లా యర్రగుంట్ల మండల పరిధిలోని హనుమనుగుత్తి గ్రామ పంచాయతీ పరిధిలోని బిస్మిల్లాబాద్ గ్రామం సమీపంలో పెన్నానదిలోని ఇసుకను అక్రమదారులు ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. పైగా గేటు వసూలు చేస్తున్నారు. క్వారీలో నుంచి అవసరమైనప్పుడు ఇసుకను ఉచితంగా తెచ్చుకోవచ్చని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిన విషయం తెలిసిందే. యర్రగుంట్ల మండలం పరిధిలో ఎక్కడా ఇసుక క్వారీ లేదు. దీంతో అక్రమార్కులు ఇసుకను తోడేస్తూ పెన్నామ్మకు గర్భశోకం మిగిలిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే బిస్మిల్లాబాద్ గ్రామంలోని కొందరు టీడీపీ నాయకులు పెన్నానదిలోని ఇసుకను తరలిస్తున్నారు. ట్రాక్టర్‌కు ఒక రేటు పెట్టి గేటును వసూలు చేస్తున్నారు. రోజుకు ఒక్కరు చొప్పును వంతులు వేసుకొని బయట నుంచి ట్రాక్టర్లను రప్పించుకొని అనధికారంగా గేటును పెట్టుకుని వసూళ్లకు తెరలేపారు. రోజుకొకరు చొప్పున ఇసుకను అమ్ముకుంటున్నారు. ప్రొద్దుటూరు, రామేశ్వరం పొట్లదుర్తి గ్రామాల నుంచి ఇసుక కోసం రోజూ ట్రాక్టర్లు వరుసలో నిలబడుతున్నాయి.ఇసుక తరలిపోతుండటం వల్ల భూగర్భ జలాలు అడుగంటుతున్నాయని గ్రామస్తులు వాపోతున్నారు. వీరి అక్రమాలను మొదట్లో గ్రామస్తులు అడ్డుకున్నారు. తర్వాత గ్రామం కోసం డబ్బు వసూలు చేస్తున్నామంటూ వారికి నచ్చజెప్పారు. పెన్నాలో అక్రమంగా ఇసుకను గేటు పెట్టి వసూళ్లు చేసుకుంటున్నారని గ్రామంలోని కొందరు అధికారులకు ఫిర్యాదు చేశారు. రెవెన్యూ, పోలీస్ శాఖ అధికారులు మాత్రం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. -
నెల్లూరులో మంత్రి నారాయణ అనుచరుల బరితెగింపు
-
శతాబ్ది స్వప్నం సాకారం
సాక్షి, అమరావతి : ఇది పెన్నా డెల్టా రైతుల శతాబ్ది స్వప్నం. సంగం బ్యారేజ్‌ను సీఎం వైఎస్ జగన్ రికార్డు సమయంలో పూర్తిచేసి, జాతికి అంకితం చేయడంతో కల సాకారమైంది. దీంతో.. జీవ నదులైన గోదావరి, కృష్ణా బేసిన్లలోని రైతులతో పెన్నా డెల్టా రైతులు పంటల సాగు, దిగుబడులలో పోటీపడే స్థాయికి చేరుకున్నారు. అలాగే, పెన్నా వరదల ముప్పు పూర్తిగా తప్పడంతో ప్రజల ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. మరోవైపు.. భూగర్భ జలమట్టం పెరగడంతో తాగు, సాగునీటి కొరత తీరింది. ఇక సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణాకు అడ్డంకులు తీరిపోయాయి. ‘సంగం’ కథాకమామిషు.. నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ఆ తర్వాత ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. ఆనకట్టపై ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వచేసినా నీళ్లందించడం కష్టంగా మారింది. దీని స్థానంలో బ్యారేజ్ నిర్మిస్తే ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీళ్లందుతాయని.. ఆ బ్యారేజ్‌ను నిరి్మంచాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. కానీ, 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. వందేళ్ల కలను సాకారం చేస్తూ.. నెల్లూరు జిల్లా ప్రజల వందేళ్ల కలను నిజం చేస్తూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006, మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. ఈ పనులను రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008, మే 21న చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. అప్పట్లో రూ.30.78 కోట్లు వ్యయం చేశారు. ఆయన హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే బాబు ప్రాధాన్యం.. సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ, అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీఓ) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం)ను నిర్మించాలని 2014లో నిపుణుల నివేదిక ఇచ్చింది. దీనిని ఆమోదించడంలో రెండేళ్లపాటు జాప్యంచేసిన టీడీపీ సర్కార్.. 2016, జనవరి 21న ఆ సూచన మేరకు బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తిచేస్తామని ఒకసారి.. 2018కి పూర్తిచేస్తామని మరోసారి.. 2019కి పూర్తిచేస్తామని ఇంకోసారి మాటమారుస్తూ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. ఈ క్రమంలో చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు (ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.88.41 కోట్లను ఖర్చుచేసినా కమీషన్ల కక్కుర్తితో బ్యారేజ్ పనులను కొలిక్కి తేలేకపోయింది. కరోనా తీవ్రత.. వరద ఉధృతితో పోటీపడుతూ పనులు ఈ నేపథ్యంలో.. సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. శరవేగంగా సంగం బ్యారేజ్‌ను పూర్తిచేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. అదే సమయంలో.. ♦ గతంలో ఎన్నడూలేని రీతిలో 2019–20లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీలు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసాయంటే పెన్నా నదికి ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ♦ ఓ వైపు కరోనా తీవ్రత.. మరోవైపు పెన్నా వరద ఉధృతితో పోటీపడుతూ బ్యారేజ్ పనులను సీఎం జగన్ పరుగులు పెట్టించారు. ♦ బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిమీల, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిమీల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. ♦ సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తిచేశారు. ♦ కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తిచేశారు. ♦ ఈ పనులను రూ.128.88 కోట్లతో పూర్తిచేసి.. బ్యారేజ్‌ను 2022, సెపె్టంబరు 6న సీఎం జగన్ జాతికి అంకితం చేశారు. తద్వారా నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. సుజలాం.. సుఫలాం.. సస్యశ్యామలం.. ఇక సంగం బ్యారేజ్ పూర్తవడంతో 2022 నుంచి ఏటా పెన్నా డెల్టాలోని 2.47 లక్షలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. దీంతో రైతులు విస్తారంగా పంటలు సాగుచేస్తున్నారు. గోదావరి, కృష్ణా డెల్టా రైతులతో పోటీపడుతూ గరిష్టంగా దిగుబడులు సాధిస్తున్నారు. పంటల ఉత్పత్తులకు గిట్టుబాటు ధరలు దక్కుతుండటంతో రైతులు సంతోషం వ్యక్తంచేస్తున్నారు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీలను నిల్వచేయడంతో భూగర్భ జలాలు పెరిగి బోర్లు, బావుల్లో పుష్కలంగా నీళ్లు లభ్యమవుతున్నాయి. అలాగే, సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తిచేయడంతో సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్య శాశ్వతంగా పరిష్కారమైంది. ఇప్పుడు సమృద్ధిగా నీళ్లందుతున్నాయి.. పెన్నా డెల్టాలో నాకు 16 ఎకరాల పొలం ఉంది. బ్యారేజ్ పూర్తికాక ముందు నీళ్లందక సాగుచేయడానికి ఇబ్బందిపడేవాణ్ణి. సీఎం జగన్ బ్యారేజ్‌ను పూర్తిచేయడంతో సమృద్ధిగా నీళ్లందుతున్నాయి. సొంత పొలంతోపాటు కౌలుకు 40 ఎకరాలు తీసుకుని వరి సాగుచేస్తున్నా. మంచి దిగుబడులు వస్తున్నాయి. గిట్టుబాటు ధర దక్కుతోంది. వరి సిరులు కురిపించిన ఘనత సీఎం జగన్‌దే. – మల్లవరం రామకృష్ణారెడ్డి, రైతు, కోవూరు రికార్డు సమయంలో పూర్తిచేశాం.. సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు మంత్రి అంబటి రాంబాబు నేతృత్వంలో సంగం బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తిచేశాం. 3.85 లక్షల ఎకరాలకు సమృద్ధిగా నీళ్లందించడానికి బ్యారేజ్ దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వచేయడంవల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. దీనివల్ల సాగు, తాగునీటి సమస్యలకు ఇబ్బంది ఉండదు. సంగం బ్యారేజ్ కమ్ బ్రిడ్జి పూర్తవడంవల్ల సంగం–పొదలకూరు మండలాల మధ్య రవాణా సమస్యకు శాశ్వత పరిష్కారం లభించినట్లయింది. – సి. నారాయణరెడ్డి, ఈఎన్సీ, జలవనరుల శాఖ మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ స్వరూపం నిర్మాణం : శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో సంగం వద్ద పెన్నా నదిపై.. (సోమశిల రిజర్వాయర్‌కు 40 కిమీల దిగువన) పరివాహక ప్రాంతం : 50,122 చ.కి.మీ. బ్యారేజ్ పొడవు : 1,195 మీటర్లు (బ్యారేజ్‌కు అనుబంధంగా రెండు వరుసల రోడ్ బ్రిడ్జి) గేట్లు : 85 గేట్లు (12 మీటర్లు ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు.. 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 స్కవర్ స్లూయిజ్ గేట్లు) గేట్ల మరమ్మతుల కోసం సిద్ధంచేసిన స్టాప్‌లాగ్ గేట్లు : 9 గేట్ల నిర్వహణ విధానం : వర్టికల్ లిఫ్ట్ గరిష్ట వరద విడుదల సామర్థ్యం : 7,50,196 క్యూసెక్కులు గరిష్ట నీటి మట్టం : 35 మీటర్లు గరిష్ట నీటినిల్వ : 0.45 టీఎంసీలు కనీస నీటి మట్టం : 32.2 మీటర్లు ఆయకట్టు : 3.85 లక్షల ఎకరాలు అంచనా వ్యయం : 335.80 కోట్లు మహానేత వైఎస్ హయాంలో వ్యయం : రూ.30.78 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేసిన వ్యయం : రూ.128.88 కోట్లు -
హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా?
సాక్షి, అమరావతి: పెన్నా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్లో కురిసే వర్షపాతం పరిమాణం 1412.58 టీఎంసీలని లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటి లభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు. అప్పటికి, ఇప్పటికి ఇదీ తేడా.. పెన్నాలో నీటి లభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. 75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. కానీ.. బేసిన్ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. అంటే.. 1993తో పోల్చితే బేసిన్ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది. దీన్ని సాగునీటి రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటి లభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు. పెన్నా బేసిన్ ఇదీ.. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్ జిల్లా నంది కొండల్లోని చెన్నకేశవ పర్వత శ్రేణుల్లో పుట్టే పెన్నా నది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి.. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. ఎడమ వైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడి వైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్లో 400 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది. ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. -
వేసవిలోనూ పెన్నా బేసిన్లో జలరాశి
సాక్షి, అమరావతి: పెన్నా నది పరీవాహక ప్రాంతం (బేసిన్)లోని రిజర్వాయర్లలో వేసవిలోనూ పుష్కలంగా నీటి నిల్వలు ఉన్నాయి. శుక్రవారానికి రిజర్వాయర్లలో 151.94 టీఎంసీలు ఉన్నాయి. పెన్నా బేసిన్‌లోని రిజర్వాయర్ల పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. అంటే.. ఖరీఫ్ పూర్తయి, రబీ పంటలు కోత దశలో ఉన్న సమయంలో పెన్నా రిజర్వాయర్ల సామర్ధ్యంలో ఇప్పటికీ 63.42 శాతం నీరు నిల్వ ఉండటం గమనార్హం. సోమశిల రిజర్వాయర్‌లో 78 టీఎంసీలకుగానూ 52.62 టీఎంసీలు, కండలేరులో 68.3 టీఎంసీలకుగాను 38.65 టీఎంసీలు, గండికోటలో 26.85 టీఎంసీలకుగాను 25.37 టీఎంసీలు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లో 10 టీఎంసీలకుగాను 8.16 టీఎంసీలు, వెలిగల్లు ప్రాజెక్టులో 4.64 టీఎంసీలకుగాను 4.41 టీఎంసీలు జలాలు ఉన్నాయి. పెన్నా బేసిన్ చరిత్రలో ఏప్రిల్ రెండో వారంలో ఈ స్థాయిలో నీరు ఉండటం ఇదే ప్రథమమని అధికారవర్గాలు తెలిపాయి. రిజర్వాయర్లలో గతేడాది ఇదే రోజుకు 134.74 టీఎంసీలు.. 2021లో 127.6 టీఎంసీలు నిల్వ ఉండేవి. కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన నంది కొండల్లో జన్మించే పెన్నా నది.. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, బాహుదా, పించా, పాపాఘ్ని వంటి ఉప నదులను కలుకుకొని శ్రీ సత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, నెల్లూరు జిల్లాల మీదుగా ప్రవహించి.. ఊటుకూరు వద్ద సముద్రంలో కలుస్తుంది. వర్షఛాయ ప్రాంతంలో ఉన్న ఈ నదీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు కురవకపోడంతో 2019 వరకూ పెన్నాలో ప్రవాహం పెద్దగా ఉండేది కాదు. కానీ.. గత నాలుగేళ్లుగా బేసిన్లో సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా నది ఉరకలెత్తింది. చిన్న, మధ్య తరహా, భారీ ప్రాజెక్టులు నిండటంతో ఖరీఫ్‌లో భారీ ఎత్తున రైతులు పంటలు సాగుచేసుకున్నారు. రబీలోనూ నీరు పుష్కలంగా ఉండటంతో రైతులు అదే రీతిలో పంటలు సాగుచేసుకున్నారు. ప్రస్తుతం రబీ పంటలు కోత దశలో ఉన్నాయి. నీటి నిల్వలు సమృద్ధిగా ఉన్నందున పెన్నా బేసిన్లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు ఉండవని అధికారవర్గాలు చెప్పాయి. గతేడాది తరహాలోనే ఈ ఏడాదీ ఖరీఫ్‌లో పంటల సాగుకు ముందస్తుగా నీటిని విడుదల చేయవచ్చని తెలిపాయి. -
నెల్లూరు: పెన్నా నదిలో చిక్కుకున్న ఐదుగురు
నెల్లూరు: పెన్నా నదిలో శనివారం ఐదుగురు వ్యక్తులు చిక్కుకున్నారు. నది మధ్యలో ఇసుకదిబ్బపై వాళ్లు ఉండడం గమనించిన స్థానికులు అధికారులకు సమాచారం అందించారు. సాక్షి టీవీ సమాచారంతో స్పందించిన అధికారులు .. పెన్నా బ్రిడ్జి వద్దకు చేరుకున్నారు. తహసీల్దార్‌తో పాటు పోలీసులు కూడా వచ్చారు. చిక్కుకున్న వాళ్లను మత్యకారులుగా భావిస్తున్నారు. బోట్ ద్వారా వాళ్లను ఒడ్డుకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సోమశిల నుంచి పెన్నాకు నీటిని విడుదల చేయటంతోనే వాళ్లు అలా చిక్కుకుని ఉంటారని భావిస్తున్నారు. మరోవైపు తమ హెచ్చరికలు పట్టించుకోకుండా వాళ్లు నదిలోకి వెళ్లినట్లు అధికారులు భావిస్తున్నారు. -
నదుల్లో వరద ఉద్ధృతి.. శ్రీశైలానికి పెరిగిన ప్రవాహం
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. పెన్నానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3,00,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 8 వేలు, హంద్రీ–నీవాకు 1,013, కల్వకుర్తికి 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు. 884.7 అడుగుల్లో 213.38 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్ వే తొమ్మిదిగేట్లను 10 అడుగులు ఎత్తి 2,51,433, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,537 కలిపి 3,13,970 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగులు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి వదులుతున్నారు. పులిచింతలకు చేరుతున్న వరదను చేరుతున్నట్లుగా స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,99,478 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,728 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 2,96,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు. -
Anantapur: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం
కూడేరు/ గార్లదిన్నె/ శింగనమల(అనంతపురం జిల్లా): కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడంతో నురగలు కక్కుతూ దూకుతున్న జలసోయగం చూపరులను కట్టిపడేస్తోంది. కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) చరిత్రలో పది రోజుల వ్యవధిలో పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం కురిసిన వర్షాలకు పీఏబీఆర్‌కు 15వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 5.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈఈ లక్ష్మిదేవి తెలిపారు. ఉన్న ఏడు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్దనున్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నిండుకుండను తలపిస్తోంది. పీఏబీఆర్ నుంచి తుంగభద్రజలాలు రోజుకు 17వేల క్యూసెక్కులు ఎంపీఆర్‌లోకి వస్తున్నాయి. ఈ డ్యాంలో 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తు జాగ్రత్తగా రెండోసారి బుధవారం తొమ్మిది గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కులు పెన్నానది దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోనే పెద్దచెరువుల్లో ఒక్కటైన శింగనమల రంగరాయలచెరువు ఉధృతంగా మరవ పారుతోంది. దీంతో బుధవారం శింగనమల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసర పనులున్న వారిని బోటు ద్వారా అవతలికి తీసుకెళ్లారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో బెళుగుప్ప, కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో వేదావతి హగరి నది ఉగ్రరూపం దాల్చింది. -
దశాబ్దాల కల ‘సంగం’ సాకారం
మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నిర్మాణం పూర్తి కావడంతో పెన్నా డెల్టాలోని 2.47 లక్షల ఎకరాలు, కనుపూరు కాలువ కింద 63 వేలు, కావలి కాలువ కింద 75 వేలు వెరసి మొత్తంగా 3.85 లక్షల ఎకరాల ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందించడానికి మార్గం సుగమం అయ్యింది. ప్రధానంగా నెల్లూరుకు ముంపు ముప్పు తప్పింది. చెప్పిన మాట మేరకు యుద్ధ ప్రాతిపదికన బ్యారేజ్ నిర్మాణం పూర్తి చేయడం ద్వారా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తన నిబద్ధతను చాటుకున్నారు. దీనికి తోడు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి కూడా రికార్డు సమయంలో పూర్తి కావడం విశేషం. (మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి రామగోపాలరెడ్డి ఆలమూరు): శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల స్వప్నం సాకారమైంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో భాగంగా చేపట్టిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజ్ పనులను ఆయన తనయుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పూర్తి చేశారు. ఈనెల 6న బ్యారేజ్‌ను జాతికి అంకితం చేయనున్నారు. దీంతో పాటు నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా రికార్డు సమయంలో పూర్తి చేశారు. సంగం బ్యారేజీ నిర్మాణం ద్వారా పెన్నా వరదలను సమర్థవంతంగా నియంత్రించి, ముంపు ముప్పు నుంచి నెల్లూరు జిల్లా ప్రజలను తప్పించవచ్చు. బ్యారేజ్‌లో 0.45 టీఎంసీల నీటిని నిల్వ చేసే అవకాశం ఉండటం వల్ల పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరగడం ఖాయం. తద్వారా తాగునీటి ఇబ్బందులు తీరుతాయి. మేకపాటి గౌతమ్‌రెడ్డి బ్యారేజ్ కమ్ బ్రిడ్జిని పూర్తి చేయడం ద్వారా సంగం, పొదలకూరు మండలాల మధ్య రాకపోకల సమస్యను సీఎం వైఎస్ జగన్ శాశ్వతంగా పరిష్కరించారు. శిథిలమైనా పట్టించుకోని దుస్థితి నెల్లూరు జిల్లా సంగం వద్ద పెన్నా నదిపై 1882–83లో బ్రిటీష్ సర్కార్ 0.9 మీటర్ల ఎత్తున ఆనకట్టను నిర్మించి.. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల కింద ఆయకట్టుకు 1886 నుంచి నీళ్లందించడం ప్రారంభించింది. ఈ ఆనకట్టకు దిగువన నదీ గర్భంలో నిర్మించిన రోడ్డు ద్వారా సంగం–పొదలకూరు మండలాల మధ్య రాకపోకలు సాగుతున్నాయి. పెన్నాలో వరద పెరిగితే ఈ రెండు మండలాల మధ్య రాకపోకలు స్తంభించిపోయేవి. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. ఆనకట్ట శిథిలావస్థకు చేరుకోవడంతో.. దానిపై 0.3 మీటర్ల మేర ఇసుక బస్తాలు వేసి, నీటిని నిల్వ చేసినా.. ఆయకట్టుకు నీళ్లందించడం కష్టంగా మారింది. సంగం ఆనకట్ట స్థానంలో బ్యారేజ్ నిర్మించి, ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీళ్లందించాలని నెల్లూరు జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తూ వచ్చారు. అయితే ఆ డిమాండ్‌ను 2006 వరకూ ఎవరూ పట్టించుకోలేదు. సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసిన మేకపాటి గౌతమ్‌రెడ్డి సంగం బ్యారేజీ స్వప్నం సాకారం దిశగా అడుగులు.. నెల్లూరు జిల్లా ప్రజల చిరకాల స్వప్నాన్ని సాకారం చేసే దిశగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2006 మే 28న సంగం బ్యారేజ్‌కు శంకుస్థాపన చేశారు. రూ.147.50 కోట్ల అంచనా వ్యయంతో 2008 మే 21న పనులు చేపట్టారు. మహానేత వైఎస్ హయాంలో బ్యారేజ్ పనులు పరుగులు తీశాయి. ఈ పనులకు అప్పట్లో రూ.30.85 కోట్లు వ్యయం చేశారు. అయితే మహానేత వైఎస్ హఠాన్మరణం సంగం బ్యారేజ్ పనులకు శాపంగా మారింది. కమీషన్లు వచ్చే పనులకే టీడీపీ హయాంలో పెద్దపీట సంగం బ్యారేజ్‌ను నిర్మిస్తున్న ప్రాంతంలో పెన్నా నది వెడల్పు 1,400 మీటర్లు. కానీ.. అప్పట్లో సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ (సీడీవో) చీఫ్ ఇంజనీర్ 846 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ నిర్మాణం), ఇరువైపులా 554 మీటర్ల వెడల్పుతో మట్టికట్టలు నిర్మించేలా డిజైన్‌ను ఆమోదించారు. బ్యారేజ్ నిర్మాణ సమయంలో ఇబ్బందులు ఏర్పడటంతో డిజైన్లలో మార్పులు చేయాలని 2013లో అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై స్పందించిన ప్రభుత్వం 2013 నవంబర్ 23న నిపుణుల కమిటీని నియమించింది. బ్యారేజ్ నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించిన నిపుణుల కమిటీ.. 1,195 మీటర్ల వెడల్పుతో బ్యారేజ్ (కాంక్రీట్ కట్టడం) నిర్మించాలని 2014లో నివేదిక ఇచ్చింది. ఈ నివేదికను ఆమోదించడంలో రెండేళ్ల పాటు జాప్యం చేసిన టీడీపీ సర్కార్.. ఎట్టకేలకు 2016 జనవరి 21న బ్యారేజ్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ క్రమంలో అంచనా వ్యయాన్ని రూ.335.80 కోట్లకు పెంచింది. బ్యారేజ్‌ను 2017కు పూర్తి చేస్తామని ఒకసారి.. 2018కి పూర్తి చేస్తామని మరోసారి.. 2019కి పూర్తి చేస్తామని ఇంకోసారి ముహూర్తాలను మారుస్తూ వచ్చింది. టీడీపీ సర్కార్ కేవలం కమీషన్లు వచ్చే పనులకే అధిక ప్రాధాన్యం ఇచ్చింది. బ్యారేజ్‌లో 85 పియర్స్(కాంక్రీట్ దిమ్మెలు)ను సగటున 22 మీటర్ల చొప్పున అరకొరగా పూర్తి చేసింది. చేసిన పనుల కంటే.. ధరల సర్దుబాటు(ఎస్కలేషన్), పనుల పరిమాణం పెరిగిందనే సాకుతో అధికంగా బిల్లులు చెల్లించింది. రూ.86.10 కోట్లను ఖర్చు చేసినా బ్యారేజ్ పనులను ఒక కొలిక్కి తేలేకపోయింది. పెన్నా నదిపై సంగం బ్యారేజీ దిగువ వైపు నుంచి... అటు కరోనా, ఇటు వరద.. అయినా పూర్తి ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి బాధ్యతలు స్వీకరించాక సంగం బ్యారేజ్‌పై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రాధాన్యత ప్రాజెక్టుగా ప్రకటించి, శరవేగంగా పూర్తి చేయాలని జల వనరుల శాఖ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. 2020 మార్చి నుంచి 2021 ఆఖరుదాకా కరోనా మహమ్మారి విజృంభించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో 2019–20, 2020–21, 2021–22లో పెన్నా నది ఉప్పొంగి ప్రవహించింది. 2019–20 లో 42.52, 2020–21లో 301.52, 2021–22లో 373.52 టీఎంసీల నీరు నెల్లూరు బ్యారేజీ నుంచి సముద్రంలో కలిసిందంటే ఏ స్థాయిలో వరద వచ్చిందో అంచనా వేసుకోవచ్చు. ఓ వైపు కరోనా మహమ్మారి తీవ్రత.. మరో వైపు పెన్నా వరద ఉధృతితో పోటీ పడుతూ సంగం బ్యారేజ్ పనులను సీఎం వైఎస్ జగన్ పరుగులెత్తించారు. బ్యారేజ్ 85 పియర్లను 43 మీటర్ల ఎత్తుతో పూర్తి చేయించారు. ఈ పియర్స్ మధ్య 12 మీటర్ల ఎత్తు, 2.8 మీటర్ల వెడల్పుతో 79 గేట్లు, కోతకుగురై వచ్చిన మట్టిని దిగువకు పంపడానికి 12 మీటర్ల ఎత్తు, 3.8 మీటర్ల వెడల్పుతో 6 గేట్లు (స్కవర్ స్లూయిజ్) బిగించారు. వరద ప్రవాహం వచ్చినప్పుడు దిగువకు విడుదల చేయడానికి వీలుగా గేట్లను ఎత్తడానికి, దించడానికి విద్యుత్‌తో పనిచేసే హాయిస్ట్ వ్యవస్థను ఏర్పాటు చేశారు. బ్యారేజ్‌కు ఎగువన ఎడమ వైపున 3.17 కిలోమీటర్లు, బ్యారేజ్‌కు కుడి వైపున 3 కిలోమీటర్ల పొడవున కరకట్టలను పటిష్టం చేశారు. సంగం నుంచి పొదలకూరుకు రాకపోకలు సాగించడానికి వీలుగా బ్యారేజ్‌పై రెండు వరుసల రోడ్ బ్రిడ్జిని పూర్తి చేశారు. కనిగిరి, కావలి కాలువలకు సంయుక్తంగా నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్, కనుపూరు కాలువకు నీటిని సరఫరా చేసే రెగ్యులేటర్లను పూర్తి చేశారు. ఈ పనులను రూ.131.12 కోట్ల ఖర్చుతో పూర్తి చేసి.. నెల్లూరు ప్రజల దశాబ్దాల స్వప్నాన్ని సాకారం చేశారు. నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు సైతం రికార్డు సమయంలో నెల్లూరు బ్యారేజీ కమ్ బ్రిడ్జిని కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం పూర్తి చేసింది. జలయజ్ఞంలో భాగంగా దివగంత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2008–09లో ప్రారంభించిన ఈ ప్రాజెక్టును పదేళ్ల తర్వాత ఆయన తనయుడు జగన్మోహన్రెడ్డి సీఎంగా పూర్తి చేశారు. నెల్లూరు నగరానికి సమీపాన ఇప్పటికే ఉండే పాత ఆనకట్టకు వంద మీటర్ల ఎగువున ఇంకొక కొత్త బ్యారేజీ కమ్ బ్రిడ్జి ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టును కూడా ఈ నెల 6న జాతికి అంకితం చేయనున్నారు. 13 ఏళ్ల క్రితం మొదట్లో రూ.147.20 కోట్ల అంచనాతో మొదలు పెట్టిన ఈ ప్రాజెక్టులో 2014కు ముందే రూ.86.62 కోట్ల మేరకు పనులు పూర్తయ్యాయి. తర్వాత ప్రాజెక్టు వ్యయం రూ.274.83 కోట్లకు పెరిగింది. 2014–19 మధ్య చంద్రబాబు ప్రభుత్వం రూ.71.54 కోట్లు ఖర్చు చేసినా ప్రాజెక్టు పూర్తి చేసే ఆలోచనతో కాకుండా ప్రాజెక్టు నిర్మాణంలో కేవలం కమీషన్లకు అవకాశం ఉన్న పనులు చేపట్టేందుకు ఆసక్తి చూపింది. అయితే 2019లో వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక ఈ ప్రాజెక్టును ప్రాధాన్యత ప్రాజెక్టుగా గుర్తించారు. కేవలం మూడేళ్లలో రూ.77.37 కోట్లు ఖర్చు చేసి ప్రాజెక్టు ప్రధాన కాంక్రీట్, ఇతర మట్టి పనులన్నింటినీ ప్రభుత్వం పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టు పూర్తి చేయడం ద్వారా 72 గ్రామాల పరిధిలోని 99,525 ఎకరాల్లో సాగు నీటి పారుదల అవకాశాలు మెరుగు పడతాయి. నెల్లూరు– కోవూరుల మధ్య రాకపోకల ఇబ్బందులు పూర్తిగా తొలగిపోనున్నాయి. ఆనకట్టకు ఎగువన ఇన్ఫిల్ట్రేషన్ బావులు నిండడం వల్ల ఆ ప్రాంతంలో భూగర్భ జల మట్టం పెరిగి నెల్లూరు çనగరం.. ఆ చుట్టు పక్కల ప్రాంతాలకు తాగునీటి అవసరాలు తీరే అవకాశం ఉంది. ఇదో మహోజ్వల ఘట్టం సంగం బ్యారేజ్ నిర్మాణాన్ని మహానేత వైఎస్సార్ ప్రారంభిస్తే.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ పూర్తి చేసి ఈ నెల 6న జాతికి అంకితం చేయనుండటం మహోజ్వల ఘట్టం. కరోనా తీవ్రత, పెన్నా వరద ఉధృతిని తట్టుకుని.. బ్యారేజ్‌ను పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజలకు మేకపాటి గౌతమ్‌రెడ్డి చేసిన సేవలను స్మరించుకుంటూ బ్యారేజ్‌కు ఆయన పేరు పెట్టాం. పెన్నా డెల్టా, కనుపూరు, కావలి కాలువల ఆయకట్టుకు నీళ్లందించి సస్యశ్యామలం చేస్తాం. – అంబటి రాంబాబు, జల వనరుల శాఖ మంత్రి రికార్డు సమయంలో పూర్తి సీఎం ఆదేశాల మేరకు బ్యారేజ్‌ను రికార్డు సమయంలో పూర్తి చేశాం. 3.85 లక్షల ఎకరాలకు నీళ్లందించడానికి ఇది దోహదపడుతుంది. బ్యారేజ్‌లో నిత్యం 0.45 టీఎంసీలను నిల్వ చేయడం వల్ల భూగర్భ జలాలు పెరుగుతాయి. సాగు, తాగునీటికి ఇబ్బంది ఉండదు. బ్రిడ్జితో సంగం–పొదలకూరు మధ్య రవాణా సమస్యకు పరిష్కారం లభించింది. – సి.నారాయణరెడ్డి, ఈఎన్సీ నాణ్యతకు ప్రాధాన్యత సంగం బ్యారేజ్ పనులను అత్యంత నాణ్యతతో శరవేగంగా పూర్తి చేశాం. సీఎం వైఎస్ జగన్ ప్రాధాన్యత ప్రాజెక్టుగా సంగం బ్యారేజ్‌ను ప్రకటించి.. గడువులోగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఆ మేరకు గడువులోగా పూర్తి చేశాం. నెల్లూరు జిల్లా ప్రజల దశాబ్దాల కలను సీఎం వైఎస్ జగన్ నిజం చేశారు. – హరినారాయణ రెడ్డి, సీఈ, తెలుగుగంగ -
కర్ణాటకలో భారీ వర్షాలు.. చిత్రావతి, పెన్నా, జయమంగళి నదులకు భారీగా వరద
-
పెన్నా నది పరవళ్లు.. సువర్ణముఖి చిందులు
సాక్షి, రామగిరి(శ్రీ సత్యసాయి జిల్లా): ఎగువ ప్రాంతం కర్ణాటకలో కురుస్తున్న భారీ వర్షాలకు పెన్నమ్మ పరవళ్లు తొక్కుతూ పేరూరు చేరింది. దీంతో డ్యాం పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంటుండటంతో అధికారులు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. ఇప్పటి వరకూ ఒకటిన్నర టీఎంసీ దిగువకు వదిలినా పేరూరు డ్యాంకు ఇన్‌ఫ్లో ఏమాత్రం తగ్గలేదని, అందుకే నీటిని ఏకధాటిగా వదలుతున్నట్లు డీఈ వెంకటరమణ తెలిపారు. భారీ వర్షాలతో మూడు దశాబ్దాల తర్వాత పేరూరు డ్యాం నిండుకుండను తలపించగా... గత నెలలో తొలిసారి పేరూరు డ్యాం గేట్లు ఎత్తారు. తాజాగా సోమవారం మరోసారి గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతుండగా.. ఈ సుందర దృశ్యాన్ని తిలకించేందుకు పలు గ్రామాల ప్రజలు డ్యాం వద్దకు వస్తున్నారు. సువర్ణముఖి చిందులు నాలుగు దశాబ్దాల తర్వాత తొలిసారి మరువ పారిన చెరువులు అగళి: 20 రోజులుగా కర్ణాటక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షానికి సువర్ణముఖి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. వరద నీరు అగళి మండలంలోని మధూడి, ఇరిగేపల్లి, కోడిపల్లి, రావుడి, వడగుంటనపల్లి చెరువుల్లో చేరడంతో నాలుగు దశాబ్దాల తర్వాత అవన్నీ మరువ పారాయి. దీంతో స్థానికులు తండోపతండాలుగా వచ్చి మరువపారుతున్న ప్రాంతాల్లో జలకాలాటలు ఆడారు. (క్లిక్: ప్రాణం పోసుకుంటున్న నల్ల రాతి శిలలు!) -
తాడిపత్రి పెన్నా నదిలో చిక్కుకున్నవ్యక్తి సేఫ్
-
పర్యాటకానికి కొత్త కళ
జమ్మలమడుగు: పర్యాటక ప్రాంతమైన గండికోట అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం వేగవంతంగా చర్యలు చేపడుతోంది. గండికోట పరిసర ప్రాంతాలలో ఉన్న 1100 ఎకరాల రెవెన్యూ భూమిని పర్యాటకశాఖకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగానే స్థానిక రెవెన్యూ అధికారులు దానికి సంబంధించిన రికార్డులను పరిశీలించడంతోపాటు సర్వేలను పూర్తిచేశారు. మొత్తం 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను తహసీల్దార్ కార్యాలయం నుంచి అధికారులు విజయవాడకు తీసుకెళ్లి రాష్ట్ర ప్రభుత్వానికి అందజేశారు. మూడు నెలల్లో అందుబాటులోకి రోప్‌వే పెన్నానదిలోయ అందాలను వీక్షించడం కోసం ఏర్పాటు చేస్తున్న రోప్‌వే మరో మూడు నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానుంది. మరో రెండు మూడు వారాల్లో పూర్తిస్థాయిలో రోప్‌వే సామగ్రి రానుంది. పనులను వీలైనంత త్వరగా పూర్తిచేసి రోప్‌వేను పర్యాటకులకు అందుబాటులోనికి తీసుకుని వస్తామని అధికారులు పేర్కొంటున్నారు. పెరుగుతున్న పర్యాటకుల సంఖ్య ప్రపంచంలో గ్రాండ్ కెన్యాన్‌గా పేరుపొందిన పెన్నా నది లోయ అందాలతోపాటు, జుమ్మామసీదు, మాధవరాయస్వామి ఆలయం తదితర ప్రాంతాలను తిలకించేందుకు ఇటీవల పర్యాటకులు పెద్ద సంఖ్యలో వస్తున్నారు. దీంతో పర్యాటకులకు కావలసిన వసతుల కల్పన కోసం స్థానికంగా హరితా హోటల్‌తోపాటు, చాలా మంది ప్రత్యేకంగా లాడ్జిలను ఏర్పాటు చేసుకుని ఉపాధి పొందుతున్నారు. మరి కొంత మంది హోటల్, కూల్డ్రింక్స్షాపులను పెట్టుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో పర్యాటకులకు ఉన్నత స్థాయిలో విడిది ఏర్పాటు చేయడం కోసం గతంలో ఒబెరాయ్ హోటల్ యాజమాన్యం దాదాపు 30 నుంచి 40 ఎకరాలలో హోటల్ ఏర్పాటు చేసేందుకు ముందుకు వచ్చింది. అలాగే ప్రైవేట్ భాగస్వామ్యంతో సైతం గండికోటకు ప్రపంచ స్థాయిలో గుర్తింపు తీసుకు రావడం కోసం పర్యాటక శాఖ ప్రత్యేక ప్రణాళికలను సిద్ధం చేసుకుంది. అందులో భాగంగా సాహసకృత్యాలు, స్పోర్ట్స్లతోపాటు వివిధ రకాల అభివృద్ధిపై అధికారులు దృష్టి సారించారు. బోటు షికారు అనుమతుల కోసం నిరీక్షణ గండికోటకు సమీపంలోని మైలవరం జలాశయంలో పర్యాటకుల కోసం బోటు షికారును ఏర్పాటు చేశారు. మూడేళ్ల క్రితం గోదావరి నదిలో బోటు మునిగి చాలా మంది మరణించడంతో ఇక్కడ బోటు షికారును నిలిపివేశారు. కాగా నెలన్నర క్రితం బోటు షికారును తిరిగి ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి ప్రారంభించారు. జలాశయంలో నీరు తక్కువగా ఉండటంతో తాత్కాలికంగా బోటు షికారును నిలిపివేశారు. 1100 ఎకరాల భూమిని అప్పగించాం పర్యాటక కేంద్రమైన గండికోటను అభివృద్ధి చేసేందుకు 1100 ఎకరాల భూమికి సంబంధించిన రికార్డులను ప్రభుత్వానికి అందజేశాము. ప్రభుత్వం ఆ భూమిని పర్యాటక శాఖకు అప్పగిస్తే వారు పర్యాటక అభివృద్ధికోసం వినియోగించనున్నారు. –జి.శ్రీనివాసులు,ఆర్డీఓ,జమ్మలమడుగు అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో గండికోట అభివృద్ధి గండికోట ప్రాంతాన్ని అంతర్జాతీయ ప్రమాణాల స్థాయిలో పర్యాటకంగా తీర్చిదిద్దడం కోసం ఇప్పటికే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యాటకశాఖకు ఆదేశాలు జారీచేసి ఉన్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో పర్యాటకులకు అన్ని వసతులు సమకూర్చుతాం. మూడు నెలల్లో రోప్‌వే పనులు పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకుని వస్తాం. –ఈశ్వరయ్య, పర్యాటకశాఖ ఈఈ, కడప -
మూడు దశాబ్దాల తర్వాత పెన్నాలో నీటిజాడ
పెన్నా నదిలో నీటిని చూడడమే ఒక వింత అని.. మృతదేహాలను పూడ్చిపెట్టడానికే ఈ ప్రాంతం పనికొస్తుందని.. ముప్పై ఏళ్లకొకసారే పెన్నా ప్రవహిస్తుందని.. ఇలా రక రకాల వాదనలు ఉన్నాయి. వాటన్నింటినీ పటాపంచలు చేస్తూ ఈసారి పెన్మ్మ పరవళ్లు తొక్కుతోంది. ఏడు నెలల వ్యవధిలోనే భారీ వర్షాలకు రెండు సార్లు నది పారింది. దీంతో నది పరీవాహక ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, వంకలు, పెన్నార్ – కుముద్వతి ప్రాజెక్టు నీటితో కళకళలాడుతున్నాయి. హిందూపురం టౌన్: కర్ణాటక రాష్ట్రం చిక్కబళ్లాపూర్ జిల్లా నంది హిల్స్‌లో పుట్టే పెన్నా నది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్‌లో ప్రవహిస్తుంది. 597 కిలోమీటర్లు ప్రవహించే ఈ నది ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు వద్ద తీరంలో బంగాళాఖాతంలో కలుస్తుంది. శ్రీసత్యసాయి జిల్లాలోకి హిందూపురం మండలం చౌళూరు వద్ద ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి పలు గ్రామాల మీదుగా కోనాపురం వద్ద పరిగి మండలంలో ప్రవేశించి శ్రీరంగరాజుపల్లి సమీపాన పెన్నానదికి ఉపనది అయిన కుముద్వతి నదితో కలిసి పెన్నా–కుముద్వతి ప్రాజెక్టుకు నీరు చేరుతుంది. అక్కడి నుంచి రొద్దం మీదుగా కర్ణాటక రాష్ట్రం నాగలమడక ప్రాజెక్టుకు చేరి.. అలా మరోసారి ఆంధ్రాలో కలిసి కనగానపల్లి మీదుగా రామగిరి వద్ద అప్పర్ పెన్నార్ ప్రాజెక్టు (పేరూరు డ్యామ్)లోకి కలుస్తుంది. దాదాపు 75 కిలోమీటర్ల మేర పెన్నానది ఈ జిల్లాలో ప్రవహిస్తుంది. మూడు రోజులుగా కురిసిన వర్షాలకు పెన్నా పారుతోంది. హిందూపురం మండలం చౌళూరు, సంతేబిదనూరు, కిరికెర, బేవినహళ్లి, సుగూరు చెరువులు, పెన్నా–కుముద్వతి ప్రాజెక్టులో కలిసిన తర్వాత లెఫ్ట్ కెనాల్ ద్వారా పరిగి మండలం పరిగి, శాసనకోట, సుబ్బరాయునిపల్లి, కొడిగెనహళ్లి చెరువులు, రైట్ కెనాల్ ద్వారా కొట్నూరు, కొల్లకుంట, ఊటుకూరు చెరువులకు నీరు చేరుతోంది. పరిగి మండలం పైడేటి నుంచి రొద్దం మండలంలోకి ప్రవేశిస్తోంది. జిల్లాలో 18,418 ఎకరాల ఆయకట్టుకు లబ్ధి చేకూరుతోంది. మూడు దశాబ్దాల కిందట (1991 ఏప్రిల్‌లో) కర్ణాటకలో కురిసిన వర్షాలకు చాలా చెరువులు తెగి పెన్నా, ఉపనది జయమంగళి ఉధృతంగా ప్రవహించాయి. ఆంధ్ర ప్రాంతంలో వర్షాలు తక్కువైనప్పటికీ మన ప్రాంతంలో నదులు పారి చెరువులు నిండి మరువలు పారాయి. మళ్లీ ఇప్పుడు మండు వేసవిలో చరిత్రలో కనీవినీ ఎరుగని రీతిలో నదులు పరవళ్లు తొక్కుతుంటే జిల్లా ప్రజలు ఆశ్చర్యంలో మునిగిపోయారు. దీనికి తోడు ఏడు నెలల వ్యవధిలోనే పెన్నా నది రెండు సార్లు పారింది. ఇదో అద్భుతంగా అభివర్ణిస్తూ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. భూగర్భజలాల మెరుగు నీటికి కటకటలాడే పరిస్థితుల నుంచి చెరువులు నిండి, భూగర్భజలాలు సైతం మెరుగుపడి బోర్లు రీచార్జ్ అయ్యాయి. పెన్నా నది ఏడు నెలల్లో రెండు సార్లు పారడం పరీవాహక ప్రాంత ఆయకట్టు రైతులకు శుభ పరిణామం. సాగు, తాగు నీటి కష్టాలు తీరనున్నాయి. ఇరిగేషన్ రికార్డుల్లో వేసవిలో పెన్నానది పారినట్లు లేనేలేదు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెన్నా నది మేలో పారింది. ఖరీఫ్ సీజన్లో చెరువుల కింద పంట పండించే రైతులకు ఎంతో లబ్ధి చేకూరుతుంది. – యోగానంద్, ఇరిగేషన్ డీఈ, హిందూపురం పెన్నా నదికి పునరుజ్జీవం తేవాలి ఎండలు మండే మే నెలలో వర్షాల కారణంగా పెన్నా నది ప్రవహించడం ఇదివరకెన్నడూ చూడలేదు. 30 ఏళ్ల తర్వాత పెన్నా నది గత నవంబర్‌లో ప్రవహించింది. ఏడు నెలల్లో రెండోసారి పెన్నా పరవళ్లు తొక్కడం సంతోషకరం. పరీవాహక ప్రాంత చెరువుల్లో నీరు చేరుతూ భూగర్భజలాలు మెరుగయ్యాయి. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టు కింద పంటల సాగుకు ఎంతో ఉపయోగకరం. పెన్నాపై సర్ఫ్లస్ డ్యామ్‌లు కట్టి నీరు నిల్వ ఉంచేలా చేసి నదికి పునరుజ్జీవం తేవాల్సిన అవసరం ఉంది. – వెంకటరామిరెడ్డి, ఏపీ రైతు సంఘం నాయకుడు ఆనందంగా ఉంది పెన్నా నది ప్రవాహం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఇటీవల కురిసిన వర్షాలు, నదిలో నీటి ప్రవాహంతో భూగర్భజలాలు పెరిగాయి. ఎకరా పొలంలో ఇప్పటి వరకు పూల సాగు చేస్తూ వచ్చాను. చెరువు నిండి, బోర్లలోనూ నీరు సమృద్ధిగా ఉన్నందున నీటి కొరత తీరింది. ఖరీఫ్‌లో మొక్కజొన్న వేస్తాను. ఇప్పటికే పనులు కూడా ప్రారంభించాను. – కేబీ నాగన్న, రైతు, చౌళూరు -
నదుల అనుసంధానమే అజెండా
సాక్షి, అమరావతి: దేశంలో నదుల అనుసంధానమే అజెండాగా ఈ నెల 19న జాతీయ జల వనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలకమండలి సమావేశమవుతోంది. కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన వర్చువల్ విధానంలో జరిగే ఈ సమావేశంలో ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్, సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం) చైర్మన్ ఆర్కే సిన్హాతోపాటూ అన్ని రాష్ట్రాల జల వనరుల శాఖ ఉన్నతాధికారులు పాల్గొంటారు. రాష్ట్రం తరఫున జల వనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి హాజరవుతారు. సముద్రం పాలవుతున్న నదీ జలాలను ఒడిసిపట్టి.. లభ్యత ఎక్కువగా ఉన్న నది నుంచి తక్కువ లభ్యత ఉన్న నదికి మళ్లించడం ద్వారా దేశాన్ని సస్యశ్యామలం చేసేందుకు నదుల అనుసంధానాన్ని చేపట్టడం కోసం ఎన్‌డబ్ల్యూడీఏను కేంద్రం ఏర్పాటు చేసింది. హిమాలయ నదులను అనుసంధానం చేయడానికి 14, ద్వీపకల్ప నదులను అనుసంధానం చేయడానికి 16 ప్రణాళికలను ఎన్‌డబ్ల్యూడీఏ ఇప్పటికే సిద్ధం చేసింది. వాటిని ప్రాధాన్యత క్రమంలో చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలుత కెన్–బెట్వా, గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరి, దామన్‌గంగ–పింజాల్, పార్–తాపి–నర్మద నదులను అనసంధానించేందుకు నడుం బిగించింది. కెన్–బెట్వా అనుసంధాన పనులు చేపట్టడానికి రూ.44,605 కోట్లకు కేంద్ర మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. ఆ పనులు చేపట్టడానికి వీలుగా కెన్–బెట్వా లింక్ ప్రాజెక్ట్ అథారిటీ (కేబీఎల్‌పీఏ) పేరుతో ఎస్పీవీని ఎన్‌డబ్ల్యూడీఏ ఏర్పాటు చేసింది. ఈ పనులకు నిధుల సమీకరణ, టెండర్లపై సమావేశంలో చర్చించనున్నారు. గోదావరి నుంచి కృష్ణా, పెన్నా, కావేరి బేసిన్లకు 216 టీఎంసీలను తరలించే అనుసంధానం పనులపై ఇప్పటికే ఆ బేసిన్ల పరిధిలోని రాష్ట్రాలతో ఎన్‌డబ్ల్యూడీఏ చర్చించింది. అనుసంధానాన్ని ఎలా చేయాలనే అంశంపై ఈ సమావేశంలో చర్చిస్తారు. -
"చెప్పాడంటే.. చేస్తాడంతే" అని మరోసారి నిలబెట్టుకున్న సీఎం వైఎస్ జగన్
-
ముందే వేసుకొన్న పథకం.. భార్యను పెన్నా నదిలో తోసేసిన భర్త
సాక్షి, జమ్మలమడుగు : కట్టుకున్న భార్యపై అనుమానంతో ఆమెను పెన్నా నదిలోకి తోసేసిన సంఘటన జమ్మలమడుగులో చోటు చేసుకుంది. పట్టణ సీఐ వెంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు మండలం గండికోట కొట్టాలపల్లెకు చెందిన ప్రసాద్ ముద్దనూరు మండలం కమ్మవారిపల్లె గ్రామానికి చెందిన తన అక్క రామాంజనమ్మ కుమార్తె రాధిక (19)ను మూడేళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి వీరి దాంపత్య జీవితం సవ్యంగా సాగింది. ఇటీవల భార్య మీద భర్తకు అనుమానం మొదలైంది. దీనికితోడు రాధిక తనకు ఆరోగ్యం బాగుండటం లేదని ప్రొద్దుటూరు మండలం తాళ్లమాపురం గ్రామానికి వెళ్లి అక్కడ ఓ స్వామితో అంత్రాలు వేయించుకొని వచ్చేది. ఈ నేపథ్యంలో గత నెల 20వ తేదీ రాధిక భర్తకు చెప్పకుండా తాళ్లమాపురం గ్రామానికి వెళ్లింది. అయితే అదే గ్రామంలో ఉన్న ప్రసాద్ మరో అక్క అక్ష్మీదేవి తాళ్లమాపురానికి నీ భార్య వచ్చిందని తమ్మునికి సమాచారం చేరవేసింది. దీంతో ప్రసాద్ తన తమ్ముడు నవీన్‌ను వెంట పెట్టుకుని అదే రోజు తాళ్లమాపురం వెళ్లాడు. అక్కడి నుంచి భార్యను పిలుచుకుని జమ్మలమడుగుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో పెన్నా బ్రిడ్జి వద్దకు రాగానే భార్య రాధిక, భర్త ప్రసాద్ మధ్య వాగ్వాదం జరిగింది. భార్యపై ప్రసాద్ చేయిచేసుకోవడంతో ఆమె కింద పడింది. అన్నదమ్ములు ఇద్దరు ముందే వేసుకొన్న పథకం ప్రకారం పెన్నానదిపై నుంచి ఆమెను నీటిలోకి తోసేశారు. నీటి ప్రవాహం ఎక్కువ కావడంతో రాధిక నదిలో కొట్టుకుని పోయింది. నాలుగు రోజులైనా కూతురు కనిపించకపోవడంతో అల్లుడు ప్రసాద్, నవీన్‌పై అనుమానం వ్యక్తం చేస్తూ గత నెల 28వ తేదీ జమ్మలమడుగు పట్టణ పోలీస్ స్టేషన్లో రాధిక తల్లి రామాంజనమ్మ ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు భర్త ప్రసాద్, అతని తమ్ముడు నవీన్‌ను విచారించగా తామే పెన్నానదిలో తోసేశామని అంగీకరించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
పెన్నా నదిలో 25 మంది కూలీలు.. గంటపాటు శ్రమించి..
సాక్షి, అనంతపురం: జిల్లాలోని పెన్నానదిలో 25 మంది కూలీలు చిక్కుకున్నారు. వరద ఉధృతికి కాజ్‌వేపై ఐచర్ వాహనం చిక్కుకు పోయింది. పెద్దపప్పూరు మండలం జోడిధర్మాపురం దగ్గర ఈ ఘటన జరిగింది. నదిలో వరద ఉధృతి అధికంగా ఉండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలిగింది. అయితే రెస్య్కూ సిబ్బంది అక్కడకు చేరుకుని కూలీలను సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. పెంచలపాడు నుంచి జూటూరు గ్రామానికి వెళ్తుండగా ఐచర్ వాహనం అదుపు తప్పింది. అదే సమయంలో వరద ఉధృతి పెరగడంతో 25 మంది కూలీలు అందులోనే చిక్కుకుపోయారు. వెంటనే అప్రమత్తనే గ్రామస్థులు, పోలీసులు, రెస్క్యూ బృందాలు గంటపాటు శ్రమించి జేసీబీ, ఇటాచీల సాయంతో కూలీలను సురక్షితంగా బయటకు చేర్చారు. -
'పెన్నా' పరవళ్లు
సాక్షి, అమరావతి: నీటిచుక్క జాడలేక ఎడారిలా మారిన పెన్నా నది ఇప్పుడు జీవనదిగా అవతరించింది. మూడు దశాబ్దాల తర్వాత 2019లో రాయలసీమలో విస్తారంగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ పరవళ్లు తొక్కింది. గతేడాది, ఈ ఏడాదీ సమృద్ధిగా వర్షాలు కురవడంతో పెన్నమ్మ ఉరకలెత్తుతోంది. బేసిన్లో అన్ని ప్రాజెక్టుల నీటినిల్వ సామర్థ్యం 239.59 టీఎంసీలు. పెన్నా, ఉప నదులు ఉధృతంగా ప్రవహించడంతో బేసిన్‌లోని ప్రాజెక్టులు నిండిపోయాయి. నైరుతి రుతుపవనాలు నిష్క్రమించినా.. ఖరీఫ్ పంటలకు వాడుకోగా ఇప్పటికీ ప్రాజెక్టుల్లో 175.91 టీఎంసీలు నిల్వ ఉండటం గమనార్హం. గతేడాది ఇదే సమయానికి ఈ ప్రాజెక్టుల్లో 157.84 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. అంటే.. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 18.07 టీఎంసీలు అధికంగా నిల్వ ఉండటం గమనార్హం. మొత్తం మీద ప్రాజెక్టులన్నీ నిండటం.. పెన్నా ప్రవాహంతో భూగర్భ జలాలు పెరగడంతో పాడిపంటలతో బేసిన్ సస్యశ్యామలమైంది. సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో.. గోదావరి, కృష్ణా నదులు పశ్చిమ కనుమల్లో పురుడుపోసుకోవడం.. పరీవాహక ప్రాంతంలో అధిక వర్షాలు కురవడంవల్ల ఆ నదులు ఉరకలెత్తుతూ ప్రవహిస్తాయి. కానీ, పెన్నా తద్భిన్నం. వర్ష ఛాయ (రెయిన్ షాడో) ప్రాంతంలో జన్మించి.. ప్రవహించే ప్రాంతంలో సగటున 400–800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఎల్‌నినో.. లానినో పరిస్థితుల ప్రభావంవల్ల నైరుతి రుతుపవనాల గమనం ఆధారంగా పెన్నా బేసిన్లో వర్షాలు కురుస్తాయి. దేశంలో అత్యల్ప వర్షపాతం నమోదయ్యే ప్రాంతం పెన్నా బేసిన్. జైసల్మేర్ తర్వాత అత్యల్ప వర్షపాతం నమోదయ్యే అనంతపురం జిల్లా ఈ బేసిన్లోనే ఉంది. కర్ణాటకలో 1995 నుంచి 2004 మధ్య నందిదుర్గం నుంచి నాగలమడక వరకూ ఆ రాష్ట్ర సర్కార్ పెన్నాపై భారీఎత్తున చెక్ డ్యామ్‌లు, డ్యామ్‌లు నిర్మించింది. పెన్నా ఉప నదులైన చిత్రావతిపై పరగోడు వద్ద డ్యామ్ నిర్మించింది. జయమంగళి, కుముద్వతిపైనా అదే రీతిలో చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో పెన్నా, ఉప నదుల నుంచి.. ఎగువ నుంచి దిగువకు చుక్కనీరు రాకుండాపోయింది. అదే సమయంలో రాయలసీమలో సక్రమంగా వర్షాలు కురవక.. కరువు పరిస్థితులు ఏర్పడటంతో పెన్నా ఎండిపోయింది. 2019 నుంచి రాష్ట్రంతోపాటూ రాయలసీమలోనూ సమృద్ధిగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పెన్నా వరదకు కృష్ణా వరదను తోడుచేసి.. గత రెండేళ్లుగా గండికోట, సోమశిల, కండలేరు, చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లలో తొలిసారిగా గరిష్ఠస్థాయిలో నీటిని నిల్వచేశారు. జీవనదిగా పెన్నమ్మ రూపాంతరం విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో పెన్నా, ఉప నదులు జలకళతో తొణికిసలాడుతున్నాయి. పెన్నా ప్రధాన పాయపై అనంతపురం జిల్లాలో పెండేకళ్లు, చాగల్లు, వైఎస్సార్ కడప జిల్లాలో గండికోట, మైలవరం, నెల్లూరు జిల్లాలో సోమశిల, కండలేరుల్లో 2019, 2020, ఈ ఏడాదీ గరిష్ఠస్థాయిలో నీటి నిల్వలున్నాయి. ఉప నదులైన చిత్రావతిపై అనంతపురం–వైఎస్సార్ కడప సరిహద్దులోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్, మద్దిలేరు (యోగి వేమన) ప్రాజెక్టుల్లో గరిష్ఠ స్థాయిలో నీటి నిల్వ ఉంది. గతేడాది తరహాలోనే ఈ ఏడాది పాపాఘ్ని ఉప్పొంగడంవల్ల వైఎస్సార్ జిల్లాలోని వెలిగల్లు నిండిపోయింది. చెయ్యేరు, సగిలేరుపై ఉన్న ప్రాజెక్టుల్లో ఇదే పరిస్థితి. బాహుదా ఉరకలెత్తడంతో చిత్తూరు జిల్లాలోని బాహుదా ప్రాజెక్టు, పెద్దేరు నిండిపోయాయి. ఎగువన పెన్నమ్మకు పునరుజ్జీవం కర్ణాటక చెక్ డ్యామ్‌లు, డ్యామ్‌ల నిర్మాణంతో ఎగువ నుంచి పెన్నాకు వరద రాకపోవడంవల్ల కర్ణాటక సరిహద్దులో అనంతపురం జిల్లాలో ఉన్న పేరూరు డ్యామ్ (అప్పర్ పెన్నార్) నుంచి పీఏబీఆర్, మధ్య పెన్నార్ వరకూ పెన్నా ఒట్టిపోయింది. దీంతో దిగువ రీతిలో ఎగువన కూడా జీవనదిగా మార్చేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పాపాఘ్ని, స్వర్ణముఖి ఉప నదులనూ పునరుజ్జీవింపజేసే చర్యలను వేగవంతం చేసింది. వాతావరణ మార్పుల వల్లే.. వాతావరణ మార్పులవల్ల వర్షాలు పడే రోజులు తగ్గాయి. కానీ.. వర్షంపడే రోజుల్లో ఒకేసారి కుండపోత కురుస్తోంది. దీనివల్ల చెరువులు నిండి.. పెన్నాలోకి వరద ప్రవహిస్తోంది. ఫలితంగా 2019 నుంచి పెన్నా, ఉప నదులపై ఉన్న ప్రాజెక్టులు నిండుతున్నాయి. పాడిపంటలతో ఈ బేసిన్ సస్యశ్యామలమవుతోంది. ఎగువన పెన్నా నదిని పునరుజ్జీవింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నడుంబిగించడం శుభపరిణామం. – డాక్టర్ మల్లారెడ్డి, డైరెక్టర్, యాక్షన్ ఫెటర్నా ఎకాలజీ సెంటర్, అనంతపురం సవ్యమైన రీతిలో జలచక్రం ఎన్నడూలేని రీతిలో 2019 నుంచి రాయలసీమ, నెల్లూరు జిల్లాల్లో వర్షాలు కురుస్తుండటంవల్ల పెన్నా, ఉప నదులు ఉరకలెత్తుతున్నాయి. పెన్నా వరద జలాలకు కృష్ణా వరద జలాలను జతచేసిన రాష్ట్ర ప్రభుత్వం అన్ని ప్రాజెక్టులను నింపింది. ఇది పెన్నాలో వాతావరణ సమతుల్యతకు దారితీసింది. జలచక్రం సవ్యమైన రీతిలో మారడంవల్ల వర్షాలు సమృద్ధిగా కురుస్తున్నాయి. ఇదే జీవనదిగా పెన్నా అవతరించడానికి బాటలు వేస్తోంది. – మురళీనాథ్‌రెడ్డి, చీఫ్ ఇంజనీర్, కర్నూలు జిల్లా -
ఇదీ ఆ ఊరు కథ.. నెల్లి అంటే ఉసిరిక, నెల్లు అంటే వడ్లు!
నెల్లూరు సిటీ: నెల్లూరంటేనే మంచి ధాన్యం, నాణ్యమైన నాగరికత, పెన్నానదీ, ఆ నదీతీరాన వెలసిన రంగనాయకులస్వామీ గుర్తుకు వస్తారు. ఒకప్పుడు ఇదీ దండకారణ్యంలో ఒకభాగం. సింహాలు ఎక్కువగా ఉండేవని, అందువల్ల సింహాపురి అనే పేరు వచ్చిందని ఒక వాదన. నెల్లూరును ఎక్కువ కాలం పాలించిన పల్లవులకు ‘సింహా’ అనే బిరుదు ఉండేది. అందువల్ల ‘సింహాపురి’ అనే పేరు వచ్చిందనేది ఇంకో వాదన. బృహత్పల్లవుల్లో మొదటివాడైనా సింహవిష్ణువు తన పేరిట విక్రమ సింహపురాన్ని నిర్మించారనేది ఒక అభిప్రాయం. నెల్లూరు నగర వ్యూ ముక్కంటి రెడ్డి అనే అతడు ఒకప్పుడు ఈ ప్రాంతానికి నాయకుడిగా ఉండేవారు. అతడికి ఒకరోజు ఈశ్వరుడు ప్రత్యక్షమై ఆ ప్రాంతంలో ఉసిరిక చెట్టు కింద గల శివలింగానికి ఆలయం కట్టించవలసిందిగా కోరాడు. ముక్కంటి రెడ్డి ఆలయం కట్టించి నిత్యోత్సవాలు జరిగే ఏర్పాటు చేశారు. ఆ ఆలయమే ఇప్పుడు మూలాపేటలో ఉన మూలస్థానేశ్వరాలయం. (చదవండి: స్టోన్‌హౌస్‌పేట.. ఆ కలెక్టర్ చేసిన సేవలకు గుర్తింపుగా) నెల్లూరు నగర వ్యూ అప్పట్లో నెల్లూరు పట్టణం మూలాపేట, రంగనాయకులపేట, సంతపేట, దర్గామిట్టలకు పరిమితమై ఉండేది. ‘నెల్లి’ అంటే ఉసిరిక చెట్టుగనుక ఆ విధంగా నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు కొందరు. పినాకినీ నదీ తీరాన ఈ నగరం ఉండడంతో, వరి పంటకు ప్రసిద్ధి. నెల్లు అంటే వడ్లు గనుక వడ్లు ఎక్కువగా పండే ప్రాంతం కాబట్టి నెల్లూరు అనే పేరు వచ్చిందంటారు మరికొందరు. నెల్లూరు పట్ల ఇన్నీ రకాల అభిప్రాయాలు ఉండడం విశేషం. (చదవండి: AP Special: ప్రోత్సహిస్తే ఇత్తడి భవిత బంగారమే!) -
పెన్నా నదిలో ఇద్దరు గల్లంతు.. ఒకరి మృతదేహం లభ్యం
సాక్షి, వైఎస్సార్ కడప: వైఎస్సార్ కడప జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. చెన్నూరు వద్ద పెన్నా నదిలో ముగ్గురు విద్యార్థులు గల్లంతయ్యారు. ఈ ఘటనలో ఒకరిని స్థానికులు కాపాడగా మరో ఇద్దరు నదిలో కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం అధికంగా ఉండటంతో స్థానికులు ఒకరిని మాత్రమే ఒడ్డుకు చేర్చగలిగారు. మరో ఇద్దరు విద్యార్థులు నీటి ప్రవాహం కొట్టుకుపోగా.. ఒకరి మృతదేహం లభ్యమైంది. గల్లంతైన మరో విద్యార్థి కోసం జాలర్ల సాయంతో పోలీసులు నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. గడ్డకు చేరిన విద్యార్థి కడప రవీంద్రనగర్‌కు చెందిన విద్యార్థి షేక్ జహీర్‌గా పోలీసులు గుర్తించారు. గల్లంతై మృతి చెందిన విద్యార్థి కోడూరు చైతన్య కడప ఏఆర్ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న కొండయ్య కుమారుడుగా తెలిపారు. గల్లంతైన మరో విద్యార్థి కమలాపురం మండలం నేటపల్లె గ్రామానికి చెందిన ఉమ్మారెడ్డి శ్రీనాథ్‌రెడ్డి (16) అని పోలీసులు తెలిపారు. -
పెన్నా కాఫర్ డ్యామ్‌కు గండి
నెల్లూరు (క్రైమ్): పెన్నా నదికి నీటి ప్రవాహం అధికం కావడంతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట)కు గండి పడింది. ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో పెన్నానదిపై నూతన బ్యారేజీ నిర్మాణంలో ఉంది. బ్యారేజ్‌కు అవతల వైపు నీటిని నిల్వ చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. ఆదివారం సాయంత్రం నీరు అధికం కావడంతో దీనికి గండి పడి, దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం పెరిగింది. పశువులు మేపుకునేందుకు, ఈత కొట్టేందుకు వెళ్లిన మహిళలు, పురుషులు.. మొత్తం ఆరుగురు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు. అందులో భాస్కర్ అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి తమను రక్షించాలని అభ్యర్థించాడు. స్పందించిన ఎస్పీ సీహెచ్ విజయారావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో సంతపేట ఇన్స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్ఐ నాగరాజు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బ్యారేజీ గేట్లను మూయించారు. తాళ్లు, గజ ఈతగాళ్ల సాయంతో అతి కష్టం మీద భాస్కర్, అతని స్నేహితుడిని, పొర్లుకట్టకు చెందిన కాకు చిన్నమ్మ, ఆర్ సుబ్బాయమ్మ, గుణలను రక్షించారు. మరో వ్యక్తి అప్పటికే రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఎక్కడంతో తాళ్ల సహాయంతో అతన్ని బ్రిడ్జి మీదకు చేర్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ఎస్పీ అభినందించగా, బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. -
కావేరికి గోదారి.. ఏపీ అవసరాలను తీర్చాకే
సాక్షి, అమరావతి: ఏపీ అవసరాలు తీర్చాకే కావేరి పరీవాహక ప్రాంతానికి గోదావరి జలాలను తరలించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర జల్‌శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ అధ్యక్షతన మంగళవారం వర్చువల్ విధానంలో జరిగిన జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్యూడీఏ) పాలక మండలి సమావేశంలో గోదావరి – కృష్ణా – పెన్నా – కావేరి అనుసంధానంపై ప్రధానంగా చర్చించారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ, ఒడిశా, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ, తమిళనాడు ఈ సమావేశంలో పాల్గొన్నాయి. ఏపీ తరఫున జలవనరుల శాఖ కార్యదర్శి శ్యామలరావు, ఈఎన్సీ సి.నారాయణరెడ్డి తదితరులు హాజరయ్యారు. సహకరించాలన్న జల్‌శక్తి శాఖ కార్యదర్శి జూన్ నుంచి అక్టోబర్ మధ్య 143 రోజుల్లో ఇచ్చంపల్లి నుంచి 247.19 టీఎంసీలను నాగార్జునసాగర్(కృష్ణా)–సోమశిల(పెన్నా) మీదుగా కావేరి (గ్రాండ్ ఆనకట్ట)కు తరలించే పనులు చేపట్టడానికి సహకరించాలని కేంద్ర జల్ శక్తి శాఖ కార్యదర్శి పంకజ్‌కుమార్ కోరారు. దీనిపై ఛత్తీస్‌గఢ్ సర్కార్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమకు కేటాయించిన 147.9 టీఎంసీలను కావేరికి తరలించడానికి అంగీకరించే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. గోదావరి–కావేరి అనుసంధానంపై ఎన్‌డబ్ల్యూడీఏ చేసిన ప్రతిపాదనలో ఎస్సారెస్పీ(శ్రీరాంసాగర్ ప్రాజెక్టు)–ఇచ్చంపల్లి మధ్య 176.6 టీఎంసీల లభ్యత ఉంటుందని లెక్క కట్టిందని, కానీ వాటిని ఉపయోగించుకునేలా ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టామని, అంటే అక్కడ ఇక నీటి లభ్యత ఉండదని తెలంగాణ స్పష్టం చేసింది. మహానది–గోదావరి అనుసంధానం చేపట్టాకనే గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలని పేర్కొంది. సాగర్‌ను బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌గా మార్చడాన్ని అంగీకరించబోమంది. అదనపు వాటా కోసం పట్టు.. గోదావరి–కావేరి అనుసంధానం ద్వారా కృష్ణా బేసిన్‌కు మళ్లించే గోదావరి జలాలకుగానూ కృష్ణా జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కర్ణాటక డిమాండ్ చేసింది. కావేరి జలాల్లో అదనపు వాటా ఇవ్వాలని కేరళ కోరింది. గోదావరి–కావేరి అనుసంధానాన్ని పూర్తి చేసి తమ రాష్ట్రంలో సాగు, తాగునీటి సమస్యను పరిష్కరించాలని తమిళనాడు విజ్ఞప్తి చేసింది. అన్ని రాష్ట్రాల అభిప్రాయాలను తెలుసుకున్నాక గోదావరి–కావేరి అనుసంధానం చేపడతామని పంకజ్‌కుమార్ తెలిపారు. బేసిన్ పరిధిలోని రాష్ట్రాల అభిప్రాయాలపై అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఎన్‌డబ్ల్యూడీఏ డైరెక్టర్ జనరల్ భోపాల్‌సింగ్‌ను ఆదేశించారు. ఈ నివేదిక ఆధారంగా ప్రత్యేక సమావేశం నిర్వహిస్తామన్నారు. ఏపీ ఏం చెప్పిందంటే.. ► గోదావరిలో నీటి లభ్యతపై ఎన్‌డబ్ల్యూడీఏ, కేంద్ర జలసంఘం వేర్వేరుగా లెక్కలు చెబుతున్నాయి. 75 శాతం నీటి లభ్యత ఆధారంగా చూస్తే గోదావరి నికర జలాల్లో మిగులు లేదు. నీటి లభ్యతను శాస్త్రీయంగా తేల్చాలి. గోదావరి డెల్టాకు ఖరీఫ్‌కు నీళ్లు అవసరం. అందువల్ల జూన్‌లో కావేరికి గోదావరిని తరలించరాదు. ► ప్రస్తుతం రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకే 776 టీఎంసీలు అవసరం. దుర్భిక్ష ప్రాంతాలను సుభిక్షం చేయడానికి గోదావరి–బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్(బీసీఆర్) అనుసంధానం చేపట్టాలని నిర్ణయించాం. ఈ ప్రతిపాదన మేరకు గోదావరి–కావేరి అనుసంధానం చేపట్టాలి. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు గోదావరి జలాలు చేరేలా అనుసంధానం చేపట్టాలి. బొల్లాపల్లి వద్ద బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌ను నిర్మిస్తేనే అనుసంధానం ఫలవంతమవుతుంది. -
నదుల అనుసంధానం.. ఓ భగీరథయత్నం
సాక్షి, అమరావతి: నదుల అనుసంధానం అంటే.. ఎవరో కట్టిన కాలువలో నాలుగు చెంబుల నీళ్లు ఎత్తిపోయడమా.. ఆ కాలువలో వర్షపు నీటిని చూపించి రెండు నదులను అనుసంధానించేశామంటూ కోట్లు ఖర్చుపెట్టి ఈవెంట్లు చేయడమా... వేర్వేరు మార్గాలలో పయనించే రెండు నదులను అనుసంధానించడం ఓ భగీరథయత్నం.. ఇందుకు నిధులు మాత్రమే కాదు నిబద్ధత, దృఢ దీక్ష కూడా అవసరమే. పాలకులకు అవి ఉన్నప్పుడే అనుసంధాన యత్నాలు ఫలిస్తాయి. రెండు కాదు.. మూడు కాదు రాష్ట్రంలో మొత్తంగా ఆరు చోట్ల నదుల అనుసంధానం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. రాష్ట్రం పరిధిలోని నదుల అనుసంధానం పనులను వేగవంతం చేస్తూనే గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ వంటి అంతర్రాష్ట్ర నదుల అనుసంధానంపైనా కేంద్రంతో కలిసి కసరత్తు చేస్తోంది. నదుల అనుసంధానం అంటే ఇదీ.. నదుల అనుసంధానానికి కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) 2016లో మార్గదర్శకాలు జారీ చేసింది. వాటి ప్రకారం ఒక నదిపై బ్యారేజీ నిర్మించి.. అక్కడి నుంచి వరద జలాలను మరో నదిపై నిర్మించే బ్యారేజీలోకి తరలించినప్పుడే ఆ రెండు నదులు అనుసంధానం చేసినట్లు లెక్క. గోదావరి నదిపై ఎలాంటి బ్యారేజీ నిర్మించకుండా..దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి పూర్తి చేసిన పోలవరం కుడి కాలువ మీదుగా పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా ప్రకాశం బ్యారేజీలోకి 2016లో గోదావరి జలాలను తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా నదులను అనుసంధానం చేసినట్లు నాటి సీఎం చంద్రబాబు ప్రకటించడాన్ని అప్పట్లో సీడబ్ల్యూసీ ఖండించడం గమనార్హం. రూ.145.34 కోట్లతో వంశధార–నాగావళి అనుసంధానం నాగావళి నదిలో వరద ఆలస్యంగా రావడం, నారాయణపురం ఆనకట్ట నీటి నిల్వ సామర్థ్యం తక్కువగా ఉండటం వల్ల ఖరీఫ్‌లో ఆయకట్టుకు సకాలంలో నీళ్లందించడం కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో వంశధార ప్రాజెక్టు స్టేజ్–2 ఫేజ్–2లో హిరమండలం రిజర్వాయర్‌కు తరలించిన వంశధార నీటిని, ఆ రిజర్వాయర్ మట్టికట్ట 5.6 కి.మీ వద్ద నుంచి 33.583 కి.మీల పొడవున హెచ్చెల్సీ(హైలెవల్ కెనాల్)ను తవ్వి రోజుకు 600 క్యూసెక్కులను నారాయణపురం ఆనకట్టకు ఎగువన నాగావళి నదిలోకి పోయడం ద్వారా ఆ రెండు నదులను అనుసంధానం చేసి, ఆయకట్టును సస్యశ్యామలం చేసే పనులను రూ.145.34 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టింది. ఇప్పటికే 31.30 కి.మీ పొడవున హెచ్చెల్సీ తవ్వకం పనులను పూర్తి చేసింది. కేవలం 2.283 కి.మీల కాలువ తవ్వకం పనులు మాత్రమే మిగిలాయి. వాటిని ఖరీఫ్ నాటికి పూర్తి చేసి.. వంశధార–నాగావళి అనుసంధానాన్ని సాకారం చేయనున్నది. దీని వల్ల నారాయణపురం ఆనకట్ట కింద 39,179 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు హెచ్చెల్సీ కింద కొత్తగా ఐదు వేల ఎకరాలకు నీళ్లందించడం ద్వారా శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల అభివృద్ధిని మరింత వేగవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. పోలవరం నుంచి గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు అనుసంధానం ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. ► పోలవరం ప్రాజెక్టు కుడి కాలువ ద్వారా గోదావరి జలాలను గ్రావిటీపై ప్రకాశం బ్యారేజీలోకి తరలించడం ద్వారా గోదావరి–కృష్ణా అనుసంధానం చేసే పనులకు 2004లో సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీకారం చుట్టారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి.. 2022 నాటికి కుడి కాలువ ద్వారా గ్రావిటీపై గోదావరి జలాలను ప్రకాశం బ్యారేజీకి తరలించాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నిర్ణయించారు. ఆ క్రమంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగవంతం చేశారు. దీని వల్ల కృష్ణా డెల్టాలో 13.08 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువలో 57.85 కి.మీల వద్ద నుంచి గోదావరి జలాలను ఏలేరు రిజర్వాయర్‌లోకి ఎత్తిపోయడం ద్వారా గోదావరి–ఏలేరు నదులను అనుసంధానం చేసే పనులనూ 2022 నాటికి పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. దీని వల్ల ఏలేరు రిజర్వాయర్ కింద 53,017 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. ► పోలవరం ఎడమ కాలువ 162.409 కి.మీ నుంచి 80 టీఎంసీలను తరలించడం ద్వారా వంశధార, నాగావళి పరీవాహక ప్రాంతాల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాల్లో ఎనిమిది లక్షల ఎకరాలకు నీళ్లందించే పనులను దశలవారీగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టింది. కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి అనుసంధానం.. తెలుగుంగ ప్రాజెక్టులో భాగంగా కృష్ణా(శ్రీశైలం రిజర్వాయర్)–పెన్నా (సోమశిల రిజర్వాయర్)ను ఇప్పటికే అనుసంధానం చేశారు. సోమశిల వరద కాలువ 12.52 కి.మీ నుంచి రోజుకు 2,500 క్యూసెక్కులను తరలించి.. చిత్తూరు జిల్లాలోని స్వర్ణముఖి నదిలో పోయడం ద్వారా కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి నదులను అనుసంధానం చేసే పనులను ప్రభుత్వం ప్రాధాన్యతగా చేపట్టింది. ఈ అనుసంధానం ద్వారా 1.23 లక్షల ఎకరాలకు నీళ్లందించనున్నారు. స్వర్ణముఖి నది పెన్నా ఉప నది. కృష్ణా–పెన్నా–పాపాఘ్ని అనుసంధానం.. గాలేరు–నగరి సుజల స్రవంతి పథకం కింద 2009 నాటికే దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కృష్ణా–పెన్నా నదులను అనుసంధానం చేశారు. పెన్నా ఉప నది అయిన పాపాఘ్ని పరీవాహక ప్రాంతం పూర్తిగా వర్షాభావ ప్రాంతంలో ఉంది. దీని వల్ల పాపాఘ్నిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఈ నేపథ్యంలో గాలేరు–నగరి ద్వారా శ్రీశైలం నుంచి తరలించిన కృష్ణా నదీ వరద జలాలు.. గాలేరు–నగరి ప్రధాన కాలువ 56 కి.మీ వద్ద నుంచి జలాలను ఎత్తిపోసి.. పాపాఘ్ని నదిపై 4.56 టీఎంసీల సామర్థ్యంతో నిర్మించిన వెలిగల్లు రిజర్వాయర్‌లోకి తరలించే పనులను చేపట్టారు. దీని ద్వారా 26 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. కృష్ణా–వేదవతి అనుసంధానం.. కృష్ణా ఉప నది అయిన వేదవతిపై అనంతపురం జిల్లాలో భైరవానితిప్ప ప్రాజెక్టును 1956లో నిర్మించారు. ఈ ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. టీడీపీ సర్కార్ హయాంలో కర్ణాటకలో వేదివతిపై చెక్ డ్యామ్‌లు నిర్మించడంతో బీటీపీలోకి చుక్క నీరు చేరడం లేదు. శ్రీశైలం జలాశయం నుంచి హంద్రీ–నీవా ద్వారా తరలించే నీటిని జీడిపల్లి రిజర్వాయర్ నుంచి బీటీపీలోకి ఎత్తిపోయడం ద్వారా కృష్ణా–వేదవతి నదుల అనుసంధానం పనులను రూ.968 కోట్లతో చేపట్టింది. దీని ద్వారా బీటీపీ కింద 12 వేల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించడంతోపాటు వర్షాభావ ప్రాంతంలోని కళ్యాణదుర్గం, రాయదుర్గం నియోజకవర్గాల్లో చెరువులను నింపడం ద్వారా మరో 10,323 ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నారు. గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కసరత్తు... గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానంపై కేంద్రం ప్రత్యేక దృష్టి పెట్టింది. జానంపల్లి నుంచి గోదావరి–కృష్ణా(నాగార్జునసాగర్)–పెన్నా(సోమశిల)–కావేరీ(గ్రాండ్ ఆనకట్ట) అనుసంధానం చేసేలా ఎన్‌డబ్ల్యూడీఏ(జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ) రూపొందించిన ప్రతిపాదనపై రాష్ట్ర ప్రభుత్వం తన అభిప్రాయాలను చెబుతూ.. తక్కువ వ్యయంతో గరిష్టంగా వరద జలాలను ఒడిసి పట్టి.. రాష్ట్రానికి ప్రయోజనం చేకూరేలా ప్రత్యామ్నాయ ప్రతిపాదనలనూ సిద్ధం చేయాలని జలవనరుల శాఖ అధికారులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఈ ప్రతిపాదనలు సిద్ధం చేశాక.. వాటిని ఎన్‌డబ్ల్యూడీఏకు పంపి.. పనులు చేపట్టాలని నిర్ణయించారు. కేసీ కెనాల్‌తోనే నదుల అనుసంధానానికి నాంది.. తుంగభద్ర నదిపై కర్నూలు జిల్లాలో సుంకేశుల వద్ద ఆనకట్ట నిర్మించి, అక్కడి నుంచి వైఎస్సార్ జిల్లాలో పెన్నా నదిని అనుసంధానిస్తూ కేసీ కెనాల్ తవ్వకం పనులను 1863లో ప్రారంభించిన డచ్ సంస్థ 1870 నాటికి పూర్తి చేసింది. ఈ కాలువను నౌకా మార్గంగా వినియోగించుకుని వ్యాపారం చేసేది. వాణిజ్య కార్యకలాపాల కోసం ఈ కాలువను 1882లో ఈస్ట్ ఇండియా కంపెనీ డచ్ సంస్థ నుంచి రూ.3.02 కోట్లకు కొనుగోలు చేసింది. సర్ ఆర్ధర్ కాటన్ ప్రతిపాదన మేరకు కేసీ కెనాల్‌ను 1933లో సాగునీటి వనరుగా మార్చింది. ఈ కాలువ కింద ప్రస్తుతం 2.65 లక్షల ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. దేశంలో కేసీ కెనాల్ ద్వారానే నదుల అనుసంధానం చేయడం ప్రథమం కావడం గమనార్హం. కేసీ కెనాల్ స్ఫూర్తితోనే నదుల అనుసంధానానికి శ్రీకారం చుట్టినట్లు ఎన్‌డబ్ల్యూడీఏ స్పష్టం చేసింది. తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం.. దేశానికి స్వాతంత్య్రం వచ్చాక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా తుంగభద్రపై తుంగభద్ర డ్యామ్‌ను నిర్మించారు. తుంగభద్ర ఎగువ ప్రధాన కాలువ ద్వారా తుంగభద్ర జలాలను పెన్నాపై నిర్మించిన మధ్య పెన్నార్ ప్రాజెక్టులోకి.. అక్కడి నుంచి చిత్రావతిపై నిర్మించిన చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్‌లోకి తరలించేలా ప్రణాళిక రూపొందించి.. పనులు ప్రారంభించారు. ఈ పనులు 2009 నాటికి పూర్తయ్యాయి. దీని ద్వారా తద్వారా తుంగభద్ర–పెన్నా–చిత్రావతి అనుసంధానం పనులను 2009 నాటికి దివంగత సీఎం వైఎస్ పూర్తి చేశారు. దీని ద్వారా 1,90,035 ఎకరాలకు నీళ్లందిస్తున్నారు. నదుల అనుసంధానానికి రాష్ట్రమే స్ఫూర్తి.. చెన్నైకి తాగునీటిని సరఫరా చేయడం కోసం కృష్ణా నది నుంచి తన కోటాలో నుంచి ఐదు టీఎంసీల చొప్పున కేటాయించేందుకు ఫిబ్రవరి 15,1976న మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలు అంగీకరించాయి. ఈ నీటిని శ్రీశైలం జలాశయం నుంచి తరలించేలా అక్టోబర్ 27, 1977న ఏపీ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల మధ్య ఒప్పందం కుదిరింది. చెన్నైకి తాగునీటిని అందించడంతోపాటు 29 టీఎంసీల కృష్ణా వరద జలాలు, 30 టీఎంసీల పెన్నా వరద జలాలను ఒడిసి పట్టి.. కర్నూల్, వైఎస్సార్ కడప, నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో 5.75 లక్షల ఎకరాలకు నీళ్లందించేలా తెలుగుగంగ ప్రాజెక్టును చేపట్టేందుకు 1978లో ప్రభుత్వం సర్వే పనులను చేపట్టింది. ఈ పనులను 2009 నాటికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. తెలుగుగంగలో భాగంగా కృష్ణా(శ్రీశైలం)–పెన్నా(సోమశిల)–పూండి రిజర్వాయర్(తమిళనాడు)ను అనుసంధానం చేశారు. దేశంలో అంతర్రాష్ట్ర నదుల అనుసంధానానికి ఈ పథకమే స్ఫూర్తి అని ఎన్‌డబ్ల్యూడీఏ పేర్కొంది. రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయడమే లక్ష్యం సముద్రంలో కలుస్తున్న వరద జలాలను ఒడిసి పట్టి.. బీడు భూములకు మళ్లించి.. రాష్ట్రాన్ని సుభిక్షం చేయడమే లక్ష్యంగా నదులను అనుసంధానం చేయాలని సీఎం జగన్ ఆదేశించారు. ఆ మేరకు రాష్ట్రం పరిధిలోని ఆరు అనుసంధానాల పనులను చేపట్టాం. వంశధార–నాగావళి, గోదావరి–కృష్ణా, గోదావరి–ఏలేరు, కృష్ణా–పెన్నా–స్వర్ణముఖి, కృష్ణా–పెన్నా–పాపాఘ్ని, కృష్ణా–వేదవతి అనుసంధానం పనులను వేగవంతం చేశాం. సీఎం జగన్ ఆదేశాల మేరకు రాష్ట్రానికి అత్యధిక ప్రయోజనం చేకూరేలా గోదావరి–కృష్ణా–పెన్నా–కావేరీ అనుసంధానం చేయడంపై కసరత్తు చేస్తున్నాం. నదులను అనుసంధానం చేయడం ద్వారా రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేసే దిశగా అడుగులు వేస్తున్నాం. – సి.నారాయణరెడ్డి, ఇంజనీర్–ఇన్–చీఫ్, జలవనరుల శాఖ -
విషాదం: పెన్నానదిలో నలుగురు గల్లంతు
సాక్షి, వైఎస్సార్ జిల్లా: జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. పుష్పగిరి క్షేత్రం వద్ద పెన్నానదిలో నలుగురు యువకులు గల్లంతయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి యువకులు ఈతకు వెళ్లగా ఈ ఘటన జరిగింది. గల్లంతైనవారిలో ఇద్దరు యువకుల మృతదేహాలు లభ్యం కాగా, మరో ఇద్దరు యువకుల కోసం పోలీసులు, స్థానికులు గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారు కడపలోని బెల్లంమండి వాసులుగా గుర్తించారు. చదవండి: మాన్సాస్ భూముల వ్యవహారంపై విచారణ మంగళగిరి ఎన్ఆర్ఐ ఆస్పత్రి డైరెక్టర్ల మధ్య వివాదం