వైఎస్ఆర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
వైఎస్ఆర్ జిల్లా: వైఎస్ఆర్ జిల్లాలో పలుచోట్ల కురిసిన భారీ వర్షాలకు పెన్నానది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కురిసిన వర్షాల కారణంగా భారీగా వరదనీరు వచ్చి పెన్నానదిలో చేరుతోంది. దాంతో పలు ప్రాంతాల్లోని లోతట్టు గ్రామాల్లో వరదనీరు ఉప్పొంగి ప్రవహిస్తోంది. కాజీపేట మండలం కొమ్మలూరు పెన్నానదిలో నది పరివాహిక ప్రాంత వాసులు 8 మంది చిక్కుకపోగా, చెన్నూరు మండలం కొక్కిరాయిపల్లి పెన్నానదిలో మరో ఐదుగురు చిక్కుకపోయినట్టు తెలుస్తోంది.
వరదనీటిలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. అయితే కొమ్మలూరు పెన్నానదిలో చిక్కుకపోయిన ఎనిమిది సురక్షితంగా బయటపడ్డారు. కానీ, కొక్కిరాయిపల్లి పెన్నానదిలో చిక్కుకున్న ఐదుగురిలో ఇద్దరిని జాలర్లు కాపాడారు. మిగతా వారిని రక్షించేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.