
పెన్నాపై కబ్జా పంజా
నెల్లూరు(బృందావనం): నగరవాసుల దాహార్తిని తీరుస్తూ, డెల్టా రైతులకు సాగునీటిని అందిస్తూ వేలాది ఎకరాలను సస్యశ్యామలం చేస్తున్న పెన్నానది పైనా కబ్జాకోరుల కళ్లుపడ్డాయి. అక్రమార్కులు ఎవరికి తోచిన విధంగా వారు ఆక్రమణలకు పాల్పడుతూ పెన్నమ్మ ఒడిలో కాసుల పంట పండించుకుంటున్నారు. దీంతో నగరం పరిధిలో పెన్నమ్మ రూపురేఖలు మారిపోతున్నాయి. ఏటి పొరంబోకులో పెద్ద ఎత్తున ఆక్రమణలు జరుగుతున్నప్పటికీ సాగునీటి పారుదల శాఖ గాని మున్సిపల్ కార్పొరేషన్ గాని పట్టించుకోవడంలేదు.
అంతేకాకుండా ఆక్రమణలకు పరోక్షంగా అండదండలు అందిస్తున్నారనే అపవాదును కూడా అధికారులు మూటగట్టుకుంటున్నారు. నగరంలోని పాత మున్సిపల్ కార్యాలయం సమీపంలోనే జరుగుతున్న ఆక్రమణలు అధికారులకు తెలియవనుకుంటే పొరబాటే. ఆక్రమణల ఫలితంగా పెన్నాకు వరదలు వచ్చిన సమయంలో పలు ప్రాంతాలు జలమయమైన సందర్భాలు ఉన్నాయి.
ఈ ఆక్రమణల పర్వం ఏటికేటికి విస్తరిస్తూనే ఉంది. దీంతో ఎప్పుడు వరదలు వచ్చినా నగరవాసులకు ముప్పు తప్పదనే ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పెన్నమ్మ ఆక్రమణలపై దృష్టిసారించకపోతే ప్రమాద ఘంటికలు మోగిన ట్టేనని అంటున్నారు. ఏటి పోరంబోకులో సవకతోటలు, కంపచెట్ల పెంపకం, ఇసుక అక్రమ తరలింపు, రియల్‌ఎస్టేట్ వ్యాపారం, తాగునీటి ప్లాంట్‌ల ఏర్పాటు ఇలా ఎవరికి తోచిన విధంగా వారు పెన్నానదిని దోచుకుంటున్నారు. దీంతో పెన్నా నదీపరివాహక ప్రాంతం రూపురేఖలు కోల్పోతోంది.
పాత నగరపాలక సంస్థ కార్యాలయానికి ఉత్తర,పడమటి వైపున ఉన్న పెన్నానది తీరం వెంట ఉన్న నీటిపారుదలశాఖ ‘ఏటి పోరంబోకు’ను రియల్టర్లు దర్జాగా ఆక్రమించేస్తున్నారు. నదీపరివాహకప్రాంతంలో నగరపాలక సంస్థ యంత్రాంగం వ్యర్థపదార్ధాలతో నింపేస్తూ రియల్టర్లుకు మరింత సహకారం అందిస్తోంది. వ్యర్థపదార్థాలను యంత్రాలతో చదునుచేసి పెన్నమ్మ ఆనవాలు లేకుండా చేసేస్తున్నారు.
రియల్ ఎస్టేట్ తరహా ప్లాట్లుగా మలిచారు. లోపాయకారిగా నగరపాలకసంస్థయంత్రాంగం రియల్టర్లుకు సహకరిస్తుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. పాత నగరపాలక సంస్థ కార్యాలయం వెనుకభాగాన వరహాలరావుతోట, నాగేంద్రస్వామిపుట్టకి ఉత్తరంవైపున ఏటిపోరంబోకు స్థలం ఇప్పటికే కబ్జాఅయ్యింది.. ఇక్కడ అంకణం *30 నుంచి *50 వేలుకు ఓ రియల్టర్ అమ్మకం సాగిస్తున్నారు.
నాగేంద్రస్వామి పుట్టకు ఎదురుగా ఏటిపోరంబోకులో ఓ మల్లెతోటను కబ్జాదారులు కొంత కాలం సాగుచేశారు. ఆ స్థలాన్ని వేరేవారికి విక్రయించేశారు. కొనుగోలుచేసిన వారు ఆ తోటను చదనుచేసి ఇళ్లప్లాట్లుగా మార్చారు. స్ధానికులు ఏటి పోరంబోకు కబ్జాను అప్పటి కలెక్టర్ శ్రీధర్, కమిషనర్ టీఎస్‌ఆర్ ఆంజనేయులు దృష్టికి తీసుకెళ్లడంతో ప్లాట్లలో వేసిన రాళ్లను తొలగించారు. తదుపరి ఆ స్థలం చేతులు మారి నేడు బాణసంచా తయారీదారుల చేతుల్లోకి వెళ్లిపోయింది.
ఇదిలా ఉంటే పెన్నాపోరంబోకు స్థలంలో ఒక పార్టీ నాయకుడు గతంలో సవకచెట్లు పెంచి, సొమ్ముచేసుకునేవారు. ఇతని వ్యవహారశైలిపై విమర్శలురావడంతో, నీటిపారుదలశాఖ అధికారులు చేసిన హెచ్చరికలతో గత రెండేళ్ల క్రితం సవకచెట్లును తొలగించారు. గత రెండేళ్ల నుంచి సవకచెట్లస్థానంలో కర్రతుమ్మచెట్లును పెంచుతూ వీటి ద్వారా ఆదాయం పొందుతున్నారు. ఎవరైనా ఈ ప్రాంతానికి వస్తే ఆయన తన పార్టీ పేరుచెబుతూ బెదిరింపులకు గురిచేస్తున్నారు.
ఉయ్యాల కాలువ మురుగునీటిని పెన్నానదిలోకి కలపడంతో దాదాపు తాగునీరు కలుషితైమై పోతోంది. దీంతోసమీపప్రాంత ప్రజలకు పరిశుభ్రమైన తాగునీరు అందకుండాపోయింది. దీనిని అదునుగా తీసుకున్న ప్రైవేట్ వ్యక్తి ఒకరు వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేసుకుని దర్జాగా వ్యాపారాన్ని సాగిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి.
ఇదిలాఉంటే దర్జాగా ఏర్పాటు చేసుకున్న అక్రమ రహదారులలో పట్టపగలు ఎడ్లబండ్ల, రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో టన్నులకొద్ది ఇసుక తరలిపోతోంది. ఒక మాజీ కౌన్సిలర్ అన్నీ తామై పరిస్థితిని చక్కబెడుతుంటారన్న ఆరోపణలు ఉన్నాయి. అంగబలం,అర్థబలం ఉన్న వీరిని నియంత్రించేందుకు స్థానికులు జంకుతుండడంతో వీరి దందాకు అడ్డూఅదుపు లేకుండా ఉంది.
ఏటి పోరంబోకు ఆక్రమిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం-
-వి.కోటేశ్వరరావు, సూపరింటెండెంట్ ఇంజనీరు, నీటిపారుదలశాఖ
ఏటిపోరంబోకును ఆక్రమించడం చట్టపరంగా నేరం. పెన్నానది పరివాహక ప్రాంతంలో ఎటువంటి అక్రమకట్టడాలు నిర్మించరాదు. అక్రమలేఅవుట్లు తొలగిస్తాం. ఇసుక అక్రమరవాణాపై చర్యలు తీసుకుంటాం. నగరపాలక సంస్థకుచెందిన వ్యర్థపదార్ధాలతో పెన్నానది కలుషితమౌతున్న విషయమై ఇంజినీరింగ్ అధికారులతో పరిశీలనచేస్తాం.