లింగంపల్లిలో 16 అడుగులకు పడిపోయిన భూగర్భ జల మట్టం
కడప నగరంలో తీవ్రతరం కానున్న నీటి ఎద్దడి ఎండిపోయిన పెన్నా
కడప కార్పొరేషన్: పెన్నా నది ఎండి పోవడం, భూగర్భ జలాలు అడుగంటడంతో కడప నగరానికి తాగునీటి ఎద్దడి పొంచి ఉంది. అధికమవుతున్న ఎండలకు, వడగాల్పులకు తేమ ఆవిరైపోతోంది. దీంతో నెలకు ముందే మంచి నీటి గండం కడపను పలకరిస్తోంది. కడప నగరానికి ప్రధాన తాగునీటి వనరు అయిన పెన్నానది పూర్తిగా ఎండిపోయింది. ఓ వైపు వర్షాలు కురవక పోవడం, మరోవైపు ఇసుకాసురుల విజృంభిస్తుండటం వల్ల భూగర్భ జలాలు కూడా అదే రీతిలో అడుగంటిపోతున్నాయి. దీంతో నగరంలో పలు ప్రాంతాలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
164 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన కడప నగరంలో 3.40 లక్షల జనాభా ఉంది. తాగునీటి పైపులైన్‌లు సుమారు 490 కీ.మీల మేర విస్తరించి ఉన్నాయి. 30,600 కొళాయి కనెక్షన్లు ఉన్నాయి. ప్రజలకు తగిన మోతాదులో నీరు సరఫరా చేయాలంటే ప్రతిరోజూ 56.84 ఎంఎల్‌డీ(మిలియన్ లీటర్స్ పర్ డే) నీరు అవసరం. కాగా పెన్నాలో నీరు సమృద్ధిగా ఉన్నప్పుడే 51 ఎంఎల్‌డీలు లభ్యమయ్యేవి. ప్రస్తుతం గండి, లింగంపల్లిలో భూగర్భ జలాలు 16 అడుగులకు పడిపపోయాయి. దీంతో కేవలం 46 ఎంఎల్‌డీల నీరే సరఫరా అవుతోంది. గంజికుంట కాలనీ, ప్రకాష్‌నగర్, నకాష్, ఖలీల్‌నగర్, ఎన్టీఆర్ నగర్, సరోజినీ నగర్, శివానందపురం, ఇండస్ట్రియల్ ఎస్టేట్, ఊటుకూరు, సాయిప్రతాప్ నగర్‌లతోపాటు నగర శివారు ప్రాంతాలలో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ప్రస్తుతానికైతే అధికారులు నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలలో 11 ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నారు. ఇలాగే కొనసాగితే బోర్లు ఫెయిల్ అయ్యే అవకాశం లేకపోలేదు.
వెలిగల్లు నుంచి నీటిని తెచ్చేందుకు ప్రయత్నాలు
వేసవిలో నీటిఎద్దడి తలెత్తిన ప్పుడల్లా వెలుగోడు నుంచిగానీ, అలగనూరు రిజర్వాయర్ నుంచిగానీ పెన్నాకు నీటిని విడుదల చేయించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం అలగనూరు రిజర్వాయర్‌లో 1.6 టీఎంసీల నీరే ఉంది. ఇక్కడి నుంచి నీటిని విడుదల చేసినా దూరం ఎక్కువగా ఉండటం వల్ల నీరు పెన్నాలోకి చేరే సరికి ఎక్కువ సమయం పడుతుంది. దీంతో అధికారులు వెలిగల్లు నుంచి నీటిని విడుదల చేయించేందుకు కలెక్టర్ ద్వారా ప్రయత్నాలు మొదలుపెట్టారు. వెలిగల్లులో ప్రస్తుతం 3 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆ నీటిని చక్రాయపేట, గండి, కమలాపురం, పాపాఘ్ని ద్వారా 70 కి.మీ తీసుకురావచ్చని అధికారులు భావిస్తున్నారు. కాగా, వెలుగోడు రిజర్వాయర్ నుంచి పెన్నాకు స్వల్ప పరిమాణంలో నీరు వదిలారు. ఆ నీరు గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్‌కు చేరేసరికి కనీసం 15 రోజులు పట్టే అవకాశం ఉంది. మధ్యమధ్యలో రైతులు వేసే అడ్డుకట్టలను తొలగిస్తూ కడపకు నీటిని తీసుకురావలసి ఉంది. నీరు సకాలంలో గండి, లింగంపల్లికి చేరితే మళ్లీ బోర్లు రీచార్జి అయ్యే అవకాశం ఉంది.