జలగండం
గ్రేటర్‌లో తాగునీటి ఇక్కట్లు
నిత్యం రెండు వేలకు పైగా జలమండలి ట్యాంకర్ల బుకింగ్
వీరిలో 1500 మందికే సత్వర సరఫరా
నిరీక్షణలో 500 మంది వినియోగదారులు
అడ్డూ అదుపూ లేని ప్రైవేటు ట్యాంకర్ల దోపిడీ
సిటీబ్యూరో: వేసవి ప్రారంభంలోనే గ్రేటర్‌లో క‘న్నీటి’ కష్టాలు తీవ్రమయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటడం... జలమండలి సరఫరా చేస్తున్న నల్లా నీళ్లు సరిపోక పోవడంతో ట్యాంకర్ నీటికి డిమాండ్ పెరిగింది. మహా నగరంలో జలమండలి ట్యాంకర్ బుకింగ్‌లు రోజుకు రెండు వేలు దాటుతున్నాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. ఈ నెల 1 నుంచి 10వ తేదీ వరకు 20,965 ట్రిప్పుల ట్యాంకర్ నీళ్లను సిటీ జనం బుక్ చేసుకున్నారు. వీరిలో 15,534 మందికిబుక్ చేసుకున్న 24 గంటల్లోనే నీటి సరఫరా చేశారు. మిగతా 5,431 మందికి నిరీక్షణ తప్పడం లేదు. వీరంతా ట్యాంకర్ నీళ్లకు 48 నుంచి 72 గంటల పాటు నిరీక్షించాల్సి వస్తోంది. నిజాంపేట్, శేరిలింగంపల్లి, మియాపూర్, మల్కాజ్‌గిరి తదితర శివారు ప్రాంతాల్లో ట్యాంకర్ బుక్ చేసి వారం రోజులు దాటినా నీరు అందకపోవడం గమనార్హం.
దారి తప్పుతున్న ఉచిత ట్యాంకర్లు
జలమండలి పరిధిలోని 65 ఫిల్లింగ్ కేంద్రాల వద్ద నీటి సరఫరాకు సుమారు వెయ్యి ట్యాంకర్లు ఉన్నాయి. వీటి ద్వారా బుక్ చేసిన వినియోగదారులకు నీటిని సరఫరా చేస్తున్నారు. ఐదువేల లీటర్ల సామర్థ్యం గల ట్యాంకర్‌కు రూ.400, వాణిజ్య అవసరాలకైతే రూ.700 వసూ లు చేస్తున్నారు. ఇవి కాక ఉచితంగా బస్తీలకు నీటిని సరఫరా చేసే ట్యాంకర్లు సుమారు 200 వరకు ఉన్నాయి. ఇవి తరచూ పక్కదారి పడుతున్నాయి. బస్తీలకు ఉచితంగా సరఫరా చేయాల్సిన నీటిని హోటళ్లు, ఫంక్షన్ హాళ్లు, సినిమా హాళ్లు, రెస్టారెంట్లు, హాస్టళ్లు, మెస్‌లకు రూ.వెయ్యి వంతున విక్రయిస్తూ కొందరు భారీగా సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ప్రైవేటు దోపిడీ....
జలమండలి ట్యాంకర్లకు సుదీర్ఘ నిరీక్షణ తప్పకపోవడంతో జనం ప్రైవేటు ట్యాంకర్లతో జేబులు గుల్ల చేసుకుంటున్నారు. మియాపూర్, వనస్థలిపురం, నిజాంపేట్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి తదితర ప్రాంతాల్లో బోరుబావులు వట్టిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్ల మాఫియా ఆడింది ఆట..పాడింది పాటగా మారింది. కుంటలు, చెరువులు, పారిశ్రామిక వాడల్లో అక్రమంగా బోర్లు వేసి భూగర్భ జలాలను తోడేస్తున్నారు. ఒక్కో ట్రిప్పుకు డిమాండ్‌ను బట్టి రూ.1000 నుంచి రూ.1500 వరకు దండుకుంటున్నారు. వారు సరఫరా చేస్తున్న నీటిలో బురద, వ్యర్థాలు, పారిశ్రామిక వ్యర్థజలాలు ఉంటున్నాయని జనం గగ్గోలు పెడుతున్నారు. ఈ ఆగడాలను అడ్డుకునే నాథుడే కరువయ్యారని వాపోతున్నారు.
ట్యాంకర్ నీళ్ల లెక్కలివే..
జలమండలి ట్యాంకర్ల బుకింగ్: రోజుకు రెండువేలకు పైగా
రోజు వారీగా అందుతున్నది:
సుమారు 1500 మందికి నిరీక్షణ జాబితాలోని వినియోగదారులు:
సుమారు 500 మంది జలమండలి ట్యాంకర్ నీళ్లకు నిరీక్షించాల్సి సమయం:
శివారు ప్రాంతాల్లో 48 నుంచి 72 గంటలు. కొన్నిచోట్ల వారం రోజులు.
గృహ అవసరాలకు సరఫరా చేస్తున్న నీటికి
జలమండలి చార్జీ: రూ.400 (ఐదు వేల లీటర్లు)
వాణిజ్య అవసరాలకు తరలిస్తున్న నీటికి
జలమండలి చార్జీ: రూ.700 (ఐదువేల లీటర్లు)
జలమండలి పరిధిలో ట్యాంకర్లు:
సుమారు వెయ్యి. మరో 200 ఉచిత ట్యాంకర్లు
ప్రైవేటు వ్యాపారులు ప్రతి ట్యాంకర్‌కు
వసూలు చేస్తున్న చార్జీ: రూ.1000 నుంచి రూ.1500