ఐదింట్లో అదే గోస
♦ పినపాక నియోజకవర్గంలో తీవ్ర నీటి ఎద్దడి
♦ అడుగంటుతున్న భూగర్భ జలాలు
♦ శిథిలమవుతున్న తాగునీటి పథకాలు
♦ యథేచ్ఛగా నీటి వ్యాపారం
చెంతనే గోదావరి ఉన్నా... మణుగూరువాసులకు తాగునీటి తండ్లాట తప్పడం లేదు. తాగునీటి పథకాలు ప్రారంభానికి నోచుకోవడం లేదు. చివరకు చెలిమల నీరే దిక్కవుతోంది. -మణుగూరు
నియోజకవర్గ ప్రజలు తాగునీటి కోసం అవస్థలు పడుతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల భూగర్భ జలాలు అడుగంటడంతో బోర్లు పనిచేయని పరిస్థితి. మార్చిలోనే ఇలా ఉంటే.. ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితిని తలచుకొని భయపడుతున్నారు. గ్రామీణ నీటి సరఫరా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టకపోగా.. కనీసం అందుబాటులో కూడా ఉండడం లేదని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మణుగూరు మండలం సమితిసింగారం నుంచి అశ్వాపురం మండలం మొండికుంట వరకు ఉన్న 16 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఉద్దేశించిన గ్రామీణ నీటి సరఫరా పథకం ప్రారంభించకుండానే అతీగతీ లేకుండా పోయింది. 2011లో సదరు గ్రామాలకు తాగునీరు అందించాల్సి ఉన్నా.. ఏళ్లు గడిచినా చుక్క నీరు అందించలేదు.
2009లో రూ.5కోట్ల అంచనాతో ప్రారంభించిన పథకానికి నిధులు చాలకపోవడంతో మరో రూ.5కోట్లు ప్రభుత్వం మంజూరు చేసింది. పనులు ప్రారంభించి ఆరేళ్లు దాటిపోయాయి. ఇందులో భాగంగా చినరావిగూడెం వద్ద గోదావరి ఒడ్డున ఇన్‌టేక్‌వెల్, కమలాపురం వద్ద ఫిల్టర్‌బెడ్, ఓవర్‌హెడ్ ట్యాంక్, అశోక్‌నగర్ వద్ద సంప్, ఓవర్‌హెడ్ ట్యాంక్ నిర్మించారు.. పైపులైన్లు సైతం వేశారు. అధికారుల అలసత్వం వల్ల కాంట్రాక్టర్ నాసిరకం పైపులు వేశాడు. దీంతో నీటి సరఫరా ప్రారంభిస్తే పైపులు పగిలిపోయే పరిస్థితి. ప్రస్తుతం ఆ పైపులు మార్చాల్సి ఉన్నప్పటికీ ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ, ఏఈల నిర్లక్ష్యం వల్లే పరిస్థితి ఇలా తయారైందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
మణుగూరు మండలంలో మొత్తం 205 బోర్లు ఉండగా.. 25 బోర్లు పనిచేయడం లేదు. రామానుజవరం పంచాయతీలోని చిక్కుడుగుంట, దమ్మక్కపేట గ్రామాల్లో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. చెంతనే గోదావరి ఉన్నా.. అగచాట్లు పడాల్సి వస్తోంది. దీంతో వాటర్ ప్లాంట్ల నిర్వాహకులు మినరల్ వాటర్ అంటూ సాధారణ నీటిని అమ్ముతూ భారీగా దోపిడీ చేస్తున్నారు.
పినపాక మండలంలో 310 చేతిపంపులకు.. 55 పనిచేయడం లేదు. రక్షిత మంచినీటి పథకాలు 30 ఉండగా.. 20 గ్రామాల్లో అలంకారప్రాయంగా ఉన్నాయి. 90 బోరు మోటార్లు ఉండగా.. ఐదు ప్రాంతాల్లో పనిచేయడం లేదు.
అశ్వాపురం మండలంలో 405 చేతిపంపులు ఉండగా.. 65 పనిచేయడం లేదు. మిట్టగూడెం, గొందిగూడెం, మనుబోతులగూడెం, మామిళ్లవాయి, వేములూరు గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి ఎదుర్కొంటున్నారు. కుమ్మరిగూడెంలో వాటర్‌గ్రిడ్ పనులు నత్తనడకన సాగుతున్నాయి.
బూర్గంపాడు మండలంలో 528 బోర్లు ఉండగా.. 155 బోర్లు పనికిరాకుండా పోయాయి. మరో 102 బోర్లు మరమ్మతు దశలో ఉన్నాయి. రక్షిత మంచినీటి పథకాలు 15 ఉండగా.. 6 పథకాలు పనిచేయడం లేదు. రెండో దశ మిషన్ కాకతీయ పనులు ఇంకా ప్రారంభం కాలేదు. గత ఏడాది మిషన్ కాకతీయ పనులు 6 చెరువుల్లో అసంపూర్తిగానే చేశారు. ఉప్పుసాక, జిన్నెగట్టు, వడ్డగూడెం, పినపాక పట్టీనగర్, మోరంపల్లిబంజర, కృష్ణసాగర్, గోపాలపురం గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉంది.
గుండాల మండలంలో 350 చేతిపంపులు ఉండగా.. 102 పనిచేయడం లేదు. గుండాల, రాయిలంక, ముత్తాపురం, కాచనపల్లి, రాయిపాడు, మర్కోడు, గుండాల, రాఘవాపురం గ్రామాల్లో వాటర్ ట్యాంకులు నిరూపయోగంగా ఉన్నాయి. ఇటీ వల శంభునిగూడెం, నర్సాపురం, రోళ్లగడ్డ గ్రామాల్లో నిర్మించిన వాటర్ ట్యాంకులకు కనె క్షన్ ఇవ్వకపోవడంతో ఆయా గ్రామాలకు నీరందడం లేదు. సాయనపల్లి, చెట్టుపల్లి, మర్కోడు పంచాయతీల్లో డీపీ స్కీంలు నిర్మించగా.. పట్టించుకునే వారు లేక మూలనపడ్డాయి. రూ.22కోట్లతో ఆళ్లపల్లి పంచాయతీలో చేపట్టిన ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాగునీటి కోసం ప్రజలు వాగులను ఆశ్రయిస్తున్నారు. మండలంలో ఉన్న 8 రక్షిత మంచినీటి పథకాలు పనిచేయడం లేదు. వాటర్ గ్రిడ్ పనులు సర్వే దశలోనే ఉన్నాయి.