తాగునీటి తండ్లాట షురూ.. | The water scarcity began | Sakshi
Sakshi News home page

తాగునీటి తండ్లాట షురూ..

Published Mon, Feb 27 2017 10:55 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM

తాగునీటి తండ్లాట షురూ..

తాగునీటి తండ్లాట షురూ..

► అడుగంటుతున్న భూగర్భ జలాలు
► మరో వారమైతే తాగునీరూ కరువే
► పశువులను అమ్ముకుంటున్న రైతులు
► ఆందోళనలో బాధిత గ్రామాల ప్రజలు


ఆదిలాబాద్‌ రూరల్‌ : మండలంలోని పలు ఏజెన్సీ మారుమూల గ్రామాల్లో నీటి ఎద్దడి అప్పుడే మొదలైంది. ప్రతీ వేసవి కాలం మాదిరిగానే మండలంలోని ఖండాల గ్రామపంచాయతీ పరిధిలోని ఖండాల, పోతగూడ, ఎస్సీగూడ, పూనగూడ, ధర్‌లొద్ది, మొలాలగుట్ట, చిలాటిగూడతో పాటు పిప్పల్‌ధరి గ్రామ పంచాయతీ పరిధిలోని మామిడికోరి గ్రామంలో రెండు నెలల కిందటనే భూగర్భ జలాలు అడుగంటిపోయాయి. గ్రామానికి ఆనుకుని ఉన్న వాగులో చెల్మెలు తోడి కలుషిత నీళ్లతో దాహార్తిని తీర్చుకుంటున్నారు. వాగు నీళ్లు సైతం ఇంకిపోవడంతో గ్రామానికి సుమారు ఒకటిన్నర కిలోమీటర్ల దూరం నుంచి నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని గ్రామస్తులు వాపోతున్నారు.

ఖండాల గ్రామంలో సుమారు 70 కుటుంబాలలో 600కుపైగా జనాభా ఉంది. వీరి దాహార్తిని తీర్చడానికి గ్రామంలో రెండు బోరు బావులు, మరో వ్యవసాయ బావి ఉంది. వీటిలో బోరు బావుల్లోని నీరు అడుగంటిపోయింది. వ్యవసాయ పొలంలో ఉన్న బావే పెద్ద దిక్కుగా మారింది. ఆ బావిలో నీళ్లు రావాలంటే గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి నెలకొంటోందని గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఖండాల గ్రామ పంచాయతీ పరిధిలోని పోతగూడ గ్రామంలోని బోరు బావులు ఇంకిపోవడంతో గ్రామానికి కొంత దూరంలో ఉన్న బావి నుంచి నీళ్లను తెచ్చుకుంటున్నారు.

గ్రామంలో ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో నీళ్లు లేకపోవడంతో స్నానాలకు వేరే చోట నుంచి ఎడ్ల బండ్లతో తీసుకువస్తున్నారు. తాగడానికి ఐదు కిలోమీటర్ల దూరం నుంచి ఫ్యూరిఫైడ్‌ నీళ్లను తెచ్చుకుంటున్నారు. వేసవి కాలం ప్రారంభం కాక ముందే నీళ్లు అడుగంటిపోవడంతో రాబోయే రోజుల్లో తమ పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. అలాగే అదనంగా బోర్లు వేసి తమ దాహార్తిని తీర్చాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.

బురద నీళ్లే తాగుతున్నం
డిసెంబర్‌ చివరి వారం నుంచే నీటి ఇబ్బందులు మొదలయ్యాయి. రాబోయే రోజుల్లో మరింత ఇబ్బందులకు గురయ్యే ప్రమాదం ఉంది. నీళ్లు దొరకకపోవడంతో గ్రామ సమీపంలో ఉన్న చెలిమెల నుంచి తెచ్చుకున్న బురదనీరే తాగుతున్నం.
– ఆత్రం సీతాబాయి, మామిడికోరి, పిప్పల్‌ధరి

పనులకు వెళ్లలేకపోతున్నం
ప్రస్తుతం బోరు బావిలోని నీరు అడుగంటింది. గ్రామంలో సోలార్‌ చేతిపంపు ఉన్నప్పటికీ నీళ్లు లేవు. గ్రామానికి దూరంగా ఉన్న చెరువు నుంచి ఎడ్లబండ్లతో, కాలినడకన వెళ్లి నీళ్లను తెచ్చుకుంటున్నాం. అధికారులు, ప్రజాప్రతినిధులు సమస్య పరిష్కరించాలి.  
– ఆత్రం రాము, గ్రామపటేల్, మామిడికోరి

చాలా దూరం పోతున్నం
రెండు నెలల నుంచి నీళ్ల కోసం మస్తు పరేషానవుతున్నం. మా ఊళ్లో ఉన్న బోరింగ్‌లు, నూతిల్లో నీళ్లు ఎండిపోయాయి. నీళ్ల కోసం ఎడ్లబండిపై మస్తు దూరం పోతున్నం. ఎండలు ముదిరితే నీళ్లు దొరకేటట్లు లేవు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించాలి.  
– కొడప జంగుబాయి, మొలాలగుట్ట

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement