
రూ. 200 కోట్లు ఇస్తా.. పెన్నాకు నీరిస్తారా?
తాడిపత్రి: ‘ఇసుక అమ్మకాల ద్వారా ప్రభుత్వానికి రూ. 100 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పడం బాగుంది. అయితే నేను రూ. 200 కోట్లు ఇస్తాను.. పెన్నానదికి నీరు ఇస్తారా.. నీళ్లను డబ్బుతో కొనుక్కోగలమా... ఇసుక రీచ్‌ల నిర్వహణ సరిగా లేదు. ఆదాయం కోసం నదుల్లో ఇసుకను తవ్వడం ద్వారా భవిష్యత్తులో తీవ్ర సమస్యలు వస్తాయని తెలియదా’ అంటూ తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడారు.
ఇసుక రీచ్‌ల నిర్వహణ ఇష్టా రాజ్యంగా జరుగుతోందని విమర్శించారు. జిల్లా కలెక్టర్ వెంటనే స్పదించాలని, లేదంటే జిల్లాలోని ఇసుక తవ్వకాలను అడ్డుకుంటానని చెప్పారు. పెన్నానదిలో ఇసుక తవ్వకాల వల్ల పెద్దపెద్ద గుంతలు ఏర్పడ్డాయన్నారు. చాగల్లు ప్రాజెక్టుకు 1.5 టీఎంసీల నీరు త్వరలో వస్తుందని, ఈ నీరు వచ్చేందుకు పెన్నానదిలో కాలువ తీయాల్సిన పరిస్థితి నెలకొందన్నారు.
వారం రోజులుగా 12 పొక్లెరుున్ల ద్వారా పెద్దవడుగూరు మండలం చిట్టూరు నుంచి కాలువ తీయాల్సి వస్తోందని చెప్పారు. ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వకపోయినా తానే స్వయంగా లక్షలు ఖర్చుచేసి నదిలో నీరు పారేందుకు కాలువలు తవ్విస్తున్నానని చెప్పారు. ఇష్టారాజ్యంగా సాగుతున్న ఇసుక తవ్వకాలు ఆపకపోతే ఈ నెల 5న తాను అడ్డుకుంటానని చెప్పారు.