మితిమీరిన జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్ రెడ్డి ఆగడాలు
గడిచిన ఐదేళ్లూ ప్రశాంతంగా ఉన్న తాడిపత్రిలో నేడు రోజూ అలజడే
ఇసుక తోలేది వాళ్లే.. ఫిర్యాదు చేసేదీ వాళ్లే
మాజీ ఎమ్మెల్యేను తాడిపత్రికి రానివ్వకుండా గొడవలు
పోలీసులపై ప్రతాపం.. క్షమాపణలు చెప్పే వరకు వదలని వైనం
ఉన్నతాధికారులే సారీ చెప్పించడంపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి
‘మీరేంటో.. మీ విధానాలేంటో..’ అంటూ ఓ సినిమాలో రావు రమేష్ చెప్పిన డైలాగ్ వారికి బాగా సరిపోతుంది. నిత్యం వివాదాలకు వారే ఆజ్యం పోస్తూ చలికాచుకోవడం రివాజుగా మారింది. గత ఐదేళ్లూ ప్రశాంత వాతావరణంలో జీవనం సాగించిన తాడిపత్రి నియోజకవర్గ ప్రజలు ప్రస్తుతం జేసీ ఆగడాల కారణంగా బిక్కుబిక్కుమంటూ గడపాల్సి వస్తోంది.
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఉమ్మడి అనంతపురం జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో 13 నియోజకవర్గాలు ఒకరకం.. తాడిపత్రి ఒక్కటీ మరో రకంగా మారింది. ‘మేమే రాజులం, మేమే మంత్రులం.. మేము రాసిందే రాజ్యాంగం’ అనే రీతిలో జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారు. తమకు వ్యతిరేకంగా మాట్లాడిన వారిపైనా, ప్రత్యర్థి పారీ్టలోని నాయకులపైనా దాడులు చేయడమే కాకుండా తిరిగి వారిపైనే కేసులు పెట్టిస్తూ రాక్షసానందం పొందుతున్నారు.
ఇసుక అక్రమాలపై కావాలనే రాద్ధాంతం..
అధికారం చేతిలో ఉందికదా అని జేసీ ప్రభాకర్ రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నట్టు చర్చ జరుగుతోంది. ‘25 మంది ఇసుక తోలేది మా వాళ్లే.. మీరందరూ ఇసుక తోలడం మానుకోండి. లేదా నాకు దూరమవుతారు’ అంటూ ఇటీవల ప్రభాకర్‌రెడ్డి వీడియో సందేశాలు విడుదల చేశారు. అయితే, జేసీ వ్యాఖ్యలను నిశితంగా గమనిస్తే అందులో మరో కోణం అవగతమవుతుంది. తన వర్గం నాయకులు సాగిస్తున్న ఇసుక దందాను నిలిపివేయించి తానే సొంత వాహనాలతో ఇసుక అక్రమ రవాణా సాగించాలన్న మర్మం బయటపడుతుంది. జిల్లాల వారీగా చంద్రబాబు ప్రభుత్వం విజిలెన్స్ రిపోర్టులు తయారు చేయిస్తోందన్న సమాచారం అందడంతోనే డ్రామాలు ఆడుతున్నారన్న విమర్శలు మరోవైపు వినిపిస్తున్నాయి.
పోలీసుల్లో అసంతృప్తి..
తాడిపత్రి మండలంలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్న టిప్పర్లను ఇటీవల పోలీసులు పట్టుకోగా.. ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి వెంటనే సీఐ లక్ష్మీకాంత్ రెడ్డికి ఫోన్ చేసి కేసులు కట్టాలంటూ దురుసుగా వ్యవహరించారు. ఎప్పుడు కేసులు కట్టాలో తనకు తెలుసునని సీఐ చెప్పగా.. ఆయనను ఇష్టారాజ్యంగా మాట్లాడారు. ఈ క్రమంలో సీఐను వెనకేసుకు రావాల్సిన పోలీసు ఉన్నతాధికారులు అందుకు భిన్నంగా వ్యవహరించి, సీఐతో ఎమ్మెల్యేకు క్షమాపణ చెప్పించారు. నిజాయితీగా పనిచేసే ఓ సీఐ పట్ల ఉన్నతాధికారులు వ్యవహరించిన తీరుపై పోలీసు వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎస్పీ స్థాయి వ్యక్తి క్షమాపణలు చెప్పించడమేంటని కిందిస్థాయి పోలీసు అధికారులు వాపోతున్నారు. ఇదే క్రమంలో.. తాను ఏ తప్పూ చేయలేదని, శాంతిభద్రతలకు విఘాతం కలగకూడదనే క్షమాపణలు చెప్పానని సీఐ పేర్కొనడం గమనార్హం.
మాజీ ఎమ్మెల్యే రాకుండా అడ్డంకులు..
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలోకి అడుగుపెట్టకుండా దాడులు చేయిస్తున్నారంటే జేసీ ప్రభాకర్‌రెడ్డి గూండాగిరీ ఏ స్థాయిలో ఉందో ఇట్టే తెలుసుకోవచ్చు. ఇటీవల ఎన్నికల పోలింగ్ రోజు రాళ్లు రువ్వుకున్న ఘటనలో ప్రభాకర్‌రెడ్డి, పెద్దారెడ్డిలు ఇద్దరిపైనా కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత ఇద్దరికీ బెయిలొచ్చింది. కానీ పెద్దారెడ్డిని తాడిపత్రికి రానివ్వకుండా జేసీ ప్రభాకర్‌రెడ్డి అడ్డుకుంటున్నారు. ఇటీవల పెద్దారెడ్డి తాడిపత్రికి వెళ్లగా తన అనుచరులతో దాడులు చేయించారు. కందిగోపుల మురళి అనే వైఎస్సార్ సీపీ నాయకుడి ఇంటిని ధ్వంసం చేశారు. ఇంత జరుగుతున్నా జిల్లా పోలీసులు చేష్టలుడిగి చూస్తుండడం విమర్శలకు తావిస్తోంది.
పనిచేయడానికి అధికారులే రావడం లేదు..
జేసీ కుటుంబం దెబ్బకు నియోజకవర్గంలో పనిచేసేందుకు అధికారులే రావడం లేదంటే అతిశయోక్తి కాదు. తాడిపత్రి తహసీల్దార్‌గా వెళ్లిన ఈశ్వరమ్మ కొన్ని రోజులకే తానక్కడ పనిచేయలేనంటూ తిరిగి వచ్చేశారు. తాడిపత్రి టౌన్‌కు ఎస్‌ఐ ఉన్నా అటాచ్‌డ్ కింద పెదపప్పూరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. రూరల్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ లేరు. తమకు ఎప్పుడు బదిలీ వస్తే వెళ్లిపోదామా అన్న ఆలోచనలో రవాణా శాఖ సిబ్బంది ఉన్నారు. మైనింగ్, రెవెన్యూ, ఆరోగ్య.. ఇలా ఏ శాఖ అధికారులైనా తాడిపత్రిలో పనిచేసేందుకు జంకుతున్నారు. పోలీసులన్నా, అధికారులన్నా తన కింద గుమస్తాలే అన్న రీతిలో జేసీ వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ ఉద్యోగులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment