హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా? | Central Jal Sangha latest study on Penna river water | Sakshi
Sakshi News home page

హన్నన్నా.. పెన్నాలో ఇన్ని నీళ్లా?

Dec 27 2023 5:23 AM | Updated on Dec 27 2023 5:23 AM

Central Jal Sangha latest study on Penna river water - Sakshi

సాక్షి, అమరావతి: పెన్నా నదిలో 75 శాతం లభ్యత ఆధారంగా ఏటా 210.12 టీఎంసీల నీటి ప్రవాహం ఉందని కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) తాజాగా తేల్చింది. 1985 నుంచి 2015 వరకు పెన్నా నదీ పరీవాహక ప్రాంతం (బేసిన్‌)లో వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతపై సీడబ్ల్యూసీ అధ్యయనం చేసింది. ఏటా పెన్నా బేసిన్‌లో కురిసే వర్షపాతం పరిమాణం 1412.58 టీఎంసీలని లెక్కగట్టింది.

వరద జలాలతో కలుపుకొంటే ఏటా 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది. కానీ.. పెన్నాలో ఆ స్థాయిలో నీటి లభ్యత లేదని సాగునీటి రంగ నిపుణులు తేల్చి చెబుతున్నారు. బేసిన్‌లో 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యతను లెక్కగట్టడం శాస్త్రీయం కాదని చెబుతున్నారు. వందేళ్లు లేదా కనీసం 50 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా చేసే అధ్యయనానికే శాస్త్రీయత ఉంటుందని స్పష్టం చేస్తున్నారు.  

అప్పటికి, ఇప్పటికి ఇదీ తేడా.. 
పెన్నాలో నీటి లభ్యతపై 1993లో సీడబ్ల్యూసీ తొలిసారి అధ్యయనం చేసింది. 1944–45 సంవత్సరం నుంచి 1983–84 వరకు బేసిన్‌లో 40 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా అప్పట్లో నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలుపుకొంటే పెన్నాలో 223.18 టీఎంసీల లభ్యత ఉంటుందని తేల్చింది. పెన్నా బేసిన్‌ 55,213 చదరపు కిలోమీటర్లుగా పేర్కొంది. తాజాగా సీడబ్ల్యూసీ పెన్నా బేసిన్‌లో 1985–2015 మధ్య అంటే 30 ఏళ్లలో కురిసిన వర్షపాతం, ప్రవాహాల ఆధారంగా నీటి లభ్యత లెక్కగట్టింది. వరద జలాలతో కలిపితే 389.16 టీఎంసీల ప్రవాహం ఉంటుందని తేల్చింది.

75 శాతం లభ్యత ఆధారంగా చూస్తే నదిలో 210.12 టీఎంసీలు ఉంటుందని తేల్చింది. కానీ.. బేసిన్‌ మాత్రం 54,905 చదరపు కిలోమీటర్లకు తగ్గినట్లు గుర్తించింది. అంటే.. 1993తో పోల్చితే బేసిన్‌ విస్తీర్ణం 308 చదరపు కిలోమీటర్లు తగ్గింది. పెన్నా బేసిన్‌లో 1944–84తో పోల్చితే 1985–2015 మధ్య వర్షపాతం అధికంగా ఉండటంవల్లే నీటి లభ్యత పెరిగిందని సీడబ్ల్యూసీ పేర్కొంది.

దీన్ని సాగునీటి రంగ నిపుణులు కొట్టిపారేస్తున్నారు. కేవలం 30 ఏళ్ల వర్షపాతం, ప్రవాహాలను ఆధారంగా తీసుకోవడాన్ని తప్పుపడుతున్నారు. అధ్యయనం పరిధిని తగ్గించుకోవడం వల్లే నీటి లభ్యత పెరిగిందని, ఇది అశాస్త్రీయమని స్పష్టం చేస్తున్నారు.  

పెన్నా బేసిన్‌ ఇదీ.. 
కర్ణాటకలో వర్షాఛాయ ప్రాంతమైన చిక్‌బళ్లాపూర్‌ జిల్లా నంది కొండల్లోని చెన్నకేశవ పర్వత శ్రేణుల్లో పుట్టే పెన్నా నది.. రాష్ట్రంలో వర్షాభావ ప్రాంతాలైన శ్రీసత్యసాయి, అనంతపురం, వైఎస్సార్, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల మీదుగా 597 కిలోమీటర్లు ప్రవహించి.. ఊటుకూరు వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది.

ఎడమ వైపు నుంచి జయమంగళ, కుందేరు, కుడి వైపు నుంచి సగిలేరు, చిత్రావతి, పాపాఘ్ని, చెయ్యేరు ఉప నదులు పెన్నాలో కలుస్తాయి. పెన్నా బేసిన్‌లో 400 800 మిల్లీమీటర్ల వర్షపాతం కురుస్తుంది. ఈ బేసిన్‌ విస్టీర్ణం 54,905 చదరపు కిలోమీటర్లని సీడబ్ల్యూసీ తాజాగా తేల్చింది.  ఇది దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.67 శాతానికి సమానం. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement