
సాక్షి, అమరావతి/శ్రీశైలం ప్రాజెక్టు/విజయపురిసౌత్: పరివాహక ప్రాంతాల్లో (బేసిన్‌లో) విస్తారంగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా, వంశధార, నాగావళి నదుల్లో వరద ఉద్ధృతి పెరిగింది. పెన్నానదిలో వరద ప్రవాహం స్థిరంగా కొనసాగుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి మంగళవారం సాయంత్రం 6 గంటలకు 3,00,847 క్యూసెక్కుల ప్రవాహం వస్తోంది. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌కు 8 వేలు, హంద్రీ–నీవాకు 1,013, కల్వకుర్తికి 800 క్యూసెక్కులు తరలిస్తున్నారు.
884.7 అడుగుల్లో 213.38 టీఎంసీలను నిల్వచేస్తూ స్పిల్ వే తొమ్మిదిగేట్లను 10 అడుగులు ఎత్తి 2,51,433, కుడి, ఎడమ గట్టు కేంద్రాల్లో విద్యుదుత్పత్తి చేస్తూ 62,537 కలిపి 3,13,970 క్యూసెక్కులను దిగువకు వదిలేస్తున్నారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు 16 గేట్లను 10 అడుగులు ఎత్తి వచ్చిన వరదను వచ్చినట్లు కిందికి వదులుతున్నారు.
పులిచింతలకు చేరుతున్న వరదను చేరుతున్నట్లుగా స్పిల్ వే, విద్యుత్ కేంద్రాల ద్వారా దిగువకు వదిలేస్తున్నారు. దీంతో ప్రకాశం బ్యారేజ్‌లోకి వరద స్థిరంగా కొనసాగుతోంది. ప్రకాశం బ్యారేజ్‌లోకి 2,99,478 క్యూసెక్కులు చేరుతుండగా.. కృష్ణా డెల్టాకు 10,728 క్యూసెక్కులు విడుదల చేస్తూ.. 2,96,625 క్యూసెక్కులను సముద్రంలోకి వదిలేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment