సాక్షి, అమరావతి: పది వేల ఎకరాల్లో వరి సాగుకు ఒక టీఎంసీ నీళ్లు అవసరం. ఆరుతడి పంటలైతే ఒక టీఎంసీ నీటితో 15 వేల ఎకరాల్లో సాగు చేయవచ్చు. కానీ, 58 టీఎంసీలతో 15.01 లక్షల ఎకరాలకు ఒకేసారి నీటిని అందించడం సాధ్యమేనా? 5.80 లక్షల ఎకరాలకు మించి ఒక్క ఎకరాకైనా అదనంగా నీళ్లందించడం సాధ్యం కాదని సాగునీటి రంగ నిపుణులు తేల్చిచెప్పేశారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం దీన్ని పెడచెవిన పెట్టారు. అధికారాంతమున కమీషన్లు వసూలు చేసుకోవడానికి, సాగునీరు ఇస్తామంటూ రైతుల చెవ్వుల్లో పువ్వులు పెట్టి ఓట్లు కొల్లగొట్టడానికి చింతలపూడి ఎత్తిపోతల పథకానికి అనుబంధంగా రూ.6,719 కోట్లతో గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశ, కోటపాడు– చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల పథకాలను చేపట్టారు. ఈ రెండు ఎత్తిపోతల పథకాలకు హైడ్రలాజికల్, పర్యావరణ, కేంద్ర జలసంఘం(సీడబ్ల్యూసీ) తదితర అనుమతులు తీసుకోలేదు. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలి దశ పనులను నిలిపివేయాలని జాతీయ హరిత ట్రిబ్యునల్(ఎన్జీటీ) శుక్రవారం ఇచ్చిన తీర్పు చంద్రబాబు ప్రభుత్వ వ్యవహార శైలికి అద్దం పట్టిందని సాగునీటి రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.
అంచనా వ్యయం భారీగా పెంపు
గోదావరి నదికి వరద వచ్చే 90 రోజుల్లో పశ్చిమ గోదావరి జిల్లా రౌతులగూడెం వద్ద నుంచి రోజుకు 56 క్యూమెక్కుల(1977.64 క్యూసెక్కులు) చొప్పున 15.50 టీఎంసీలను ఎత్తిపోసి పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల్లో 2.1 లక్షల ఎకరాలకు సాగునీరు, 6.65 లక్షల మందికి తాగునీరు అందించాలన్న లక్ష్యంతో రూ.1,701 కోట్ల వ్యయంతో 2008 అక్టోబర్ 24న చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టారు. 2014లో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని విస్తరించి.. గోదావరి నుంచి రోజుకు అదనంగా 138.52 క్యూమెక్కులు(4,897 క్యూసెక్కులు) చొప్పున 90 రోజుల్లో 38 టీఎంసీలు తరలించి, నాగార్జునసాగర్ ఎడమ కాలువ కింద 2.1 లక్షల ఎకరాలు, ఎర్రకాల్వ కింద 27 వేలు, కొవ్వాడ కాలువ కింద 17 వేలు, తమ్మిలేరు ప్రాజెక్టు కింద 24 వేల ఎకరాలు.. వెరసి 2.80 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని నిర్ణయించారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం అంచనా వ్యయాన్ని 2016 సెప్టెంబరు 3న రూ.4,909.80 కోట్లకు పెంచేసి కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ పనులను 2019 ఖరీఫ్ నాటికి పూర్తి చేసి 4.9 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీళ్లందిస్తామని అప్పట్లో చంద్రబాబు పలుమార్లు హామీ ఇచ్చారు.
బాబు ఎత్తులు చిత్తు
గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశలో చంద్రబాబు ప్రభుత్వం నిబంధనలను తుంగలో తొక్కడాన్ని ఎన్జీటీ మరోసారి బహిర్గతం చేసింది. చంద్రబాబుకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ‘వ్యాప్కోస్’ నివేదిక ఆధారంగా గోదావరి–పెన్నా నదుల అనుసంధానానికి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రూపొందించి.. సీడబ్ల్యూసీ, పర్యావరణ, హైడ్రలాజికల్, సైట్ క్లియరెన్స్‌లు తీసుకుని పనులు చేపట్టే వారని సాగునీటి రంగ నిపుణులు అంటున్నారు. కమీషన్ల కక్కుర్తితో ఎలాంటి అనుమతులు లేకుండానే వ్యాప్కోస్ నివేదికను వక్రీకరించి.. గోదావరి–పెన్నా అనుసంధానం చేపట్టి లబ్ధి పొందడానికి చంద్రబాబు ఎత్తుగడ వేశారు. ఆ ఎత్తును ఎన్నికల్లో రైతులు చిత్తు చేశారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
ప్రణాళికా లోపానికి పరాకాష్ట
- నాగార్జున సాగర్ కుడి కాలువకు 152 టీఎంసీలను బచావత్ ట్రిబ్యునల్ కేటాయించింది. 2014కు ముందు నాగార్జునసాగర్‌లో నీటి మట్టం 545 అడుగులు ఉన్నప్పుడు కూడా కుడి కాలువ కింద వరి సాగుకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కానీ, 2014 నుంచి 2018 ఖరీఫ్ వరకూ చంద్రబాబు ప్రభుత్వం ఏ ఒక్క ఏడాది కూడా కుడి కాలువ ఆయకట్టులో వరి సాగుకు నీటిని విడుదల చేయలేదు. దాంతో టీడీపీ సర్కార్ తీరుపై గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుండటంతో ఎన్నికల్లో ఘోర పరాభవం తప్పదని చంద్రబాబు గుర్తించారు. ప్రజాగ్రహాన్ని చల్లార్చడం, కమీషన్లు మింగేయడమే లక్ష్యంగా ‘వ్యాప్కోస్’ నివేదికను వక్రీకరించి, రూ.6,020.15 కోట్లతో గోదావరి–పెన్నా నదుల అనుసంధానం తొలిదశకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- పట్టిసీమ ఎత్తిపోతల ద్వారా పోలవరం కుడి కాలువలోకి ఇప్పటికే 8,500 క్యూసెక్కులను ఎత్తిపోస్తున్నారు. గోదావరి–పెన్నా అనుసంధానం తొలిదశలో భాగంగా.. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా ఏడు వేల క్యూసెక్కులను పోలవరం కుడి కాలువలోకి ఎత్తిపోసి, పట్టిసీమ జలాలతో కలిపి తరలిస్తే ప్రవాహ నష్టాలు, మార్గమధ్యంలో వినియోగం పోనూ ప్రకాశం బ్యారేజీకి 14 వేల క్యూసెక్కులు చేరుతాయని.. వాటిలో ఏడు వేల క్యూసెక్కులు కృష్ణా డెల్టాకు విడుదల చేసి, మిగతా ఏడు వేల క్యూసెక్కులను ప్రకాశం బ్యారేజీ జల విస్తరణ ప్రాంతంలో హరిశ్చంద్రాపురం నుంచి ఐదు దశల్లో నీటిని ఎత్తిపోసి నాగార్జున సాగర్ కుడి కాలువలో పోసి, 9.61 లక్షల ఎకరాలకు నీళ్లందించాలని నిర్ణయించారు. చంద్రబాబు ఈ పనులను రెండు ప్యాకేజీలుగా విభజించి, ఎన్నికలకు ఆరు నెలల ముందు కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు దండుకున్నారు.
- ఎన్నికలకు మూడు నెలల ముందు అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ప్రాతనిధ్యం వహిస్తున్న కృష్ణా జిల్లాలో, అదీ మైలవరం, నూజివీడు, జగ్గయ్యపేట నియోజకవర్గాల్లో టీడీపీపై తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమవుతుండటాన్ని గుర్తించిన చంద్రబాబు.. రైతులను ఆకట్టుకోవడానికి రూ.699 కోట్లతో కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతలను మంజూరు చేశారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి జలాలను మళ్లించి, కోటపాడు–చానుబండ–విస్సన్నపేట ఎత్తిపోతల ద్వారా 50 వేల ఎకరాలకు సాగు నీరందిస్తామని ప్రకటించారు. ఆ పనులను కోటరీ కాంట్రాక్టర్లకు అప్పగించి కమీషన్లు జేబులో వేసుకున్నారు. ఈ ఆయకట్టుకూ 2019 ఖరీఫ్ నాటికే నీళ్లందిస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment