వరద ప్రవాహంలో చిక్కుకున్న వారిని రక్షిస్తున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది
నెల్లూరు (క్రైమ్): పెన్నా నదికి నీటి ప్రవాహం అధికం కావడంతో కాఫర్ డ్యామ్ (మట్టి కట్ట)కు గండి పడింది. ఆకస్మికంగా పెరిగిన నీటి ప్రవాహంలో చిక్కుకున్న ఆరుగురిని పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కేంద్రంలో పెన్నానదిపై నూతన బ్యారేజీ నిర్మాణంలో ఉంది. బ్యారేజ్‌కు అవతల వైపు నీటిని నిల్వ చేసేందుకు కాఫర్ డ్యామ్ నిర్మించారు. ఆదివారం సాయంత్రం నీరు అధికం కావడంతో దీనికి గండి పడి, దిగువ ప్రాంతానికి నీటి ప్రవాహం పెరిగింది. పశువులు మేపుకునేందుకు, ఈత కొట్టేందుకు వెళ్లిన మహిళలు, పురుషులు.. మొత్తం ఆరుగురు నీటి ప్రవాహంలో చిక్కుకుపోయారు.
అందులో భాస్కర్ అనే వ్యక్తి డయల్ 100కు ఫోన్ చేసి తమను రక్షించాలని అభ్యర్థించాడు. స్పందించిన ఎస్పీ సీహెచ్ విజయారావు సిబ్బందిని అప్రమత్తం చేశారు. నగర డీఎస్పీ శ్రీనివాసులరెడ్డి నేతృత్వంలో సంతపేట ఇన్‌స్పెక్టర్ అన్వర్‌బాషా, ఎస్‌ఐ నాగరాజు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన పెన్నానది వద్దకు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. సంబంధిత అధికారులతో మాట్లాడి బ్యారేజీ గేట్లను మూయించారు. తాళ్లు, గజ ఈతగాళ్ల సాయంతో అతి కష్టం మీద భాస్కర్, అతని స్నేహితుడిని, పొర్లుకట్టకు చెందిన కాకు చిన్నమ్మ, ఆర్ సుబ్బాయమ్మ, గుణలను రక్షించారు. మరో వ్యక్తి అప్పటికే రైల్వే బ్రిడ్జి పిల్లర్‌ను ఎక్కడంతో తాళ్ల సహాయంతో అతన్ని బ్రిడ్జి మీదకు చేర్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందిని ఎస్పీ అభినందించగా, బాధితుల కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment