దేవుడా.. | oh.. my god | Sakshi
Sakshi News home page

దేవుడా..

Published Tue, Aug 30 2016 7:25 PM | Last Updated on Mon, Sep 4 2017 11:35 AM

దేవుడా..

దేవుడా..

సాక్షి, కడప/చెన్నూరు :

గంట కాదు....అరగంట కాదు....ఏకంగా ఆరు గంటలు...ద్వీపంలా చుట్టుముట్టిన నీరు....కదలడానికి లేదు...తినడానికి లేదు...పశువులు, గొర్రెలు, మేకలతో కలిసి 13 మంది కాపరులు పడిన వేదన అంతా ఇంతా కాదు....ఇక బ్రతుకుతామన్న ఆశ ఎంతమాత్రం లేదు....గంట గంటకు పెరుగుతున్న నీటితో గుండెలోతుల్లో తెలియని అలజడి....చుట్టుముట్టుతున్న నీటితో అనుక్షణం ఊపిరి బిగపట్టుకుని....ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని వారు చేస్తున్న ఆర్తనాదాలు...హాహాకారాలు అందరినీ కదిలిస్తున్నా అధికారులను కదిలించలేదు......  జనాలకు, నదిలో ఉన్న బాధితులకు సుమారు అర కిలో మీటరు మేర ఎడబాటు ఉన్నా ఎట్టకేలకు సాయంత్రానికి తెప్పల ద్వారా బయటికి రావడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. ఇందుకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి.
        చెన్నూరు మండలం కొక్కరాయపల్లెకు చెందిన సుమారు 13 మంది గొర్రెలు, మేకలను, పశువులను కాసేందుకు వాటిని తోలుకుని నదిలోకి వెళ్లారు. అయితే ఉదయం 120 క్యూసెక్కుల నీటి ప్రవాహం మాత్రమే ఉండడంతో ప్రభావం ఎంతమాత్రం లేదు. దీంతో మధ్యాహ్నం వరకు మేపుకుంటున్న కాపరులకు ఒక్కసారిగా ఎగువ నుంచి వస్తున్న నీటితో అలజడి మొదలైంది. మధ్యాహ్నం 1.15 గంటల ప్రాంతంలో నీటి ప్రవాహాన్ని అంచనా వేసిన కాపరులంతా బయటికి వెళ్లాలని నిర్ణయించుకుని స్పీడుగా నడక ప్రారంభించారు. అయితే నది మధ్యలోకి రాగానే గొంతు వరకు నీరు వచ్చి చేరడంతో బెదిరిపోయారు. అడుగు ముందుకేస్తు కొట్టుకుపోయే ప్రమాదం ఉండడంతో తప్పనిసరి పరిస్థితుల్లో గడ్డమీదికి చేరారు.
ఐదారు గంటలపాటు నది మధ్యలో...
        మధ్యాహ్నం ఒంటి గంట నుంచి నది మధ్యలో కాపరులు భయాందోళనల మధ్య కాలం వెళ్లదీశారు. ముందుకు వెళ్లలేక, వెనక్కి అడుగు వేయలేక....ధైర్యం చేసి పశువుల తోకలు పట్టుకుని కొంత ప్రయత్నం చేసినా పెద్ద ఎత్తున వస్తున్న వరద నీరు కొట్టుకుపోయే అంతటి ఉధతి ఉండడంతో వెనక్కి తగ్గారు. ఒంటి గంట ప్రాంతం నుంచి సుమారు సాయంత్రం 5.30 గంటల వరకు నది మధ్యలోనే బ్రతుకు జీవుడా అంటూ కాలం వెళ్లదీశారు. మహిళలు, పురుషులతో కలిపి 11 మంది ఒక ప్రక్క, చెన్నూరు బ్రిడ్జికి మరోప్రక్క ఇద్దరు కలుపుకుని మొత్తం 13 మంది నరకం అనుభవించారు. కాపాడటానికి జనాలు విశ్వప్రయత్నాలు చేసినా నది మధ్య కావడంతో ధైర్యం చేయడానికి ఎవరూ ముందడుగు వేయలేదు. దాదాపు ఐదారు గంటలపాటు నదిలోనే వారు ప్రాణభయంతో గడిపారు.
వెంటనే స్పదించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ
        ఒకప్రక్క ఖాజీపేట మండలంలో సుమారు ఎనిమిది మందిని పెన్నానది నుంచి కాపాడటమే కాకుండా మరోప్రక్క చెన్నూరు బ్రిడ్జి సమీపంలో నది మధ్యలో ఇరుక్కుపోయిన 13 మందిని కాపాడటంలో జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణతోపాటు ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ ప్రత్యేక కషి చేశారు. విషయం తెలియగానే తన సిబ్బందిని పంపి సహాయక చర్యలు చేపట్టారు. ప్రత్యేకంగా తెప్పలు తెప్పించి బాధితులను బయటికి రప్పించడంతోపాటు గొర్రెలు, మేకలు, లేగదూడలను కూడా పడవ ద్వారా బయటికి తీసుకొచ్చారు. ఎస్పీ రామకష్ణ  చెన్నూరు బ్రిడ్జి వద్దనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించారు. బ్రిడ్జి వద్ద డీఎస్పీ ఈజీ అశోక్‌కుమార్, ఆర్డీఓ చిన్నరాముడు, సీఐ సదాశివయ్యతోపాటు ఎస్‌ఐ హుసేన్‌లు అక్కడికక్కడే ప్రత్యేక చర్యలు చేపట్టడంతోపాటు బ్రిడ్జిపై ట్రాఫిక్‌ స్తంభింవకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు.
సంఘటనా స్థలంలో ఎమ్మెల్యే రవిరెడ్డి
            నది ప్రవాహంలో సుమారు 13 మంది బాధితులు చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి నేరుగా చెన్నూరులోని బ్రిడ్జి వద్దకు చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షించారు. ప్రత్యేకంగా అంతకుముందే జిల్లా కలెక్టర్‌ కేవీ సత్యనారాయణ, ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణలతో రవిరెడ్డి చర్చించారు. సహాయక చర్యలను వెంటనే చేపట్టాలని అధికారులను కోరారు. నది మధ్యలో ఉన్న బాధితులతో కూడా సెల్‌ఫోన్‌లో మాట్లాడి ధైర్యంగా ఉండాలని....బయటికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని వారికి ధైర్యం చెప్పారు. బ్రిడ్జి వద్దనే చాలాసేపు ఎమ్మెల్యే గడిపారు. అలాగే సంఘటన ప్రాంతానికి టీడీపీ నాయకులు పుత్తా నరసింహారెడ్డి, రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలు కూడా చేరుకున్నారు.
బయట పడతామనుకోలేదు
        అసలు ఊహించలేదు....నది ప్రవాహం చూసి బయటికి వద్దామనుకుని పరిగెత్తాం....గస వస్తున్నా ఆపుకుని అడుగులు వేసినా వరద చుట్టుముట్టింది. గుండె దాటి గొంతు వద్దకు వస్తూనే ఇక తట్టుకోలేం...ప్రవాహంలో కొట్టుకుపోతామని వెనుకడుగు వేశాం....ప్రాణాల మీద అయితే ఆశలేదుగానీ కాకపోతే గట్టుమీద ఉంటే ఎవరో ఒకరు ఏదో ఒకటి చేయకపోతారా అని ఆశగా ఎదురుచూస్తూ దేవుడిని మొక్కుకున్నాం. మా మొక్కు దేవుడు విన్నాడో...ఏమో తెలియదుగానీ సాయంత్రానికి పడవల్లో బయటికి చేర్చడంతో పునర్జన్మ లభించినట్లుంది. ఊహించని విధంగా బయటపడ్డాం. ఒక విధంగా చెప్పాలంటే చచ్చిబ్రతికామంటూ బాధితులు ఆనందం వ్యక్తం చేశారు.
వరద నీరు ముంచెత్తుంటే....
        మంగళవారం ఉదయం నుంచి 120 క్యూసెక్కుల చొప్పున నదిలో కనిపించిన నీరు మధ్యాహ్నానికి అమాంతం పెరిగిపోయింది. మధ్యాహ్నం 12 గంటల తర్వాత సుమారు ఏడు వేల క్యూసెక్కులకు పైగా పారుతున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ప్రవాహం గంటగంటకు వేల క్యూసెక్కులకు పెరుగుతూ రావడంతో ప్రమాదం ఏర్పడింది. సాయంత్రం 3–4 గంటలకల్లా సుమారు 30 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహానికి చేరుకోవడంతో చుట్టూ వరద పోటెత్తింది. అయితే ఆపైన నీటి ప్రవాహం పెరగకపోవడంతోనే బాధితులు ప్రాణాలతో బయటపడగలిగారు. అదే ప్రవాహం సాఫీగా సాగడంతో గడ్డమీదికి నీరు చేరలేదు. కనీసం కొన్ని క్యూసెక్కులు పెరిగినా....వరుణుడు ఆగ్రహించినా....చివరికి చెరువులు తెగినా కూడా ఇబ్బందికర పరిస్థితి తలెత్తేదని పలువురు అధికారులు స్పష్టం చేశారు.
నది మధ్యలోనే పశువులు
 నది మధ్యలో ప్రవాహం ఉధతంగా ఉండడంతో గట్టుమీదనే పశువులు ఉండిపోయాయి. సుమారు 18 మేకలు, గొర్రెలు ఉండగా, వాటిని సాయంత్రం పోలీసులు ప్రత్యేక పడవలో ఎలాగోలా తీసుకొచ్చి ఒడ్డుకు చేర్చారు. కొన్ని దూడలను కూడా తీసుకొచ్చారు. అయితే సుమారు 20కి పైగా పశువులు..వాటి లేగ దూడలను రక్షించడానికి ప్రయత్నించగా కష్టం కావడంతో ప్రస్తుతం నది మధ్యలోనే పశువులు ఉండిపోయాయి. అయితే ప్రస్తుతానికి నీటిమట్టం తగ్గుతోందని, తద్వారా ఉదయానికి పశువులు బయటికి వచ్చే అవకాశం ఉందని కడప అర్బన్‌ సీఐ సదాశివయ్య ‘సాక్షి’కి తెలియజేశారు. అయితే చెన్నూరులోని గాంధీనగర్‌కు చెందిన దేవరాజు పశువులు మాత్రం నదిలో కొట్టుకపోయాయి.
భారీగా తరలివచ్చిన జనం
        ఊహించని రీతిలో కర్నూలుజిల్లాలో కురిసిన వర్షాలకు ఒక్కసారిగా పెన్నానదికి వరద నీరు పోటెత్తింది. దీంతో ఊహించని పరిస్థితి ఏర్పడి నది మధ్యలో బాధితులు ఇరుక్కుపోవడంతో సంబంధిత గ్రామాల ప్రజలతోపాటు ప్రయాణీకులు ఉత్కంఠతో ఎదురుచూశారు. సెల్‌ఫోన్లతో ఫోటోలు తీస్తూ....నీటి ప్రవాహం పెరుగుతున్న నేపధ్యంలో ఆందోళన చెందుతూ కనిపించారు. చెన్నూరు బ్రిడ్జి వెంబడి ఇటువైపు నుంచి అటువైపు వరకు మొత్తం జనాలతో రద్దీ ఏర్పడింది. ఎప్పుడు ఏం జరుగుతుందోనన్న టెన్షన్‌ వాతావరణం నెలకొంది. ఒకప్రక్క వాహనాలు వెళ్లడానికి కూడా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది.
21 మందిని రక్షించాం : ఎస్పీ రామకృష్ణ
        జిల్లాలోని ఖాజీపేట మండలం కొమ్మలూరు వద్ద సుమారు 9 మంది, చెన్నూరు వద్ద కొక్కరాయపల్లెకు చెందిన 13 మందిని నది నుంచి రక్షించినట్లు జిల్లా ఎస్పీ పీహెచ్‌డీ రామకష్ణ స్పష్టం చేశారు. రెవెన్యూ, అగ్నిమాపక, మత్స్యశాఖతోపాటు పోలీసుశాఖ సంయుక్త సహకారంతో వారందరినీ సురక్షితంగా బయటికి చేర్చామని తెలియజేశారు. అంతేకాకుండా పెద్ద స్పీడు పడవలు పనిచేయకపోవడంతో తప్పనిసరి పరిస్థితుల్లో తెప్పల సాయంతో అందరినీ బయటికి తీసుకొచ్చామని తెలియజేశారు. ప్రత్యేకంగా మత్స్యకారులు, కొంతమంది పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సంరక్షించినందుకుగాను పోలీసుశాఖ తరుపున రివార్డు ఇస్తూనే ప్రభుత్వం తరుపున కూడా రివార్డులు అందించేందుకు కషి చేస్తామన్నారు. మనుషులనే కాకుండా పశువులు, గొర్రెలను కూడా రక్షించేందుకు కషి చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అధికారులను అప్రమత్తం చేశా : ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి
 నది మధ్యలో బాధితులు ఉన్నారన్న విషయం తెలియగానే వెంటనే సంబంధిత అ«ధికారులతో మాట్లాడి సహాయక చర్యలకు కషి చేశానని ఎమ్మెల్యే రవీంద్రనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ఒక్కసారిగా నీరు రావడంతోనే ప్రమాదం ఏర్పడిందని ఆయన తెలియజేశారు. నది మధ్యలో ఉన్న బాధితులను రక్షించేందుకు అధికారులతో మాట్లాడానని, అంతేకాకుండా బాధితులకు కూడా ఫోన్‌ చేసి ధైర్యం చెప్పినట్లు రవీంద్రనాథ్‌రెడ్డి తెలియజేశారు. అంతేకాకుండా ఎస్పీ, కలెక్టర్‌తో చర్చించి యుద్ద ప్రాతిపదికన సహాయక చర్యలు చేపట్టాలని కోరినట్లు ఆయన తెలియజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement