
తిక్కన సాక్షిగా పయనిస్తూనే ఉన్నా...
గమనం నదుల స్వగత కథనం
పుట్టినప్పట్నుంచీ ప్రయాణిస్తూనే ఉన్నా, నిత్య చైతన్యంలా. అలుపెరగని బాటసారిలా. నందగిరి కొండల్లో పుట్టాను. నేనెక్కడున్నాను అని ఒకసారి వెనక్కి చూసుకుంటే... ‘పశ్చిమ కనుమలకు దగ్గరగా ఉన్నాను’ అనుకునే లోపే తూర్పుగా పయనిస్తున్నా... నా గమనం నా చేతిలో లేదు... పల్లానికి జారిపోతూనే ఉన్నా. నా ఒడ్డున బాటసారులు సేద దీరుతున్నారు. నేనూ బాటసారినే కదా! వాళ్లు నా తోటి ప్రయాణికులేమోనని పలకరిద్దాం, స్నేహం చేద్దామనుకుంటే... స్నేహంగా నన్ను స్పృశించి... దాహం తీర్చుకుని వెళ్లిపోతున్నారు. అంతే తప్ప నేను అక్కడ ఘడియ సేపైనా ఉండడానికి ఏ ప్రయత్నమూ చేయడం లేదు నా హితులు. ఇంకా ముందుకు వచ్చే కొద్దీ కొత్త స్నేహితులు పరిచయమవుతున్నారు. నా గమనంలో నేనెక్కడికి వెళ్లినా అక్కడ నాకు తోటి ప్రయాణికులు ఎదురవుతూనే ఉన్నారు.
కోలారులో పుట్టి నెల్లూరులో సాగరంలో సంగమించే వరకు నా ప్రయాణం అలా సాగుతూనే ఉంది. ఎండ, వాన, చలి... అన్నింటినీ తట్టుకుంటూ ముందుకు పోతూనే ఉన్నా. వర్షాకాలం పరవళ్లు తొక్కిన నా గమనం చలికి ఒళ్లంతా బిగుసుకుని, ఎండలకు అలసిపోయి కాస్త వేగం తగ్గిందంటే చాలు... సముద్రపు ఉప్పు నీటితో నా కంఠం బిగుసుకు పోతుంది. అదే నాకు హెచ్చరిక. మళ్లీ వేగం పుంజుకుని బంగాళాఖాతంతో పోటీ పడి నాదే పై చెయ్యి చేసుకుంటాను.
విల్లులా వంపు తిరిగి...
నేను ధనుస్సులా వంపు తిరిగానని పినాకిని అన్నారు. నా ప్రవాహ మార్గంలో వచ్చే ఊళ్లన్నింట్లో పెద్దదాన్ని కాబట్టి పెన్నేరు అన్నారు. జయమంగళ, పాపఘ్ని, చిత్రావతి, కుందూ (కుముద్వతి), చెయ్యేరు, బొగ్గేరు, బీరాపేరు... ఇవన్నీ చిన్నవి కావడంతో ఇక్కడ నేనే పెద్ద ఏరుని.
నేను పేరుకి పెద్ద దాన్నే అయినా చిన్న చిన్న మిత్రుల తోడు లేకుండా ఇంతదూరం ప్రయాణించగల శక్తి నాలో ఏ కోశానా లేదు. నన్ను నమ్ముకుని పంటలేసుకున్న రైతన్నల గోడు, జీవనశైలిని ‘పెన్నేటిపాట’లో విద్వాన్ విశ్వం, ‘పెన్నేటి కథల’తో కట్టమంచి రామలింగా రెడ్డి కళ్లకు కట్టినట్లు చూపించారు. నా బలం, బలహీనత రెండూ ఈ రచనల్లో కనిపిస్తాయి. నేను పడమర నుంచి తూర్పుగా సాగిపోతుంటే ఉత్తరం నుంచి దక్షిణంనుంచి చిన్న నదులు ఒక్కొక్కటిగా వచ్చి నాకు తోడవుతూ నాకు బలాన్నిస్తాయి. కొంత దూరం అలా కలిసి స్నేహితుల్లా ప్రయాణం సాగిస్తామో లేదో నా మిత్రులు నాలో మమేకమై పోతారు. ఎంతగా అంటే ఆనవాలుకి కూడా తమ ఉనికి దొరకనంతగా. ఒకటి మాయమయ్యాక మరొకటి... ఇలా నేను సాగరంలో కలిసే దాకా ఏదో ఒక నది నాతో చెయ్యి కలుపుతూనే ఉంది, నాలో జవసత్వాలు జారిపోనీయకుండా అవి నన్ను శక్తిమంతం చేస్తూనే ఉన్నాయి. ఏమిచ్చి వాటి రుణం తీర్చుకోను? సాగరాన్ని చేరుతున్నాను - అనుకునే లోపుగా తిక్కన భారతం రాసిన ప్రదేశం కనిపించి మనసు పరవశిస్తుంది.
ఆ మహాకవి భారతం రాయడానికి నా ఒడ్డును ఎంచుకున్నందుకు 15వ శతాబ్దంలో గిలిగింతలు పెట్టినట్లు ఎంతగా ఉక్కిరిబిక్కిరయ్యానో ఇప్పటికీ గుర్తే. ఎప్పుడు జ్ఞాపకం వచ్చినా అంతే ఆనందం కలుగుతుంది. తిక్కన జ్ఞాపకాలను గర్వంగా గుర్తు చేసుకోకుండా ఇక్కడివాళ్లకు ఎందుకో ఇంతటి ఉదాసీనత? ఆలనాపాలనా లేకుండా ఉన్న ప్రదేశాన్ని చూసినప్పుడు ఉసూరుమనిపిస్తుంటుంది. జీవితమంటే సంతోషాలే కాదు సర్దుకుపోవడాలూ తప్పనిసరని సరిపెట్టుకున్నా కూడా ఎందుకో ఒక్కోసారి మనసు మౌనంగా రోదిస్తుంది. ఆ మహాకవిని తరతరాలు గుర్తు చేసుకోవడానికి ఈ ప్రదేశాన్ని అందంగా తీర్చిదిద్దే ఓ మనీషీ! ఎక్కడున్నావు? అనుకుంటూ ముందుకు పోవడమే నేను చేయగలిగింది.
నాకు నింగి - నేల తప్ప మరే హద్దులూ తెలియవు. నోటిమాటతోనే పరిధుల గోడలు కట్టుకున్న వాళ్లు మాత్రం నన్ను కన్నడ రాష్ట్రంలో పుట్టానన్నారు, ఎవరూ పిలవకుండానే అనంతపురం (మడకశిర) మీదుగా ఆంధ్రలో అడుగుపెట్టాను. అక్కడ నుంచి కడపకు వచ్చి అలవోకగా గండికోటను చుట్టి నెల్లూరును సస్యశ్యామలం చేస్తున్నా.
పుట్టిన చోటి నుంచి ఏకబిగిన పరుగెట్టకుండా కాస్త నిదానిస్తూ పక్కనున్న ప్రకృతి రమణీయతను చూసి పరవశిస్తూ అలవోకగా అడుగులు వేయాలని ఉంది కానీ, దిగువకు వచ్చేదాకా ఎక్కడా గట్టి ఆనకట్ట లేకపోవడంతో పరుగెత్తక తప్పడం లేదు. కాలంతోపాటు నేను కూడా పరుగులు తీయకపోతే నా ఉనికి ఏమవుతుందోనన్న భయం. ఆధారం వెతుక్కుంటూ పరుగులు తీయడం నా నైజం. మబ్బు విడిన వానచినుకు ఏ తీరాన నేలకు తాకుతుందోనన్నట్లు... ఎక్కడో కురిసిన వాన చినుకులు ఒక్కటొక్కటిగా నాలో కలిసిపోయి అంతెత్తు నుంచి ప్రయాణం మొదలెడతాయి. వాటికి తరతమ భేదాలు ఉండవు. ఎక్కడ, ఎవరు చెయ్యార చేరదీస్తే వాళ్ల దప్పిక తీర్చడమే తెలుసు. దారి పొడవునా పంటల్ని పచ్చగా కళకళలాడించి మురిసిపోవడమే తెలుసు. నా నీటితో పచ్చగా ఉన్న పొలాలను చూసుకుని మురిసిపోయే రైతును చూసినప్పుడు నా గుండె ఉప్పొంగుతుంది. నా ప్రయాణం సార్థకమైందని మనసు ఆనందంతో పులకించి పోతుంటుంది. అదే మనుషులు... ఆగకుండా సాగుతున్న నా గమనాన్ని, ఎండుతున్న పంటను చూస్తూ నిస్సహాయంగా మిగిలిన రైతును చూసి ఎగతాళి చేసినప్పుడు నా గుండె కలుక్కుమంటుంటుంది. నేను ఎగువన క్షణం కూడా ఆగకుండా పరుగెత్తినందుకు సిగ్గుగా అనిపిస్తుంది. అక్కడ నేను ఆగడానికి చిన్న ఆధారం దొరికినా చాలని ఎన్నిసార్లో అనుకుంటాను. నాకు నేనుగా ఏమీ చేసుకోలేక ఇలా పరుగెడుతూనే ఉన్నా. చిన్న ఆధారం ఉంటే ఒకింత విశ్రాంతిగా ప్రయాణం సాగిస్తాను. నా దారినంతటినీ పచ్చగా మార్చుకుంటాను.
ప్రెజెంటేషన్: వాకా మంజులారెడ్డి
email: manjula.features@sakshi.com
పెన్నా నది జన్మస్థానం: కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా నందగిరి కొండలు సాగరసంగమం: నెల్లూరు జిల్లా ఊటుకూరు, సంగం దగ్గర బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ ప్రదేశానికి సంగం అనే పేరు నది సంగమంతోనే వచ్చింది. నదీగమనం: 560 కి.మీ