రోజుల వయస్సు గల కవల పిల్లలతో పెన్నానది ఒడ్డున నివసిస్తున్న గిరిజన దంపతులు
సాక్షి, ఆత్మకూరు: ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పుట్టుపల్లి గ్రామ సమీపంలోని పెన్నానది గట్టున ఓ ఇసుక తిన్నెపై తాటాకులతో వేసుకున్న పూరిపాకలో గిరిజన దంపతులు ఈగా శీనయ్య, కృష్ణవేణి నివాసం ఉంటున్నారు. పెన్నానదిలో చేపలు పట్టి వాటిని అమ్ముకుని కడుపునింపుకుంటున్నారు. గతంలో కలువాయి మండలం తెలుగురాయపురం సమీపంలోని పెన్నాతీరంలో ఉంటున్న వీరు కొన్ని నెలల క్రితం పుట్టుపల్లి వద్దకు వచ్చారు. పెన్నలో చిన్న పాక ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. చేపల వేట వీరి జీవనాధారం. నాలుగేళ్లుగా పెన్నానదికి వరదలు లేక, వర్షాలు కురవకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేకుంటే వారు నివాసం ఉంటున్న ప్రాంతం ఓ మోస్తారు వర్షానికే మునిగిపోయి ఉండేది.
ఆధార్ లేదు.. రేషన్ రాదు
బతుకుదెరువు కోసం పుట్టుపల్లిలోని పెన్నాతీరానికి వచ్చిన వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు. కారణం ఆధార్, రేషన్‌కార్డు లాంటివి ఈ దంపతులకు లేవు. ఈ క్రమంలో కృష్ణవేణి గర్భం దాల్చింది. 10 రోజుల క్రితం ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కవల పిల్లలకు జన్మినిచ్చింది. సాధారణ కాన్పు కావడంతో ప్రసవించిన నాలుగు రోజులకే మళ్లీ తాముంటున్న పుట్టుపల్లిలోని పెన్నాతీరానికి చేరుకున్నారు. సాధారణంగా పురిటి బిడ్డలను ఎండ, వాన సోకకుండా ఇళ్లలోనే కాపాడుకుంటారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఈ గిరిజనులకు పెన్మమ్మే(పెన్నానదే) ఆవాసమైంది. పసిబిడ్డలకు పెన్నాతీరంలోనే స్నానం చేయిస్తూ ఆలనాపాలనా చూస్తున్నారు. వీరికి ఆధార్, రేషన్‌కార్డు లేకపోవడంతో తల్లీబిడ్డ సంక్షేమం ద్వారా అందే ప్రభుత్వపరమైన సౌకర్యాలు అందలేదు. వీరికి రేషన్ సరుకులు రావు. పక్కా ఇల్లు లేదు. గ్రామంలోని రైతులు పెన్నానది ఒడ్డుకు వచ్చే క్రమంలో వీరి దుస్థితిని చూసి పసిబిడ్డల కోసం దుస్తులు, ఆహార పదార్థాలు సాయమందిస్తున్నారు. దీని గురించి అధికారులకు సమాచారం లేదు.
ఐక్య ఫౌండేషన్ సాయం
గిరిజన కుటుంబం దుస్థితిని తెలుసుకున్న ఆత్మకూరు మండలం అప్పారావుపాళేనికి చెందిన ఐక్య ఫౌండేషన్ నిర్వాహకులు పుట్టుపల్లి అంగన్‌వాడీ కేంద్రానికి చేరుకుని వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు.
గిరిజన దంపతులకు పౌష్టికాహారం, మందులు అందజేస్తున్న ఏఎన్‌ఎంలు, అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది
స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి
ఆదివారం సోషల్ మీడియాలో ఈ గిరిజన దంపతుల గురించి ఒక్కసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసి స్పందిం చిన ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అప్పటికప్పుడే ఆ పేద గిరిజన కుటుంబానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చేజర్ల మండల తహసీల్దార్ ఎంవీకే సుధాకర్‌రావు, స్థానిక అంగన్‌వాడీ కార్యకర్త, ఏఎన్‌ఎంలు ఆ గిరిజనులకు పౌష్టికాహారం, మందులు అందజేసేందుకు వీఆర్‌ఓ, ఆర్‌ఐలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ గిరిజన దంపతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని పుట్టుపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వారిని తరలించారు. వారికి కలువాయిలోనూ రేషన్, ఆధార్‌కార్డు లేదన్న విషయం తెలుసుకుని వెంటనే ఆ కార్డులు అందించేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటివరకు వారికి నిత్యావసర వస్తువులు, రేషన్ సరుకులు అందించాలని సిబ్బందికి తెలిపారు. గిరిజన కుటుంబం దుస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment