tribal family
-
రోహిణి థియేటర్ నిర్వాహం.. కమల్ హాసన్ తీవ్ర ఖండన
చైన్నెలోని రోహిణి థియేటర్ నిర్వాహకం చర్యలను పలువురు సినీ ప్రముఖులు తీవ్రంగా ఖండిస్తున్నారు. నటుడు శింబు కథనాయకుడిగా నటించిన చిత్రం పతు తల. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకున్న ఈ చిత్రం గురువారం తెరపైకి వచ్చింది. దీంతో శింబు అభిమానులు వేకువజాము నుంచే థియేటర్ ముందు గుమికూడారు. అలాంటి వారిలో సంచార జాతి ప్రేక్షకులు ఉన్నారు. వీరు స్థానిక కోయంబేడులోని రోహిణి థియేటర్లో పత్తుతల చిత్రాన్ని చూడడానికి వచ్చారు. టికెట్లు కూడా కొనుగోలు చేసి థియేటర్లోకి వెళ్లడానికి ప్రయత్నించారు. అయితే అక్కడ థియేటర్ కార్మికుడు వారిని అడ్డుకోవడం వివాదాస్పదంగా మారింది. ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో కొంత సమయం తర్వాత వారిని లోపలికి అనుమతించారు. டிக்கெட் இருந்தும் நரிக்குறவ மக்களை படம் பார்க்க அனுமதிக்காத @RohiniSilverScr திரையரங்கம் ... இவுங்களுக்கு நீ தனி ஷோ போட்டுக்காட்டத்தான் போற அத நான் பாக்கத்தான் போறேன் ...#RohiniTheatre #PathuThala @SilambarasanTR_ @CMOTamilnadu @IamSellvah pic.twitter.com/1Pd3rE8CsV — Viji Nambai (@vijinambai) March 30, 2023 అయితే ఈ వ్యవహారంపై థియేటర్ నిర్వాహకం వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ వ్యవహారాన్ని కమలహాసన్, విజయ్‌సేతుపతి, సూరి, దర్శకుడు వెట్రిమారన్, నటి ప్రియా భవానిశంకర్ తీవ్రంగా ఖండించారు. తాజాగా కమలహాసన్ ట్విటర్లో పేర్కొంటూ టికెట్ తీసుకున్న తర్వాత కూడా సంచార జాతి ప్రజలను థియేటర్లోకి అనుమతించకపోయిన సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయిన తర్వాత వారిని అనుమతించడం ఖండించదగ్గ విషయం అని పేర్కొన్నారు. దర్శకుడు వెట్రిమారన్ శ్రమజీవులను థియేటర్లోకి రానీయకుండా అడ్డుకోవడం ప్రమాదకరం అని పేర్కొన్నారు. సూరి స్పందిస్తూ జరిగిన సంఘటనకు తాను విచారం వ్యక్తం చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రియా భవాని శంకర్ స్పందిస్తూ సంచార జాతి ప్రజలకు మద్దతు తెలిపారు. అందరూ ఎవరి పని వారు చేసుకుంటూ పోతున్నప్పుడు టికెట్ ఉన్నా కూడా మమ్మల్ని ఎందుకు థియేటర్లోకి అనుమతించడం లేదు అని సంచార జాతి మహిళా ప్రశ్నే ఇలాంటి వ్యతిరేక చర్యలకు తొలి గొంతు అని భవాని శంకర పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక కోయంబేడు పోలీసులు రోహిణి థియేటర్ నిర్వాకంపై అట్రాసిటీ కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. டிக்கெட் இருந்தும் நாடோடிப் பழங்குடியினருக்குத் திரையரங்கத்திற்குள் அனுமதி மறுக்கப்பட்டுள்ளது. சமூகவலைதளங்களில் எதிர்ப்பு கிளம்பிய பிறகே அவர்கள் அனுமதிக்கப்பட்டுள்ளனர். இது கண்டிக்கத்தக்கது. https://t.co/k9gZaDH0IM — Kamal Haasan (@ikamalhaasan) March 31, 2023 -
Viral:మల్టీప్లెక్స్‌లోకి గిరిజన కుటుంబం అడ్డగింత
Tribal Video: చెన్నైలోని ఓ పాపులర్ మల్టీప్లెక్స్ కమ్ షాపింగ్ మాల్ సిబ్బంది తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. సినిమా చూసేందుకు వెళ్లిన ఓ గిరిజన కుటుంబానికి చేదు అనుభవం ఎదురైంది. వాళ్లను స్క్రీన్‌లోకి వెళ్లనివ్వకుండా అడ్డుకున్నారు సిబ్బంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో సదరు మల్టిప్లెక్స్ మేనేజ్మెంట్ వివరణ ఇచ్చుకుంది. చెన్నైలోని రోహిణి సిల్వర్ స్క్రీన్స్‌లో శింబు నటించిన ‘పాతు తల’ చిత్రం నడుస్తోంది. ఇంతలో ఓ కుటుంబం టికెట్లు కొనుక్కుని లోపలికి వెళ్లేందుకు యత్నించింది. అయితే.. వాళ్ల అవతారం, వేషధారణ చూసి థియేటర్ సిబ్బంది వాళ్లను లోపలికి అనుమతించలేదు. టికెట్లు ఉన్నా అనుమతించకపోవడంపై ఆ కుటుంబం తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో దుమారం రేగింది. గిరిజనులపై వివక్ష ప్రదర్శించిన సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ట్విటర్, యూట్యూబ్, సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయ్యి హక్కుల సాధన ఉద్యమకారుల నుంచి విమర్శలకు తావిచ్చింది. ఇంకోపక్క నారికురవర్(ఆ కుటుంబం ఈ వర్గానికి చెందిందే) తెగ పెద్దలు సైతం ఈ ఘటనపై మానవ హక్కుల సంఘాన్ని ఆశ్రయించేందుకు యత్నించారు. అయితే.. காசு கொடுத்து டிக்கெட் வாங்கினப்புறம் என்னடா இது @RohiniSilverScr pic.twitter.com/bWcxyn8Yg5 — Sonia Arunkumar (@rajakumaari) March 30, 2023 ఈలోపే సదరు మల్లిప్లెక్స్ నిర్వాహకులు ఘటనపై వివరణ ఇచ్చారు. పాతు తల చిత్రానికి సెన్సార్ బోర్డు యూ బై ఏ U/A సర్టిఫికెట్ ఇచ్చింది. కాబట్టి, 12 ఏళ్లలోపు వాళ్లు సినిమా చూసేందుకు అనుమతి లేదు. ఆ లెక్కన ఆ కుటుంబంలో రెండు, ఆరు, ఎనిమిది, పదేళ్ల వయసున్న పిల్లలు ఉన్నారు. అందుకే లోపలికి అనుమతించలేదు. అంతేతప్ప.. అక్కడ ఎవరినీ అవమానించలేదు. ఈలోపు కొందరు గుమిగూడి గూడడంతో.. పరిస్థితి చెయ్యి దాటకూడదన్న ఉద్దేశంతో వాళ్లను సినిమా చూసేందుకు అనుమతించాం అంటూ ఆ కుటుంబం వీడియో చూస్తున్న వీడియోను నెట్లో పోస్ట్ చేశారు. pic.twitter.com/dvfewZsxuN — Rohini SilverScreens (@RohiniSilverScr) March 30, 2023 ఇదిలా ఉంటే.. ఓ గిరిజన మహిళ ఫిర్యాదు మేరకు ఎస్సీ/ఎస్టీ చట్టంతో పాటు ఐపీసీ సెక్షన్ 341 కింద ఇద్దరు థియేటర్ సిబ్బందిపై పోలీసులు కేసు నమోదు చేయగం గమనార్హం. మరోవైపు సినీ ప్రముఖులు సైతం ఈ వీడియోపై స్పందించారు. ఈ వ్యవహారంలో థియేటర్ సిబ్బంది తీరుపై సింగర్ చిన్మయి ఆగ్రహం వ్యక్తం చేయగా.. సంగీత దర్శకుడు జీవీ ప్రకాశ్, వ్యవహారం అప్పుడే సర్దుమణిగిందని, వాళ్లను సినిమా చూసేందుకు మేనేజ్మెంట్ అనుమతించిందంటూ రీట్వీట్ చేశారు. ఇదీ చదవండి: రియల్ కాంతార.. భూత కోల చేస్తూ కుప్పకూలాడు పాపం -
నాటుకోడి కూర కారంగా ఉందే: సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: నిత్యం మంత్రులు, ఉన్నతాధికారులతో బిజీబిజీగా గడిపే ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శనివారం ప్రత్యేకంగా గడిపారు. చెన్నై శివార్లలోని సంచారజాతుల నివాసాలకు వెళ్లి సరదా ముచ్చటించారు. వారి పిల్లాపాపలతో ముచ్చట్లాడి, స్వయంగా ఇడ్లీ తినిపించి అందరినీ ఆశ్చర్య పరిచారు. ఆవడి సమీపంలోని తిరుముల్లవాయల్ పరిసరాల్లో నివసించే సంచారజాతుల నివాసాలను సీఎం స్టాలిన్ శుక్రవారం సందర్శించారు. వీరు పూసలతో హారాలు, గాజులు తయారు చేసే చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్నారు. కారం తింటే కరోనా రాదయ్యా.. కొద్దిసేపు సీఎం స్టాలిన్ అక్కడి ప్రజలతో మాట్లాడి వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకున్నారు. అక్కడి నుంచి ఆవడి బస్‌స్టేషన్ సమీపంలోని సంచారజాతుల ఇళ్లకు వెళ్లి సంభాషించారు. ఓ ఇంట్లో ఇడ్లీ తిని ఒక బాలికకు తినిపించారు. ఇడ్లీతో పాటు పెట్టిన నాటుకోడి కూర కారంగా ఉందే అని ముఖ్యమంత్రి స్టాలిన్ ప్రశ్నించారు. కారం తీంటే కరోనా రాదని మా నమ్మకం అయ్యా అంటూ ఒక మహిళ బదులిచ్చింది. అలాగైతే నేనూ కారం ఎక్కువగా తింటాను అంటూ సీఎం స్టాలిన్ నవ్వుతూ బదులిచ్చారు. ఆ తరువాత అక్కడి ప్రజలకు సీఎం ఆరోగ్య బీమా పథకం కార్డు, రేషన్‌కార్డులు, సామాజిక రక్షణ పథకం కింద ఆర్థిక సాయం, ఇళ్లపట్టాలను పంపిణీ చేశారు. సంచార జాతి ప్రజలకు అందుతున్న మౌలిక సదుపాయాల గురించి ఆరా తీశారు. సంచారజాతుల వారు తయారుచేసిన వివిధ పూసల హారాన్ని సీఎం స్టాలిన్ మెడలో వేసి సత్కరించారు. చదవండి: (రష్యా నుంచి ఎస్–400 మిస్సైల్ సిస్టమ్ రాక) -
మద్యంలో విషం కలిపి...
ఖమ్మం క్రైం: వారంతా అన్నదమ్ముల పిల్లలే. అయినా ఏళ్ల తరబడి కొనసాగుతున్న పాత కక్షలతో సొంత సోదరులనే అంతమొందించారు. సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య మిస్టరీని పోలీసులు చేధించగా, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సోమవారం వివరాలు వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో అన్నాదమ్ముళ్ల కుటుంబాలకు చెందిన బోడా మల్సూర్, బోడా హరిదాస్, బోడా భద్రు కలిసిమెలిసి జీవించేవారు. అయితే, వీరితో ఇదే తండాకు చెందిన బోడా బిచ్చా, ఆయన కుమారులు అర్జున్, చిన్నాకు పడేది కాదు. భూవివాదాలు మొదలు అనేక విషయాల్లో ఘర్షణలు ఉండగా పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. అన్ని విషయాల్లో మల్సూర్, హరిదాస్, భద్రు తమకంటే పైచేయిగా ఉన్నారని ఆక్రోశంతో బిచ్చా కుమారులు రగిలిపోయారు. ముగ్గురిని హతమారిస్తే తమదే పెత్తనమవుతుందని బోడా చిన్నా నిర్ణయించుకుని తండాకే చెందిన «తన బం«ధువు, స్నేహితుడైన ధరావత్ సింగ్‌కు చెప్పి సాయం కోరాడు. ఆయన చంద్రుగొండకు చెందిన నందనూరి సుదర్శన్‌ను చిన్నాకు పరిచయం చేయగా, బంగారం దుకాణంలో పనిచేసే భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీం వద్దకు సుదర్శన్ తీసుకెళ్లాడు. అక్కడ రూ.15 వేలకు ఆభరణాల తయారీలో ఉపయోగించే సెనైడ్ కొనుగోలు చేశారు. కర్మకాండలే వేదికగా హత్యాపథకం ఆరు నెలలుగా హరిదాస్, మల్సూర్, భద్రులను హత్య చేసేందుకు సమయం కోసం చూస్తుండగా, బిచ్చా కుమారుడు అర్జున్ మరణించాడు. దీంతో ఈనెల 14వ తేదీన అర్జున్ కర్మకాండలకు ముగ్గురినీ ఆహ్వానించారు. అయితే మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లిన కారణంగా వారు హాజరుకాలేదు. దీంతో చిన్నా అదేరోజు సాయంత్రం వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హరిదాస్, మల్సూర్, భద్రుతో పాటు వారి కుటుంబసభ్యులు మరో ముగ్గురు వచ్చారు. ఈ మేరకు వారు భోజనానికి సిద్ధమవుతుండగా, చిన్నా ముందుగానే సైనేడ్ కలిపిన మద్యం తీసుకొచ్చి వారికి అందించడంతో ఆయన కుట్ర తెలియని ఆ ముగ్గురూ మద్యం సేవించారు. దీంతో హరిదాస్, మల్సూర్ అక్కడిక్కడే మృతిచెందగా, భద్రు ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం బోడా చిన్నా, ధరావత్ సింగ్, నందనూరి సుదర్శన్, మహ్మద్ సలీంను అరెస్ట్ చేయగా బోడా బిచ్చా పరారీలో ఉన్నాడు. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించిన కూసుమంచి సీఐ సతీశ్, ఎస్సైలు రఘు, నన్దీప్, అశోక్‌తోపాటు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ స్నేహమోహ్రా, ఏసీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
గిరిజన ఆణిముత్యం.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ బినేష్ బాలన్
గిరిజన నిరుపేద కుటుంబంలో జన్మించిన ఆణిముత్యం బినేష్ బాలన్. తనతోపాటు ఎదిగిన ఆర్థిక కష్టాలతోపాటు, సాంఘిక వివక్షతను సమర్థవంతంగా అధిగమించాడు. కూలీవాడని తోటి సమాజం తూట్లు పొడుస్తున్నప్పటీకి కుంగిపోకుండా మౌనంగా ముందుకు సాగి సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా ఎదిగాడు. కేరళలోని కాసర్గోడ్ జిల్లా కొలిచల్ గ్రామం బినేష్ సొంతూరు. కూలీనాలి చేసుకుని జీవనం సాగించే మావిలాన్ గిరిజన కుటుంబంలో బినేష్ జన్మించాడు. నిరుపేద కుటుంబం కావడంతో చిన్నప్పటి నుంచే తనుకూడా కూలీ పనులకు వెళ్లి కుటుంబానికి సాయం చేస్తూ శ్రద్ధగా చదువుకునేవాడు. బినేష్ నాలుగోతరగతి చదివేటప్పుడు ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న రాజపురం టౌన్లో ఇంటర్నెట్ కేఫ్‌లో వీడియోగేమ్‌లు ఆడేందుకు ఎంతో ఇష్టంగా వెళ్లేవాడు. అప్పుడే అతనికి కంప్యూటర్స్‌పై మక్కువ ఏర్పడింది. అప్పటి నుంచి కంప్యూటర్ నేర్చుకోవాలనే తపన అతడిలో పెరిగింది. దీంతో కంప్యూటర్ సంబంధిత పుస్తకాల ద్వారా కొంత, నెట్లో కొంత వెతికి భిన్నమైన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకోవడంతోపాటు, కంప్యూటర్ ఆపరేట్ చేయడం పూర్తిగా నేర్చుకున్నాడు. ఇతర సబ్జెక్టుల కంటే కంప్యూటర్‌నే ఎక్కువగా ఇష్టపడేవాడు. కాలం గడుస్తున్న కొద్దీ కంప్యూటర్లో ఆరితేరి క్లాస్ లో దిబెస్ట్‌గా నిలిచాడు. దీంతో స్కూల్లో టీచర్లు సైతం కంప్యూటర్ సంబంధించి ఏవైనా సందేహాలు ఉంటే తననే సంప్రదించేవాళ్లు. ఆ తర్వాత ఎకనమిక్స్‌లో డిగ్రీ పూర్తిచేసి ఎంబీఏలో చేరాడు. కూలిపని చేసుకుంటూనే ఎంబీఏ పూర్తిచేసిన బినేష్ అనేక ఆటంకాలను అధిగమించి కేంద్ర ప్రభుత్వ అందించే స్కాలర్షిప్ సాయంతో యూకేలోని సస్సెక్స్ యూనివర్శిటీలో చదువుకోవడానికి వెళ్లాడు. స్కాలర్షిప్ డబ్బులు సరిపోకపోవడంతో ఉదయం 4 గంటల నుంచి 8 గంటల వరకు క్లీనింగ్ బాయ్‌గా పనిచేసి తన చదువును కొనసాగించాడు. చదువు పూర్తయ్యాక సాఫ్ట్వేర్ ఉద్యోగిగా జీవితం ప్రారంభించాడు. ఎప్పటికైనా స్టార్టప్ స్థాపించాలని అనుకున్న బినేష్ ... తన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఓపెన్ బ్యాంకింగ్ సాఫ్ట్వేర్(రెక్స్‌చేంజ్)ను అభివృద్ధి చేసి విజయం సాధించాడు. రెక్స్‌చేంజ్ సాఫ్ట్వేర్.. తన కొలీగ్ అయిన ఇడుక్కితో కలిసి ఫ్యూచర్ జనరేషన్స్‌కు ఉపయోగపడే సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేసేందుకు బినేష్ కృషిచేశాడు. ప్రస్తుతం మన దేశ బ్యాంకింగ్ వ్యవస్థలో ఉపయోగించే సాఫ్ట్వేర్ల మాదిరిగా ఇది పనిచేయదు. రెక్స్‌చేంజ్ డబ్బువిలువను భారతీయ రూపాయల్లో కాకుండా, రెసిప్రొసిటీ లేదా ఆర్వీ అనే డిజిటల్ విలువలో నిల్వచేస్తుంది. ఆర్వీని ఉంచే ఖాతాను కూప్ బ్యాంక్ అకౌంట్ నంబర్(సీబీఏఎన్) అనిపిలుస్తారు. ఇది యూరో డాలర్, పౌండ్ వంటి అధిక విలువ కలిగిన కరెన్సీ విలువలను నిల్వ చేయగలదు. అంతేగాక ఇండియన్ కరెన్సీలో విత్‌డ్రా చేసుకోవచ్చు. సీబీఎన్ ఖాతా రెక్స్‌చేంజ్ యాప్ ద్వారా మాత్రమే పనిచేస్తుంది. వారం క్రితం ప్రారంభించిన ఈ యప్‌ను ఇప్పటికే 70 మందికిపైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఆర్వీ విలువను లైవ్ రెక్స్‌చేంజ్ రేట్(ఎల్ఆర్ఆర్) నిర్ణయిస్తుంది. సీబీఎన్ ఖాతాల సంఖ్య పెరుగుదల ప్రకారం ఎల్ఆర్ఆర్ పెరుగుతుంది. 2019 నుంచి అమ్స్టర్డమ్ యూనివర్శిటీలో సామాజిక, సాం్కృతిక ఆంథాలజీ మీద బినేష్ పరిశోధనలు చేస్తున్నాడు. -
మనుషులా.. రాబంధులా!
అందరూ ఆడపిల్లలు. తల్లిదండ్రుల మరణంతో అనాథలయ్యారు. ఉండడానికి సరైన గూడు కూడా లేని దయనీయ స్థితిలో ఉన్న ఆడపిల్లల విషయంలో మానవత్వం చూపాల్సిన కొందరు రాబంధుల్లా వ్యవహరించారు. తండ్రి మరణంతో ప్రభుత్వం అందజేసిన బీమా సొమ్మును ఎవరికి వారు వీలైనంత వాటాలు పంచుకున్నారు. అసలే గిరిజనులు. చదువు సంధ్య లేని అమాయకులు. ఆడపిల్లల అమాయకత్వాన్ని, అజ్ఞానాన్ని ఆసరాగా చేసుకుని కొందరు గ్రామ పెద్దలు వేరొకరి బాకీలను, అప్పు ఉన్నాడని డబ్బులు కాజేశారు. సాక్షి, నెల్లూరు(కలువాయి): సాటి మనిషికి కష్టమొస్తే.. అండగా నిలిచి మానవత్వం చూపాల్సిన కొందరు పెద్ద మనుషులు, ప్రభుత్వ ఉద్యోగులు సాయం పేరుతో రాబంధుల కన్నా హీనంగా వ్యవహరించారు. రాబంధులన్నా.. కళేబరాలను మాత్రమే పీక్కుతింటాయి. కానీ మనిషి రూపంలో ఉన్న ఈ రాబంధులు బతికున్న వాళ్లను పీక్కుతింటున్నారు. అనాథలైన ఆడపిల్లలకు తలో చేయ్యేసి మేమున్నామని భరోసా ఇవ్వాల్సిన తరుణంలో వీరు తలో చేయ్యేసి వారి సొమ్మును కాజేసి వాటాలు పంచుకున్నారు. ►మండలంలోని దాచూరు ముక్కుతిప్ప గ్రామంలో ఓ పేద గిరిజన కుటుంబం నివాసం ఉంటోంది. మల్లికా రమణయ్య, లక్ష్మమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. అందరూ ఆడబిడ్డలే. ►రమణయ్య చేపల వేటతో ఆ కుటుంబం జీవనం సాగించేది. ఏ పూటకాపూట పని చేస్తేనే కానీ పూట గడవని స్థితి. విధివశాత్తు లక్ష్మమ్మ 13 ఏళ్ల క్రితం మరణించింది. ►అందరూ ఆడపిల్లలు కావడంతో రమణయ్య తాను కాయకష్టం చేసి బిడ్డలను పోషించుకుంటూ వచ్చాడు. అయితే అప్పటికే తన మొదటి ఇద్దరు బిడ్డలు వెంకటరమణమ్మ, అంజలిలకు పెళ్లి చేశాడు. ►ఐదో సంతానం స్వాతి పుట్టుకతో మూగ, మానసిక పరిపక్వత లేకపోయినా ఎంతో అపురూపంగా చూసుకునేవాడు. ►విధి ఆ కుటుంబాన్ని వెంటాడింది. రమణయ్య ఈ ఏడాది మార్చి 21వ తేదీ ఆకస్మికంగా మృతి చెందాడు. ►తల్లి, తండ్రి కాలం చేయడంతో ఆ కుటుంబం వీధిన పడింది. ►ఆయన మృతితో మిగిలిన బిడ్డలు అనాథలుగా మారారు. ప్రస్తుతం వీరు పెదనాన్న హనుమంతు సంరక్షణలో ఉన్నారు. ►హనుమంతు కుటుంబం ఆర్థిక పరిస్థితి కూడా అంతంత మాత్రమే. కూలి పనులు చేసి జీవనం సాగించేవాడు. తనకు భారమైన తమ్ముడి సంతానం బాగోగులు చూస్తున్నాడు. వైఎస్సార్ బీమా సొమ్ములో ఉద్యోగులు, పెద్దలు వాటాలు రమణయ్య మృతితో ఆ కుటుంబాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం వైఎస్సార్ బీమా పథకం కింద రూ.2 లక్షలు మంజూరు చేసింది. ఈ మొత్తాన్ని ఆడ పిల్లల బతుకుదెరువుకు అందించాల్సిన వెలుగు ఉద్యోగులు, గ్రామ పెద్దలు కొందరు వాటాలు పంచుకుని, చివరకు కేవలం రూ.45 వేలు మాత్రమే వారికి అందించారు. ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు ప్రభుత్వం అందజేసే సాయాన్ని ప్రతి రూపాయి ఆ కుటుంబ ప్రయోజనాలకే ఉపయోగపడాలని, బ్యాంకర్లు, ప్రైవేట్ అప్పుల వాళ్లు తీసుకోకుండా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. అయితే ఇందుకు భిన్నంగా ఇక్కడి ఉద్యోగుల, కొందరు పెద్దలు వ్యవహరించిన తీరు జుగుస్పాకరంగా ఉంది. ►రమణయ్య పేరుతో వేరొక వ్యక్తి బ్యాంక్‌లో తీసుకున్న రుణం బకాయికి కొందరు పెద్దలు రూ. 12 వేలు జమ చేయించారు. ►మరో వ్యక్తి రమణ్య తనకు బాకీ పడ్డాడని తెల్ల కాగితాలు చూపించి మరో రూ.30 వేలు అప్పు కింద జమ చేసుకున్నాడు. ►వెలుగులో పని చేసే వీఓఏ అధికారులకు, ఖర్చులకు అంటూ రూ.10 వేలు తీసుకున్నారు. ►రమణయ్య కూతురు పొదుపు రుణం ఉందని దానికి జమ చేయించేందుకు కొంత పక్కన పెట్టారు. ►అన్నీ పోగా ఆ కుటుంబానికి బీమా సొమ్ములో రూ. 45 వేలు మాత్రమే మిగిలాయి. సమాధానం చెప్పని వెలుగు ఉద్యోగులు మానవత్వాన్ని ప్రశ్నిస్తున్న గిరిజన కుటుంబానికి జరిగిన అన్యాయంపై స్థానిక విలేకరులు వెలుగు ఉద్యోగులను సంప్రదిస్తే సమాధానం చెప్పడానికి కూడా ఇష్టపడడం లేదు. ఒకటికి పది సార్లు ఫోన్ చేసినా కూడా కనీసం లిఫ్ట్ చేయడం లేదు. మరొకరి ద్వారా ఫోన్ చేయిస్తే.. తమకేమీ తెలియదంటూ దాట వేస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కాక హడావుడిగా వీఓఏ తీసుకున్న రూ.10 వేల మాత్రం ఆడపిల్లలకు తెచ్చి ఇచ్చేశారు. నెలనెలా ప్రభుత్వ జీతాలు తీసుకుంటూ ఇలాంటి సాయంలో కక్కుర్తికి పాల్పడుతున్న ఉద్యోగుల తీరుపై స్థానికులు అసహ్యించుకుంటున్నారు. ఈ వ్యవహారంలో వీఓఏను కాపాడేందుకే హడావుడిగా స్వాహా చేసిన సొమ్మును తిరిగి తెచ్చి ఇచ్చారని స్థానికులు అంటున్నారు. -
చిగురుటాకులా.. నూరేళ్ల ఆయుష్షు
ఆడే పాడే వయస్సు.. చలాకీగా గడపాల్సిన ప్రాయం.. బడికిపోదామంటే భయం భయం.. చేయి కదపలేడు.. రాత రాయలేడు.. ఆడుకుందామంటే ఆందోళన.. తనకేమవుతుందోననే భయం.. పురిటి బిడ్డగా ఉన్నప్పుడే మెడపై ఏర్పడిన గడ్డ (న్యూరల్ ట్యూబ్ డిఫెక్ట్)అతన్ని కదలనీయకుండా చేస్తోంది. చేయి కదిలిస్తే నొప్పితో నరకయాతన. ప్రాణం పోయేంత బాధ. చీపురు పుల్ల తగిలినా గిలగిలా కొట్టుకుంటాడు. వైద్యులు మాత్రం ఆపరేషన్ చేసినా ఆయుష్షుకు గ్యారెంటీ లేదంటున్నారు. వైద్యం చేయించలేని నిరుపేద తల్లిదండ్రుల స్తోమత. కంటికి రెప్పలా కాపాడుకోకపోతే తమ బిడ్డ బతకడేమోనన్న మానసిక వేదన. వెరసి పదిహేనేళ్లుగా ఓ గిరిజన విద్యార్థి బతుకు దినదినగండంలా మారింది. నాయుడుపేట మండలం శ్రీనివాసపురం గిరిజన కాలనీకి చెందిన నాని నరకయాతన చూస్తే ఎవరైనా కన్నీరు పెడతారు. సాక్షి, నాయుడుపేట: నాయుడుపేట మండల పరిధిలోని జువ్వలపాళెం పంచాయతీ శ్రీనివాసపురం గిరిజనకాలనీకి చెందిన సత్యేటి వెంకటరమణయ్య – మరియమ్మలకు ముగ్గురు కుమారులు. తొలి సంతానం సత్తేటి నాని. నానికి పురిటి బిడ్డగా ఉన్న సమయంలోనే మెడపై గుండ్రని కణిత ఏర్పడింది. అప్పట్లో వైద్యులు గడ్డను చూసి ఆపరేషన్ చేస్తే బిడ్డకు ప్రమాదమని చెప్పారు. చేసేదేమీ లేక ఆ తల్లిదండ్రులు మిన్నకుండిపోయారు. నానిని స్వగ్రామమైన జువ్వలపాళెం ప్రాథమికోన్నత పాఠశాలలో 8వ తరగతి వరకు చదివించారు. 9వ తరగతిలో చేరేందుకు సమీప పాఠశాలల్లో చేరాలన్న ప్రయత్నంలో ఉన్నారు. వసతి గృహంలో చేరాలంటే కణితకు చీపురపుల్ల తగిలినా గిలగిలకొట్టుకుంటూ పడిపోతాడు. ఈ అనారోగ్య కారణంతో వసతి గృహాల్లో చేర్చలేక దూరంగా చదివించలేక తల్లిదండ్రులే భారం మోస్తున్నారు. సమీప పాఠశాలలో చదివించుకుంటూ సాయంత్రానికి ఇంటికి వచ్చేలా తమ బిడ్డను కంటికిరెప్పలా కాపాడుకుంటున్నారు. సెంటు భూమి లేని ఈ గిరిజన కుటుంబం కార్పొరేట్ వైద్యం అందించలేని పరిస్థితిలో ఉంది. కార్పొరేట్ వైద్యం అందించాలంటే పెద్ద మొత్తంలో నగదు చెల్లించుకోవాల్సి ఉంది. అంత స్తోమత లేని ఈ కుటుంబం ప్రభుత్వ వైద్యశాలల్లో మెడపై ఉన్న కణితను చూపుతూ ప్రభుత్వ వైద్యులు ఇచ్చిన సలహాల మేరకు 15 ఏళ్లుగా కాలం వెల్లదీస్తూ వచ్చారు. ఈ క్రమంలో 9వ తరగతిలో చేరాలంటే దూర ప్రాంతాల్లో చేరాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. బిడ్డను అలా చేర్పిస్తే ఇబ్బందులు పడాల్సి వస్తుందేమోనని మదనపడుతూ పాఠశాలలు ప్రారంభమై రెండు నెలలు కావస్తున్నా ఇంటి వద్దనే ఉంచారు. చేయూతనివ్వని గత ప్రభుత్వాలు పదేళ్లుగా ప్రభుత్వాల నుంచి వారు ఆర్థికసాయం కోసం ఎదురుచూస్తున్నారు. మెడపై గడ్డ కారణంగా కుడిచేయి పైకి లేపలేకపోవడంతోపాటు రోజురోజుకూ చేయి సన్నగిల్లుతోంది. దీని కారణంగా మానసిక ధైర్యాన్ని కోల్పోతున్న ఆ విద్యార్థికి సదరం క్యాంపులో ఫిజికల్ హ్యాండీ క్యాప్డ్ సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడంతో ప్రభుత్వం నుంచి అందే పెన్షన్ కూడా అందడం లేదు. చేయి కదపలేక, పనిచేసుకోలేక, రాయలేని స్థితిలో ఉన్న విద్యార్థికి వైద్యశాఖ అధికారులు సర్టిఫికెట్ మంజూరు చేయకపోవడం బాధాకరమని ఆ గిరిజన కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తోంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన ఈ విద్యార్థికి కొత్తగా బాధ్యతలు చేపట్టిన జిల్లా ఉన్నతాధికారులైనా న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. నాని మెడపై ఉన్న గడ్డ, చేయి కదపలేని పరిస్థితిలో నాని గడ్డ పెరిగే కొద్ది భయమేస్తుంది పురిటి బిడ్డ నుంచే ఉన్న చిన్నపాటి కణిత రోజురోజుకూ పెరుగుతోంది. పెరిగే కొద్ది భయమేస్తోంది. కొంతమంది వైద్యులు ఆపరేషన్ చేస్తే ప్రమాదమని చెబుతున్నారు. మరికొంతమంది వైద్యులు సాంకేతిక పరిజ్ఞానంతో కణితను తీసి మామూలు మనిషిని చేస్తారని చెబుతున్నారు. ఉన్న ముగ్గురు బిడ్డలను పోషించేందుకే మా జీవితం సరిపోతోంది. పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో డబ్బు పెట్టాలంటే మాకు స్థోమత లేదు. ప్రభుత్వ వైద్యులు మాకు ఎలాంటి సలహాలు ఇవ్వడం లేదు. – సత్తేటి మణెమ్మ, నాని తల్లి చదువుకోవాలని ఉంది నాకు చదువుకోవాలని ఉంది. మంచి చదువులు చదివి అమ్మానాన్నలకు మంచి పేరు తీసుకురావాలని అనుకుంటున్నా. కానీ నా మెడపై పెరుగుతున్న గడ్డ కారణంగా రాత్రి పడుకున్న సమయంలో నొప్పికి అల్లాడిపోతున్నా. పాఠశాలకు వెళ్లిన సమయంలో స్నేహితులతో కలిసి ఆటలాడలేకున్నా. చదువుపై దృష్టి పెట్టాలంటే ఆరోగ్యం సహకరించడం లేదు. – సత్తేటి నాని, విద్యార్థి -
పెన్నమ్మే అమ్మ
సాక్షి, ఆత్మకూరు: ప్రపంచం సాంకేతికంగా ఎంతో అభివృద్ధి చెందినా గ్రామీణ ప్రాంతాల్లోని పేద కుటుంబాల పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఆత్మకూరు నియోజకవర్గంలోని చేజర్ల మండలం పుట్టుపల్లి గ్రామ సమీపంలోని పెన్నానది గట్టున ఓ ఇసుక తిన్నెపై తాటాకులతో వేసుకున్న పూరిపాకలో గిరిజన దంపతులు ఈగా శీనయ్య, కృష్ణవేణి నివాసం ఉంటున్నారు. పెన్నానదిలో చేపలు పట్టి వాటిని అమ్ముకుని కడుపునింపుకుంటున్నారు. గతంలో కలువాయి మండలం తెలుగురాయపురం సమీపంలోని పెన్నాతీరంలో ఉంటున్న వీరు కొన్ని నెలల క్రితం పుట్టుపల్లి వద్దకు వచ్చారు. పెన్నలో చిన్న పాక ఏర్పాటు చేసుకుని ఉంటున్నారు. చేపల వేట వీరి జీవనాధారం. నాలుగేళ్లుగా పెన్నానదికి వరదలు లేక, వర్షాలు కురవకపోవడంతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. లేకుంటే వారు నివాసం ఉంటున్న ప్రాంతం ఓ మోస్తారు వర్షానికే మునిగిపోయి ఉండేది. ఆధార్ లేదు.. రేషన్ రాదు బతుకుదెరువు కోసం పుట్టుపల్లిలోని పెన్నాతీరానికి వచ్చిన వీరికి ప్రభుత్వపరంగా ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు కాలేదు. కారణం ఆధార్, రేషన్‌కార్డు లాంటివి ఈ దంపతులకు లేవు. ఈ క్రమంలో కృష్ణవేణి గర్భం దాల్చింది. 10 రోజుల క్రితం ఆత్మకూరులోని జిల్లా ప్రభుత్వ వైద్యశాలలో కవల పిల్లలకు జన్మినిచ్చింది. సాధారణ కాన్పు కావడంతో ప్రసవించిన నాలుగు రోజులకే మళ్లీ తాముంటున్న పుట్టుపల్లిలోని పెన్నాతీరానికి చేరుకున్నారు. సాధారణంగా పురిటి బిడ్డలను ఎండ, వాన సోకకుండా ఇళ్లలోనే కాపాడుకుంటారు. కటిక పేదరికాన్ని అనుభవిస్తున్న ఈ గిరిజనులకు పెన్మమ్మే(పెన్నానదే) ఆవాసమైంది. పసిబిడ్డలకు పెన్నాతీరంలోనే స్నానం చేయిస్తూ ఆలనాపాలనా చూస్తున్నారు. వీరికి ఆధార్, రేషన్‌కార్డు లేకపోవడంతో తల్లీబిడ్డ సంక్షేమం ద్వారా అందే ప్రభుత్వపరమైన సౌకర్యాలు అందలేదు. వీరికి రేషన్ సరుకులు రావు. పక్కా ఇల్లు లేదు. గ్రామంలోని రైతులు పెన్నానది ఒడ్డుకు వచ్చే క్రమంలో వీరి దుస్థితిని చూసి పసిబిడ్డల కోసం దుస్తులు, ఆహార పదార్థాలు సాయమందిస్తున్నారు. దీని గురించి అధికారులకు సమాచారం లేదు. ఐక్య ఫౌండేషన్ సాయం గిరిజన కుటుంబం దుస్థితిని తెలుసుకున్న ఆత్మకూరు మండలం అప్పారావుపాళేనికి చెందిన ఐక్య ఫౌండేషన్ నిర్వాహకులు పుట్టుపల్లి అంగన్వాడీ కేంద్రానికి చేరుకుని వారికి నెల రోజులకు సరిపడా నిత్యావసర సరుకులు, బియ్యం అందజేశారు. గిరిజన దంపతులకు పౌష్టికాహారం, మందులు అందజేస్తున్న ఏఎన్ఎంలు, అంగన్వాడీ కేంద్రాల నిర్వాహకులు, రెవెన్యూ సిబ్బంది స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి ఆదివారం సోషల్ మీడియాలో ఈ గిరిజన దంపతుల గురించి ఒక్కసారిగా విషయం వెలుగులోకి వచ్చింది. ఇది చూసి స్పందిం చిన ఆత్మకూరు ఎమ్మెల్యే, రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి అప్పటికప్పుడే ఆ పేద గిరిజన కుటుంబానికి అవసరమైన సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. దీంతో చేజర్ల మండల తహసీల్దార్ ఎంవీకే సుధాకర్‌రావు, స్థానిక అంగన్వాడీ కార్యకర్త, ఏఎన్ఎంలు ఆ గిరిజనులకు పౌష్టికాహారం, మందులు అందజేసేందుకు వీఆర్ఓ, ఆర్ఐలతో కలిసి అక్కడికి చేరుకున్నారు. ఆ గిరిజన దంపతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకుని పుట్టుపల్లి గ్రామంలో ఖాళీగా ఉన్న అంగన్వాడీ కేంద్రానికి వారిని తరలించారు. వారికి కలువాయిలోనూ రేషన్, ఆధార్‌కార్డు లేదన్న విషయం తెలుసుకుని వెంటనే ఆ కార్డులు అందించేలా ఏర్పాట్లు చేయాలని సిబ్బందిని ఆదేశించారు. అప్పటివరకు వారికి నిత్యావసర వస్తువులు, రేషన్ సరుకులు అందించాలని సిబ్బందికి తెలిపారు. గిరిజన కుటుంబం దుస్థితిని తెలుసుకుని వెంటనే స్పందించిన మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. -
దారుణం : రూ.200లకు కన్నబిడ్డను అమ్మిన అమ్మ
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో దారుణం జరిగింది. తినడానికి తిండిలేని ఓ గిరిజన కుటుంబం పూట గడవడం కోసం రెండేళ్ల కుమారుడిని రూ.200లకు అమ్ముకున్నారు. ఈసంఘటన రాష్ట్ర రాజధాని అగర్తలాకు 112కిలోమీటర్ల దూరంలో ఉన్న రామ్కుమార్పురాలో జరిగింది. రుయనాభాటీ రేయంగ్ దంపతులు కటిక పేదరికం అనుభవిస్తున్నారు. వీరికి ప్రభుత్వం తరపున ఏ సంక్షేమ పథకాలు అందంటం లేదు. ఒకపూట కూడా తినడానికి తిండి లేని సమయాన తన రెండేళ్ల కుమారుడిని మచ్కుంభీర్కు చెందిన ఆటో డ్రైవర్ ధన్షాయ్కు గత ఏప్రిల్ 13న కేవలం రూ.200లకు అమ్ముకున్నారు. అయితే ఈసంఘటనపై సమాచారం అందుకున్న ఛైల్డ్ లైన్ స్వచ్చంద సంస్థ ఈసంఘటనను తీవ్రంగా ఖండించింది. తల్లీ బిడ్డలను తిరిగి కలిపే బాధ్యత తీసుకుంది. జిల్లా పాలనాధికారులు, పోలీసుల సహకారంతో బాలుడి తల్లి రుయనాభాటీతోపాటు, బాలుడిని కొనుగోలు చేసిన ధన్షాయ్తో పలుసార్లు చర్చలు జరిపింది. ఈసందర్భంగా రుయనాభాటీ విధిలేని పరిస్థితుల్లో తన రెండో భర్త, బాలుడిని అమ్మమని బలవంతం పెడితేనే అమ్మినట్లు పేర్కొంది. పలు దఫాలు ఇరువురితో చర్చలు జరిపిన తరువాత బాలుడిని కన్నతల్లికి అప్పగించినట్లు ఛైల్డ్‌లైన్ సభ్యులు మృణాళిని రక్షిత్ తెలిపారు. బాలుడిని కొనుగోలు చేసిన ధన్షాయ్కు నలుగురు కుమర్తెలు ఉన్నారు. దీంతో కుమారుడు కావాలని బాలుడిని కొనుగోలు చేశారు. చర్చల అనంతరం బాలుడిని కన్నతల్లికి అప్పగించినా, ఆర్థికంగా బాలుడుకు అండగా ఉండటానికి అంగీకరించారు. అంతేకాకుండా రుయనాభాటీ కుటుంబాన్ని అన్నివిధాల ఆదుకుంటామని జిల్లా అధికారులు హామీ ఇచ్చారు. అయితే ఈసంఘటనని త్రిపుర ప్రభుత్వం ఘండించింది. ఇలాంటి సంఘటనలకు రాష్ట్రంలో అవకాశం లేదని, రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలుచేయడానికి, ప్రతిపక్షాలు పన్నిన కుట్ర అని సంక్షేమ శాఖా మంత్రి బిజితానాథ్ ఆరోపించారు. -
చిన్నారికి పెద్ద కష్టం
♦ పదోతరగతి చదువుతుండగా బ్లడ్ క్యాన్సర్ ♦ వైద్యం కోసం సహకరించని ఆర్థిక పరిస్థితి ♦ తల్లడిల్లుతున్న నిరుపేద కుటుంబం ♦ ఆపన్న హస్తం కోసం ఎదురుచూపు.. సాలూరురూరల్ (పాచిపెంట) : మండలంలోని కేసలి పంచాయతి పరిధి మడవలస గ్రామానికి చెందిన బంటు జోగయ్య, మంగమ్మలది నిరుపేద గిరిజన కుటుంబం. నిర్వాసితులు. సెంటు భూమి లేదు. ప్రభుత్వం కట్టించి ఇచ్చే గూడులో కాలం వెళ్లదీస్తున్నారు. ఆలుమగలిద్దరూ కూలిపనులు చేస్తూ ఇద్దరు పిల్లలను సాకారు. పెద్ద కుమార్తెకు వివాహం చేశారు. చిన్న కుమార్తె సాయిను పాచిపెంట కేజీబీవీలో చేర్పించారు. కుమార్తె చక్కగా చదువుకుంటుంటే సంబర పడ్డారు. తమ కష్టానికి ఫలితం దక్కుతుందని, ఉద్యోగం సాధిస్తుందని ఆశపడ్డారు. బాలిక పదోతరగతి చదువుతుండగా బ్లడ్ క్యాన్సర్ సోకింది. చిన్నారి ఆరోగ్యాన్ని ఛిదిమేసింది. ఆస్పత్రుల పాలచేసి చదువుకు దూరం చేసింది. చిన్నారి ఆరోగ్యాన్ని బాగుచేయించేందుకు ఉన్నకాడికి అప్పులు చేశారు. రూ.3 లక్షలు వ్యయం చేశారు. ఇప్పుడు నెలకు మందుల ఖర్చుకోసం రూ.2500 ఖర్చవుతోంది. ఆస్పత్రులకు తీసుకెళ్లి మెరుగైన వైద్యం అందించేందుకు ఆర్థిక స్థోమత సహకరించడం లేదు. చేపలవేటతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న జోగయ్య,మంగమ్మలు కుమార్తె ఆరోగ్య పరిస్థితిని చూసి తల్లడిల్లుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురు చూస్తున్నారు. దాతలు దయతలచి చదువుల తల్లిని కాపాడాలంటూ ప్రాథేయపడుతున్నారు. -
వారెవ్వా.. టాయిలెట్ కోసం ఎంతపని చేశారు
ఉదయ్‌పూర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆలస్యంగానైనా నలుగురిలో మంచి మార్పునే తీసుకొస్తుంది. పట్టణాలు గ్రామాలే కాకుండా గిరిజన ప్రాంతాల్లో సైతం ఈ పథకం గట్టి మార్పును తీసుకొస్తుంది. రాజస్థాన్‌లో ఓ గిరిజన దంపతులు తమ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకునేందుకు ఇంట్లో మేకలు అమ్ముకోవడంతోపాటు గృహిణి కాలి వెండి కడియాన్ని తాకట్టుపెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్డి ఆవశ్యకతను కొంతమంది సామాజిక కార్యకర్తలు రాజస్థాన్‌లోని దంగార్ పూర్ గ్రామంలో ప్రచారం చేశారు. వారి ప్రచారం నుంచి స్ఫూర్తిపొందిన గీతా, సునీల్ పిళ్లై అనే గిరిజన దంపతులు వారు చేసుకునేది రోజువారి కూలిపనే అయినా.. గడ్డు పరిస్థితుల మధ్య ఉంటూనే రూ.9000తో టాయిలెట్ నిర్మించుకునేందుకు మేకలు అమ్మి, కాలి వెండి కడియం తాకట్టు పెట్టుకున్నారు. వాస్తవానికి తొలుత ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో టాయిలెట్లు నిర్మించుకోవచ్చని.. 12 వేలు ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పడంతో నిర్మాణం ప్రారంభించారు. కానీ, అన్నట్లుగానే రెండు దఫాల్లో రూ.8000 మాత్రమే వచ్చింది. అయితే, టాయిలెట్ పూర్తయ్యేందుకు అంతకంటే ఎక్కువ అవసరం కావడంతో వారు ఈ పని చేశారు. తమ మేకల్ని అమ్ముకొని మరీ వారు టాయిలెట్ నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుంగార్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కేకే గుప్తా వారిని సన్మానించారు. అనంతరం అతడికి విడుదల కావాల్సిన మరో రూ.4వేలు కూడా మంజూరుకావడంతో తిరిగి తన భార్య కడియాన్ని విడిపించుకున్నాడు. -
పేద గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: తీవ్ర కష్టాల్లో చిక్కుకొని దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న గిరిజన కుటుంబానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అభయహస్తమిచ్చారు. మంత్రి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అండగా నిలిచారు. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలంలోని మల్లోనికుంట తండాకి చెందిన హమాలీ రమావత్ బిచ్చా దంపతులు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తెతో కలసి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పేద కుటుంబాన్ని అనారోగ్యం పట్టిపీడిస్తోంది. కుమారులు రవినాయక్, బాబునాయక్, కుమార్తె లక్ష్మీ శరీరం అంతుబట్టని నరాల వ్యాధితో చచ్చుబడిపోయింది. కొద్దిరోజుల కింద తండ్రి సైతం అనారోగ్యంపాలవడంతో కుటుంబ పోషణ భారం తల్లిమీద పడింది. వైద్య ఖర్చులు లేక పూట గడవక ఈ కుటుంబం పడుతున్న వేతనను ఇటీవల కొందరు ట్విట్టర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశం మేరకు జిల్లా వైద్యాధికారి, ఆర్డీవో, తహసీల్దార్ వెళ్లి కుటుంబాన్ని కలిశారు. వారి వైద్యానికి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తామన్నారు. కుటుంబ బాగోగులు చూస్తున్న అటెండెంట్‌కి ఉద్యోగం కల్పిస్తామన్నారు.