హత్య కేసు నిందితుల వివరాలు వెల్లడిస్తున్న ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు ఎస్.వారియర్
ఖమ్మం క్రైం: వారంతా అన్నదమ్ముల పిల్లలే. అయినా ఏళ్ల తరబడి కొనసాగుతున్న పాత కక్షలతో సొంత సోదరులనే అంతమొందించారు. సంచలనం సృష్టించిన ముగ్గురి హత్య మిస్టరీని పోలీసులు చేధించగా, ఖమ్మం పోలీస్ కమిషనర్ విష్ణు వారియర్ సోమవారం వివరాలు వెల్లడించారు. తిరుమలాయపాలెం మండలం చంద్రుతండాలో అన్నాదమ్ముళ్ల కుటుంబాలకు చెందిన బోడా మల్సూర్, బోడా హరిదాస్, బోడా భద్రు కలిసిమెలిసి జీవించేవారు. అయితే, వీరితో ఇదే తండాకు చెందిన బోడా బిచ్చా, ఆయన కుమారులు అర్జున్, చిన్నాకు పడేది కాదు.
భూవివాదాలు మొదలు అనేక విషయాల్లో ఘర్షణలు ఉండగా పోలీసు కేసులు సైతం నమోదయ్యాయి. అన్ని విషయాల్లో మల్సూర్, హరిదాస్, భద్రు తమకంటే పైచేయిగా ఉన్నారని ఆక్రోశంతో బిచ్చా కుమారులు రగిలిపోయారు. ముగ్గురిని హతమారిస్తే తమదే పెత్తనమవుతుందని బోడా చిన్నా నిర్ణయించుకుని తండాకే చెందిన «తన బం«ధువు, స్నేహితుడైన ధరావత్ సింగ్‌కు చెప్పి సాయం కోరాడు. ఆయన చంద్రుగొండకు చెందిన నందనూరి సుదర్శన్‌ను చిన్నాకు పరిచయం చేయగా, బంగారం దుకాణంలో పనిచేసే భద్రాది కొత్తగూడెం జిల్లా కేంద్రానికి చెందిన మహమ్మద్ సలీం వద్దకు సుదర్శన్ తీసుకెళ్లాడు. అక్కడ రూ.15 వేలకు ఆభరణాల తయారీలో ఉపయోగించే సెనైడ్ కొనుగోలు చేశారు.
కర్మకాండలే వేదికగా హత్యాపథకం
ఆరు నెలలుగా హరిదాస్, మల్సూర్, భద్రులను హత్య చేసేందుకు సమయం కోసం చూస్తుండగా, బిచ్చా కుమారుడు అర్జున్ మరణించాడు. దీంతో ఈనెల 14వ తేదీన అర్జున్ కర్మకాండలకు ముగ్గురినీ ఆహ్వానించారు. అయితే మధ్యాహ్నం పొలం పనులకు వెళ్లిన కారణంగా వారు హాజరుకాలేదు. దీంతో చిన్నా అదేరోజు సాయంత్రం వారి ఇళ్లకు వెళ్లి ప్రత్యేకంగా ఆహ్వానించడంతో హరిదాస్, మల్సూర్, భద్రుతో పాటు వారి కుటుంబసభ్యులు మరో ముగ్గురు వచ్చారు. ఈ మేరకు వారు భోజనానికి సిద్ధమవుతుండగా, చిన్నా ముందుగానే సైనేడ్ కలిపిన మద్యం తీసుకొచ్చి వారికి అందించడంతో ఆయన కుట్ర తెలియని ఆ ముగ్గురూ మద్యం సేవించారు.
దీంతో హరిదాస్, మల్సూర్ అక్కడిక్కడే మృతిచెందగా, భద్రు ఖమ్మంలోని జిల్లా ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ అనంతరం బోడా చిన్నా, ధరావత్ సింగ్, నందనూరి సుదర్శన్, మహ్మద్ సలీంను అరెస్ట్ చేయగా బోడా బిచ్చా పరారీలో ఉన్నాడు. ఈ హత్య కేసు మిస్టరీని ఛేదించిన కూసుమంచి సీఐ సతీశ్, ఎస్సైలు రఘు, నన్‌దీప్, అశోక్‌తోపాటు సిబ్బందిని సీపీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పీ స్నేహమోహ్రా, ఏసీపీ వెంకటరెడ్డి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment