వారెవ్వా.. టాయిలెట్ కోసం ఎంతపని చేశారు
ఉదయ్పూర్: ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమం ఆలస్యంగానైనా నలుగురిలో మంచి మార్పునే తీసుకొస్తుంది. పట్టణాలు గ్రామాలే కాకుండా గిరిజన ప్రాంతాల్లో సైతం ఈ పథకం గట్టి మార్పును తీసుకొస్తుంది. రాజస్థాన్లో ఓ గిరిజన దంపతులు తమ ఇంట్లో మరుగు దొడ్డి నిర్మించుకునేందుకు ఇంట్లో మేకలు అమ్ముకోవడంతోపాటు గృహిణి కాలి వెండి కడియాన్ని తాకట్టుపెట్టుకున్నారు. స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మరుగుదొడ్డి ఆవశ్యకతను కొంతమంది సామాజిక కార్యకర్తలు రాజస్థాన్లోని దంగార్ పూర్ గ్రామంలో ప్రచారం చేశారు.
వారి ప్రచారం నుంచి స్ఫూర్తిపొందిన గీతా, సునీల్ పిళ్లై అనే గిరిజన దంపతులు వారు చేసుకునేది రోజువారి కూలిపనే అయినా.. గడ్డు పరిస్థితుల మధ్య ఉంటూనే రూ.9000తో టాయిలెట్ నిర్మించుకునేందుకు మేకలు అమ్మి, కాలి వెండి కడియం తాకట్టు పెట్టుకున్నారు. వాస్తవానికి తొలుత ప్రభుత్వం ఇచ్చే సొమ్ముతో టాయిలెట్లు నిర్మించుకోవచ్చని.. 12 వేలు ప్రభుత్వం నుంచి వస్తాయని చెప్పడంతో నిర్మాణం ప్రారంభించారు.
కానీ, అన్నట్లుగానే రెండు దఫాల్లో రూ.8000 మాత్రమే వచ్చింది. అయితే, టాయిలెట్ పూర్తయ్యేందుకు అంతకంటే ఎక్కువ అవసరం కావడంతో వారు ఈ పని చేశారు. తమ మేకల్ని అమ్ముకొని మరీ వారు టాయిలెట్ నిర్మించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ దుంగార్పూర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్మన్ కేకే గుప్తా వారిని సన్మానించారు. అనంతరం అతడికి విడుదల కావాల్సిన మరో రూ.4వేలు కూడా మంజూరుకావడంతో తిరిగి తన భార్య కడియాన్ని విడిపించుకున్నాడు.