జైపూర్: రాజస్థాన్‌లోని గిరిజనులు అధికంగా ఉండే బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో విచిత్రంగా సాగుతోంది . ఇక్కడ కాంగ్రెస్ తన సొంత అభ్యర్థికి ఓటు వేయవద్దని ఓటర్లను అభ్యర్థిస్తోంది. అలాగని అక్కడి అభ్యర్థి రెబల్ అనుకుంటే పొరపాటే.
వివరాల్లోకి వెళ్తే.. ఎస్టీ రిజర్వ్‌డ్ అయిన బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గంలో కాంగ్రెస్ అరవింద్ దామోర్‌ను తన సొంత అభ్యర్థిగా నిలబెట్టింది. అయితే నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీకి ఒక రోజు ముందు భారత్ ఆదివాసీ పార్టీ (BAP) అభ్యర్థి రాజ్‌కుమార్ రోట్‌కు మద్దతు ఇవ్వాలని నిర్ణయించుకుంది.
బీఏపీకి మద్దతివ్వాలని పార్టీ చేసిన ప్రకటనకు అనుగుణంగా దామర్ తన నామినేషన్ ఉపసంహరించుకోవాల్సి ఉంది. కానీ నామినేషన్ల ఉపసంహరణ చివరి తేదీ ముగిసే వరకు ఆయన ఎక్కడా కనిపించలేదు. అనంతరం మీడియా ముందుకు వచ్చిన దామర్.. జరిగిన పరిణామాలేవీ తనకు తెలియనట్లు నటించి ఎన్నికల్లో పోటీ చేస్తానని ప్రకటించారు.
దీంతో బీజేపీ, కాంగ్రెస్-బీఏపీ కూటమి మధ్య ద్విముఖ పోటీ కాస్త త్రిముఖ పోరుగా మారింది. దామర్ పోటీ కాంగ్రెస్ ఓట్లను చీల్చే అవకాశం ఉంది. ఇది బీజేపీ అభ్యర్థి మహేంద్రజిత్ సింగ్ మాల్వియాకు ప్రయోజనం కలిగించనుంది. బన్స్వారా-దుంగార్‌పూర్ లోక్‌సభ నియోజకవర్గానికి రెండవ దశలో శుక్రవారం పోలింగ్ జరగనుంది.
కాంగ్రెస్ స్థానిక నాయకత్వం తమ సొంత అభ్యర్థికి బదులు రోట్‌కు ఓటు వేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేయగా, బీఏపీతో పొత్తుకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ నాయకులలోని ఒక వర్గం తనకు మద్దతు ఇస్తున్నట్లు దామోర్ పేర్కొన్నారు. జిల్లా స్థాయి నాయకుడు వికాస్ బమ్నియా, కాంగ్రెస్ ఎమ్మెల్యే అర్జున్ బమ్నియా కుమారుడు రోట్‌కు పార్టీ మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించడం గమనార్హం. 2023 అసెంబ్లీ ఎన్నికలకు ముందు దక్షిణ రాజస్థాన్‌లో స్థాపించిన బీఏపీకి రోట్‌తో సహా ముగ్గురు ఎమ్మెల్యేలు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment