300కు మించకపోవచ్చని అంచనాలు
ఎన్డీఏకు 350 నుంచి 332కు తగ్గింపు
కాంగ్రెస్‌కు 60 వస్తాయంటూ బెట్టింగ్
లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై రాజస్తాన్‌లోని ఫలోదీ సట్టా బజార్ తాజా అంచనాలు ఎలా ఉన్నాయి? కచి్చతమైన అంచనాలు, బెట్టింగ్‌లకు దేశమంతటా పేరొందిన ఫలోదీ మార్కెట్ ఇప్పటికీ బీజేపీ సొంతంగా మెజారిటీ సాధిస్తుందని నమ్ముతోంది. అక్కడి పంటర్లు మోదీ సర్కారుపైనే బెట్టింగులు కడుతున్నారు. కానీ నెలక్రితం అంచనాలతో పోలిస్తే బీజేపీ నెగ్గబోయే స్థానాల సంఖ్య బాగా తగ్గడం విశేషం. బీజేపీ 330 నుంచి 333 స్థానాలు నెగ్గుతుందని తొలి విడత పోలింగ్‌కు ముందు దాకా ఇక్కడ జోరుగా పందేలు సాగాయి. కానీ ఇప్పుడది 296 నుంచి 300 సీట్లకు పరిమితమైంది...!
క్రమంగా తగ్గుదల..
ఒక్కో విడత పోలింగ్ జరుగుతున్న కొద్దీ ఫలోదీ బజార్లో బీజేపీకి అంచనాలు తగ్గుతూ వస్తున్నాయి. 307 నుంచి 310 స్థానాలు గెలుస్తుందంటూ మే 13న నాలుగో విడత పోలింగ్‌కు ముందు పందేలు నడిచాయి. నాలుగో దశ ముగిశాక తాజాగా 296 నుంచి 300కు తగ్గాయి. ఎన్డీఏకు 350 దాటుతాయని తొలుత పేర్కొనగా, 329 నుంచి 332 మధ్య రావచ్చని తాజాగా పందేలు సాగుతున్నాయి.
2019 ఎన్నికల్లో ఎన్డీఏకు 353 స్థానాలు రావడం తెలిసిందే. ఇక కాంగ్రెస్‌కు 41 నుంచి 43 సీట్ల కన్నా రావని నెల క్రితం అంచనా వేసిన ఫలోదీ పందెంరాయుళ్లు కాస్తా, 58 నుంచి 62 స్థానాలు గెలుస్తుందని తాజాగా బెట్లు కడుతున్నారు. 2019లో కాంగ్రెస్‌కు 52 స్థానాలొచ్చాయి. ఈసారి నాలుగు విడతల్లో పోలింగ్ 2019 ఎన్నికలతో పోలిస్తే కాస్త తగ్గడం తెలిసిందే. తదనుగుణంగా ఫలోదీ మార్కెట్ కూడా బీజేపీ విషయంలో అంచనాలను సవరించుకున్నట్టు కనిపిస్తోంది.
రాష్ట్రాలవారీగా..
ఫలోదీ సట్టా బజార్ తాజా బెట్టింగ్‌ల ప్రకారం బీజేపీ గుజరాత్‌లో క్లీన్‌స్వీప్ చేస్తుంది. 26 స్థానాలూ గెలుస్తుంది. మధ్యప్రదేశ్‌లోని 29కి 27–28 రావచ్చు. రాజస్తాన్‌లో 2019లో 24 గెలవగా ఈసారి 18–20తో సరిపెట్టుకోవచ్చు. ఒడిశాలోని మరో 4 స్థానాలు అదనంగా 11 నుంచి 12 రావచ్చు. పంజాబ్‌లో 2019లో రెండు గెలవగా ఈసారీ 2 నుంచి 3 రావచ్చు. మొత్తం 10 స్థానాలూ గెలిచిన హరియాణాలో 5 నుంచి 6తో సరిపెట్టుకోవచ్చు.
తెలంగాణలో 4 గెలవగా ఈసారి 5 నుంచి 6 రావచ్చు. ఛత్తీస్‌గఢ్‌లోని 11, హిమాచల్‌ప్రదేశ్‌లోని 4, ఉత్తరాఖండ్‌లోని 5 స్థానాలనూ బీజేపీ క్లీన్‌స్వీప్ చేస్తుంది. జార్ఖండ్‌లో మళ్లీ 10 నుంచి 11 దాకా రావచ్చు. 2019లో ఒక్క సీటూ నెగ్గని తమిళనాడులో 3 నుంచి 4 స్థానాలు రావచ్చని బెట్టింగులు నడుస్తున్నాయి. కీలకమైన పశి్చమబెంగాల్‌లో 2019లో 18 చోట్ల గెలవగా ఈసారి 21 నుంచి 22 దాకా రావచ్చు. యూపీలో 63 చోట్ల గెలిచిన బీజేపీ ఈసారి మరో రెండు సీట్లు పెంచుకోవచ్చని సట్టా బజార్ అంచనా.
కచ్చితత్వం ఎక్కువ...
ఎన్నికల ఫలితాల విషయంలో ఫలోదీ మార్కెట్ ఏం చెబితే అదే జరుగుతుందన్న నమ్మకముంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ఫలోదీ బుకర్ల అంచనాలే అక్షరాలా నిజమయ్యాయి. ముఖ్యంగా ఛత్తీస్‌గఢ్ విషయంలో దాదాపుగా ఎగ్జిట్ పోల్స్ అన్నీ తలకిందులు కాగా సట్టా బజార్ అంచనాలు మాత్రమే నిజమయ్యాయి.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment