పేద గిరిజన కుటుంబానికి కేటీఆర్ అండ
సాక్షి, హైదరాబాద్: తీవ్ర కష్టాల్లో చిక్కుకొని దిక్కుతోచనిస్థితిలో కొట్టుమిట్టాడుతున్న గిరిజన కుటుంబానికి రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు అభయహస్తమిచ్చారు. మంత్రి జిల్లా కలెక్టర్‌తో మాట్లాడి అండగా నిలిచారు. నల్లగొండ జిల్లా పెద్దపూర మండలంలోని మల్లోనికుంట తండాకి చెందిన హమాలీ రమావత్ బిచ్చా దంపతులు ముగ్గురు కుమారులు, ఓ కుమార్తెతో కలసి దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు. ఈ పేద కుటుంబాన్ని అనారోగ్యం పట్టిపీడిస్తోంది. కుమారులు రవినాయక్, బాబునాయక్, కుమార్తె లక్ష్మీ శరీరం అంతుబట్టని నరాల వ్యాధితో చచ్చుబడిపోయింది.
కొద్దిరోజుల కింద తండ్రి సైతం అనారోగ్యంపాలవడంతో కుటుంబ పోషణ భారం తల్లిమీద పడింది. వైద్య ఖర్చులు లేక పూట గడవక ఈ కుటుంబం పడుతున్న వేతనను ఇటీవల కొందరు ట్విట్టర్ ద్వారా మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. దీంతో ఈ కుటుంబాన్ని ఆదుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. మంత్రి ఆదేశం మేరకు జిల్లా వైద్యాధికారి, ఆర్డీవో, తహసీల్దార్ వెళ్లి కుటుంబాన్ని కలిశారు. వారి వైద్యానికి అవసరమైన మందులను ఉచితంగా ఇస్తామన్నారు. కుటుంబ బాగోగులు చూస్తున్న అటెండెంట్‌కి ఉద్యోగం కల్పిస్తామన్నారు.