మరువపారుతున్న శింగనమల చెరువు
కూడేరు/ గార్లదిన్నె/ శింగనమల(అనంతపురం జిల్లా): కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడంతో నురగలు కక్కుతూ దూకుతున్న జలసోయగం చూపరులను కట్టిపడేస్తోంది.
కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) చరిత్రలో పది రోజుల వ్యవధిలో పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం కురిసిన వర్షాలకు పీఏబీఆర్‌కు 15వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 5.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈఈ లక్ష్మిదేవి తెలిపారు. ఉన్న ఏడు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు.
గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్దనున్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నిండుకుండను తలపిస్తోంది. పీఏబీఆర్ నుంచి తుంగభద్రజలాలు రోజుకు 17వేల క్యూసెక్కులు ఎంపీఆర్‌లోకి వస్తున్నాయి. ఈ డ్యాంలో 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తు జాగ్రత్తగా రెండోసారి బుధవారం తొమ్మిది గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కులు పెన్నానది దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ఇక జిల్లాలోనే పెద్దచెరువుల్లో ఒక్కటైన శింగనమల రంగరాయలచెరువు ఉధృతంగా మరవ పారుతోంది. దీంతో బుధవారం శింగనమల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసర పనులున్న వారిని బోటు ద్వారా అవతలికి తీసుకెళ్లారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో బెళుగుప్ప, కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో వేదావతి హగరి నది ఉగ్రరూపం దాల్చింది.
Comments
Please login to add a commentAdd a comment