singanamala cheruvu
-
Anantapur: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం
కూడేరు/ గార్లదిన్నె/ శింగనమల(అనంతపురం జిల్లా): కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడంతో నురగలు కక్కుతూ దూకుతున్న జలసోయగం చూపరులను కట్టిపడేస్తోంది. కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) చరిత్రలో పది రోజుల వ్యవధిలో పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం కురిసిన వర్షాలకు పీఏబీఆర్కు 15వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 5.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈఈ లక్ష్మిదేవి తెలిపారు. ఉన్న ఏడు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్దనున్న మిడ్పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నిండుకుండను తలపిస్తోంది. పీఏబీఆర్ నుంచి తుంగభద్రజలాలు రోజుకు 17వేల క్యూసెక్కులు ఎంపీఆర్లోకి వస్తున్నాయి. ఈ డ్యాంలో 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తు జాగ్రత్తగా రెండోసారి బుధవారం తొమ్మిది గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కులు పెన్నానది దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోనే పెద్దచెరువుల్లో ఒక్కటైన శింగనమల రంగరాయలచెరువు ఉధృతంగా మరవ పారుతోంది. దీంతో బుధవారం శింగనమల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసర పనులున్న వారిని బోటు ద్వారా అవతలికి తీసుకెళ్లారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో బెళుగుప్ప, కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో వేదావతి హగరి నది ఉగ్రరూపం దాల్చింది. -
భగవాన్ ఈ శిక్ష ఎవరికి?
ఐదు రోజుల పాటు భక్తిశ్రద్ధలతో అశేష పూజలందుకున్న ఆదిదేవుడు.. చివరకు ఇలా మిగిలాడు. పెరిగిన పోటీతత్వంతో గల్లీకి రెండు.. మూడు వినాయక మంటపాలను ఏర్పాటు చేశారు. ప్రజల నుంచి సేకరించిన విరాళాలతో ఆర్భాటాలకు పోయి హంగామా చేశారు. భక్తి పేరుతో పర్యావరణానికి హాని తలపెట్టారు. మట్టి గణపతులను కాకుండా గొప్పలకు పోయిన పలువురు.. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్, విషపూరిత రసాయనిక రంగులు, ఇనుప చువ్వలతో తయారు చేసిన ప్రతిమలను కొలువుదీర్చారు. చివరి రోజు ఇలా నిర్లక్ష్యంగా పడేశారు. నీటిలో కరగని వ్యర్థాలతో శింగనమల చెరువు కాస్తా కలుషితమైపోయింది. మట్టి గణపయ్యలను పూజించి.. నిమజ్జనం చేసి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. నీటిలో పడేసిన వినాయకుడి ప్రతిమలను తమ బతుకు తెరువు కోసం కొందరు బుధవారం ఒడ్డుకు లాగారు. వాటిని పగులగొట్టి, అందులో ఉన్న ఇనుప చువ్వలను వెలికి తీసే పనిలో నిమగ్నమయ్యారు. ఐదు రోజుల పాటు ఎనలేని భక్తి భావం చూపిన చోటే... ఆరో రోజు ఇంతటి నిర్ధయను చవిచూడాల్సి రావడం ఆ విఘ్నాధిపతి చేసుకున్న దౌర్భాగ్యమా? మట్టి ప్రతిమలను పూజలకు వినియోగించడంలో భక్తుల నిర్లక్ష్యమా? ఏదేమైనా.. పర్యావరణం మాత్రం దెబ్బతినింది. ఈ పరిస్థితి నుంచి గట్టెక్కేందుకు శింగనమల చెరువుకు ఎన్ని రోజులు పడుతుందో.. - జి.వీరేష్, సాక్షి ఫొటోగ్రాఫర్. -
19 గొర్రెలు మృత్యువాత
శింగనమల : శింగనమల కాపర్లకు చెందిన 19 గొర్రెలు అకాల మృత్యువాతపడ్డాయి. కాపరి కిష్టప్పకు చెందిన గొర్రెలు శింగనమల చెరువులో వేసిన గడ్డిజొన్న మొలకలను శనివారం సాయంత్రం తిన్నాయి. అందులో 13 గొర్రెలు నాముకొని ఆదివారం ఉదయం మృతి చెందాయి. శింగనమలకు చెందిన కాయల చలమయ్య అనే కాపరికి చెందిన గొర్రెల మంద రాగులకుంట కొండ ప్రాంతానికి వెళ్లగా.. రాత్రి మందపై గుర్తు తెలియని జంతువులు దాడి చేసి ఆరు గొర్రెలను చంపేశాయి. మృతి చెందిన గొర్రెలకు ఆదివారం ఉదయం పశువైద్యాధికారులు పోస్టుమార్టు నిర్వహించారు. ఘటనపై అటవీ అధికారులు కేసు నమోదు చేశారు.