Mid pennar Reservoir
-
Anantapur: చూపరులను కట్టిపడేస్తోన్న.. జలసోయగం
కూడేరు/ గార్లదిన్నె/ శింగనమల(అనంతపురం జిల్లా): కనీవినీ ఎరుగని రీతిలో కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులు, నదులు, చెరువులు నిండుకుండలను తలపిస్తున్నాయి. ప్రాజెక్టుల వద్ద గేట్లు ఎత్తడంతో నురగలు కక్కుతూ దూకుతున్న జలసోయగం చూపరులను కట్టిపడేస్తోంది. కూడేరు మండల పరిధిలోని పెన్నహోబిలం బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ (పీఏబీఆర్) చరిత్రలో పది రోజుల వ్యవధిలో పలుమార్లు గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం ఇదే ప్రథమం. మంగళవారం కురిసిన వర్షాలకు పీఏబీఆర్‌కు 15వేల క్యూసెక్కుల వరద నీరు చేరింది. 5.38 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్లు జేఈఈ లక్ష్మిదేవి తెలిపారు. ఉన్న ఏడు గేట్లలో ఆరు గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు. గార్లదిన్నె మండలం పెనకచెర్ల వద్దనున్న మిడ్‌పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) నిండుకుండను తలపిస్తోంది. పీఏబీఆర్ నుంచి తుంగభద్రజలాలు రోజుకు 17వేల క్యూసెక్కులు ఎంపీఆర్‌లోకి వస్తున్నాయి. ఈ డ్యాంలో 4.09 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ముందస్తు జాగ్రత్తగా రెండోసారి బుధవారం తొమ్మిది గేట్లు ఎత్తి 17వేల క్యూసెక్కులు పెన్నానది దిగువకు వదిలినట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇక జిల్లాలోనే పెద్దచెరువుల్లో ఒక్కటైన శింగనమల రంగరాయలచెరువు ఉధృతంగా మరవ పారుతోంది. దీంతో బుధవారం శింగనమల వద్ద రాకపోకలు బంద్ అయ్యాయి. అత్యవసర పనులున్న వారిని బోటు ద్వారా అవతలికి తీసుకెళ్లారు. భైరవానితిప్ప ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదలడంతో బెళుగుప్ప, కణేకల్లు, బొమ్మనహాల్ మండలాల్లో వేదావతి హగరి నది ఉగ్రరూపం దాల్చింది. -
మిడ్ పెన్నార్ డ్యామ్‌కు పోటేత్తిన వరద నీరు
-
Photo Feature: మిడ్ పెన్నార్ రిజర్వాయర్.. కొత్త అందాలు
చుట్టూ పచ్చని గిరులు.. ఆ పైనే గాలిమరలు.. మధ్యన పెన్నార్ నీరు.. పక్కన గలగల పారే కాలువ.. ఏపుగా పెరిగిన చెట్లు.. స్వచ్ఛమైన గాలి..స్వేచ్ఛగా తిరుగుతున్న పశుపక్ష్యాదులు... సందర్శకులను ఇట్టే ఆకట్టుకుంటున్నాయి. అనంతపురం జిల్లా గార్లదిన్నె మండలం పెనకచర్ల వద్ద గల మిడ్ పెన్నార్ రిజర్వాయర్ (ఎంపీఆర్) కొత్త అందాలను సంతరించుకుని పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తోంది. – డి.మహబూబ్‌బాషా, సాక్షి ఫొటోగ్రాఫర్, అనంతపురం -
పద్మవ్యూహంలో టీడీపీ
శింగనమల/అనంతపురం సెంట్రల్: నాలుగేళ్లుగా మిడ్ పెన్నార్ డ్యాం కింద ఉన్న ఆయుకట్టుకు నీరు వదలడం లేదు. భూగర్భ జలాలూ పూర్తిగా తగ్గిపోయాయి. పొలాలన్నీ బీళ్లుగా మారాయి. రైతుల తరఫున సాగునీటి కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పలుమార్లు రోడ్లెక్కి ఆందోళన, రాస్తారోకోలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో, స్థానిక ప్రజాప్రతినిధుల తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మంగళవారం నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడం.. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాటకు సిద్ధం కావడంతో భయపడిపోయిన స్థానిక ఎమ్మెల్యే యామనిబాల, ఎమ్మెల్సీ శమంతకమణి మిడ్ పెన్నార్ డ్యాం కింద నున్న ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని రాత్రికి రాత్రే నిర్ణయించుకున్నారు. కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకుండా... జలాశయం వద్ద జనరేటర్లు సరిగా పనిచేస్తున్నాయో లేదా కూడా చూసుకోకుండా నేరుగా వెళ్లి గేట్లు ఎత్తి కేవలం 75 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు. కానీ డ్యాంలో నీరుకొద్దిగా ఉండడం.. అవి కొన్నిరోజులు కూడా పారే అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆలోచనలోపడ్డారు. రైతుల వద్ద చులకన కాకూడదని భావించి అప్పటికప్పుడు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. మిడ్ పెన్నార్ డ్యాంకు వాటా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా స్పందించకుండా... ఆయకట్టు రైతుల గురించి ఐఏబీ సమావేశంలో కానీ, ఆతర్వాత కానీ శింగనమల నియోజకవర్గంలోని హెచ్చెల్సీ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ ఆయకట్టు రైతుల గురించి పట్టించుకోని శింగనలమ టీడీపీ ప్రజాప్రతినిధులు..ఇప్పుడే ఎందుకు మేలుకొన్నారనే అంశం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా మిడ్‌పెన్నార్ సౌత్కెనాల్కు అక్టోబర్ 1వ తేదీ నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదలసలహా మండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయించారు. మిగతా ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలోని కాలువలకు ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు. అయితే శింగనమల ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలు ఈ అంశంపై పెద్దగా చర్చించలేదు. దీంతో అక్టోబర్ 1 ముహూర్తం ఖరారు చేశారు. వాస్తవానికి ఈ పాటికి మిడ్ పెన్నార్ డ్యాంలో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. కానీ పై ప్రాంతాల వారు నీరు అక్రమంగా తీసుకుపోవడం.. డ్యాం పరిధిలో లైనింగ్ పనులు చేపడుతుండడంతో ప్రస్తుతం డ్యాంలో 1.03 టీఎంసీలు నీరు నిల్వ ఉందని హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. టీబీ డ్యాం నుంచి ప్రసుత్తం 280 క్యూసెక్యుల నీరు డ్యాంలోకి వస్తోంది. సోమవారం డ్యాం షెట్టర్లు ఎత్తడంతో 75 క్యూసెక్యులు బయటకు వెళ్తోంది. ఈ మాత్రం నీరుతో ఆయుకట్టులోని ఒక్క ఎకరా కూడా తడవదు. పైగా కొన్ని రోజుల్లోనే డ్యాంలో నీరు డెడ్‌స్టోరేజీ దశకు చేరుకునే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసీ అధికార పార్టీ నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ ధర్నా రెండు నెలలు ముందుగానే చేసి ఉంటే.. మిడ్ పెన్నార్ డ్యాంలో నీరు నిల్వ చేసేవారని స్థానిక రైతులు చర్చించుకుంటున్నారు. వైఎస్సార్సీపీ పాదయాత్రతో చలనం హెచ్చెల్సీ ఆయకట్టుకు, చెరువులకు నీరు విడుదల చేయాలని, పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని చెరువులకు నీరు విడుదల చేసి తాగునీటి సమస్యను తీర్చాలన్న డిమాండ్‌తో వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం నుంచి మిడ్ పెన్నార్ డ్యాం నుంచి తరిమెల వరుకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే వైఎస్సార్సీపీకి పేరొస్తుందని భావించిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఒక రోజు ముందుగా మిడ్ పెన్నార్ డ్యాం నుంచి నీరు విడుదల చేయించారు. నీళ్లు ఎంతవరకు వెళతాయో.. ప్రస్తుతం దక్షిణ కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాలువలలో తీసిన మట్టిని తీసివేయడం లేదు. కొన్ని చోట్లు బ్లాస్టింగ్ పనులు కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఇపుడు వదిలిన నీరు కాలువలో ఎంత వరుకు వెళతాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు. -
జల దోపిడీ
పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంతానికి ప్రధాన జీవనాధారమైన పులివెందుల బ్రాంచ్ కెనాల్ నీటితో అక్రమార్కులు పంట పండించుకుంటున్నారు. ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీరు అనధికారిక ఆయకట్టుకు మళ్లించుకుంటున్నా.. ఇదేమని అడిగే అధికారులు లేకపోవడంతో కాలువ వెంబడి అక్రమ మోటార్లు వెలుస్తున్నాయి. పైగా హైలెవెల్ కెనాల్(హెచ్ఎల్సీ) పరిధిలో సుమారు 26కుపైగా చిన్న, చిన్న గేట్లు ఉన్న నేపథ్యంలో వాటిని ఎత్తి పంటలకు.. చెరువులకు మళ్లించుకుంటున్నా.. ఆపలేని పరిస్థితి నెలకొంటోంది. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి అనంతపురం జిల్లాలోని 5వేల ఎకరాల ఆయకట్టు కలుపుకొని పులివెందుల నియోజకవర్గంలో 55వేల ఎకరాలతో కలిసి సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఏ నాడూ పూర్తి ఆయకట్టుకు నీరు అందిన దాఖలాలు లేవు. ప్రతిసారి పీబీసీకి నీటి కోటా కేటాయిస్తున్నా.. అమలులో అధికారులు చొరవ చూపడంలేదని రైతులు విమర్శిస్తున్నారు. జటిలంగా మారిన జలదోపిడి కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఆంధ్రా కోటా కింద నీరు విడుదల చేస్తే హెచ్ఎల్సీ ద్వారా పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు రావాలంటే మిడ్ పెన్నార్ రిజర్వాయర్ వద్ద నీటి కేటాయింపుల ప్రకారం నీటిని విడుదల చేస్తారు. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి పెనకచర్ల, దుగ్గుపల్లె మీదుగా దాదాపు 70కి.మీ మేర హెచ్ఎల్సీ ద్వారా తుంపెర వరకు నీరు రావాల్సి ఉంది. అయితే ఈ మధ్యలో సుమారు 26కుపైగా చిన్న, చిన్న గేట్లు ఉన్న నేపథ్యంలో.. ఎప్పుడుపడితే అప్పుడు రైతులు ఎత్తేస్తున్నారు. దీంతో పీబీసీ నీరు చౌర్యానికి గురవుతోంది. దీని గురించి ఇక్కడి అధికారులు అక్కడికి వెళ్లి ప్రస్తావించినా.. అక్కడి అధికారులు రైతులకు సంబంధించిన వ్యవహారంగా కొట్టిపారేస్తున్నారు. మిడ్ పెన్నార్ తుంపెర వద్ద సుమారు 70కి.మీ మేర ఉన్న కాలువల్లోకి సుమారు 100కుపైగా మోటార్లు వేసి నీటిని అక్రమంగా తోడుకుంటున్నా అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పులివెందులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అంతేకాకుండా తుంపెర్ నుంచి సీబీఆర్ వరకు రావాలన్నా.. సుమారు 20కి.మీ మేర పీబీసీ కాలువ ఉంది. తుంపెర నుంచి గంగనపల్లె, రామాపురం, ముచ్చుగుంటపల్లె, కునుకుంట్ల, చిన్నకొండాయపల్లె, పెద్దకోట్ల తదితర గ్రామాల మీదుగా కాలువ వస్తుండటంతో అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది అక్రమంగా నీటిని తోడేస్తున్నారు. ఒకటికాదు.. రెండు కాదు ఇక్కడ కూడా 60నుంచి 70మేర అక్రమ మోటార్లు ఉన్నట్లు పీబీసీ అధికారులకు తెలిసినా.. తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. ఇక్కడ కూడా అక్రమంగా కొన్ని కాలువలను తవ్వుకొని నీటిని తరలించుకపోతున్నట్లు ఆయకట్టు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. పీబీసీ వెంబడి పోలీసు పహారా అవసరం పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి మొదటి విడత ఆగస్ట్ 16వ తేదీనుంచి విడుదల చేశారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పీబీసీకి సంబంధించిన నీటిని కూడా తుంపెర వద్ద కొంతమంది అక్రమంగా తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కు మళ్లించారు. అయితే ఇది తెలుసుకున్న ఆయకట్టు రైతులతోపాటు వైఎస్ఆర్ సీపీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకెళ్లి గేట్లను మూసివేసినట్లు తెలిసింది. నీరు సక్రమంగా రావాలంటే పోలీసు పహారా ఎంతైనా అవసరం. తుంపెర వద్దనే కాకుండా నీరు విడుదల చేసినన్ని రోజులు ప్రత్యేకంగా ఒక పోలీసు మొబైల్ టీంను పెట్టి అక్రమంగా నీటిని తరలించకుండా ఉంచితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. అంతేకాకుండా రెండవ విడత ఈనెల 20 తర్వాత నీటిని విడుదల చేయనుండటంతో కాలువ వెంబడి ఉన్న అక్రమ మోటార్లను తొలగించిన తర్వాత నీటిని విడుదల చేస్తే సీబీఆర్ డ్యాంకు పూర్తిస్థాయిలో నీరు చేరే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.