పులివెందుల, న్యూస్‌లైన్ : పులివెందుల ప్రాంతానికి ప్రధాన జీవనాధారమైన పులివెందుల బ్రాంచ్ కెనాల్ నీటితో అక్రమార్కులు పంట పండించుకుంటున్నారు. ఆయకట్టుకు ఇవ్వాల్సిన నీరు అనధికారిక ఆయకట్టుకు మళ్లించుకుంటున్నా.. ఇదేమని అడిగే అధికారులు లేకపోవడంతో కాలువ వెంబడి అక్రమ మోటార్లు వెలుస్తున్నాయి. పైగా హైలెవెల్ కెనాల్(హెచ్‌ఎల్‌సీ) పరిధిలో సుమారు 26కుపైగా చిన్న, చిన్న గేట్లు ఉన్న నేపథ్యంలో వాటిని ఎత్తి పంటలకు.. చెరువులకు మళ్లించుకుంటున్నా.. ఆపలేని పరిస్థితి నెలకొంటోంది. పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి అనంతపురం జిల్లాలోని 5వేల ఎకరాల ఆయకట్టు కలుపుకొని పులివెందుల నియోజకవర్గంలో 55వేల ఎకరాలతో కలిసి సుమారు 60వేల ఎకరాల ఆయకట్టు ఉంది. అయితే ఏ నాడూ పూర్తి ఆయకట్టుకు నీరు అందిన దాఖలాలు లేవు. ప్రతిసారి పీబీసీకి నీటి కోటా కేటాయిస్తున్నా.. అమలులో అధికారులు చొరవ చూపడంలేదని రైతులు విమర్శిస్తున్నారు.
జటిలంగా మారిన జలదోపిడి
కర్ణాటకలోని తుంగభద్ర ప్రాజెక్టు నుంచి ఆంధ్రా కోటా కింద నీరు విడుదల చేస్తే హెచ్‌ఎల్‌సీ ద్వారా పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు నీరు రావాలంటే మిడ్ పెన్నార్ రిజర్వాయర్ వద్ద నీటి కేటాయింపుల ప్రకారం నీటిని విడుదల చేస్తారు. మిడ్ పెన్నార్ రిజర్వాయర్ నుంచి పెనకచర్ల, దుగ్గుపల్లె మీదుగా దాదాపు 70కి.మీ మేర హెచ్‌ఎల్‌సీ ద్వారా తుంపెర వరకు నీరు రావాల్సి ఉంది. అయితే ఈ మధ్యలో సుమారు 26కుపైగా చిన్న, చిన్న గేట్లు ఉన్న నేపథ్యంలో.. ఎప్పుడుపడితే అప్పుడు రైతులు ఎత్తేస్తున్నారు. దీంతో పీబీసీ నీరు చౌర్యానికి గురవుతోంది. దీని గురించి ఇక్కడి అధికారులు అక్కడికి వెళ్లి ప్రస్తావించినా.. అక్కడి అధికారులు రైతులకు సంబంధించిన వ్యవహారంగా కొట్టిపారేస్తున్నారు.
మిడ్ పెన్నార్ తుంపెర వద్ద సుమారు 70కి.మీ మేర ఉన్న కాలువల్లోకి సుమారు 100కుపైగా మోటార్లు వేసి నీటిని అక్రమంగా తోడుకుంటున్నా అక్కడి అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడంతో పులివెందులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. అంతేకాకుండా తుంపెర్ నుంచి సీబీఆర్ వరకు రావాలన్నా.. సుమారు 20కి.మీ మేర పీబీసీ కాలువ ఉంది. తుంపెర నుంచి గంగనపల్లె, రామాపురం, ముచ్చుగుంటపల్లె, కునుకుంట్ల, చిన్నకొండాయపల్లె, పెద్దకోట్ల తదితర గ్రామాల మీదుగా కాలువ వస్తుండటంతో అనంతపురం జిల్లాకు చెందిన కొంతమంది అక్రమంగా నీటిని తోడేస్తున్నారు. ఒకటికాదు.. రెండు కాదు ఇక్కడ కూడా 60నుంచి 70మేర అక్రమ మోటార్లు ఉన్నట్లు పీబీసీ అధికారులకు తెలిసినా.. తెలియనట్లు వ్యవహరిస్తున్నారని ఆయకట్టు రైతులు లబోదిబోమంటున్నారు. ఇక్కడ కూడా అక్రమంగా కొన్ని కాలువలను తవ్వుకొని నీటిని తరలించుకపోతున్నట్లు ఆయకట్టు సంఘం నాయకులు పేర్కొంటున్నారు.
పీబీసీ వెంబడి పోలీసు పహారా అవసరం
పులివెందుల బ్రాంచ్ కెనాల్‌కు సంబంధించి మొదటి విడత ఆగస్ట్ 16వ తేదీనుంచి విడుదల చేశారు. అయితే సమైక్యాంధ్ర ఉద్యమం జోరుగా సాగుతున్న నేపథ్యంలో పీబీసీకి సంబంధించిన నీటిని కూడా తుంపెర వద్ద కొంతమంది అక్రమంగా తాడిపత్రి బ్రాంచ్ కెనాల్(టీబీసీ)కు మళ్లించారు. అయితే ఇది తెలుసుకున్న ఆయకట్టు రైతులతోపాటు వైఎస్‌ఆర్ సీపీ నాయకులు స్వచ్ఛందంగా ముందుకెళ్లి గేట్లను మూసివేసినట్లు తెలిసింది. నీరు సక్రమంగా రావాలంటే పోలీసు పహారా ఎంతైనా అవసరం. తుంపెర వద్దనే కాకుండా నీరు విడుదల చేసినన్ని రోజులు ప్రత్యేకంగా ఒక పోలీసు మొబైల్ టీంను పెట్టి అక్రమంగా నీటిని తరలించకుండా ఉంచితే బాగుంటుందని పలువురు సూచిస్తున్నారు. అంతేకాకుండా రెండవ విడత ఈనెల 20 తర్వాత నీటిని విడుదల చేయనుండటంతో కాలువ వెంబడి ఉన్న అక్రమ మోటార్లను తొలగించిన తర్వాత నీటిని విడుదల చేస్తే సీబీఆర్ డ్యాంకు పూర్తిస్థాయిలో నీరు చేరే అవకాశం ఉంటుందని రైతులు పేర్కొంటున్నారు.
జల దోపిడీ
Published Mon, Nov 18 2013 4:32 AM | Last Updated on Sat, Sep 2 2017 12:42 AM
Advertisement