
వైఎస్ రాజారెడ్డి కంటి వైద్యశాలను ప్రారంభించిన వైఎస్ జగన్
ఆస్పత్రిలో వివిధ విభాగాల పరిశీలన
అత్యాధునిక పరికరాల పనితీరును వివరించిన నిపుణులు
ఆస్పత్రిలో వైఎస్ జగన్‌కు కంటి పరీక్షలు
సాక్షి కడప: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో అత్యాధునిక వసతులు, అత్యున్నత పరికరాలు, అత్యుత్తమ నిపుణుల ఆధ్వర్యంలో రూ.10 కోట్ల వ్యయంతో ఆధునికీకరించిన వైఎస్ రాజారెడ్డి నేత్ర వైద్యశాలను మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం ప్రారంభించి పులివెందుల ప్రజలకు అంకితం చేశారు. ముందుగా ఆస్పత్రి ఆవరణలోకి వైఎస్ జగన్ చేరుకోగానే వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతినిధులతోపాటు ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి యాజమాన్యం ఘన స్వాగతం పలికారు.
ఎల్వీ ప్రసాద్ ఐ ఆస్పత్రి ఫౌండర్, చైర్మన్ డాక్టర్ గుళ్లపల్లి నాగేశ్వరరావు, ఆయన సతీమణి ప్రతిభారావులతో కలసి రిబ్బన్ కట్ చేసి వైఎస్ జగన్ ఆస్పత్రిని ప్రారంభించారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం వైఎస్సార్ ఔట్ పేషెంట్స్ విభాగాన్ని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో ప్రతిభారావు ప్రారంభించారు. పులివెందులలో రాజారెడ్డి ఆస్పత్రి దశాబ్దాలుగా ప్రజలకు సేవలు అందిస్తున్న విషయం తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఇదే ఆస్పత్రిలో పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. రోజుకు 5 వేల ఆపరేషన్లు చేయగల అత్యాధునిక పరికరాలను అందుబాటులో ఉంచారు. వైద్యశాలకు వైఎస్సార్ ఫౌండేషన్ స్థలాన్ని సమకూర్చడంతోపాటు సుమారు రూ.10 కోట్లు వెచ్చిoచి నూతన భవనం, అత్యాధునిక పరికరాలను సమకూర్చింది. ఆధునికీకరించిన ఈ నేత్ర వైద్యశాలను ఎల్వీ ప్రసాద్, వైఎస్ రాజారెడ్డి కంటి వైద్య విజ్ఞాన సంస్థగా తీర్చిదిద్ది అత్యాధునిక కంటి వైద్య సేవలు అందించేలా సిద్ధం చేశారు.
ఆస్పత్రిలో కలియతిరిగి..
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహర్‌రెడ్డిలతో కలసి వైఎస్ జగన్ ఆస్పత్రిలో కలియతిరిగి అన్ని విభాగాలను నిశితంగా పరిశీలించారు. కంటి యంత్ర పరికరాలను ఆసక్తిగా తిలకించారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ప్రశాంత్ గార్గ్, వైస్ చైర్మన్ డాక్టర్ రాజీవ్ కె.రెడ్డి, డైరెక్టర్ రాజశేఖర్ వాటి పనితీరును వివరించారు. ఆసుపత్రి సిబ్బందితోపాటు అక్కడ ఉన్న అందరినీ పలుకరిస్తూ వైఎస్ జగన్ ముందుకు కదిలారు.
కార్యకర్తలతో మమేకం..
రెండు రోజుల పర్యటన నిమిత్తం పులివెందులకు వచ్చిన వైఎస్ జగన్ తొలిరోజు మంగళవారం కార్యకర్తలు, నాయకులతో క్యాంపు కార్యాలయంలో మమేకమయ్యారు. బుధవారం వైఎస్ రాజారెడ్డి, ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్యశాలను ప్రారంభించారు. అనంతరం బయట వేలాదిగా వేచి ఉన్న మహిళలు, అభిమానులకు అభివాదం చేశారు. తెలిసినవారు కావడంతో పలువురిని పేరు పేరునా ఆప్యాయంగా పలుకరించారు.

కంటి పరీక్షలు చేయించుకున్న వైఎస్ జగన్
వైఎస్ రాజారెడ్డి ఐ సెంటర్‌ను ప్రారంభించిన అనంతరం వైఎస్ జగన్ అక్కడ కంటి పరీక్షలు చేయించుకున్నారు. ఎల్వీ ప్రసాద్ కంటి వైద్య నిపుణులు ఆయనకు పరీక్షలు చేశారు. ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందించాలని వారిని వైఎస్ జగన్ కోరారు. ఆసుపత్రికి సంబంధించి ఎలాంటి అవసరం ఉన్నా వెంటనే తీర్చాలని వైఎస్సార్ ఫౌండేషన్ ప్రతినిధి జనార్థన్‌రెడ్డికి సూచించారు.

‘‘రాజారెడ్డి ఐ సెంటర్..’’ నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది
వైఎస్ జగన్ ట్వీట్
సాక్షి, అమరావతి: పులివెందులలో ‘‘ఎల్‌వీపీఈఐ’’ సహకారంతో అత్యాధునిక సౌకర్యాలతో రాజారెడ్డి కంటి ఆస్పత్రిని ప్రారంభించడం గర్వంగా ఉందని మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పేర్కొన్నారు. ‘‘ఈ క్షణం.. అదే ఆస్పత్రికి చెందిన ప్రఖ్యాత వైద్యుడు, మా నాన్న జ్ఞాపకాలను తిరిగి తెస్తోంది. పులివెందులలో కొన్ని దశాబ్దాలుగా రాజారెడ్డి ఆస్పత్రి సేవలు అందిస్తోంది.
దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ ఆస్పత్రిలోనే పని చేసి రూపాయి వైద్యుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఈ ఆస్పత్రిని ఇప్పుడు అత్యాధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దారు. అత్యాధునిక సౌకర్యాలతో ఇక నుంచి రాజారెడ్డి ఆస్పత్రి కంటి వైద్య సేవలు అందించనుంది’’ అని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు.
Comments
Please login to add a commentAdd a comment