
వైఎస్సార్‌సీపీ శ్రేణులకు వైఎస్ జగన్ దిశా నిర్దేశం
ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడదాం
బాబు మోసాలను ప్రజలు అతి తక్కువ సమయంలోనే గ్రహిస్తున్నారు..
మనం ఎప్పుడూ ప్రజాపక్షమే.. అదే ఏకైక అజెండాగా పని చేద్దాం
స్థానిక సమస్యలపై జనం గొంతుకగా పని చేయాలి
తొలి రోజు పులివెందుల పర్యటనలో నేతలతో భేటీ
సాక్షి ప్రతినిధి, కడప: ‘‘ప్రజల మదిలో మనం చెరగని ముద్ర వేశాం... ప్రజా సంక్షేమమే ధ్యేయంగా పాలనందించాం. విపక్ష పార్టీ నాయకులుగా ప్రజాపక్షమే ఏకైక అజెండాగా పని చేద్దాం. ఎప్పటికప్పుడు ఈ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల హృదయాలను గెలుచుకుందాం..’’ అని వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పార్టీ యంత్రాంగానికి దిశానిర్దేశం చేశారు. అధికారంలో ఉన్నా.. లేకున్నా వైఎస్సార్‌సీపీ ఎప్పుడూ ప్రజాపక్షమే అనే విషయాన్ని గుర్తెరిగి పార్టీ నేతలంతా సమష్టిగా పని చేయాలని పిలుపునిచ్చారు.
మంగళవారం పులివెందులలో ప్రజా దర్బార్ సందర్భంగా తొలుత ఇటీవల పార్టీ పదవులు పొందిన నాయకులతో ఆయన ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నేతలను కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి పరిచయం చేశారు. అనంతరం వైఎస్ జగన్ మాట్లాడుతూ.. పార్టీ పదవులు పొందిన నాయకులు ఎప్పటికప్పుడు ప్రభుత్వం చేపట్టే ప్రజêవ్యతిరేక చర్యలపై ఉద్యమించాలని.. స్థానిక సమస్యలపై ప్రజల గొంతుకగా పని చేయాలని సూచించారు.
వైఎస్సార్ సీపీ ప్రజల మనసుల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేలా పాలన అందించామన్నారు. అబద్ధాల హామీలతో టీడీపీ కూటమి నేతలు ప్రభుత్వ పగ్గాలు చేపట్టారన్నారు. చంద్రబాబు నయవంచకుడని తెలిసి కూడా ప్రజలు నమ్మి ఓటేశారని, అతి తక్కువ సమయంలోనే మోసపోయామని గ్రహిస్తున్నారని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి లేదని ధ్వజమెత్తారు.
పులివెందులలో కోలాహలం..
రెండు రోజుల పర్యటనలో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం ఉదయంతాడేపల్లి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు పులివెందుల చేరుకున్నారు. భాకరాపురంలోని తన నివాసంలో పార్టీ నేతలతో సమావేశం అనంతరం కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహించారు.
ప్రజల సమస్యలు అడిగి తెలుసుకుంటూ వారి విజ్ఞప్తులను స్వీకరించారు. అప్పటికప్పుడు పరిష్కారం అయ్యే సమస్యలను పరిష్కరిస్తూనే.. అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన వాటిని నోట్ చేసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఈ సందర్భంగా పులివెందులలో సందడి వాతావరణం నెలకొంది. అభిమాన నేతను చూసేందుకు కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
నూతన జంటలకు ఆశీర్వాదం...
పులివెందులలో ఇటీవల వివాహం జరిగిన నాలుగు నూతన జంటలను వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆశీర్వదించారు. నారాయణ కళాశాల సమీపంలో నివాసం ఉంటున్న వై.మహేశ్వరరెడ్డి కుమార్తె అనిలాదేవి, అల్లుడు విష్ణువర్ధన్‌రెడ్డికి వైఎస్ జగన్ ఆశీస్సులు అందజేశారు.
అలాగే చెన్నారెడ్డి కాలనీలో నివసించే రవీంద్రనాథరెడ్డి కుమార్తె సాయిలహరి, అల్లుడు లిఖిత్‌లతోపాటు జి.మహేశ్వరరెడ్డి కుమార్తె సాహిత్య, అల్లుడు రామమనోహర్‌రెడ్డికి.. సుదర్శన్ కుమారుడు అనుదీప్‌కుమార్, కోడలు లాస్యశ్రీలకు వివాహ శుభాకాంక్షలు తెలియజేశారు. నూతన జంటల కుటుంబ సభ్యులతో మమేకమై వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.
ఘనస్వాగతం...
తాడేపల్లి నుంచి హెలికాఫ్టర్‌లో పులివెందుల చేరుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి ఘనస్వాగతం లభించింది. ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధా, కడప మేయర్ సురేష్‌బాబు, మాజీ ఎమ్మెల్యేలు ఎస్.రఘురామిరెడ్డి, ఎస్‌బీ అంజాద్ బాషా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్‌కుమార్‌రెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్‌చార్జి వైఎస్ మనోహరరెడ్డి, బీసీ సెల్ నేత బంగారు నాగయ్య, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిన్నప్ప పలువురు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
మండలశాఖ అధ్యక్షుడి కుటుంబానికి పరామర్శ...
సింహాద్రిపురం మండలశాఖ అధ్యక్షుడు దేవిరెడ్డి శ్రీకాంత్‌రెడ్డి తల్లి లక్ష్మీ నరసమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. అప్పట్లో ఫోన్‌లో పరామర్శించిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మంగళవారం సాయంత్రం పులివెందులలో నివాసం ఉంటున్న శ్రీకాంత్‌రెడ్డి ఇంటికి వెళ్లి లక్ష్మీ నరసమ్మ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక నాయకులను కలుసుకున్నారు.
మామను చూడాలని పాదయాత్ర!
సాక్షి ప్రతినిధి, కడప: అభిమానానికి హద్దుండదు...! ఆత్మీయతకు వయసుతో నిమిత్తం లేదు!! వైఎస్ జగన్ పట్ల చిన్నారుల మక్కువ మరోమారు నిరూపితమైంది. పులివెందులకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న కొండారెడ్డి కాలనీలో నివసించే బాలుడు మాబు షరీఫ్‌కు వైఎస్ జగన్ అంటే ఎనలేని ఇష్టం. వైఎస్ జగన్ పులివెందుల వస్తున్నట్లు తెలియడంతో ఎలాగైనా ఆయన్ను కలిసి ఫొటో దిగాలనే ఆరాటంతో తెల్లవారుజామున 5.30 గంటలకు చెప్పులు లేకుండా కాలినడకన ఇంటి నుంచి బయలుదేరాడు.
హెలిప్యాడ్ వద్దకు చేరుకుని నిరీక్షించాడు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో అక్కడకు చేరుకున్న వైఎస్ జగన్ తన వద్దకు వచ్చిన బాలుడిని గమనించి ఆప్యాయంగా పలుకరించారు. కరచాలనం చేయడంతో ఆనంద బాష్పాలు రాల్చిన చిన్నారి కళ్ల నీళ్లు తుడిచి వివరాలు కనుక్కున్నారు.
మామయ్య తనను దగ్గరకు తీసుకున్నారని బాలుడు ఎంతో సంబరంగా వైఎస్ జగన్‌తో ఓ ఫొటో దిగాడు. ఆ చిన్నారి అభిమానాన్ని చూసి వైఎస్ జగన్ చలించిపోయారు. అనంతరం ఆ బాలుడికి జాగ్రత్తలు చెప్పి క్షేమంగా ఇంటికి చేర్చే బాధ్యతను పార్టీ కార్యకర్తలకు అప్పగించారు.