మిడ్ పెన్నార్ డ్యాం వద్ద షెట్టరు ఎత్తుతున్న దృశ్యం
శింగనమల/అనంతపురం సెంట్రల్: నాలుగేళ్లుగా మిడ్ పెన్నార్ డ్యాం కింద ఉన్న ఆయుకట్టుకు నీరు వదలడం లేదు. భూగర్భ జలాలూ పూర్తిగా తగ్గిపోయాయి. పొలాలన్నీ బీళ్లుగా మారాయి. రైతుల తరఫున సాగునీటి కోసం వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో పలుమార్లు రోడ్లెక్కి ఆందోళన, రాస్తారోకోలు చేపట్టారు. అయినా ప్రభుత్వంలో, స్థానిక ప్రజాప్రతినిధుల తీరులో మార్పు రాలేదు. ఈ క్రమంలోనే వైఎస్సార్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మంగళవారం నుంచి పాదయాత్రకు సిద్ధమయ్యారు. ప్రస్తుతం ఎన్నికలు సమీపిస్తుండడం.. రైతుల పక్షాన వైఎస్సార్ సీపీ పోరుబాటకు సిద్ధం కావడంతో భయపడిపోయిన స్థానిక ఎమ్మెల్యే యామనిబాల, ఎమ్మెల్సీ శమంతకమణి మిడ్ పెన్నార్ డ్యాం కింద నున్న ఆయకట్టుకు నీరు విడుదల చేయాలని రాత్రికి రాత్రే నిర్ణయించుకున్నారు. కనీసం అధికారులకు సమాచారం ఇవ్వకుండా... జలాశయం వద్ద జనరేటర్‌లు సరిగా పనిచేస్తున్నాయో లేదా కూడా చూసుకోకుండా నేరుగా వెళ్లి గేట్లు ఎత్తి కేవలం 75 క్యూసెక్కులు నీటిని దిగువకు వదిలారు. కానీ డ్యాంలో నీరుకొద్దిగా ఉండడం.. అవి కొన్నిరోజులు కూడా పారే అవకాశం లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఆలోచనలోపడ్డారు. రైతుల వద్ద చులకన కాకూడదని భావించి అప్పటికప్పుడు కలెక్టరేట్ వద్దకు చేరుకుని ధర్నాకు దిగారు. మిడ్ పెన్నార్ డ్యాంకు వాటా నీరు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
ముందుగా స్పందించకుండా...
ఆయకట్టు రైతుల గురించి ఐఏబీ సమావేశంలో కానీ, ఆతర్వాత కానీ శింగనమల నియోజకవర్గంలోని హెచ్చెల్సీ సౌత్ కెనాల్, నార్త్ కెనాల్ ఆయకట్టు రైతుల గురించి పట్టించుకోని శింగనలమ టీడీపీ ప్రజాప్రతినిధులు..ఇప్పుడే ఎందుకు మేలుకొన్నారనే అంశం నియోజకవర్గ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతోంది. తుంగభద్ర జలాశయంలో నీటి లభ్యత ఆధారంగా మిడ్‌పెన్నార్ సౌత్‌కెనాల్‌కు అక్టోబర్ 1వ తేదీ నుంచి నీటిని విడుదల చేయాలని నీటిపారుదలసలహా మండలి(ఐఏబీ) సమావేశంలో నిర్ణయించారు. మిగతా ప్రజాప్రతినిధులు వారి నియోజకవర్గాలోని కాలువలకు ఆలస్యం లేకుండా వెంటనే విడుదల చేయాలని అధికారులపై ఒత్తిడి తెచ్చారు.
అయితే శింగనమల ఎమ్మెల్యే యామినిబాల, ఎమ్మెల్సీ శమంతకమణిలు ఈ అంశంపై పెద్దగా చర్చించలేదు. దీంతో అక్టోబర్ 1 ముహూర్తం ఖరారు చేశారు. వాస్తవానికి ఈ పాటికి మిడ్ పెన్నార్ డ్యాంలో ప్రస్తుతం 4 టీఎంసీల నీరు నిల్వ ఉండాలి. కానీ పై ప్రాంతాల వారు నీరు అక్రమంగా తీసుకుపోవడం.. డ్యాం పరిధిలో లైనింగ్ పనులు చేపడుతుండడంతో ప్రస్తుతం డ్యాంలో 1.03 టీఎంసీలు నీరు నిల్వ ఉందని హెచ్చెల్సీ అధికారులు చెబుతున్నారు. టీబీ డ్యాం నుంచి ప్రసుత్తం 280 క్యూసెక్యుల నీరు డ్యాంలోకి వస్తోంది. సోమవారం డ్యాం షెట్టర్లు ఎత్తడంతో 75 క్యూసెక్యులు బయటకు వెళ్తోంది. ఈ మాత్రం నీరుతో ఆయుకట్టులోని ఒక్క ఎకరా కూడా తడవదు. పైగా కొన్ని రోజుల్లోనే డ్యాంలో నీరు డెడ్‌స్టోరేజీ దశకు చేరుకునే అవకాశం ఉంది. ఇవన్నీ తెలిసీ అధికార పార్టీ నేతలు కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అధికార పార్టీ నేతలు ఈ ధర్నా రెండు నెలలు ముందుగానే చేసి ఉంటే.. మిడ్ పెన్నార్ డ్యాంలో నీరు నిల్వ చేసేవారని స్థానిక రైతులు చర్చించుకుంటున్నారు.
వైఎస్సార్‌సీపీ పాదయాత్రతో చలనం
హెచ్చెల్సీ ఆయకట్టుకు, చెరువులకు నీరు విడుదల చేయాలని, పుట్లూరు, యల్లనూరు మండలాల్లోని చెరువులకు నీరు విడుదల చేసి తాగునీటి సమస్యను తీర్చాలన్న డిమాండ్‌తో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి ఆధ్వర్యంలో కార్యకర్తలు మంగళవారం నుంచి మిడ్ పెన్నార్ డ్యాం నుంచి తరిమెల వరుకు పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఇదే జరిగితే వైఎస్సార్‌సీపీకి పేరొస్తుందని భావించిన టీడీపీ ప్రజాప్రతినిధులు ఒక రోజు ముందుగా మిడ్ పెన్నార్ డ్యాం నుంచి నీరు విడుదల చేయించారు.
నీళ్లు ఎంతవరకు వెళతాయో..
ప్రస్తుతం దక్షిణ కాలువ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. కాలువలలో తీసిన మట్టిని తీసివేయడం లేదు. కొన్ని చోట్లు బ్లాస్టింగ్ పనులు కూడా చేశారు. ఈ పరిస్థితుల్లో ఇపుడు వదిలిన నీరు కాలువలో ఎంత వరుకు వెళతాయోనని స్థానికులు చర్చించుకుంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment