
పెన్నాకు పుష్కర శోభ
వల్లూరు:
పెన్నా నదికి పుష్కర శోభ వచ్చింది. శ్రీ శైలం నుండి వచ్చిన కృష్ణా నది నీరే మన జిల్లాలోని కుందూ, పెన్నా నదుల్లో ప్రవహిస్తున్న వైనంపై సాక్షిలో వచ్చిన కథనంతో ప్రజల్లో చైతన్యం వచ్చింది. అంతదూరం వ్యయ ప్రయాసలకోర్చి ఇబ్బందులు పడడం కంటే మనకు అందుబాటులో పావన పినాకినీ తీరంలో వున్న పుష్పగిరిని సందర్శించి పెన్నమ్మలో స్నానం చేస్తే ఫలితం వుంటుందని గుర్తించారు. శుక్రవారం ఒక మోస్తారుగా వచ్చిన భక్తులు శనివారం భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేలాది మంది పుష్పగిరి వద్ద నదిలో స్నానాలు ఆచరించారు. జిల్లాలోని నలుమూలల నుండే కాక అనంతపురం జిల్లా నుండి కూడా తరలి వచ్చారు. కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వామి ఆలయాల్లో, గ్రామంలోని శ్రీ వైద్యనాథ స్వామి, శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మహిళలు నది ఒడ్డున ఇసుకతో ∙సైకత లింగాలను చేసి దీపాలను వెలిగించి నదీమ తల్లికి పూజలు నిర్వహించారు. కొందరు తమ పూర్వీకులకు పిండ ప్రదాన కార్యక్రమాలు నిర్వహించారు.
ఆనందంలో భక్తులు:
పంచ నదీ సంగమమైన పుష్పగిరి వద్ద గల పినాకినీ నదిలో కృష్ణానది నీరు రావడం భక్తులకు ఆనందదాయకంగా వుంది. కార్తీక, శ్రావణ, మాఘ మాసాలలో, బ్రహ్మోత్సవాల్లో ∙ఇక్కడి నదిలో స్నానాలు ఆచరించి శివ కేశవులను దర్శించుకోవడం వలన సకల పాపాలు నశిస్తాయని పురాణాలు పేర్కొంటున్నాయి. కృష్ణా పుష్కర నేపథ్యంలో కృష్ణా నది నీరు ఇక్కడ ప్రవహించడం వలన ఈ నీటిలో స్నానాలు మరింత పుణ్య ఫలితాన్ని చేకూరుస్తాయి.
–అఖిల్ దీక్షితులు , పుష్పగిరి ఆలయ ప్రధాన పూజారి
చాలా సంతోషంగా వుంది:
పుష్కర వేళ దక్షిణ కాశీగా పేరు పొందిన పుష్పగిరి వద్ద పెన్నా నదిలో కృష్ణమ్మ నీటిలో స్నానాలు ఆచరించడం చాలా సంతోషంగా వుంది. కుంటుంబంతో కలిసి వచ్చాను.
–జయలక్ష్మి, ధర్మవరం, అనంతపురం జిల్లా
పుణ్య క్షేత్రాల్లో పుష్కర స్నానం మంచిది:
పుణ్య క్షేత్రాల్లో ఆధ్యాత్మిక భావనతో పుష్కర స్నానం చేయడం చాలా మంచిది. మన సాంప్రదాయాలను పాటిస్తూ వాటిని సంరక్షించుకుంటూ ముందుకు సాగాల్సిన అవసరం వుంది. అంత దూరం వెళ్లలేని వారికి పెన్నా నదిలో కృష్ణా జలాల్లో పుష్కర స్నాన అవకాశం లభించడం ఎంతో సంతోషాన్నిస్తోంది.
–రవి శంకర్, డీఎఫ్‌వో , ప్రొద్దుటూరు.