పెన్నా గర్భశోకం
►పామిడిలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
►పోలీసుల అండతో రెచ్చిపోతున్న ఇసుకాసురులు
►గుంతలమయమైన పెన్నాతీరం
►కన్నెత్తి చూడని రెవెన్యూ, మైనింగ్ అధికారులు
అక్రమార్కులు పెన్నానదిని తోడేస్తున్నారు. అనుమతులు లేకండానే ఇసుకను అక్రమంగా తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పామిడిలో ఈ ఇసుకదందా తీవ్రం కావడంతో ఈ ప్రాంతంలోని పెన్నాతీరం గుంతలమయమై కనిపిస్తోంది. ఆక్రమణలు కూడా ఎక్కువ కావడంతో నది కుంచించుకుపోతోంది. ఇంత జరుగుతున్నా ఇటు మైనింగ్ అధికారులు గానీ, ఇటు పోలీసులు గాని కన్నెత్తి చూడడం లేదు.
- పామిడి:
మూడు దశాబ్దాల క్రితం పెన్నానదిలో ఎక్కడ చూసినా ఇసుక దిబ్బలు కనిపించేవి. అప్పట్లో 15 అడుగుల లోతులోనే నీరు పుష్కలంగా లభించేది. రాను రాను అక్రమ ఇసుక రవాణా ఊపందుకోవడంతో ఇసుక తిన్నెలు కనుమరుగయ్యాయి. ప్రస్తుతం పామిడిలో 150 అడుగుల్లో కూడా నీరు లభ్యంకాని పరిస్థితి. దీంతో పట్టణంలో ఎన్నడూలేని విధంగా నీటిఎద్దడి తీవ్రతరమైంది. మరోవైపు పామిడి సమీపంలో పెన్నానదిలో ఆక్రమణలు ఎక్కువ కావడంతో మైదానాన్ని తలపిస్తోంది. కొందరు ఏకంగా నదిలోనే తోటలు సాగు చేస్తున్నారు.
రోజుకు రూ.4 లక్షలు విలువ గల ఇసుక తరలింపు
గతంలో శింగనమల మండలంలో ఉల్లికల్లు, పెద్దవడుగూరు మండలంలో ఈరన్నపల్లి గ్రామాల వద్ద ఇసుకరీచ్‌లు ఉండేవి. గతంలో అక్కడి నుంచి మాత్రమే ఇనుక తరలించేలా నిబంధనలు ఉండేవి. ఏడాది క్రితం ఇసుక రీచ్‌లు ఎత్తివేశారు. దీంతో అధికారపార్టీ నేతలు ఇసుక అక్రమ రవాణా దందాకు పామిడిని కేంద్రంగా చేసుకున్నారు. పామిడి సమీపంలోని పెన్నానది నుంచి రోజుకు రూ.4 లక్షలు విలువ చేసే ఇసుకను అక్రమంగా రవాణ చేస్తూ కోట్లాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. ట్రాక్టర్లు, ట్రిప్పర్లు, లారీల్లో రోజుకు వంద ట్రిప్పులు చొప్పున ఇసుకను బెంగుళూరు, అనంతపురం, గుంతకల్లు, ఉరవకొండ, వజ్రకరూరు ప్రాంతాలకు తరలిస్తున్నారు. ముఖ్య పట్టణాల్లో అపార్ట్‌మెంట్ల నిర్మాణానికి, గుంతకల్లు పరిధిలోని రైల్వే డబ్లింగ్ పనులకు ఈ అక్రమ ఇసుకను తరలిస్తున్నారు.
ప్రాంతాన్ని బట్టి ధర
గుంతకల్లు, వజ్రకరూరు ప్రాంతాలకు ఒక ట్రాక్టర్ ధర రూ.3 వేలు పలుకుతోంది. అదే అనంతపురానికి అయితే రూ.4 వేలు. ట్రిప్పర్ ఇసుక అయితే రూ.18 వేలు పలుకుతోంది. బెంగుళూరు వంటి ముఖ్య పట్టణాలకు టెన్‌వీలర్ లారీ ఇసుక రూ.1.30 లక్షలు పలుకుతుండడంతో ఇసుకాసురుల అక్రమార్జన మూడు పువ్వులు... ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ఈక్రమంలోనే అక్రమ రవాణాను అఽడ్డు రాకుండా పోలీసులకు మామూళ్లు సమర్పిస్తున్నట్లు ఆరోపణలు వినవస్తున్నాయి. అయితే జిల్లా ఎస్పీగా అశోక్‌కుమార్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పోలీసులు అడపా...దడపా...దాడులు నిర్వహిస్తున్నా...పూర్తి స్థాయిలో అడ్డుకోలేకపోతున్నారు. ఈ అక్రమ ఇసుక రవాణాను అరికట్టకపోతే పెన్నాతీరం మైదానంలా మారిపోయే ప్రమాదం ఉందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
మైదానంగా మారింది
నదిలోని ఇసుక యథేచ్ఛగా తరలించడంతో దిన్నెలు కరిగిపోయాయి. నది మైదాన ప్రాంతంగా మారింది. ఇసుక అక్రమ రవాణాతో భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో పట్టణంలో నీటిఎద్దడి నెలకొంది.
–ఎస్ రఘునాథ్ దత్తు, పామిడి.
కంపచెట్లమయం
పెన్నానదిలో కంపచెట్లు దట్టంగా పెరిగాయి. ఆక్రమణలు, తోటలు, అక్రమ కట్టడాలతో నది కుచించుకుపోతోంది. దీంతో భవిష్యత్‌లో నది మాయమయ్యే పరిస్థితి నెలకొంది.
–ఎం రంగనాయకులు, పామిడి కొండాపురం.
అక్రమ రవాణను అడ్డుకుంటాం
పెన్నానది నుంచి ఇసుక అక్రమ రవాణాను అరికట్టి సహజసంపదను కాపాడతాం. ఇసుకను రవాణా చేసే వారెవరైనా, ఎంతటివారైనా ఉపేక్షించేది లేదు. పోలీసులకు మామూళ్లు అందుతున్నాయన్న మాటల్లో వాస్తవం లేదు. ఒకటిన్నర నెల వ్యవధిలో 13 ట్రాక్టర్లు, 2 ట్రిప్పర్లు సీజ్ చేసి, రూ.3.15 లక్షల జరిమానా వసూలు చేశాం. పోలీసుల పనితీరుకు ఇదే నిదర్శనం.
- రవిశంకర్‌రెడ్డి, ఎస్‌ఐ, పామిడి