తమ్మిలేరు ఇసుకపై రగులుతున్న సెగ
తమ్మిలేరు ఇసుకపై రగులుతున్న సెగ
Published Sat, Aug 13 2016 12:48 AM | Last Updated on Mon, Oct 8 2018 4:18 PM
లోపూడి(ముసునూరు):
ఇటీవల ప్రభుత్వం ఉచిత ఇసుక తోలకాలపై ఆంక్షలు సడలిం చింది. తమ్మిలేరు ఇసుక యధేచ్ఛగా తరలిపోతోంది. రెండు నెలల క్రితం మండలంలోనూ, సమీప మండలాల్లోని మరుగుదొడ్లు, గృహ అవసరాలకు గ్రామ సెక్రటరీల ద్వారా టోకెన్లు ఇచ్చి ఇసుక రవాణా చేయడానికి రెవెన్యూ, పోలీస్ వర్గాలు అనుమతులు ఇచ్చాయి. మరుగుదొడ్లు, గృహ అవసరాలకు కాకుండా వ్యాపారాల నిమిత్తం ట్రాక్టర్‌ల యజమానులు నూజి వీడు, చాట్రాయి మండలంలోని కొన్ని ప్రాంతాలు విస్సన్నపేట మండలాలకు అధిక ధరలకు తరలిస్తున్నారు. మండలంలోని తమ్మిలేరు పరివాహక ప్రాంత రైతులు ఇసుక తరలి పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వలసపల్లి, గుళ్లపూడి, బలివే రేవుల నుంచి ఇసుక తరలించకుండా రైతులు నిలిపివేస్తున్నారు. అటువైపు అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు లోపూడి రేవు నుంచి కొద్దిరోజులుగా వందల సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారు. తమ్మిలేరులో చలమతీస్తే మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని, పరివాహక ప్రాంతంలోని బోర్లు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇసుక తోలకాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఇసుక ట్రాక్టర్లను నిలపడానికి తమ్మిలేరు దారిలో వ్యక్తిని నియమించారు. రోజువారి ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్న ట్రాక్టర్ యజ మానులు అడ్డుకున్నవారిని తిట్టడంతో వివాదం చెలరేగింది. ట్రాక్టర్ల యజమానులు తమను కులం పేరుతో దూషిస్తున్నారని, ఇసుక తోలడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సమస్యను అధికారులు పరిష్కరించాలని ప్రజలు కోరు తున్నారు.
Advertisement