tammileru
-
డెడ్ స్టోరేజ్‌తో·గడ్డు పరిస్థితి
ప్రశ్నార్థకంగా తమ్మిలేరు ఆయకట్టు సాగు ప్రాజెక్టు పరిధిలో 34 వేల ఎకరాలు ఖరీఫ్ ప్రారంభమైనా నీరందని దుస్థితి ఎగువన అక్విడెక్ట్ ఎత్తు పెంచడం తగినంతగా వర్షాలు లేకపోవడమూ కారణమే చింతలపూడి: మెట్ట ప్రాంత వర ప్రదాయని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. జిల్లాలో కీలకమైన మధ్యతరహా జలాశయం అయిన తమ్మిలేరు నుండి ఆయకట్టుకు నీటి లభ్యత ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో వరి నారు మళ్ళు పోసుకోవాలా? వద్దా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. గత ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో పాక్షికంగా నిండిన ప్రాజెక్టు.. ప్రస్తుతం మెట్టలో ఏర్పడిన వర్షాభావం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పోవడంతో జలాశయంలోకి నీరు చేరలేదు. ప్రస్తుతానికి నీటి మట్టం 330.6 అడుగులు ఉన్నట్లు ఏఈ పరమానందం తెలిపారు. రాష్ట్ర విభజనతో తమ్మిలేరు పుట్టుక ప్రాంతం అయిన ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు అక్విడెక్ట్ ఎత్తు పెంచి అక్కడి రైతులు, అధికారులు నీటిని క్రిందికి రాకుండ కట్టుదిట్టం చేశారు. దీంతో ప్రాజెక్టు పరిస్ధితిపై రైతుల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటి పోయింది. రిజర్వాయరు ఎగువ భాగంలో 20 వేల ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్ళే వైపు ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కళ్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీటి సరఫరా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాలలో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది. ప్రతీ ఏటా జూన్ 15 కల్లా రైతులు నార్లు పోసుకుని జూలై 15 కల్లా నాట్లు వేసుకోవడం పూర్తి చేస్తారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీరు లేక పోవడంతో అధికారులు నారుమళ్ళకు కూడ నీరు విడుదల చేయలేని పరిస్ధితి ఏర్పడింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుతం 330.6 అడుగుల కనిష్ట నీటి మట్టానికి పడిపోయింది. కనీసం 340 అడుగుల నీరు ఉంటేనే కాని ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసే అవకాశం లేదు. ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవడంతో ఆయకట్టులోఖరీఫ్ పంటపై నీలి మేఘాలు అలుముకున్నాయి. గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన పరిస్ధితి తమ్మిలేరుకు ఎదురు కాలేదని రైతులు వాపోతున్నారు. విభజన వల్ల అసలు కష్టాలు రాష్ట్ర విభజన వల్ల అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. గోదావరి నది నుండి ఎత్తిపోతల ద్వారా జలాలను మళ్ళించి 36 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపొందించిన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పధకం వైఎస్ మృతి చెందాక ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచిì ఆంధ్రాలో చేరిన విలీన మండలాలతో అసలు సమస్య వచ్చి పడింది. ఎత్తిపోతల ప్రాంతం విలీన మండలాల్లో ఉండటంతో తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఆంధ్రాకాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచడమే కాక ఇసుక బస్తాలు కూడా వేయడంతో వరద నీటిపై ఆశలు గల్లంతయ్యాయి. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం తమ్మిలేరు ప్రాజెక్టుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలను మళ్ళించడం ఒక్కటే మార్గం. అయితే ఎత్తిపోతల పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డంకిగా మారడంతో ఇప్పట్లో పధకం పూర్తిఅయ్యే అవకాశాలు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని ఆంధ్రాకాల్వ ద్వార తమ్మిలేరుకు మళ్ళిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆందోళన పడవద్దు ఎగువ నుండి వరద నీరు వస్తేనే ప్రాజెక్టు పూర్తి స్ధాయిలో నిండే అవకాశం ఉంటుంది. అక్కడి ప్రభుత్వం క్రిందికి నీరు రాకుండా అడ్డుకుంటోంది. అయితే జూలై, ఆగష్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు నిండుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎం అప్పారావు డిఈ ,తమ్మిలేరు ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలి. ప్రభుత్వం ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. లేక పోతే తమ్మిలేరు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. (04) జె మురళీధరరెడ్డి తమ్మిలేరు ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షులు . -
‘తమ్మిలేరు’ తగాదా
చింతలపూడి : తమ్మిలేరు రిజర్వాయర్‌లో కొన్నేళ్లుగా అనధికారికంగా రొయ్య ల సాగు చేస్తుండటం వివాదాలకు తావిస్తోంది. ప్రాజెక్టుపై రాజకీయ నాయకుల ప్రాబల్యం పెరగడంతో దళారులు మత్స్యకారుల నోళ్లు మూ యిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏటా కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల మ త్స్యకారుల సంఘాల మధ్య వివా దం చోటు చేసుకుంటోంది. నాగిరెడ్డిగూడెం సమీపంలోని తమ్మిలేరు ప్రాజెక్టు, కృష్ణాజిల్లా మంకొల్లు వద్ద నిర్మించిన గోనెలవాగులో గతేడాది సెప్టెంబర్‌లో అనధికారికంగా రొయ్య పిల్లలను వేశా రు. ఇప్పుడు వాటిని పట్టి అమ్ముకునే విషయంలో మరోసారి వివాదం తలెత్తింది. ప్రాజెక్టులో రొయ్య పిల్లలను మేము వేశామంటే, మేము వేశామని రొయ్యలు మాకే అమ్మాలని రెండు జిల్లాలకు చెందిన వ్యాపారులు వివా దాన్ని రగిల్చారు. దీంతో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో రొయ్యల వేటను నిషేధిస్తూ కృష్ణాజిల్లా చాట్రాయి తహసీల్దార్ 144 సెక్షన్ విధించారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి బతుకుతున్న సుమారు 400 మత్స్యకార కుటుంబా లు ఆందోళన చెందుతున్నాయి. దళారుల కన్ను మత్స్యశాఖ ఏటా తమ్మిలేరులో చేప పిల్లలను వేసి, అవి పెరిగాక వాటిని మత్స్యకారులు పట్టుకుని అమ్ముకునేలా ఏర్పాట్లు చేసింది. అయితే రొయ్య ల సాగు ద్వారా ఎక్కువ ఆదాయం వస్తుండటంతో రెండు జిల్లాలకు చెందిన దళారుల కన్ను ప్రాజెక్టుపై పడింది. రాజకీయ పలుకుబడితో జలాశయంలో రొయ్యలు పెంచుతూ కోట్లు గడిస్తున్నారు. ఇందుకోసం మ త్స్యకార సంఘాలతో ముందుగానే ఒప్పందం చేసుకుని పట్టిన రొయ్యలను తమకే విక్రయించాలని నిబంధన విధిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల పట్టిన రొయ్యలను తక్కువ ధరకు కొనుగోలు చేయడానికి కృష్ణా జిల్లాకు చెందిన వ్యాపారి ప్రయత్నించగా మత్స్యకారులు గిట్టదని చెప్పడంతో వివాదం చోటు చేసుకుంది. దీంతో స్థానిక మత్స్యకారులు విషయాన్ని మంత్రి పీతల సుజాత దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి ఆదేశాలతో జిల్లాకు చెందిన మత్స్యశాఖ డీడీ ఎం.యాకూబ్‌పాష, తహసీల్దార్ టి.మైఖేల్‌రాజ్ గ త శనివారం ప్రాజెక్టును పరిశీలించా రు. మత్స్యకార సంఘాలతో సంప్రదిం పులు జరిపారు. త్వరలోనే రెండు జి ల్లాల అధికారులు, మత్స్యకార సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అప్పటి వరకు రొయ్యల వేటకు వెళ్లవద్దని అధికారులు ఆదేశించారు. రొయ్యల సాగు నిషేధం తమ్మిలేరు ప్రాజెక్టులో రొయ్యల సాగు నిషేధం. అయినా దళారులు ఏటా రొయ్య పిల్లలను జలాశయంలో వేసి పెంచడం, పట్టుకుని అమ్మడం చేస్తున్నారు. ఇదంతా ఇరిగేషన్, మత్స్యశాఖ అధికారులకు తెలిసినా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వం తమ్మిలేరు ప్రాజెక్టుపై రూ.10 కోట్లతో తాగునీటి పథకం నిర్మిస్తోంది. దీని ద్వారా చింతలపూడి, ప్రగడవరం పంచాయతీలకు తాగునీరు అందించనున్నారు. ప్రాజెక్టులో రొయ్యల సాగు చేపడితే నీరు కలుషితమై తాగడానికి పనికిరావని, అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు. దీనిపై ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ సీహెచ్ అమరేశ్వరరావును వివరణ కోరగా తమ్మిలేరులో రొయ్యల సాగు చేస్తున్న వారికి నోటీసులు ఇస్తున్నామని, విషయాన్ని కలెక్టర్ భాస్కర్ దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు. -
తమ్మిలేరుకు తగ్గిన వరద
చాట్రాయి: ఖమ్మం జిల్లాలో వర్షాలు తగ్గడంతో మండలంలోని తమ్మిలేరు వాగుకి వరదనీరు తగ్గింది. రెండు రోజలు క్రితం రెండు వేల క్యూసెక్కుల వరదనీరు రాగా సోమవారం ఉదయం 1400 క్యూసెక్కులకు తగ్గింది. చిన్నంపేట, శివాపురం గ్రామాల మధ్య ఉన్న తమ్మిలేరు వంతెన వద్ద తక్కువ వరద ప్రవహిస్తోంది. సత్తుపల్లి, వేంసూరు మండలాల్లో చెరువులు నిండిపోవడంతో ఏ మాత్రం వరద వచ్చినా నేరుగా తమ్మిలేరు రిజర్వాయర్కి వరద వస్తుందని టీఆర్పీ ఇంజినీర్లు చెబుతున్నారు. -
తమ్మిలేరు ఇసుకపై రగులుతున్న సెగ
లోపూడి(ముసునూరు): ఇటీవల ప్రభుత్వం ఉచిత ఇసుక తోలకాలపై ఆంక్షలు సడలిం చింది. తమ్మిలేరు ఇసుక యధేచ్ఛగా తరలిపోతోంది. రెండు నెలల క్రితం మండలంలోనూ, సమీప మండలాల్లోని మరుగుదొడ్లు, గృహ అవసరాలకు గ్రామ సెక్రటరీల ద్వారా టోకెన్లు ఇచ్చి ఇసుక రవాణా చేయడానికి రెవెన్యూ, పోలీస్ వర్గాలు అనుమతులు ఇచ్చాయి. మరుగుదొడ్లు, గృహ అవసరాలకు కాకుండా వ్యాపారాల నిమిత్తం ట్రాక్టర్ల యజమానులు నూజి వీడు, చాట్రాయి మండలంలోని కొన్ని ప్రాంతాలు విస్సన్నపేట మండలాలకు అధిక ధరలకు తరలిస్తున్నారు. మండలంలోని తమ్మిలేరు పరివాహక ప్రాంత రైతులు ఇసుక తరలి పోవడంపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. వలసపల్లి, గుళ్లపూడి, బలివే రేవుల నుంచి ఇసుక తరలించకుండా రైతులు నిలిపివేస్తున్నారు. అటువైపు అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు లోపూడి రేవు నుంచి కొద్దిరోజులుగా వందల సంఖ్యలో ఇసుక తరలిస్తున్నారు. తమ్మిలేరులో చలమతీస్తే మంచినీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని, పరివాహక ప్రాంతంలోని బోర్లు అడుగంటిపోయాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం గ్రామస్తులు ఒక నిర్ణయానికి వచ్చారు. ఇసుక తోలకాలను అడ్డుకోవాలని నిర్ణయించారు. ఇసుక ట్రాక్టర్లను నిలపడానికి తమ్మిలేరు దారిలో వ్యక్తిని నియమించారు. రోజువారి ఇసుక తవ్వకాలను నిర్వహిస్తున్న ట్రాక్టర్ యజ మానులు అడ్డుకున్నవారిని తిట్టడంతో వివాదం చెలరేగింది. ట్రాక్టర్ల యజమానులు తమను కులం పేరుతో దూషిస్తున్నారని, ఇసుక తోలడంతో ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. సమస్యను అధికారులు పరిష్కరించాలని ప్రజలు కోరు తున్నారు. -
'పట్టిసీమ ఎత్తిపోతలపై కోర్టుకెళతాం'
పశ్చిమగోదావరి (తాడేపల్లిగూడెం): గోదావరి జలాలను తరలించే నెపంతో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలనే సర్కారు యోచన రాజకీయ నాయకుల జేబులు నింపుడానికేనని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి బలగం కుమారస్వామి విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రూ.1,300 కోట్లు ఖర్చుతో నిర్మించే ఈ పథకాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అది సాధ్యం కాదని అన్నారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి తమ్మిలేరు,. రామిలేరుపై ఆక్విడెక్ట్‌లు నిర్మించాల్సి ఉందని, ఈ పనులన్నీ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. దీనినిబట్టి చూస్తే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి ఆ ప్రాజెక్ట్‌ను వదిలేస్తుందేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు రెండు పెద్ద కంపెనీలు ప్రభుత్వంతో మాట్లాడుకుని 22 శాతం అధికంగా టెండర్లు వేశాయన్నారు. దీనినిబట్టి చూస్తే ఈ పథకానికి సుమారు రూ.1,600 కోట్లు వెచ్చించాలనుకుంటున్నారన్నారు. ఈ పథకం నాయకుల జేబులు నింపుకోవడమే తప్ప రైతులకు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. పులిచింతల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయించి, ఏడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగలిగితే సాగునీటి సమస్య తీరుతుందని, ఆయకట్టు పెరుగుతుందని వివరించారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయిస్తే తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి సమస్య ఉండదన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా హడావుడిగా జీవోలు జారీ చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం పరుగులు తీస్తోందని విమర్శించారు. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. విలేకరుల సమావేశంలో కిసాన్ సంఘ్ కార్యదర్శి చింతపల్లి నారాయణరెడ్డి, రాష్ట్ర వరి రైతుల సంఘం కన్వీనర్ మల్లారెడ్డి శేషు, బీకేఎస్ జిల్లా అధ్యక్షులు పరిమి రాఘవులు, ఉపాధ్యక్షుడు పూడి సత్యనారాయణ, కార్యదర్శి కవులూరి పతిరాజు పాల్గొన్నారు.