'పట్టిసీమ ఎత్తిపోతలపై కోర్టుకెళతాం' | we will go the court on pattiseema project, says balagam | Sakshi
Sakshi News home page

'పట్టిసీమ ఎత్తిపోతలపై కోర్టుకెళతాం'

Published Thu, Feb 12 2015 8:20 PM | Last Updated on Sat, Sep 2 2017 9:12 PM

we will go the court on pattiseema project, says balagam

పశ్చిమగోదావరి (తాడేపల్లిగూడెం): గోదావరి జలాలను తరలించే నెపంతో పట్టిసీమ వద్ద ఎత్తిపోతల పథకం నిర్మించాలనే సర్కారు యోచన రాజకీయ నాయకుల జేబులు నింపుడానికేనని భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి బలగం కుమారస్వామి విమర్శించారు. రైతుల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని అడ్డుకునేందుకు ప్రతిపాదించిన పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకునేందుకు న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తున్నట్టు చెప్పారు. గురువారం పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

రూ.1,300 కోట్లు ఖర్చుతో నిర్మించే ఈ పథకాన్ని ఆరు నెలల్లో పూర్తి చేస్తామని ప్రభుత్వం చెబుతోందని, అది సాధ్యం కాదని అన్నారు. ఎత్తిపోతల పథకానికి సంబంధించి తమ్మిలేరు,. రామిలేరుపై ఆక్విడెక్ట్‌లు నిర్మించాల్సి ఉందని, ఈ పనులన్నీ పూర్తి కావడానికి మూడు సంవత్సరాలు పడుతుందని పేర్కొన్నారు. దీనినిబట్టి చూస్తే మూడేళ్లలో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన ప్రభుత్వం పట్టిసీమ ఎత్తిపోతల పథకం చేపట్టి ఆ ప్రాజెక్ట్‌ను వదిలేస్తుందేమోననే అనుమానాలు రేకెత్తుతున్నాయన్నారు. పట్టిసీమ ఎత్తిపోతల పథకం పనులు చేపట్టేందుకు రెండు పెద్ద కంపెనీలు ప్రభుత్వంతో మాట్లాడుకుని 22 శాతం అధికంగా టెండర్లు వేశాయన్నారు. దీనినిబట్టి చూస్తే ఈ పథకానికి సుమారు రూ.1,600 కోట్లు వెచ్చించాలనుకుంటున్నారన్నారు. ఈ పథకం నాయకుల జేబులు నింపుకోవడమే తప్ప రైతులకు, ప్రజలకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు.

పులిచింతల ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయించి, ఏడేళ్ల క్రితం శంకుస్థాపన చేసిన చింతలపూడి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించగలిగితే సాగునీటి సమస్య తీరుతుందని, ఆయకట్టు పెరుగుతుందని వివరించారు. తోటపల్లి ప్రాజెక్టుకు రూ.200 కోట్లు కేటాయిస్తే తూర్పుగోదావరి జిల్లాలో సాగునీటి సమస్య ఉండదన్నారు. పెండింగ్ పనులు పూర్తి చేస్తే లక్షలాది ఎకరాలు సాగులోకి వస్తాయని వివరించారు. ప్రభుత్వం వీటిని పట్టించుకోకుండా హడావుడిగా జీవోలు జారీ చేసి పట్టిసీమ ఎత్తిపోతల పథకం కోసం పరుగులు తీస్తోందని విమర్శించారు. దీనిపై కోర్టును ఆశ్రయించేందుకు న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటున్నామన్నారు. విలేకరుల సమావేశంలో కిసాన్ సంఘ్ కార్యదర్శి చింతపల్లి నారాయణరెడ్డి, రాష్ట్ర వరి రైతుల సంఘం కన్వీనర్ మల్లారెడ్డి శేషు, బీకేఎస్ జిల్లా అధ్యక్షులు పరిమి రాఘవులు, ఉపాధ్యక్షుడు పూడి సత్యనారాయణ, కార్యదర్శి కవులూరి పతిరాజు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement