20అడుగుల ఎత్తుకు భారీగా ఎగసిపడిన గోదావరి నీరు
పోలవరం రూరల్: పట్టిసీమ ఎత్తిపోతల పథకం పైప్‌లైన్ లీకై 20 అడుగుల మేర నీరు ఎగసిపడింది. సమీపంలోని పొలాల్లోకి పెద్ద ఎత్తున నీరు చేరింది. యథావిధిగా శుక్రవారం పట్టిసీమ ఎత్తిపోతల పథకం మోటార్లు ఆన్ చేసి కుడి కాలువలోకి నీరు విడుదల చేశారు. అయితే మార్గమధ్యంలో చీకడోడిమెట్ట ప్రాంతంలో భారీగా నీరు లీకై పొలాల్లోకి చేరుతోంది. రైతులు ఇచ్చిన సమాచారం మేరకు పట్టిసీమ ఇంజనీరింగ్ అధికారులు మోటార్‌లను నిలిపివేసి పైప్‌లైన్ పరిస్థితిని పరిశీలించారు.
చీకడోడిమెట్ట ప్రాంతంలో ఎయిర్ వాల్ ప్లేట్ లేకపోవడంతో నీరు ఎగసిపడినట్టు గుర్తించి మరమ్మతులు చేశారు. అనంతరం నీటి విడుదలను పునరుద్ధరించారు. గతంలో పైప్‌లైన్ ఎయిర్ వాల్ ప్లేట్‌ను తొలగించి రైతులు సాగునీటిని వినియోగించుకున్నారని, ఆ తర్వాత ప్లేట్ సరిగా బిగించకపోవడం వల్ల నీటి ఒత్తిడికి అది ఎగిరిపోయి నీరు ఎగసిపడినట్టు డీఈ ఆర్.పెద్దిరాజు తెలిపారు.
కాగా, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఈ నెల రెండో తేదీన పట్టిసీమ ఎత్తిపోతల పథకం నుంచి హడావుడిగా కుడి కాలువకు నీటిని విడుదల చేశారని, పైప్‌లైన్‌ను పూర్తిగా పరిశీలించి మరమ్మతులు చేపట్టే అవకాశం కూడా ఇవ్వలేదని పలువురు అధికారులు వ్యాఖ్యానిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment