డెడ్‌ స్టోరేజ్‌తో·గడ్డు పరిస్థితి | difficult situation with dead storage | Sakshi
Sakshi News home page

డెడ్‌ స్టోరేజ్‌తో·గడ్డు పరిస్థితి

Published Sat, Jul 15 2017 10:45 PM | Last Updated on Tue, Sep 5 2017 4:06 PM

డెడ్‌ స్టోరేజ్‌తో·గడ్డు పరిస్థితి

డెడ్‌ స్టోరేజ్‌తో·గడ్డు పరిస్థితి

ప్రశ్నార్థకంగా తమ్మిలేరు ఆయకట్టు సాగు
ప్రాజెక్టు పరిధిలో 34 వేల ఎకరాలు
ఖరీఫ్‌ ప్రారంభమైనా నీరందని దుస్థితి
ఎగువన అక్విడెక్ట్‌ ఎత్తు పెంచడం
తగినంతగా వర్షాలు లేకపోవడమూ కారణమే
 
చింతలపూడి: 
మెట్ట ప్రాంత వర ప్రదాయని తమ్మిలేరు రిజర్వాయర్‌ ప్రాజెక్టుకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. జిల్లాలో కీలకమైన మధ్యతరహా జలాశయం అయిన తమ్మిలేరు నుండి ఆయకట్టుకు నీటి లభ్యత ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో వరి నారు మళ్ళు పోసుకోవాలా? వద్దా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. గత ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో పాక్షికంగా నిండిన ప్రాజెక్టు.. ప్రస్తుతం మెట్టలో ఏర్పడిన వర్షాభావం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పోవడంతో జలాశయంలోకి నీరు చేరలేదు. ప్రస్తుతానికి నీటి మట్టం 330.6 అడుగులు ఉన్నట్లు ఏఈ పరమానందం తెలిపారు. 
రాష్ట్ర విభజనతో తమ్మిలేరు పుట్టుక ప్రాంతం అయిన ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు అక్విడెక్ట్‌ ఎత్తు పెంచి అక్కడి రైతులు, అధికారులు నీటిని క్రిందికి రాకుండ కట్టుదిట్టం చేశారు. దీంతో ప్రాజెక్టు పరిస్ధితిపై  రైతుల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటి పోయింది. రిజర్వాయరు ఎగువ భాగంలో 20 వేల ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్ళే వైపు ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కళ్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీటి సరఫరా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాలలో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది. ప్రతీ ఏటా జూన్‌ 15 కల్లా రైతులు నార్లు పోసుకుని జూలై 15 కల్లా నాట్లు వేసుకోవడం పూర్తి చేస్తారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీరు లేక పోవడంతో అధికారులు నారుమళ్ళకు కూడ నీరు విడుదల చేయలేని పరిస్ధితి ఏర్పడింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుతం 330.6 అడుగుల కనిష్ట నీటి మట్టానికి పడిపోయింది. కనీసం 340 అడుగుల నీరు ఉంటేనే కాని ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసే అవకాశం లేదు. ప్రాజెక్టులో నీరు డెడ్‌ స్టోరేజ్‌కు చేరుకోవడంతో ఆయకట్టులోఖరీఫ్‌ పంటపై నీలి మేఘాలు అలుముకున్నాయి. గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన పరిస్ధితి తమ్మిలేరుకు ఎదురు కాలేదని రైతులు వాపోతున్నారు.
విభజన వల్ల అసలు కష్టాలు 
రాష్ట్ర విభజన వల్ల అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. గోదావరి నది నుండి ఎత్తిపోతల ద్వారా జలాలను మళ్ళించి 36 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపొందించిన ఇందిరాసాగర్‌ ఎత్తిపోతల పధకం వైఎస్‌ మృతి చెందాక ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచిì  ఆంధ్రాలో చేరిన విలీన మండలాలతో అసలు సమస్య వచ్చి పడింది. ఎత్తిపోతల ప్రాంతం విలీన మండలాల్లో ఉండటంతో తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఆంధ్రాకాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచడమే కాక ఇసుక బస్తాలు కూడా వేయడంతో వరద నీటిపై ఆశలు గల్లంతయ్యాయి.  
చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం
తమ్మిలేరు ప్రాజెక్టుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలను మళ్ళించడం ఒక్కటే మార్గం. అయితే ఎత్తిపోతల పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డంకిగా మారడంతో ఇప్పట్లో పధకం పూర్తిఅయ్యే అవకాశాలు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని ఆంధ్రాకాల్వ ద్వార తమ్మిలేరుకు మళ్ళిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. 
ఆందోళన పడవద్దు 
ఎగువ నుండి వరద నీరు వస్తేనే ప్రాజెక్టు పూర్తి స్ధాయిలో నిండే అవకాశం ఉంటుంది. అక్కడి ప్రభుత్వం క్రిందికి నీరు రాకుండా అడ్డుకుంటోంది. అయితే జూలై, ఆగష్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు నిండుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
                                   ఎం అప్పారావు డిఈ ,తమ్మిలేరు ప్రాజెక్టు 
 
చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేయాలి              
 చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలి. ప్రభుత్వం ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. లేక పోతే తమ్మిలేరు ఎడారిగా మారే ప్రమాదం ఉంది.
                   (04) జె మురళీధరరెడ్డి తమ్మిలేరు ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షులు . 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement