రాళ్లపాడు రగడ
► నీటి విడుదలలో గ్రామాల మధ్య వివాదం
► పంట చేతికొచ్చేనా...
► తాగునీటికీ కటకటే
► అధికారుల మధ్య సమన్వయ లోపం
ఏళ్ల తర్వాత రాళ్లపాడుప్రాజెక్టు నిండినా ఆ
ఆనందం రైతుల్లో లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధికారిక ఆయకట్టు
కన్నా ఎక్కువ ఎకరాల్లో పంట వేశారు. ఫలితంగా నీరు సరిపోక గ్రామాల మధ్య వివాదం నెలకొంది.
ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాళ్లపాడు ప్రాజెక్టులో నీరు అడుగంటమే దీనికి కారణం. దీంతో ఎగువ, దిగువ ప్రాంతాల రైతుల మధ్య వివాదాలు తలెత్తు తున్నాయి. రైతుల వివాదాల కాస్త రెండు జిల్లాల మధ్య శాంతి భద్రతల సమస్యగా మారింది.
సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ కందుకూరు: రాళ్లపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం 3.10 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పరిధిలో 20 వేల ఎకరాల వరకు వరి సాగు చేశారు. ఇప్పటికే సాగు చేసి దాదాపు రెండు నెలలకు పైగా అయింది. మరో నెల రోజుల వరకు నీరు ఇస్తేగానీ సరిపోయే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు ఒక్క తడికి అంటే 10 రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో కాస్త ఆలస్యంగా కుడి కాల్వ పరిధిలో నాట్లు వేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ఎగువ ప్రాంతాలైన సాయిపేట, ఇసుకపాలెం, మక్కినవారిపాలెం తదితర గ్రామాల రైతులు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే రెండు రోజులుగా మక్కినవారిపాలేనికి చెందిన రైతులు కాల్వకు అడ్డుకట్టలు, చిల్లకంప వేసి దిగువకు నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రెండు జిల్లాలకు చెందిన పోలీస్, ప్రాజెక్టు అధికారులు రెండు రోజులుగా ప్రాజెక్టు వద్దే మకాం వేసి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అయినా ప్రస్తుతం ప్రాజెక్టు కింద సాగులో ఉన్న వరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పొట్ట, వెన్నుతీసే దశలో ఉంది. మరికొంత పొలం ఇంకా ఇప్పుడిప్పుడే పొట్టదశకు వ స్తోంది.
కనీసం మరో నెల 20 రోజులకు పైగా నీరు అవసరమవుతుందని రైతులు అంటున్నారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు అప్పటి దాకా రాదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోపక్క అధికారులు మాత్రం మరో 10 రోజుల పాటు నీరిస్తే కొంత మంది రైతులు గట్టెక్కుతారని, దిగువ ప్రాంతాల్లో ఉన్న బోర్ల ఆధారంగా ఆ ప్రాంతాలకు సమస్య లేకుండా చేస్తామని చెప్తున్నారు. చివరిలో ఒక్క తడి నీరు తగ్గినా దిగుబడిపై భారీగా ప్రభావం పడుతుందని రైతులు కలత చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ఎడమ కాల్వ నీరు నిల్..
కుడి కాల్వ కింద పరిస్థితి ఇలా ఉంటే ఎడమ కాల్వ కింద రైతుల స్థితి మరీ దయనీయంగా ఉంది. 1600 ఎకరాల వరకు ఎడమ కాల్వ కింద పంట ఉంది. అయితే ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజ్‌కి చేరడంతో ప్రస్తుతం ఎడమ కాల్వకు నీరందడం లేదు. దీంతో గత 27వ తేదీ నుంచి పూర్తిగా నీరు నిలిచిపోయింది. మోటార్లు, ఆయిల్‌ఇంజన్లు ఏర్పాటు చేసి ఎడమ కాల్వకి నీరు సరఫరా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటికి అనుమతి రాలేదు. దీంతో ఎడమ కాల్వకి నీరు ఎలా ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది.
గొంతెండాల్సిందేనా...
ప్రాజెక్టులో ప్రస్తుతం 128 ఎంపీఎఫ్‌టీల నీరు ఉంది. 100 ఎంసీఎఫ్‌టీ వరకు నీటిని వినియోగించి చివరకు 28 ఎంసీఎఫ్‌టీ నీటిని వేసవి తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మాత్రం వేసవి తాగునీటికి తమకు 45 ఎంసీఎఫ్‌టీల నీరు అవసరమని చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న తాగునీటి పథకాలకు ఈ వేసవికి నీరు అందే పరిస్థితి లేదు. చుండి-చెర్లోపాలెం, రాళ్లపాడు-రోళ్లపాడు, గుడ్లూరు మంచినీటి పథకం వంటి భారీ పథకాలు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నాయి.
గుడ్లూరు పథకానికి సంబంధించి బావి ప్రాజెక్టు లోపలే ఉండడంతో దీనికి ఎలాగోలా నీరు అందుతుంది. ఇక మిగిలిన రెండు పథకాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. ఈ రెండు పథకాలపై పూర్తిగా లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నిటికీ ఈ పథకాల నుంచే తాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో ఉన్న నీరు పూర్తిగా వినియోగిస్తే ఇక ఈ గ్రామాల గొంతెండాల్సిందే.