dead storage
-
కృష్ణా బేసిన్‌లోని జలాశయాలు ఖాళీ
సాక్షి, అమరావతి: కృష్ణా నదీ పరివాహక ప్రాంతం(బేసిన్)లో జలాశయాలన్నీ ఖాళీ అయ్యాయి. కర్ణాటకలోని ఆల్మట్టి డ్యామ్ నుంచి రాష్ట్రంలోని పులిచింతల ప్రాజెక్టు వరకూ అన్ని జలాశయాల్లోనూ నీటి నిల్వ కనిష్ట స్థాయికి చేరింది. నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల పశ్చిమ కనుమలు, బేసిన్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తుండటంతో కృష్ణా నది ప్రధాన పాయలో వరద ప్రవాహం ప్రారంభమైంది. ఆల్మట్టి డ్యామ్‌లోకి బుధవారం 7,490 క్యూసెక్కులు చేరుతున్నాయి. ప్రస్తుతం ఆల్మట్టి డ్యామ్‌లో 24.68 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఇది నిండాలంటే 105.04 టీఎంసీలు అవసరం. ఇక ఆల్మట్టి దిగువన ఉన్న నారాయణపూర్ డ్యామ్ పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 37.64 టీఎంసీలు. ప్రస్తుతం 24.2 టీఎంసీలు ఉన్నాయి. నారాయణపూర్ డ్యామ్ నిండాలంటే ఇంకా 13.42 టీఎంసీలు అవసరం. అంటే.. 118.46 టీఎంసీలు చేరితేగానీ ఆల్మట్టి, నారాయణపూర్ డ్యామ్‌లు నిండవు. ఆ రెండు జలాశయాలు నిండాక గేట్లు ఎత్తి దిగువకు వరద జలాలను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ డ్యామ్‌కు దిగువన తెలంగాణలో ఉన్న జూరాల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 9.66 టీఎంసీలు. ప్రస్తుతం జూరాలలో 7.65 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. మరో 2.01 టీఎంసీలు చేరితే అదీ నిండుతుంది. ఇక శ్రీశైలం ప్రాజెక్టులో 34.52 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. శ్రీశైలం నిండాలంటే 181.29 టీఎంసీలు అవసరం. రెండు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు అయిన నాగార్జునసాగర్‌లో 122.85 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ఈ ప్రాజెక్టు నిండాలంటే 189.2 టీఎంసీలు అవసరం. సాగర్ దిగువన రాష్ట్రంలో ఉన్న పులిచింతల ప్రాజెక్టులో నీటి నిల్వ డెడ్ స్టోరేజీ స్థాయిలో 0.77 టీఎంసీలున్నాయి. అది నిండాలంటే 45 టీఎంసీలు అవసరం. కృష్ణా నదికి ప్రధాన ఉప నది అయిన తుంగభద్రపై నిర్మించిన మూడు రాష్ట్రాల ఉమ్మడి ప్రాజెక్టు తుంగభద్ర డ్యామ్‌లో 5.29 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. తుంగభద్ర నిండాలంటే ఇంకా 100 టీఎంసీలు అవసరం. -
డెడ్ స్టోరేజీ చేరువలో ఎస్సారెస్పీ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: శ్రీరాంసాగర్ ప్రాజెక్టు డెడ్ స్టోరేజీకి చేరువైంది. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న జలాశయంలో ప్రస్తుతం నీటి మట్టం 1050.30 అడుగుల (6.37 టీఎంసీ) కు పడిపోయింది. ఎండల తీవ్రతకు ప్రతిరోజూ రెండు వందలకు పైగా క్యూసెక్కుల నీరు ఆవిరవుతుండగా, కాకతీయ కాలువకు 50 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఈ ప్రాజెక్టులో భారీగా పూడిక నిండిపోవడంతో ఐదు టీఎంసీల మట్టానికి తగ్గితే బురద నీరు మారే అవకాశాలున్నాయి. తాగునీటి అవసరాల కోసం ఒకటిన్నర టీఎంసీలే అందుబాటులో ఉంటాయి. ఐదు జిల్లాల తాగునీటి అవసరాలకు ఈ ప్రాజెక్టే ఆధారం. ఆదిలాబాద్, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలకు ఈ గ్రిడ్ నుంచే నీటిని సరఫరా చేస్తున్నారు. జగిత్యాల, కోరుట్ల తాగునీటి కోసం ప్రతిరోజు 54 క్యూసెక్కులు, నిర్మల్, ఆదిలాబాద్ జిల్లాల తాగునీటి కోసం 29 క్యూసెక్కులు, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల కోసం మరో 54 క్యూసెక్కుల నీటిని పంపు చేస్తున్నారు. ఆవిరి నష్టాలతో కలిపి మొత్తం ప్రతిరోజు 394 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఏటా ఈ ప్రాజెక్టుకు ఆగస్టులో ఇన్‌ఫ్లో ఉంటుంది. అప్పటి వరకు తాగునీటి అవసరాలకు ఈ నీటినే వినియోగించాల్సి ఉంటుంది. శ్రీరాంసాగర్ ప్రాజెక్టులో ప్రస్తుతం నీటి మట్టం- 6.37టీఎంసీలు ప్రతిరోజూ తాగునీటి అవసరాలకు విడుదల చేస్తున్న నీరు- 394క్యూసెక్కులు.. ప్రాజెక్టులో డెడ్ స్టోరేజీ నీటి మట్టం- 5టీఎంసీలు ఆగస్టులో భారీగా ఇన్‌ఫ్లో.. మహారాష్ట్రతో పాటు, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాలో విస్తారంగా వర్షాలు కురిస్తే ఈ ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. కానీ ఈ ఏడాది ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో సరిగ్గా వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండ లేదు. ఈసారి 2018 ఆగస్టులో వచ్చిన వరద కొంత మేరకు ఊరటనిచ్చింది. ఒక్కోరోజు సుమారు 4లక్షల క్యూసెక్కుల నీరు వచ్చి చేరింది. కొన్నిరోజులు లక్ష క్యూసెక్కుల చొప్పున వరద జలాలు వచ్చి చేరాయి. ఏడాది మొత్తానికి 77.92 టీఎంసీలు వచ్చాయి. దీంతో 90 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఈ ప్రాజెక్టు నీటిమట్టం గరిష్టంగా 83 టీఎంసీలకు చేరింది. కాగా ఈ ఏడాది ఫిబ్రవరిలో యాసంగి పంటల కోసం కాకతీయ కాలువ ద్వారా సాగు నీటిని విడుదల చేశారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి ఏప్రిల్ మొదటి వారం వరకు నీటిని వదిలారు. ఎగువ ఎల్ఎండీ వరకు ఆయకట్టుకు సుమారు 20 టీఎంసీలు సాగునీరు సరఫరా చేశారు. తాగునీటికి ఏ మాత్రం ఇబ్బంది లేదు.. తాగునీటి అవసరాలకు ఎలాంటి ఇబ్బంది లేదు. ప్రస్తుతం ప్రాజెక్టు 6.37 టీఎంసీల నీరుంది. దీంతో ఆగస్టు మాసాంతం వరకు తాగునీటిని సరఫరా చేయవచ్చు. ఏటా ఆగస్టు, సెప్టెంబర్‌లో ప్రాజెక్టు ఇన్‌ఫ్లో ఉంటుంది. -శ్రీనివాస్‌రెడ్డి, పర్యవేక్షక ఇంజనీర్ -
ఆనందం.. ఆవిరి !
వైఎస్ఆర్ జిల్లా , జమ్మలమడుగు : మైలవరం జలాశయం డేడ్స్టోరేజీకి చేరువైంది. ఆరు టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండడంతో బోటింగ్ ఏర్పాటు చేశారు. అయితే సరైన వర్షాలు లేక పంటలు ఎండిదశకు చేరడంతో ఉత్తర దక్షిణ కాలువల ద్వారా నీటిని అందించారు. అంతేకాకుండా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని వదిలారు. అయితే ప్రొద్దుటూరుకు నీరు రాకపోవడంతో అదనంగా మరో టీఎంసీ నీటిని వదిలారు. దీంతో జలాశయంలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. ప్రస్తుతం జలాశయంలో 0.696 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెట్ స్టోరేజీ 0.585 టీఎంసీలు. డెట్ స్టోరేజి కంటే 111 క్యూసెక్కుల నీరు ఎక్కువగా ఉంది. తప్పని తిప్పలు జలాశయంలో బోటింగ్ చేయడానికి నీరు పుష్కలంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది నుంచి స్పీడ్ బోటింగ్‌తోపాటు షికారు బోటింగ్‌ను ఏర్పాటు చేశారు. కనీసం ఐదు నిమిషాల పాటు పర్యాటకులకు బోటింగ్ షికారు చేయిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీరు డెడ్‌స్టోరేజికి చేరుతుండడంతో ఎక్కువ దూరం బోటింగ్ చేయలేకపోతున్నామంటూ పర్యాటకులు వాపోతున్నారు. రెండు టీఎంసీలు ఉంటేనే.. మైలవరం జలాశయంలో కనీసం రెండు టీఎంసీల నీరు ఉంటే బోటింగ్‌తోపాటు, పర్యాటకులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. డెట్స్టోరేజీకి చేరుకుంటున్న మైలవరం జలాశయంలోనికి గండికోటలో ఉన్న నీటిలో నుంచి కనీసం ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తే బోటింగ్‌కు ఇబ్బందిలేకపోవడంతోపాటు, వచ్చిన పర్యాటకులకు నీరు కనువిందు చేస్తుంది. అభివృద్ధి చేయాలి మైలవరం జలాశయంలో ఏర్పాటు చేసిన బోటింగ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. పిల్లల ఆనందానికి అవదుల్లేవు. ఆదివారం విద్యార్థులకు సెలవు దినం కావడంతో గండికోట ఉత్సవాలకు అధిక సంఖ్యలో వచ్చారు. బోటు షికారుకు వెళ్లారు. అయితే అభివృద్ధి చేయాల్సి ఉంది. ఎక్కువగా ముళ్లపొదలు, రాళ్లు ఉన్నాయి. – చంద్రిక, పర్యాటకురాలు, ప్రొద్దుటూరు పెన్నాలోయలోకి తిప్పాలి... గండికోట ప్రాజెక్టునుంచి మైలవరం జలాశయంలోకి వచ్చె పెన్నానదిలోయలోకి బోటింగ్ షికారు పొడగించాలి. ప్రస్తుతం జలాశయంలో నీరు తక్కువగా ఉండడంతో మైలవరం వైపు మాత్రమే తిప్పుతున్నారు. భవిష్యత్తులో అయినా పెన్నానదిలోయలోకి బోటింగ్ తిప్పేలా చర్యలు తీసుకోవాలి. – నాగేంద్రుడు, జమ్మలమడుగు -
డెడ్ స్టోరేజ్..!
మోపాడు (పామూరు): కరువు తరుముతోంది. ప్రాజెక్టులు, రిజర్వాయర్లన్నీ డెడ్‌స్టోరేజీకి చేరుకోని నీళ్ల కోసం దీనంగా నోరు తెరిచి ఎదురుచూస్తున్నాయి. వీటి పరిధిలోని వేల ఎకరాల ఆయకట్టు భూములు సాగుకు నోచుకోక బీడు భూములుగా మారడంతో అన్నదాతకు పూట గడవటం కష్టంగా మారి కూలీలుగా మారుతున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితులతో మండల పరిధిలోని మోపాడు రిజర్వాయర్ డెడ్‌స్టోరేజీకి చేరుకుంది. ఏడేళ్లుగా సాగుకు నోచుకోని ఆయకట్టు భూములు.. మండలంలోని మోపాడు రిజర్వాయర్ వర్షాభావ పరిస్థితుల కారణంగా నీరు అడుగంటింది. గత 7 ఏళ్లుగా ఆయకట్టు భూములు సాగుకు నోచుకోక రైతన్నకు ఈ రిజర్వార్ దన్నుగా నిలవలేకపోతోంది. ఈ ప్రాంతంలో కరువును పారదోలేందుకు స్వాతంత్య్రానికి పూర్వం అప్పటి బ్రిటీష్ పాలకులు మోపాడు 1906లో రిజర్వాయర్ నిర్మాణాన్ని ప్రారంభించి 1921 నాటికి నిర్మాణాన్ని పూర్తిచేసి నీటిని ఆయకట్టుకు వదిలారు. మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన మోపాడు రిజర్వాయర్‌కు ప్రధానంగా నీరుచేరాలంటే కనిగిరి నియోజకవర్గంలోని సీఎస్‌పురం మండలం భైరవకోన అటవీప్రాంతంతో పాటు అదే మండలంలోని పిల్లిపల్లి, బోయమడుగుల గ్రామాల పైతట్టున ఉన్న అటవీ, చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కురిస్తే డొక్కలవాగు, మన్నేరు ద్వారా, పామూరు మండలంలోని వర్షపు నీరు నాచవాగుద్వారా మోపాడు రిజర్వాయర్‌కు నీరు చేరుతుంది. పూర్తిగా వర్షాధానంపై ఆధారపడిన మోపాడు మీడియం ఇరిగేషన్ రిజర్వాయర్ తొట్టిప్రాతం సుమారు 4,500 ఎకరాలు కాగా పూర్తిస్థాయి నీటి నిల్వసామర్థ్యం 2.1 టీఎంసీలు. రిజర్వాయర్ పరిధిలో 12,719 ఎకరాల సాగు భూమి ఉంది. ఇందులో ప్రకాశం జిల్లా పామూరు మండలంలో 8,174 ఎకరాలు, పొట్టిశ్రీరాములు నెల్లూరుజిల్లా కొండాపురం మండలంలో 4,545 ఎకరాలు ఉంది. వర్షాలు కురిసి మోపాడు రిజర్వాయరుకు సంవృద్ధిగా నీరు చేరి పూర్తిగా నిండితే 29 అడుగుల వద్ద రిజర్వాయర్ అలుగుపారి ఆయకట్టు పరిధిలో అధికారికంగా 12,719 ఎకరాలు, అనధికారికంగా 18 వేల ఎకరాల వరకు వరి పండటంతోపాటు ఆరుతడి పంటలుగా కంది, జొన్న, పొద్దుతిరుగుడు, నూగు, శనగ పంటలు పండుతాయి. 2015 డిసెంబర్లో రిజర్వాయర్‌కు 13.6 అడుగులమేర నీరుచేరగా వరిపంట సాగుకు నీరు సరిపోవని ఆయకట్టుకు విడుదల చేయచేయలేదు. ఈ దశలో 2017లో ఆయకట్టులో ఆరుతడిగా వేసిన జొన్న పైరు ఎండిపోతుండగా విధిలేని పరిస్థితుల్లో రైతుల విజ్ఞప్తితో నీటిని విడుదలచేయగా రిజర్వాయర్‌లోని నీరు 3 అడుగులకు చేరుకుని అడుగంటే స్థితికి వచ్చింది. కాగా 2017 సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో కురిసిన కొద్దిపాటి జల్లులకు రిజర్వాయర్‌కు అడుగుల నీరు చేరగా ప్రస్తుతం కొంతనీరు తగ్గి రిజర్వాయర్‌లో నీరు 5.1 అడుగుల్లో డెడ్‌స్టోరోజ్ లెవల్లో ఉంది. మోపాడు రిజర్వాయర్‌ను వెలిగొండ పరిదిలోనికి చేర్చి తద్వారా రిజర్వాయర్‌కు శాశ్వత నీటి కేటాయింపులతో శాశ్వత ప్రాతిపదికన సాగునీటితో పాటు, తాగునీటి సమస్యలను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపాదనలకే పరిమితమవుతున్న జైకా నిధులు మండలంలోని మోపాడు రిజర్వాయర్ అలుగు పొడవును 250 మీటర్ల మేర పెంచేందుకు, రిజర్వాయర్ ప్రధాన కాల్వ 22 కిలోమీటర్లు, బొట్లగూడూరు బ్రాంచ్ కెనాల్ 8 కి.మి.ల గ్రావెల్ కాల్వలను సీసీ కాల్వలుగా నిర్మించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. అదే విధంగా పామూరు కందుకూరు ఆర్అండ్బీ రోడ్డు నుంచి రిజర్వాయర్ వరకు తారురోడ్డు నిర్మాణం, నీరు పొలాల్లోకి వెళ్లేందుకు పిల్లకాల్వల నిర్మాణం, సప్టాల బాగుచేయించేందుకు మొత్తం రు. 32.41 కోట్ల జైకా నిధులకు గత సెప్టెంబర్‌లో ప్రతిపాదనలు పంపగా నేటికి నిధులు విడుదల కాలేదు. -
నీరు లేక నాగార్జున సాగర్ వెలవెల
-
డెడ్ స్టోరేజ్‌తో·గడ్డు పరిస్థితి
ప్రశ్నార్థకంగా తమ్మిలేరు ఆయకట్టు సాగు ప్రాజెక్టు పరిధిలో 34 వేల ఎకరాలు ఖరీఫ్ ప్రారంభమైనా నీరందని దుస్థితి ఎగువన అక్విడెక్ట్ ఎత్తు పెంచడం తగినంతగా వర్షాలు లేకపోవడమూ కారణమే చింతలపూడి: మెట్ట ప్రాంత వర ప్రదాయని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు ఇప్పట్లో కష్టాలు గట్టెక్కేలా లేవు. జిల్లాలో కీలకమైన మధ్యతరహా జలాశయం అయిన తమ్మిలేరు నుండి ఆయకట్టుకు నీటి లభ్యత ప్రశ్నార్ధకంగా మారింది. దీంతో వరి నారు మళ్ళు పోసుకోవాలా? వద్దా అని రైతులు సందిగ్ధంలో ఉన్నారు. గత ఏడాది సకాలంలో వర్షాలు కురవడంతో పాక్షికంగా నిండిన ప్రాజెక్టు.. ప్రస్తుతం మెట్టలో ఏర్పడిన వర్షాభావం వల్ల ప్రాజెక్టు నీటిమట్టం డెడ్ స్టోరేజ్‌కు చేరుకుంది. ఈ ఏడాది ఇప్పటి వరకు సరైన వర్షాలు కురవక పోవడంతో జలాశయంలోకి నీరు చేరలేదు. ప్రస్తుతానికి నీటి మట్టం 330.6 అడుగులు ఉన్నట్లు ఏఈ పరమానందం తెలిపారు. రాష్ట్ర విభజనతో తమ్మిలేరు పుట్టుక ప్రాంతం అయిన ఖమ్మం జిల్లా బేతుపల్లి చెరువు అక్విడెక్ట్ ఎత్తు పెంచి అక్కడి రైతులు, అధికారులు నీటిని క్రిందికి రాకుండ కట్టుదిట్టం చేశారు. దీంతో ప్రాజెక్టు పరిస్ధితిపై రైతుల్లో ఆందోళన వ్యక్త మవుతోంది. తమ్మిలేరు ప్రాజెక్టు నిర్మించి 40 ఏళ్ళు దాటి పోయింది. రిజర్వాయరు ఎగువ భాగంలో 20 వేల ఎకరాలు, దిగువ భాగంలో ఏలూరు వెళ్ళే వైపు ఇరుపక్కలా 15 ఏటి కాలువల ద్వారా 14,200 ఎకరాలు సాగవుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని తలార్లపల్లి, యర్రంపల్లి, యడవల్లి, కళ్యాణంపాడు, తువ్వచెలక రాయుడుపాలెం గ్రామాలకు చెందిన 475 ఎకరాల పల్లం భూములకు, 3,769 ఎకరాల మెరక భూములకు నీటి సరఫరా జరుగుతుంది. కృష్ణా జిల్లాలో పోలవరం, చాట్రాయి, తుమ్మగూడెం, మంకొల్లు, సోమవరం గ్రామాలలో 1,855 ఎకరాల పల్లం భూములకు, 3,070 ఎకరాల మెరక భూములకు సాగునీరు లభిస్తుంది. ప్రతీ ఏటా జూన్ 15 కల్లా రైతులు నార్లు పోసుకుని జూలై 15 కల్లా నాట్లు వేసుకోవడం పూర్తి చేస్తారు. ఈ ఏడాది ప్రాజెక్టులో నీరు లేక పోవడంతో అధికారులు నారుమళ్ళకు కూడ నీరు విడుదల చేయలేని పరిస్ధితి ఏర్పడింది. ప్రాజెక్టు గరిష్ట నీటిమట్టం 355 అడుగులు కాగా, ప్రస్తుతం 330.6 అడుగుల కనిష్ట నీటి మట్టానికి పడిపోయింది. కనీసం 340 అడుగుల నీరు ఉంటేనే కాని ఆయకట్టుకు సాగు నీరు విడుదల చేసే అవకాశం లేదు. ప్రాజెక్టులో నీరు డెడ్ స్టోరేజ్‌కు చేరుకోవడంతో ఆయకట్టులోఖరీఫ్ పంటపై నీలి మేఘాలు అలుముకున్నాయి. గత దశాబ్ద కాలంలో ఇంత దారుణమైన పరిస్ధితి తమ్మిలేరుకు ఎదురు కాలేదని రైతులు వాపోతున్నారు. విభజన వల్ల అసలు కష్టాలు రాష్ట్ర విభజన వల్ల అసలు కష్టాలు ప్రారంభమయ్యాయి. గోదావరి నది నుండి ఎత్తిపోతల ద్వారా జలాలను మళ్ళించి 36 వేల ఎకరాలకు సాగు నీరు అందించడానికి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో రూపొందించిన ఇందిరాసాగర్ ఎత్తిపోతల పధకం వైఎస్ మృతి చెందాక ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ఆగిపోయాయి. రాష్ట్ర విభజనతో తెలంగాణ నుంచిì ఆంధ్రాలో చేరిన విలీన మండలాలతో అసలు సమస్య వచ్చి పడింది. ఎత్తిపోతల ప్రాంతం విలీన మండలాల్లో ఉండటంతో తెలంగాణ రాష్ట్రం ఈ ప్రాజెక్టు వైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. ఇక ఆంధ్రాకాలువ ద్వారా తమ్మిలేరుకు వచ్చే వరద నీరు రాకుండా ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం బేతుపల్లి చెరువు అలుగు ఎత్తును పెంచడమే కాక ఇసుక బస్తాలు కూడా వేయడంతో వరద నీటిపై ఆశలు గల్లంతయ్యాయి. చింతలపూడి ఎత్తిపోతలే శరణ్యం తమ్మిలేరు ప్రాజెక్టుకు తిరిగి పూర్వ వైభవం రావాలంటే చింతలపూడి ఎత్తిపోతల పథకం నుండి గోదావరి జలాలను మళ్ళించడం ఒక్కటే మార్గం. అయితే ఎత్తిపోతల పనులు ఎప్పటికి పూర్తవుతాయోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చింతలపూడి ఎత్తిపోతలకు భూసేకరణ అడ్డంకిగా మారడంతో ఇప్పట్లో పధకం పూర్తిఅయ్యే అవకాశాలు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పధకాన్ని ఆంధ్రాకాల్వ ద్వార తమ్మిలేరుకు మళ్ళిస్తే సమస్య పరిష్కారం అవుతుంది. ఆందోళన పడవద్దు ఎగువ నుండి వరద నీరు వస్తేనే ప్రాజెక్టు పూర్తి స్ధాయిలో నిండే అవకాశం ఉంటుంది. అక్కడి ప్రభుత్వం క్రిందికి నీరు రాకుండా అడ్డుకుంటోంది. అయితే జూలై, ఆగష్టు నెలల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రాజెక్టు నిండుతుంది. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎం అప్పారావు డిఈ ,తమ్మిలేరు ప్రాజెక్టు చింతలపూడి ఎత్తిపోతల పూర్తి చేయాలి చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులను పూర్తి చేసి తమ్మిలేరుకు సాగు నీరు అందించాలి. ప్రభుత్వం ఎత్తిపోతల పథకం భూసేకరణ పనులను త్వరితగతిన పూర్తి చేసి కాల్వ తవ్వకం పనులు చేపట్టాలి. లేక పోతే తమ్మిలేరు ఎడారిగా మారే ప్రమాదం ఉంది. (04) జె మురళీధరరెడ్డి తమ్మిలేరు ప్రాజెక్టు నీటి సంఘం అధ్యక్షులు . -
అడుగంటిన జీడీపీ
– తలెత్తనున్న తాగునీటి కష్టాలు గోనెగండ్ల: మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్‌లో నీరు అడుగంటిపోతోంది. దీంతో ప్రాజెక్ట్ కింద ఉన్న మంచినీటి పథకాలకు నీటి పంపింగ్ ఇబ్బందిగా మారింది. ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో ఆశించిన మేర తొలకరి వర్షాలు కురవకపోవడం, హంద్రీనీవా నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజీకి చేరిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ద్వారా పత్తికొండ, కృష్ణగిరి, డోన్లలోని మంచినీటి పథకాలకు ప్రతి రోజు 10 క్యూసెక్కుల నీటి పంపింగ్ జరుగుతుంది.అదే విధంగా కర్నూలుకు ఎడమ కాలువ ద్వారా ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. 4.5 టీఎంసీల నీరు నిలువ చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 650 ఏంసీఎఫ్టీ( 0.65 టీఎంసీ)ల మేర పూడిక పేరుకొని పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కొంత నీరు మిగిలి ఉందని, ఆ నీరు మంచినీటి పథకాలకు 15 రోజులకు మించి సరఫరా చేయలేమని వారు స్పష్టం చేశారు. క్యాచ్మెంట్ ఏరియాల్లో వర్షాలు కురవకపోతే రెండు వారాల తర్వాత తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు. వర్షాలు వస్తేనే నీరు: రవి, జీడీపీ ఏఈ వర్షాలు వస్తేనే ప్రాజెక్ట్‌లో నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నిల్వ ఉన్న నీరు 15 రోజుల వరకు మంచినీటి పథకాలకు సరఫరాచేయవచ్చు. వర్షాలు ఆలోగా కురవకపోతే నీటి సమస్య తీవ్రమవుతుంది. -
అడుగంటిన సుంకేసుల!
– ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితికి చేరడం మొదటి సారి - కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి – వచ్చే నెల 15 వరకు మాత్రమే నీరు సరిపోయే అవకాశం – ముచ్చుమర్రి నుంచి నీరు ఇవ్వడం సాధ్యమయ్యేనా? – జీడీపీ నీటిపై అశలు పెట్టుకున్న నగరపాలక సంస్థ ఓ వైపు కృష్ణా జలాలు అందించి కర్నూలు నగర ప్రజల తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించి ఆచరణలో పెట్టలేదు. మరోవైపు ఆధారమైన సుంకేసుల (కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజీ) డ్యాంలో నీరు అడుగంటింది. వేసవి ప్రారంభంకాక ముందే సుంకేసుల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడం డ్యాం నిర్మించినప్పటి నుంచి ఇదే మొదటిసారి. సత్వరం అధికారులు మేల్కోని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే గతేడాది కంటే ఎక్కువగా ఈసారి దాహం కేకలు వినిపించే పరిస్థితి ఉంది. కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గంతో పాటు కర్నూలు నగర వాసుల దాహం తీర్చేందుకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ నీరే ఆధారం ఈ బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఫిబ్రవరి నెల రెండో వారానికే అడుగంటి పోయి రాళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 130 క్యూసెక్కుల నీరు తాగు నీటి కోసం వదులుతున్నారు. మరో 50 క్యూసెక్కుల నీరు తెలంగాణ వైపు ఉన్న మోటార్ల ద్వారా ద్వారా తోడేస్తున్నారు. మరో 15 రోజులు ఉంటే డ్యాంలోని నీరంతా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార యాంత్రంగం చెబుతుంది. ఎస్‌ఎస్‌ట్యాంకులో అరకొర నీరే నిల్వ నగరంలో సుమారు 5లక్షల జనాభా ఉంది. రోజుకు ప్రతి ఒక్కరికి 155 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఇందులో ప్రస్తుతం సగం కూడా సరఫరా చేయడం లేదు. బ్యారేజీ నుంచి కేసీ ద్వారా నీటిని మునగలపాడు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేస్తారు. దీని సామర్థ్యం 154.308 ఎంసీటీఎఫ్. ప్రస్తుతం ఎస్.ఎస్ ట్యాంకులో 100 ఎంసీటీఎఫ్ నీరు కూడా నిల్వ లేదు. ఇందులో కొంత నీరు ఎండ తీవ్రతకు ఆవిరి అవుతుంది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే తాగునీటి కష్టాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలేవి? ఇటీవల ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కర్నూలు ప్రజల తాగు నీటి దాహం తీర్చవచ్చు. ఇదే విషయాన్ని పథకం ప్రారంభోత్సవ సమయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా నీటిని అందించాలంటే నగర మధ్యలో పోయే కేసీ కాలువను శుభ్రం చేయాలి. ఇందులోని చెత్తాచెదారాన్ని తొలగించిన తర్వాత నీటిని వదిలేందుకు అవకాశం ఉంది. అయితే, ఇంత వరకు దీనికి సంబంధించిన పని మొదలు పెట్టలేదు. ఇక నగర ప్రజల తాగు నీటి దాహాం తీర్చే మరో ప్రత్యామ్నయ మార్గం గాజులదిన్నె ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా కేసీకి మళ్లీంచాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా నేటికీ మొదలు కాకపోవడంతో వచ్చే వేసవిలో కోడుమూరు, కర్నూలు వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. -
ఈరన్నవాగు డెడ్‌స్టోరేజీ
జహీరాబాద్: మల్చల్మలోని ఈరన్న వాగు ప్రాజెక్టులోకి నీరు అంతగా చేరలేదు. దీని కింద 508 ఎకరాల ఆయకట్టు ఉంది. డెడ్‌స్టోరేజీ కారణంగా తూముల వద్దకు కూడా నీరు రాకపోవడంతో పొలాలకు అందని పరిస్థితి నెలకొంది. వర్షాధారంపైనే రైతులు మినుము, పెసర, కంది, సోయాబీన్ సాగు చేసుకున్నారు. గతంలో ఈ చెరువు కింద చెరకు, అల్లం, అరటి పంటలు సాగు చేసేవారు. వర్షాలు లేక చెరువులోకి నీరు రాక రైతులు బోర్లు, బావులు తవ్వుకుని పంటలు సాగు చేసుకుంటున్నారు. మిగతా రైతులు వర్షాధార పంటలు సాగు చేస్తున్నారు. చెరువుతో ఉపయోగం లేదు నాలుగేళ్లుగా చెరువులోకి నీరు రావడం లేదు. తగినన్ని వర్షాలు లేకపోవడమే కారణం. ప్రస్తుతం కొందరు రైతులు బోర్లు వేసుకుని సాగు చేసుకుంటున్నారు. నేను కూడా బోరు కిందే సాగు చేస్తున్నా. అనేక మంది రైతులు మినుము, పెసర, కంది, సోయాబీన్ పంటలు వేసుకున్నారు. ప్రస్తుతం చెరువులో నీరు డెడ్ స్టోరేజీ చేరుకుంది. - పి.మాణిక్‌రెడ్డి, రైతు, మల్చల్మ బోరు ఆధారంగానే సాగు బోరులో ఉన్న నీటి మేరకు చెరకు వేశా. మిగతా పొలాల్లో వర్షాధార పంటలు వేశా. గత నాలుగేళ్లుగా వర్షాభావం ఉంది. చెరువులోకి నీరు రావడం లేదు. చెరువు వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది. గతంలో ఈ చెరువు ఆయకట్టు మొత్తం సాగయ్యేది. చెరకు, పసుపు ఇతర వాణిజ్య పంటలు వేసుకునే వారం. ఇప్పుడు వర్షాధార పంటలతోనే సరిపెట్టుకుంటున్నాం. - హెచ్.నాగిరెడ్డి, రైతు, మల్చల్మ -
అడుగంటిన జలనిధి
కరుణించని వరుణుడు అందని కృష్ణా జలాలు ఆందోళన ఎడగారు రైతులు సోమశిల : జిల్లా జలనిధి సోమశిల జలాశయం రోజు రోజుకి అడుగంటుతోంది. జిల్లా రైతాంగానికి సాగునీరు అందించడంతో పాటు జిల్లా, తమిళనాడు ప్రజల దాహార్తిని తీర్చే జలాశయం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకుంది. వరుణుడు కరుణించకపోవడానికి తోడు రెండో పంటకు పెరిగిన ఆయకట్టుతో జలాశయంలోని నీరు ఆవిరై పోయింది. ఎడగారు పూర్తవక ముందే జలాశయం అడుగంటడంతో అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. వరుణుడి కరుణ కోసం ఎదురు చూస్తున్నారు. జిల్లా సాగునీటి సలహా మండలిలో తీసుకున్న నిర్ణయం మేరకు రెండో పంటకు పెన్నార్ డెల్టాలోని 1.76 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది. ఐఏబీ సమావేశ సమయంలో జలాశయంలో 27.322 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నది. రెండో పంటకు జలాశయం నుంచి 22 టీఎంసీలు ఇవ్వాలని తీర్మానించారు. జలాశయంలోని 18 టీఎంసీలు, ప్రధాన చెరువులైన కనిగిరి ,సర్వేపల్లి చెరువులలోని మరో 4 టీఎంసీలను రెండో పంటకు కేటాయించారు. రెండో పంట సాగు విస్తీర్ణం మరో 30 వేల ఎకరాలు పెరగడంతో పాటు వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో ఇటీవల జలాశయం నుంచి మరో 5 టీఎంసీలు నీరు ఇవ్వాలని తీర్మానించారు. రెండో పంటకు ఇప్పటి వరకు జలాశయం నుంచి 19.5 టీఎంసీల నీరు విడుదల చేశారు. సెప్టెంబర్ 15 వరకు రెండో పంటకు సాగునీరు అందించాల్సి ఉంది. ప్రస్తుతం జలాశయంలో 7.800 టీఎంసీల నీరు నిల్వ ఉంది. మరో 4 టీఎంసీలను ఎడగారుకు కేటాయిస్తే జలాశయంలో నీటి నిల్వ డెడ్ స్టోరేజ్ (7.567 టీఎంసీలు) కన్నా పడిపోతుంది. వర్షాలు పడుతాయనే ఆశతో అధికారులు ఎడగారు పంట ఎండకుండా నీరు విడుదల చేస్తున్నట్లు సమాచారం. వరుణుడు కరుణించకపోతే పరిస్థితి ఏమిటని రైతులు ఆందోళన చెందుతున్నారు. 22ఏళ్ల తరువాత డెడ్ స్టోరేజీ నుంచి నీరు విడుదల తీవ్ర వర్షాభావ పరిస్థితులతో 1994–95లో సోమశిల జలాశయం నుంచి జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు డెడ్‌స్టోరేజీ నుంచి నీటిని విడుదల చేశారు. అప్పట్టో జలాశయంలో నీటి నిల్వ 2.36 టీఎంసీలకు చేరుకుంది. ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది డెyŠ స్టోరేజీ నుంచి సాగుకు నీటిని విడుదల చేయాలని అధికారులు చూస్తున్నారు. వర్షాలు పడుతాయనే ఆశతో ఒక్క ఎకరా కూడా ఎండ కూడదని సాగునీటిని అందించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కృష్ణా వరద ప్రవాహం రాకుండా, వరుణుడు కరుణించకపోతే తాగు నీటి ఎద్దడి పరిస్థితి ఎండమావే. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం–దేశ్ నాయక్,ఈఈ,సోమశిల సోమశిల జలాశయం డెడ్‌స్టోరేజ్‌కు చేరుకున్న విషయాన్ని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం అందిస్తున్నాం. సెప్టంబర్లో కూడా సాగుకు నీరు అందించాల్సి ఉంది. కృష్ణా జలాలు, వర్షాలపై ఆశలు పెట్టుకుని సాగుకు నీటిని విడుదల చేస్తున్నాం. -
తుంగభద్ర జలాశయం ఖాళీ
బళ్లారి: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు జిల్లాలకు తాగు, సాగునీరందించే తుంగభద్ర జలాశయంలో నీటి నిల్వలు డెడ్ స్టోరేజీకి చేరుకున్నాయి. ప్రస్తుతం డ్యాంలో కేవలం 1.5 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. డ్యాంలోకి ఈ ఏడాది 80 టీఎంసీలకు మించి నీరు చేరలేదు. ప్రతి ఏటా డ్యాం ఆయకట్టు పరిధిలో ఖరీఫ్‌తో పాటు రబీలోనూ పంటలు పండించే వారు. కానీ ఈ ఏడాది ఒకే పంట పండించాల్సి వచ్చింది. -
అడియాశలు
► అన్ని జలాశయాలు ఖాళీ ఖాళీ...... అడుగంటుతున్న నీటిమట్టం ► జూన్ మొదటి వారానికి డెడ్‌స్టోరేజ్‌కు ► రెండో పంటకు నీళ్లివ్వక పోవడం వల్లే ఈ మాత్రమైనా నీరుంది ► మంత్రి ఎం.బి.పాటిల్ సాక్షి, బెంగళూరు: రాష్ట్రంలోని జలాశయాలన్నీ అడుగంటిపోతున్నాయి. రాష్ట్ర ప్రజలకు జీవజలాన్ని అందిస్తూ వచ్చిన ప్రముఖ జలాశయాల్లో సైతం నీటిమట్టం డెడ్‌స్టోరేజ్‌కు సమీపంలో ఉందంటే రాష్ట్రంలో పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. కాస్తంత పొదుపుగా వాడుకుంటే ఈ నీళ్లు జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చగలవని అధికారులు లెక్కలు వేస్తున్నారు. ఆ తరువాత మాత్రం డెడ్స్టోరేజ్లోని నీటిని సైతం తోడేసి శుద్ధి చేసి అందజేయాల్సిన పరిస్థితి ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడింది. అయితే జూన్ వరకు కూడా వర్షాలు లేకపోతే అప్పుడేం చేయాలన్న భయం ప్రభుత్వ యంత్రాంగాన్నీ, ప్రజలను కూడా వేధిస్తోంది. బెంగళూరుకు తాగునీటిని అందజేసే కేఆర్ఎస్ డ్యామ్‌లో నీటిమట్టం ఇప్పటికే డెడ్‌స్టోరేజ్ సమీపానికి చేరుకోవడంతో బెంగళూరు నగరంలో వారానికి రెండు సార్లు మాత్రమే నీటిని సరఫరా చేసే పరిస్థితి తలెత్తింది. రానున్న రోజుల్లో వారానికి ఒకేసారి నీటిని సరఫరా చేయాలని, తద్వారా కాస్తంత నీటిని పొదుపు చేయాలని ఇప్పటికే రాష్ట్ర నీటిపారుదల శాఖ ఉన్నత స్థాయి అధికారులు బెంగళూరు జలమండలి అధికారులను ఆదేశించారు. దీంతో బెంగళూరులోని ప్రజలు ప్రస్తుతం నీటి కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనక తప్పేలా లేదు. గురువారం నాటికి కేఆర్ఎస్ జలాశయంలో 10.92టీఎంసీల నీటిమట్టం నమోదైంది. ఇక ఇదే సందర్భంలో రాష్ట్రంలోని అన్ని జలాశయాల పరిస్థితి కూడా ఇదే విధంగా ఉంది. రాష్ట్రంలోని ప్రధాన జలాశయాలైన కబినిలో శుక్రవారం నాటికి 4.41టీఎంసీలు, ఆలమట్టిలో 13.61టీఎంసీలు, నారాయణ్‌పూర్‌లో 13.34టీఎంసీలు, హారంగిలో 1టీఎంసీల నీటిమట్టం నమోదైంది. నీటిని పొదుపుగా వాడుకోవాలి...... రాష్ట్రంలో పరిస్థితిని ముందుగానే ఊహించి నవంబర్‌లో రెండో పంటకు నీరివ్వబోమని ప్రకటించాము. రైతు సంఘాల నుండి విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ అప్పుడు ఆ నిర్ణయం తీసుకున్నందుకే ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు తాగునీటికి ఇబ్బంది లేకుండా చూడగలుగుతున్నాం. ప్రస్తుతం జలాశయాల్లో ఉన్న నీరు జూన్ మొదటి వారం వరకు రాష్ట్ర ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరిపోతుంది. అప్పటికీ వర్షాలు కురవకపోతే ఇక డెడ్‌స్టోరేజ్‌లో ఉన్న నీటిని సైతం శుద్ధి చేసి ప్రజలకు అందజేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ప్రజలు నీటిని చాలా పొదుపుగా వినియోగించుకోవాలని కోరుతున్నాం. లేదంటే కర్ణాటకలో సైతం రైళ్ల ద్వారా నీటిని అందజేయాల్సిన పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉంది. - ఎం.బి.పాటిల్, రాష్ట్ర భారీ, మధ్యతరహా నీటిపారుదల శాఖ మంత్రి -
ఇందూరు ప్రాజెక్టులు ‘డెడ్’
ఉత్తర తెలంగాణ వరప్రదాయిని శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ దుస్థితి ఇది! రెండేళ్లుగా వర్షాల్లేక, వరద లేక ఇలా పూర్తిగా అడుగంటిపోయింది. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి సామర్థ్యం 90 టీఎంసీలు. ఇప్పుడు 5.30 టీఎంసీల నీరు(డెడ్ స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్ట్ నుంచి గత ఖరీఫ్‌లో ఆయకట్ట్టుకు నీరివ్వలేదు. రబీలో అదే పరిస్థితి. కనీసం తాగు నీటి పథకాలకు కూడా నీరందే పరిస్థితి లేదు. ఈ ప్రాజెక్ట్ పూర్తిగా నిండితే తెలంగాణలోని 18.82 లక్షల ఎకరాల భూమి సస్యశ్యామలమవుతుంది. ఇప్పుడు ఈ 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం నెలకొంది. నిజామాబాద్‌లో 1,60,578, ఆదిలాబాద్‌లో 1,45,387, వరంగల్‌లో 4,71,478, కరీంనగర్లో 6,72,900, ఖమ్మంలో 1,28,914, నల్లగొండలో 2,87,508 ఎకరాలకు నీరందించే ఈ ప్రాజెక్టు వెలవెలబోతుండడంతో ఆయకట్టు ప్రశ్నార్థకంగా మారింది. అంతేకాదు.. నిజామాబాద్‌లో 19 ఎత్తిపోతలు, ఆదిలాబాద్ జిల్లాలో 19 ముంపు గ్రామాల ఎత్తిపోతలు ఉత్తిపోతలుగానే మిగిలాయి. నిజామాబాద్ జిల్లాలో కరువు విలయతాండవం చేస్తోంది. 38 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ఇందూరుపై కరువు గజ్జకట్టింది. ప్రధాన ప్రాజెక్టులన్నీ డెడ్‌స్టోరేజీకి చేరాయి. తీవ్ర దుర్భిక్ష పరిస్థితుల కారణంగా ఖరీఫ్‌లో నిండా మునిగిన రైతన్న రబీకి రాం..రాం.. చెప్పాడు. చాలాచోట్ల భూగర్భజల నీటి మట్టం 22.4 మీటర్లకు పడిపోయింది. మంజీర నది ఏడారిని తలపిస్తుంది. తెలంగాణ జిల్లాలకు సాగునీరు, తాగునీరు అందించే శ్రీరాంసాగర్ ఎండిపోయింది. గత 30 ఏళ్లలో ఎన్నడూ లేనివిధంగా నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం దారుణంగా పడిపోయింది. వ్యవసాయ బావులు, బోర్లు అడుగంటిపోవడంతో తాగునీటి ఎద్దడి రోజురోజుకు తీవ్రమవుతోంది. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం - గడ్డం రాజిరెడ్డి, సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ డెడ్‌స్టోరేజీకి శ్రీరాంసాగర్, నిజాంసాగర్.. ఎడారిగా మంజీర నది * వట్టిపోతున్న ఎత్తిపోతల పథకాలు * కరువు దెబ్బకు ఖరీఫ్, రబీలకు రైతులు దూరం * జిల్లాలో తాగునీటికి కటకట.. కబేళాకు చేరుతున్న పశువులు * దారుణంగా పడిపోయిన భూగర్భ జలాల నీటిమట్టం ఎడారిగా మంజీర.. కర్ణాటక ప్రాంతం నుంచి నిజామాబాద్ జిల్లాలోకి ప్రవహించే మంజీరా నది ఇలా ఎడారిని తలపిస్తోంది. జిల్లా రైతాంగానికి మంజీర, గోదావరి నదులే జీవనాధారం. రెంజల్ మండలం కందకుర్తి సమీపంలో హరిద్రా, గోదావరి నదులతో సంగమించి ప్రవహించే ఈ నది ద్వారా 58 టీఎంసీల నీరు లభ్యమవుతుంది. మంజీరా నది ఆధారంగా బుడ్మి, దామరంచ, హన్సా, కారేగావ్, కిష్టాపూర్, పోతంగల్, కుర్తి, పైడిమాల, సంగోజీపేట తదితర ఎత్తిపోతల పథకాలు ఉన్నాయి. ప్రస్తుతం ఇవన్నీ నీళ్లు లేక బోసిపోతున్నాయి. మంజీర పరిస్థితే ఇలా ఉండడంతో దీనిపై ఆధారపడి నిర్మించిన శ్రీరాంసాగర్, నిజాంసాగర్ ప్రాజెక్టుల పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. ఒక్కో మనిషికి 80 లీటర్లే.. శీతాకాలం ప్రారంభం నుంచే జిల్లాలోని పలు ప్రాంతాల్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. రిజర్వాయర్లు ఎండిపోవడం.. భూగర్భజలాలు అడుగంటి పోవడం జిల్లా ప్రజలకు శాపంగా మారింది. జిల్లాలో 718 గ్రామ పంచాయతీలు, మూడు మున్సిపాలిటీలు, నగర కార్పొరేషన్లు ఉన్నాయి. జిల్లాలో 6.25 లక్షల కుటుంబాలు ఉన్నాయి. ప్రతి రోజు వీరికి 38 కోట్ల లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఒక్క మనిషికి 146 లీటర్ల నీటిని అందించాలి. కానీ ప్రస్తుతం 80 నుంచి 85 లీటర్ల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ‘ఉపాధి’ అంతంతే.. ఉపాధి హామీ పథకం అమలు అంతంతే ఉంది. బోధన్, మోర్తాడ్ మండలాల్లో ‘సాక్షి’ జరిపిన క్షేత్రస్థాయి పరిశీలనలో ఉపాధి కూలీల్లో కొందరికే పని లభిస్తోందని తేలింది. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో 721గ్రామాలు, 1302 హ్యాబిటేషన్లలో 4,70,544 మందికి అధికారులు జాబ్‌కార్డులు మంజూరు చేశారు. అయితే గతవారం వరకు 604 గ్రామాలలో 1,65,961 మంది పనిచేయగా.. శుక్రవారం నాటికి వారి సంఖ్య ఒకేసారి 92,725 మందికి పడిపోయింది. కూలీలకు రూ.15.95 కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉంది. జిల్లాలో పట్టణ ప్రాంతాల్లో పరిస్థితి ఇదీ నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రధాన నీటి వనరులైన రఘునాథ, మంచిప్ప చెరువులు పూర్తిగా ఎండిపోయాయి. అలీసాగర్ నుంచి నిజాంసాగర్ నీటిని అందిస్తున్నారు. ప్రస్తుతం 11,500 అడుగుల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. ఈ నీరు వేగంగా తగ్గిపోతోంది. నీటి కోసం నిజామాబాద్ నగరంలో 3,600 బోర్లు వేశారు. నగర కార్పొరేషన్లో ప్రతి మనిషికి కనీసం 140 లీటర్ల నీరివ్వాలి. కానీ రోజు విడిచి రోజు 110 లీటర్ల నీరే ఇస్తున్నారు. బోధన్ పట్టణంలో 35 వార్డులు ఉన్నాయి. పట్టణానికి ప్రధానంగా నీటిని బెల్లాల్ చెరువు నుంచి నీటిని అందిస్తున్నారు. 10 వేల కుళాయిలు ఉన్నాయి. రోజుకు 10 ఎంఎల్డీలు అవసరం. కానీ చెరువులో నీరు అందుబాటులో లేకపోవడంతో రెండు రోజులకు ఒకసారి నీటిని అందిస్తున్నారు. ఆర్మూర్ పట్టణంలో 60 వేల జనాభా ఉంది. ఒక్కో వ్యక్తికి 135 లీటర్ల నీటి సరఫరా చేయాల్సి ఉండగా.. 58 లీటర్ల నీటిని సరఫరా చేస్తున్నారు. కామారెడ్డి పట్టణంలో రోజు విడిచి రోజు నీటిని అందిస్తున్నారు. ప్రతి మనిషికి 150 లీటర్ల నీటిని అందించాల్సి ఉండగా 120 లీటర్లు ఇస్తున్నారు. ఇక తండాల్లో నీటి కోసం కిలోమీటర్ల మేర వెళ్తున్నారు. వాగులోని చెలిమ నీటితో దాహం తీర్చుకుంటున్నారు. కబేళాలకు పశువులు.. జిల్లాలో గత ఆరునెలల కాలంలో ప్రధాన సంతలో వేల సంఖ్యలో పశువులు అమ్ముడుపోయాయి. కరువు, పశుగ్రాసం కొరత, నీళ్లు లేక రైతులు పశువులను అంగట్లో పెడుతున్నారు. కామారెడ్డి, సాటాపూర్, బాన్సువాడ, ఇందల్వాయి, బీబీపేట, పెద్దమల్లారెడ్డి, పిట్లం, నవీపేట్, నందిపేట్ తదితర సంతల్లో పశువులు అధికంగా అమ్ముడుపోయాయి. కామారెడ్డి మండలం నర్సన్నపల్లిలో గత నాలుగు నెలల్లో 500 వరకు పశువులను అమ్మేశారు. దోమకొండ మండలం మాందాపూర్‌లో ఒకప్పుడు 100 జతల ఎడ్లు ఉంటే ప్రస్తుతం 10 జతలు కూడా లేవని స్థానికులు చెప్తున్నారు. రెతులు అమ్మేసిన పశువుల్లో 90శాతం పశువులు కబేళాలకు తరలుతున్నాయి. గత ఐదు నెలల కాలంలో 50 వేలకుపైగా పశువుల అమ్మకాలు సాగినట్లు అంచనా. జిల్లాలో 8 లక్షల పశువులు, మరో 8 లక్షల వరకు గొర్రెలు, మేకలు ఉన్నాయి. వీటి గ్రాసానికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. పశువులకు గ్రాసం, నీటి వసతి కోసం రూ.58.15 కోట్ల సాయం కావాలని కేంద్ర కరువు బందానికి నివేదిక ఇచ్చారు. కానీ ఇప్పటికీ ఒక్కపైసా రాలేదు. రోజుకు 15 కోట్ల నీళ్ల వ్యాపారం నీటి సమస్య వ్యాపారులకు వరంగా మారింది. నిజామాబాద్ జిల్లాలో అధికారికంగా వాటర్ప్లాంట్ల నిర్వాహకులు ఒక్కో క్యాన్ (20లీటర్లు) ధర రూ.15ల నుంచి రూ.25లకు పెంచారు. నిజామాబాద్, కామారెడ్డి, బోధన్, ఆర్మూరు, ఎల్లారెడ్డి, బాన్సువాడ, బాల్కొండ నియోజకవర్గాలతో పాటు జిల్లా వ్యాప్తంగా నీళ్ల వ్యాపారం జోరుగా సాగుతోంది. సుమారుగా 380ల వరకు వాటర్ ప్లాంట్లు ఉన్నా... కేవలం ఐదింటికీ మాత్రమే భారత ప్రమాణాల సంస్థ (బీఎస్ఐ) అనుమతి ఉంది. మిగతా చోట్ల నాణ్యతా ప్రమాణాలను మచ్చుకైనా పాటించడం లేదు. అయినా రూ.కోట్లల్లో వ్యాపారం చేస్తున్నారు. రోజుకు రూ.15 కోట్ల వరకు వ్యాపారం జరుగుతున్నట్లు అధికారుల అంచనా. మినరల్ వాటర్ పేరిట జనరల్ వాటర్ సరఫరా చేస్తూ వినియోగదారులకు లేని రోగాలను అంటగడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. బీఎస్ఐ నిబంధనలను పాటించేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఖరీఫ్, రబీలకు రైతులు దూరం గడచిన ఖరీఫ్‌లో జిల్లాలో 4,18,100 హెక్టార్లలో పంటలు సాగు చేస్తారని అంచనా వేసిన అధికారులు అందుకు.. 1.40 లక్షల క్వింటాళ్ల సబ్సిడీ విత్తనాలు సరఫరా చేయాలని నిర్ణయించారు. అత్యధికంగా 1.50 లక్షల హెక్టార్లలో వరి, 1.50 లక్షల హెక్టార్లలో సోయా సాగు చేస్తారని భావించారు. 55,000 హెక్టార్లలో మొక్కజొన్న, 15,000 హెక్టార్లలో పత్తి సాగు అవుతుందని అంచనా వేశారు. అయితే వర్షాల్లేక రైతులు 53 శాతం సాగుతోనే సరిపెట్టారు. రబీ విషయానికొస్తే 2,03,900 హెక్టార్లలో వివిధ పంటలు వేస్తారని అంచనా వేయగా...81,768 హెక్టార్లలోనే పంటలు సాగయ్యాయి. సరిపడే నిధులున్నాయి జిల్లాలో తాగునీటి సమస్య తలెత్తకుండా మొదట్నుంచీ ముందుచూపుతో వ్యవహరిస్తున్నాం. ముందస్తుగా పం పిన ప్రతిపాదనల మేర కు ప్రభుత్వం కూడా సరిపడ నిధులు విడుదల చేసింది. తాగునీటి సమస్య ఉండే గ్రామాలను గు ర్తించి రైతుల నుంచి వ్యవసాయ బావులు, బోర్లు అద్దెకు తీసుకుని నీటి సరఫరా చేస్తున్నాం. మారుమూల గ్రామాలు, తండాలకు ట్యాంకర్ల ద్వారా నీరందిస్తున్నాం. ఇప్పటి వరకు జిల్లాలో సీఆర్ఎఫ్, నాన్ సీఆర్ఎఫ్ కింద వచ్చిన రూ.7 కోట్లు ఖర్చు చేశాం. ప్రభుత్వ ఆదేశాలు, ప్రజాప్రతిని ధుల సూచనల మేరకు కలెక్టర్ ఆధ్వర్యంలో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ నీటి సమస్యను పరిష్కరిస్తున్నాం. - ఎ.రవీందర్ రెడ్డి, జాయింట్ కలెక్టర్, నిజామాబాద్ మేత లేక పశువులను అమ్ముకుంటున్నారు పశువులకు మేత కరువైంది. పశు పోషణ భారంగా మారింది. అందుకే రైతులు పశులను పోషించలేక అమ్మేస్తున్నారు. గడ్డి విత్తనాల సరఫరా లేదు. పశువులను వ్యాపారులు తక్కువ ధరలకు కొంటున్నారు. పంటలు పండక ఇప్పటికే నష్టపోయిన రైతులు.. పశువులకు ధరలు పలకకపోవడంతో మరింత నష్టపోతున్నారు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి. - దుబాస్ రాములు, రైతు సంఘం నేత నీళ్లకు చాలా తఖీలీబు ఉన్నది మా వజ్జపల్లి తండాలో బోరు బావులు లేవు. ఉన్న ఒక్క చేతి పంపు ఎండిపోయింది. నీళ్ల ట్యాంకుకు నీళ్లు సరఫరా చేసే బోరు ఎత్తి పోయింది. తాగునీళ్లకు చాలా తఖీలీబు అయితుంది. ప్రైవేటు బోరులు కిరాయికి తీసుకున్నరు. కానీ అవి కూడ సన్నం అస్తున్నయి. ఇంకో బోరు వేస్తే బాగుంటది. - బూలీ బాయి, వజ్జపల్లి తండా, గాంధారి మండలం అడుగంటిన నిజాంసాగర్ నిజామాబాద్ జిల్లా కేంద్రానికి 110 కిలోమీటర్ల దూరంలో మంజీరా నదిపై నిర్మించిన నిజాంసాగర్ ప్రాజెక్టు ఇలా పూర్తిగా అడుగంటింది. ప్రాజెక్టు పరిధిలోని 2.53 లక్షల ఎకరాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. నిజామాబాద్ నగరంతో పాటు బోధన్ పట్టణం సహా 28 గ్రామాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందుతుంది. నిజాంసాగర్ సామర్థ్యం 58 టీఎంసీలు కాగా... ప్రస్తుతం 0.30 టీఎంసీల నీరు(డెడ్‌స్టోరేజీ) మాత్రమే ఉంది. ప్రాజెక్టులో నీరు మరో 15 రోజుల వరకే సరిపోతుంది. ఆ తర్వాత తాగునీటి కష్టాలు మరింత తీవ్రం కానున్నాయి. కామారెడ్డి డివిజన్లోని మాచారెడ్డి, భిక్కనూరు, దోమకొండ, కామారెడ్డి, తాడ్వాయి, గాంధారి, లింగంపేట, నాగిరెడ్డి పేట మండలాలు మినహా జిల్లాలోని అన్ని మండలాలకు ఈ ప్రాజెక్టు ద్వారా లబ్ధి చేకూరుతుంది. ప్రాజెక్టు కింద 283 ఉప కాలువల ద్వారా 1,771 కిలోమీటర్ల వరకు నీటి పంపిణీ ఉంటుంది. -
వాటర్ ‘ఎమర్జెన్సీ’!
► సిటీకి పొంచి ఉన్న మంచినీటి గండం ► తప్పని ఎమర్జెన్సీ పంపింగ్ ► రూ.7 కోట్లతో పుట్టంగండి వద్ద 10 అత్యవసర మోటార్ల ఏర్పాటు ► 270 ఎంజీడీల మేర పంపింగ్ సాక్షి, సిటీబ్యూరో: భానుడి భగభగలతో నగరానికి మంచినీటి గండం పొంచి ఉంది. ఎండలు ఇలాగే ఉండి, వరుణుడు కరుణించకపోతే మే చివరి నాటికి భాగ్య నగరానికి మంచినీటి సరఫరా కష్టమే అని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో నీటి సంక్షోభాన్ని అధిగమించేందుకు జలమండలి అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రేటర్ దాహార్తిని తీర్చేందుకు వరదాయినిలుగా మారిన కృష్ణా, గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు రంగం సిద్ధం చేస్తున్నారు. కృష్ణా మూడుదశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్లు, గోదావరి మొదటి దశ ద్వారా 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల తాగునీటిని తరలించేందుకు జలమండలి ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం రూ.7 కోట్లు ఖర్చు చేస్తున్నారు. అత్యవసర పంపింగ్ ఇలా... మహానగరానికి కృష్ణా మూడుదశల ద్వారా 270 మిలియన్ గ్యాలన్ల తాగునీటిని తరలించేందుకు అవసరమైన 10 భారీ మోటార్లను నాగార్జునసాగర్ జలాశయం ఒడ్డున ఉన్న పుట్టంగండి వద్ద ఏర్పాటు చేయనున్నారు. వీటి ఏర్పాటుకు రూ.7 కోట్లు వ్యయం చేయనున్నారు. నాగార్జున సాగర్ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 507.30 అడుగుల మేర నిల్వలున్నాయి. నీటిమట్టాలు 506 అడుగులకు పడిపోయిన పక్షంలో అత్యవసర పంపింగ్ మొదలు పెట్టనున్నారు. ఇందుకోసం మే నెల 20వ తేదీ నాటికే మోటార్ల ఏర్పాటు, ట్రయల్ రన్ ప్రక్రియ పూర్తిచేయనున్నారు. కాగా కృష్ణా, గోదావరి జలాల అత్యవసర పంపింగ్‌కు రాష్ట్ర ప్రభుత్వం విపత్తు సహాయనిధి కింద రూ.40 కోట్లు మంజూరు చేసిన విషయం విదితమే. గోదావరి నీళ్లకూ తప్పదు... కరీంనగర్ జిల్లా ఎల్లంపల్లి జలాశయం నుంచి నగరానికి తరలిస్తున్న 86 మిలియన్ గ్యాలన్ల గోదావరి జలాలకూ మే చివరి నుంచి అత్యవసర పంపింగ్ తప్పదని జలమండలి సంకేతాలిచ్చింది. ఇందుకోసం ఎల్లంపల్లి జలాశయం నుంచి గ్రావిటీ ద్వారా నీటిని సేకరించేందుకు అవసరమైన అప్రోచ్ చానల్(కాల్వ)ను తవ్వుతున్నామని జలమండలి వర్గాలు తెలిపాయి. మే చివరి నాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే గోదావరి జలాలకూ అత్యవసర పంపింగ్ తప్పకపోవచ్చని స్పష్టంచేశాయి. కృష్ణా, గోదావరిలే వరదాయినిలు.. మహానగర దాహార్తిని తీర్చినసింగూరు, మంజీరా జలాశయాలు వట్టిపోవడం, జంటజలాశయాలు హిమాయత్‌సాగర్, ఉస్మాన్సాగర్లు డెడ్‌స్టోరేజికి చేరుకున్న నేపథ్యంలో కృష్ణా, గోదావరి జలాలే సిటీజన్ల దాహార్తిని తీర్చే వరదాయినులుగా మారాయి. నిత్యం కృష్ణా మూడు దశల ద్వారా 270 ఎంజీడీలు, గోదావరి మొదటిదశ ద్వారా ఎల్లంపల్లి నుంచి 86 ఎంజీడీలు మొత్తంగా 356 ఎంజీడీల నీటిని సిటీకి తరలించి 8.74 లక్షల నల్లాలకు సరఫరా చేస్తున్నారు. మే చివరినాటికి తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొంటే నగర తాగునీటి సరఫరా విషయంలో సంక్షోభం తప్పదన్న సంకేతాలు వెలువడుతుండడం ఆందోళన కలిగిస్తోంది. యుద్ధప్రాతిపదికన పంపింగ్‌కు ఏర్పాట్లు కృష్ణా జలాల అత్యవసర పంపింగ్‌కు 10 మోటార్లను ఏర్పాటు చేయనున్నాం. ఈ మోటార్ల సామర్థ్యం 300 హెచ్‌పీ సామర్థ్యం ఉంటుంది. మోటార్ల ఏర్పాటు ప్రక్రియను ఇతర అధికారులతో కలిసి బుధవారం పరిశీలించాము. మే 20 వతేదీకల్లా మోటార్ల ఏర్పాటు,ట్రయల్న్ ్రపూర్తవుతుంది. నగర తాగునీటికి ఢోకా ఉండదని భావిస్తున్నాం. - విజయ్‌కుమార్‌రెడ్డి, జలమండలి ట్రాన్స్మిషన్ చీఫ్ జనరల్ మేనేజర్ -
డెడ్ స్టోరేజీ నీటిని తరలించడం దారుణం
నంద్యాలరూరల్ : రాయలసీమలో తీవ్ర కరువు నెలకొని తాగునీటి ఎద్దడి ఏర్పడి అల్లాడుతుంటే శ్రీశైలం జలాశయంలోని డెడ్ స్టోరేజీ నీటిని ప్రభుత్వం కృష్ణా, గుంటూరు జిల్లాలకు తరలించడం దారుణమని జాతీయ రైతు సంఘాల సమాఖ్య సెక్రటరీ జనరల్ బొజ్జా దశరథరామిరెడ్డి విమర్శించారు. నంద్యాల టెక్కె మార్కెట్ యార్డు ఆవరణంలో సిద్దేశ్వరం సాధన సమితి ఆధ్వర్యంలో సోమవారం నియోజకవర్గ స్థాయి రైతు ప్రతినిధుల విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. బొజ్జాదశరథరామిరెడ్డి మాట్లాడుతూ రాయలసీమవాసుల కష్టాలను గుర్తించి తక్షణమే తాగునీరు విడుదల చేయాలన్నారు. ప్రభుత్వ ఏకపక్ష ధోరణి వల్ల మరో ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం రాయలసీమలో రానుందని హెచ్చరించారు. జులై రెండో వారంలో కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి సుమారు 50వేల మందితో కలిసి ‘మనజలం, మనసిద్దేశ్వరం’ నినాదంతో ఉద్యమం చేపడుతున్నామని వెల్లడించారు. నంద్యాల మార్కెట్‌యార్డు చైర్మన్ సిద్ధం శివరాం, కుందూ నది పోరాట సమితి అధ్యక్షుడు కామిని వేణుగోపాల్‌రెడ్డి, జిల్లా వరి ఉత్పత్తి దారుల సంఘం కన్వీనర్ వైఎన్‌రెడ్డి, రాయలసీమ జలసాధన సమితి కన్వీనర్ ఏర్వ రామచంద్రారెడ్డి పాల్గొన్నారు. -
రాళ్లపాడు రగడ
► నీటి విడుదలలో గ్రామాల మధ్య వివాదం ► పంట చేతికొచ్చేనా... ► తాగునీటికీ కటకటే ► అధికారుల మధ్య సమన్వయ లోపం ఏళ్ల తర్వాత రాళ్లపాడుప్రాజెక్టు నిండినా ఆ ఆనందం రైతుల్లో లేకుండా పోయింది. అధికారుల నిర్లక్ష్యం కారణంగా అధికారిక ఆయకట్టు కన్నా ఎక్కువ ఎకరాల్లో పంట వేశారు. ఫలితంగా నీరు సరిపోక గ్రామాల మధ్య వివాదం నెలకొంది. ప్రాజెక్టు కింద వేలాది ఎకరాల్లో సాగు చేసిన పంటల పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. రాళ్లపాడు ప్రాజెక్టులో నీరు అడుగంటమే దీనికి కారణం. దీంతో ఎగువ, దిగువ ప్రాంతాల రైతుల మధ్య వివాదాలు తలెత్తు తున్నాయి. రైతుల వివాదాల కాస్త రెండు జిల్లాల మధ్య శాంతి భద్రతల సమస్యగా మారింది. సాక్షి ప్రతినిధి, ఒంగోలు/ కందుకూరు: రాళ్లపాడు ప్రాజెక్టులో ప్రస్తుతం 3.10 అడుగుల నీరు ఉంది. ప్రాజెక్టు పరిధిలో 20 వేల ఎకరాల వరకు వరి సాగు చేశారు. ఇప్పటికే సాగు చేసి దాదాపు రెండు నెలలకు పైగా అయింది. మరో నెల రోజుల వరకు నీరు ఇస్తేగానీ సరిపోయే పరిస్థితి లేదు. అయితే ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు ఒక్క తడికి అంటే 10 రోజులకు మాత్రమే సరిపోతుంది. దీంతో కాస్త ఆలస్యంగా కుడి కాల్వ పరిధిలో నాట్లు వేసిన నెల్లూరు జిల్లాకు చెందిన ఎగువ ప్రాంతాలైన సాయిపేట, ఇసుకపాలెం, మక్కినవారిపాలెం తదితర గ్రామాల రైతులు ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు తమకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే రెండు రోజులుగా మక్కినవారిపాలేనికి చెందిన రైతులు కాల్వకు అడ్డుకట్టలు, చిల్లకంప వేసి దిగువకు నీరు వెళ్లకుండా అడ్డుకుంటున్నారు. దీంతో రెండు జిల్లాలకు చెందిన పోలీస్, ప్రాజెక్టు అధికారులు రెండు రోజులుగా ప్రాజెక్టు వద్దే మకాం వేసి సమస్యను ఓ కొలిక్కి తీసుకొచ్చారు. అయినా ప్రస్తుతం ప్రాజెక్టు కింద సాగులో ఉన్న వరి పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది. పంట పొట్ట, వెన్నుతీసే దశలో ఉంది. మరికొంత పొలం ఇంకా ఇప్పుడిప్పుడే పొట్టదశకు వ స్తోంది. కనీసం మరో నెల 20 రోజులకు పైగా నీరు అవసరమవుతుందని రైతులు అంటున్నారు. కానీ ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీరు అప్పటి దాకా రాదు. దీంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోపక్క అధికారులు మాత్రం మరో 10 రోజుల పాటు నీరిస్తే కొంత మంది రైతులు గట్టెక్కుతారని, దిగువ ప్రాంతాల్లో ఉన్న బోర్ల ఆధారంగా ఆ ప్రాంతాలకు సమస్య లేకుండా చేస్తామని చెప్తున్నారు. చివరిలో ఒక్క తడి నీరు తగ్గినా దిగుబడిపై భారీగా ప్రభావం పడుతుందని రైతులు కలత చెందుతున్నారు. పంటను కాపాడుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు. ఎడమ కాల్వ నీరు నిల్.. కుడి కాల్వ కింద పరిస్థితి ఇలా ఉంటే ఎడమ కాల్వ కింద రైతుల స్థితి మరీ దయనీయంగా ఉంది. 1600 ఎకరాల వరకు ఎడమ కాల్వ కింద పంట ఉంది. అయితే ప్రాజెక్టులో నీరు డెడ్‌స్టోరేజ్‌కి చేరడంతో ప్రస్తుతం ఎడమ కాల్వకు నీరందడం లేదు. దీంతో గత 27వ తేదీ నుంచి పూర్తిగా నీరు నిలిచిపోయింది. మోటార్లు, ఆయిల్ఇంజన్లు ఏర్పాటు చేసి ఎడమ కాల్వకి నీరు సరఫరా చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు పంపారు. వాటికి అనుమతి రాలేదు. దీంతో ఎడమ కాల్వకి నీరు ఎలా ఇస్తారు అనేది ప్రశ్నార్థకంగా మారింది. గొంతెండాల్సిందేనా... ప్రాజెక్టులో ప్రస్తుతం 128 ఎంపీఎఫ్‌టీల నీరు ఉంది. 100 ఎంసీఎఫ్‌టీ వరకు నీటిని వినియోగించి చివరకు 28 ఎంసీఎఫ్‌టీ నీటిని వేసవి తాగునీటి అవసరాల కోసం వినియోగిస్తామని ప్రాజెక్టు అధికారులు పేర్కొంటున్నారు. కానీ ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు మాత్రం వేసవి తాగునీటికి తమకు 45 ఎంసీఎఫ్‌టీల నీరు అవసరమని చెబుతున్నారు. దీంతో ప్రాజెక్టుపై ఆధారపడి ఉన్న తాగునీటి పథకాలకు ఈ వేసవికి నీరు అందే పరిస్థితి లేదు. చుండి-చెర్లోపాలెం, రాళ్లపాడు-రోళ్లపాడు, గుడ్లూరు మంచినీటి పథకం వంటి భారీ పథకాలు ప్రాజెక్టుపైనే ఆధారపడి ఉన్నాయి. గుడ్లూరు పథకానికి సంబంధించి బావి ప్రాజెక్టు లోపలే ఉండడంతో దీనికి ఎలాగోలా నీరు అందుతుంది. ఇక మిగిలిన రెండు పథకాల పరిస్థితి ఏంటనేది ప్రశ్నార్థకం. ఈ రెండు పథకాలపై పూర్తిగా లింగసముద్రం, వలేటివారిపాలెం మండలాల్లోని గ్రామాలు ఉన్నాయి. ఈ గ్రామాలన్నిటికీ ఈ పథకాల నుంచే తాగునీరు అందుతుంది. ప్రాజెక్టులో ఉన్న నీరు పూర్తిగా వినియోగిస్తే ఇక ఈ గ్రామాల గొంతెండాల్సిందే. -
జూరాల.. విలవిల
పాలమూరు జిల్లాకు అతిపెద్ద ఆదరువు జూరాల జలాశయం అడుగంటిపోయింది. డెడ్‌స్టోరేజీ 4.8 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ఒక టీఎంసీ నీళ్లు మాత్రమే నిల్వఉన్నాయి. ఇప్పటికే గద్వాల, రామన్‌పాడు తాగునీటి పథకాలకు నీటి సరఫరాను పూర్తిగా నిలిపేశారు. -‘సాక్షి’, మహబూబ్‌నగర్ -
జల ‘సిరి’ ఆవిరి
సాక్షి, హైదరాబాద్/ మొయినాబాద్: మండుటెండల్లోనూ నిండు కుండల్లా పరవళ్లు తొక్కిన జంట జలాశయాలు ఆవిరైపోతున్నాయి. దశాబ్దాలుగా భాగ్యనగరి గొంతు తడుపుతున్న ఈ ‘సాగర్’లు నైబారి బీడు భూములుగా మారాయి. ఈ ఏడాది తీవ్ర వర్షాభావం... అంతకంతకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతల దెబ్బకు తల్లడిల్లి నీటి జాడలు అడుగంటుతున్నాయి. 1790 అడుగుల గరిష్ట మట్టం ఉన్న ఉస్మాన్‌సాగర్ ప్రస్తుతం 1753.880 అడుగుల డెడ్ స్టోరేజీకి చేరుకుంది. ఇక్కడి నుంచి రోజుకు 15 మిలియన్ గ్యాలన్లను నగర తాగునీటి అవసరాలకు తరలించే జలమండలి... జలాశయం వట్టిపోవడంతో నీరు తోడటం నిలిపివేసింది. ఇక హిమాయత్‌సాగర్ 1763.5 అడుగుల గరిష్ట మట్టం నుంచి 1,734.41 అడుగుల అట్టడుగు స్థాయికి పడిపోయింది. దీని నుంచి గతంలో 20 ఎంజీడీల నీటిని తోడే జలమండలి ప్రస్తుతం 4.400 ఎంజీడీలకే పరిమితం చేసుకోవాల్సి వచ్చింది. ఇవి కూడా మరో నెలకు మాత్రమే సరిపోతాయి. వీటి చుట్టూ వెలసిన ఫామ్‌హౌస్‌లు, రియల్ఎస్టేట్ వెంచర్లు, కళాశాలలు, ఇసుక తవ్వకాలతో ఈ జలాశయాలకు ఎగువ ప్రాంతం నుంచి వచ్చే వర్షపు నీటి దారులు క్రమంగా మూసుకుపోయి ఈ దుస్థితి తలెత్తింది. -
డెడ్‌స్టోరేజీ దిగువన సాగర్
నాగార్జునసాగర్(నల్గొండ): నాగార్జునసాగర్ జలాశయం మంగళవారం సాయంత్రానికి కనిష్ట నీటిమట్టానికన్నా దిగువకు వెళ్లింది. సాగర్ జలాశయం కనిష్ట నీటిమట్టం 510 అడుగులు. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 509.80 అడుగులకు వెళ్లింది. దీంతో హైదరాబాద్‌కు తాగు నీరందించడానికి ఏఎమ్మార్పీలో భాగమైన పుట్టంగండి వద్ద ఏర్పాటు చేసిన మోటార్లలో ఒకదానికి నీరందక నిలిపివేశారు. కేవలం ఒక మోటరు ద్వారానే నీటిని పంప్ చేస్తున్నారు. నేడోరేపో ఈ మోటారును కూడా నిలిపివేసే అవకాశం ఉంది. నిన్నటి వరకు శ్రీశైలం-సాగర్ జలాశయాల మధ్య ఉన్న కృష్ణా పరీవాహక ప్రాంతాల్లో కురిసిన చిన్నపాటి జల్లులకు సాగిన వాగులు, వంపుల ద్వారా వచ్చి చేరిన నీటితో వారం రోజులు నెట్టుకువచ్చారు. ఇక వరదనీరు పూర్తిగా తగ్గడంతో సాగర్ జలాశయంలో నీరు తగ్గుతోంది. శ్రీశైలం జలాశయం ప్రస్తుత నీటిమట్టం 802.70 అడుగులుంది. ఇది 30.3577 టీఎంసీలతో సమానం. -
డెడ్‌స్టోరేజీకి నాగార్జునసాగర్
నేటి సాయంత్రానికి అడుగంటనున్న జలాశయం శ్రీశైలం నీరు రాకపోతే జంట నగరాలకు తాగునీటి కటకట ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్న రైతన్న నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం శుక్రవారం సాయంత్రానికి డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. గురువారం సాయంత్రానికి 510.10 అడుగులు (131.8394 టీఎంసీలు) తగ్గింది. జలాశయం కనీష్ట నీటిమట్టం 500.00 అడుగులు (130.8394 టీఎంసీలు) ఉంటుంది. కేవలం టీఎంసీ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఏఎమ్మార్పీ మోటార్ల ద్వారా రోజుకు 1,350 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారు. కానీ, ఎగువన ఉన్న జలాశయాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. గతంలో జూలైలోనే వరదలు వచ్చి జలాశయాల్లోకి నీరు చేరేది. కానీ, నేడు ఆ పరిస్థితులు కానరావడం లేదు. శ్రీశైలం జలాశయమూ గతంలో ఎన్నడూ లేనంతగా అడుగంటింది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 802.90 అడుగులు (30.4423 టీఎంసీలు). అయినప్పటికీ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తేనే నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని గ్రామాలకు, పలు జిల్లాల్లోని ఫ్లోరిన్ పీడిత గ్రామాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందే పరిస్థితి ఉంది. గతేడాది ఇదే రోజున సాగర్ జలాశయంనీటిమట్టం 527.00 అడుగులు ఉండగా, 162 టీఎంసీలనీరు నిలువఉంది. పైనుంచి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఆగస్టు 6వ తేదీన కాల్వలకు నీటిని విడుదల చేయగా సెప్టెంబర్ 4న సాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లు 26 ఎత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. కానీ, నేడు ఆ నదులన్నీ నీరులేక నీరసించాయి. అతిపెద్ద వర్షాలు కురిస్తే తప్ప ఇప్పట్లో నాగార్జునసాగర్ జలాశయం నిండేలా లేదని రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం నేటికీ ఏనిర్ణయం తీసుకోక పోవడంతో క్రాప్ హాలిడే ప్రకటిస్తారా లేదా నీరు వస్తే ఆలస్యంగానైనా విడుదల చేస్తారా అనేది రైతుల ముందున్న లక్ష డాలర్ల ప్రశ్న. ఖరీప్‌కు క్రాప్ హాలిడే ప్రకటించి జలాశయాల్లోకి నీరు వస్తే ముందస్తుగా రబీకి నీటిని విడుదల చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తలతో యోచిస్తున్నట్లు సమాచారం. 2001 నుంచి నీటిని విడుదల చేసిన సమయంలో జలాశయంలో ఉన్న నీటినిల్వలు ఆయానెలల్లో విడుదల చేసిన తేదీలను పరిశీలిస్తే సాగర్ జలాశయంలో నీరు లేనప్పటికీ శ్రీశైలం జలాశయంలో నీరుండటంతో ఎగువనుంచి వచ్చే వరదను బట్టి కాల్వలకు నీటిని విడుదల చేశారు. -
డెడ్ స్టోరేజికి మరో 5అడుగులు
మాచర్లటౌన్ : నాగార్జునసాగర్ జలాశయ నీటిమట్టం రోజురోజుకి తగ్గిపోతోంది. రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో లేకపోయినా రైతుల ప్రయోజనాల దృష్ట్యా అధికారులు కుడి, ఎడమ కాలువలకు నీటి విడుదల కొనసాగిస్తూనే ఉన్నారు. దీంతో జలాశయ నీటి మట్టం 515 అడుగులకు పడిపోయింది. మరో ఐదు అడుగులు తగ్గితే (510 అడుగులు) డెడ్ స్టోరేజి స్థాయికి చేరుకుంటుంది. ప్రతిరోజు సాగర్ ఎడమ కాలువకు ఎనిమిది వేల క్యూసెక్కులు, కుడికాలువకు ఐదు వేల క్యూసెక్కులు, నల్గొండ జిల్లాలోని ఎస్ఎల్బీసీకి 1350 క్యూసెక్కుల నీటిని వినియోగిస్తున్నారు. దీంతో రోజుకి 15వేల నుంచి 20 వేల క్యూసెక్కుల నీటిని అవుట్ ఫ్లోగా విడుదల చేయాల్సి వస్తోంది. శ్రీశైలం జలాశయం నీటి మట్టం శనివారానికి 832.20 అడుగులకు చేరుకోవటంతో అక్కడి నుంచి నామమాత్రంగా 4348 టీఎంసీల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో 832 అడుగుల వద్ద కనిష్ఠ స్థాయిలో నీటిని నిల్వ ఉంచాలని నిబంధన ఉంది. ఈ ప్రకారం ఇక శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేసే అవకాశంలేదు. రోజుకు అరడుగు తగ్గుముఖం.. నాగార్జునసాగర్ జలాశయంలో ప్రతిరోజు అరడుగు నీరు తగ్గిపోతోంది. ఇదే పరిస్థితి కొనసాగితే మరో వారంరోజుల్లో సాగర్ డెడ్ స్టోరేజికి చేరుకునే అవకాశం ఉంది. సాగర్ రిజర్వాయర్ నుంచి కుడికాలువకు ఈనెల 25వ తేదీ వరకే నీటిని విడుదల చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతుండగా నెలాఖరు వరకు నీటిని కేటాయించాలని రైతులు కోరుతున్నారు. తెలంగాణ ప్రాంతానికి రోజు 10 వేల క్యూసెక్కులకు పైగా నీటిని ఉపయోగిస్తూ కుడికాలువకు అందులో సగభాగం నీటిని వినియోగించుకుంటున్నారు. ఇలాంటి స్థితిలో సాగర్ రిజర్వాయర్ డెడ్ స్టోరేజికి చేరుకుంటే నీరివ్వలేమని తెలంగాణ ప్రభుత్వం చేతులెత్తే అవకాశాలు ఉండటంతో నీటి విడుదల ఎప్పటి వరకు ఉంటుందనే విషయంపై రైతుల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
‘పేట’కు మురుగునీరేనా?
సూర్యాపేట : పేటవాసులకు తాగునీటి కష్టాలు తప్పేలాలేవు. ప్రతి ఏడాది వేసవిలో ఉండే ఇబ్బందులు ఈ సారి మాత్రం ముందే మొదలయాయ్యి. నీటి శుద్ధికోసం ఏటా రూ. 30లక్షలు చేస్తున్నట్లు మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం అధికారుల లెక్కలు చూపుతున్నా ఎలాంటి ఫలితం కనిపించడంలేదు. మూసీలో నీటిమట్టం డెడ్‌స్టోరేజీకి చేరడం.. నిత్యం చేపలవేట కొనసాగించడంతో నీరంతా మురికిగా మారుతోంది. ఈ నీటిలో దుర్వాసన వస్తోంది. దీనిని తాగడం మాట అటుంచితే కనీసం ఇతరఅవసరాలకు కూడా వినియోగించే పరిస్థితిలేదు. ప్రజలకు పరిశుద్ధమైన జలాలు అందిస్తామని అధికారులు, ప్రజాప్రతిని ధులు ఎన్నికల సమయంలో చేస్తున్న హామీలు నీటిమూటలుగా మిగిలిపోతున్నాయి. దీంతో పేట వాసులకు తాగునీటి తిప్పలు మొదలయ్యాయి. పట్టణంలో 1.05 లక్షల జనాభా ఉన్నట్లు అధికారికలెక్కలు చూపుతున్నాయి. అదనంగా మరో 50 వేల మంది వ్యాపార, వాణిజ్యాల కోసం వస్తున్నారు. పట్టణంలోని 17 వార్డులకు మూసీ నీరు, 17 వార్డులకు సాగర్ జలాలు అందిస్తున్నారు. ఒక్కొక్కరికి 165 లీటర్ల నీరు అవసరం కాగా వీరందరికీ ప్రతిరోజూ 23 ఎమ్ఎల్డీల నీరు అవసరం ఉంటుంది. కానీ మూసీ నుంచి 13.13 ఎమ్‌ఎల్‌డీలు సరఫరా కావాల్సి ఉండగా కేవలం 09.01 ఎమ్‌ఎల్‌డీలు, సాగర్ కెనాల్ నుంచి 10.15 సరఫరా కావాల్సి ఉండగా కేవలం 05.41 ఎమ్ఎల్డీల నీరు మాత్రమే సరఫరా అవుతోంది. అది కూడా మూడు రోజులకోసారి మాత్రమే నీటి సరఫరా చేస్తున్నారు. ఈయేడు వర్షాలు సరిగా కురవకపోవడంతో ఎగువప్రాంతం నుంచి నీరు మూసీ రిజర్వాయర్‌లోకి ఎక్కువగా చేరలేదు. మూసీలో గరిష్ట నీటిమట్టం 645అడుగులు కాగా ప్రస్తుతం 607అడుగుల నీటిమట్టం మాత్రమే ఉంది. ఇటీవల ఎంతోకాలం నుంచి మరమ్మతులకు నోచుకోని షటర్లను మరమ్మతు చేసేందుకు నీటిని విడుదల చేశారు. నవంబర్ నుంచి జూన్ 15 వరకు షటర్ల మరమ్మతులు పూర్తిచేయనున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. 610 అడుగుల మేరకు నీటిస్థాయి తగ్గితేనే షటర్లు మరమ్మతులు చేసేందుకు అవకాశం ఉన్నందు వల్ల అప్పటి దాకా నీటిని విడుదల చేశారు. డెడ్ స్టోరేజీ అంటే 605 అడుగులు మాత్రమే. 605 అడుగులకు నీటి మట్టం చేరితే దుర్గంధంతో కంపు కొట్టే నీరు మాత్రమే సరఫరా అవుతోంది. 590 అడుగుల దాకా పేట వాసులకు నీటి సరఫరా చేయవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. కానీ ప్రస్తుతం దుర్వాసనతో కూడిన నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కనీసం అవి నిత్యవసరాలకు వినియోగించే పరిస్థితి లేదని వాపోతున్నారు. మరో నాలుగు నెలలకు పైగా గడిస్తేగానీ వర్షాలు కురిసే అవకాశం లేదని పేట ప్రజలు తెలిపారు. ఇప్పటికే మూడురోజులకోసారి సరఫరా చేసే నీటిని వారం రోజులకు కూడా పెంచే అవకాశమున్నట్లు ఆందోళన చెందుతున్నారు. లక్షలు వ్యయం.. ఫలితం శూన్యం మున్సిపల్ తాగునీటి సరఫరా విభాగం నీటిశుద్ధి చేసేందుకు గాను ఏటా ఆళం కోసం రూ. 10లక్షలు, క్లోరిన్ గ్యాస్ కోసం రూ. 20లక్షలకుపైగా ఖర్చు చేస్తున్నట్లు లెక్కలు చూపుతున్నారు. కానీ ఎలాంటి ప్రయోజం చేకూరడంలేదు. పట్టణ ప్రజలకు మాత్రం మురుగునీరే సరఫరా చేస్తున్నారు. సాగర్ కెనాల్ ద్వారా.. ఇక సాగర్ కెనాల్ ద్వారా ఏటా మార్చి 15 వరకు నీరు విడుదల చేస్తుండడంతో ఆ నీటిని పట్టణానికి సరఫరా చేస్తారు. సాగర్ కెనాల్ బంద్అయిన అనంతరం అనాజిపురం గాండ్ల చెరువును నింపుతారు. ఆ రిజర్వాయర్ నుంచి 45 రోజులు పట్టణానికి నీరు సరఫరా అవుతుంది. అంటే మే చివరి నాటికి కృష్ణా జలాలు 15 వార్డులకు సరఫరా అవుతాయి. జూన్ మొదటి వారంలో వర్షాలు పడితేనే దోసపహాడ్ నుంచి పట్టణానికి నీటి సరఫరా అవుతుంది. లేకపోతే పట్టణానికి నీటి సరఫరా బంద్. మూసీ రిజర్వాయర్ నింపేందుకు ప్రత్యామ్నాయం లేదా? కాగా వర్షాలు సరిగా కురవకపోవడం.. షటర్ల మరమ్మతుల పేరిట నెల,రెండు నెలల పాటు నీరు విడుదల చేయడంతో డెడ్ స్టోరేజీకి చేరుకోనున్న మూసీ రిజర్వాయర్‌ను నింపేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు లేవనే అధికారులు చెబుతున్నారు. కేవలం ఎగువ ప్రాంతంలో వర్షాలు కురిస్తే తప్ప రిజర్వాయర్ నిండే అవకాశాలు లేవు. సాగర్ కెనాల్ నుంచే రప్పించేందుకు ఏర్పాట్లు.. స్థానిక ఎమ్మెల్యే, రాష్ర్ట మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి చొరవ తీసుకొని పేట వాసులకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సాగర్ కెనాల్‌ను మార్చి 15 తర్వాత కూడా బంద్ చేయకుండా పట్టణానికి నీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఇప్పటికే అనాజిపురం గాండ్ల చెరువు రిజర్వాయర్ నిండి ఉండడంతో పాటు కెనాల్ కూడా వేసవిలో బంద్ కాకుండా వస్తే పట్టణ ప్రజలకు నీటినందింవచ్చని భావిస్తున్నారు. మూసీ నుంచి బంద్ అయితే పట్టణమంతా దోసపహాడ్ నీటి సరఫరా.. మూసీ నుంచి వచ్చే నీరు మరోనెల రోజుల పాటు సరిపోతుందని, ఆ తర్వాత ఇప్పటికే 17 వార్డులకు సరఫరా చేస్తున్న దోసపహాడ్ నీటిని పట్టణానికంతటికీ సరఫరా చేసేందుకు ఇప్పటికే పొట్టిశ్రీరాములు సెంటర్ వద్ద కనెక్షన్ ఇచ్చినట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఏది ఏమైనప్పటికీ సాగర్ కెనాల్ నుంచి నిరవధికంగా వేసవి అంతా నీరు విడుదలైతేనే పేట వాసులకు నీటి గండం తప్పేట్లు లేదు. మరమ్మతులకు నోచని చేతిపంపులు... పట్టణంలో సుమారు 479చేతిపంపులు ఉండగా సగానికిపైగా నిర్వహణలోపంతో పనిచేయడం లేదు. అధికారులు తాగునీటి సమస్యనుంచి గట్టెక్కించేందుకు వాటిని రిపేర్ చేయించేదిపోయి ఫ్లోరిన్ ఎక్కువగా ఉందనే సాకుతో వాటిని వదిలేశారు. వాటి మరమ్మతుల కోసం వచ్చిన డబ్బులు మాత్రం అధికారుల జేబుల్లోకి వెళ్లాయన్న ఆరోపణలున్నాయి. ముక్కుపిండి నల్లాబిల్లుల వసూలు నీటి సరఫరాలో శ్రద్ధచూపని అధికార యంత్రాంగం నల్లాబిల్లులు మాత్రం ముక్కుపండి వసూలు చేస్తున్నట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టణంలో అధికారికంగా 14వేల నీటి కనెక్షన్లు ఉన్నాయి. ఇటీవల రూ. 200 ఓ కనెక్షన్ ఇవ్వడంతో అదనంగా మరో 500 కనెక్షన్లు పెరిగాయి. అయినప్పటికీ అధికారులు నీటి సరఫరాలో మాత్రం శ్రద్ధ చూపడం లేదు. పట్టణంలోని 7వేల కనెక్షన్ నంబర్ల వరకు బీపీఎల్ వినియోగదారులకు ప్రతి కనెక్షన్‌కు రూ. 80చొప్పున నల్లాబిల్లు వసూలు చేస్తున్నారు. ఇటీవల కొత్తగా నిర్మించిన గృహ యజమానుల నుంచి రూ. 100 వసూలు చేస్తున్నారు. ఇందిరమ్మ కాలనీలో సుమారు 3వేల మంది వద్ద నుంచి రూ. 80చొప్పున నల్లాబిల్లు తీసుకుంటున్నారు. మూసీలో చేపల వేట.. మూసీ ప్రాజెక్టులో కొంతకాలంగా చేపల వేట కొనసాగిస్తున్నారు. దీంతో మూసీలో తక్కువ నీరు ఉండడం.. మత్స్యకారులు వలలతో చేపలు పడుతుండడంతో నీరు బురదమయంగా మారింది. అదే నీరు సూర్యాపేట పట్టణానికి సరఫరా అవుతోంది. దీంతో బురదనీటితోనే సరిపెట్టుకోవాల్సివస్తోంది. తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం - వెంకటేశ్వరరావు, మున్సిపల్ డీఈ తాగునీటికి ఇబ్బంది లేకుండా చూస్తాం. మూసీ గేట్ల మరమ్మతు కోసం నీటిని విడుదల చేశారు. ఫిల్టర్ చేసి సరఫరా చేస్తున్నాం. రెండు ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తున్నాం. -
రబీ రందీ..
ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాభావంతో జిల్లాలోని జలాశయాలు అడుగంటాయి. గతేడాది ఇదే సమయానికి నిండుకుండలను తలపించిన ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరువలో ఉన్నాయి. కాలువ మట్టానికి కూడా నీళ్లు లేక ఆయకట్టుకు నీళ్లంద ని పరిస్థితి నెలకొంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురువలేదు. రబీలో ప్రాజెక్టుల కింద సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులు ఆందోళకు గురవుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లా సాధారణ వర్షపాతం 1088.6 మిల్లీ మీటర్లు కాగా కేవలం 734.9 మిల్లీ మీటర్ల వర్షపాతం మాత్రమే నమోదైంది. దీంతో ఈ ఏడాది -33 శాతం వర్షాభావ పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ పంటల పరంగా ప్రధానంగా పత్తి, సోయా, వరి దిగుబడులు అమాంతంగా పడిపోయి రైతన్నలు తీవ్ర దిగాలులో ఉన్నారు. నిరాశే.. గతేడాది భారీ వర్షాలతో లక్షల క్యూసెక్కుల నీటిని ప్రా జెక్టు గేట్లు ఎత్తి దిగువకు వదిలారు. ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా ఉంది. సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా ఎస్సారెస్పీ, కడెం, స్వర్ణ నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీరాంసాగర్ నుంచి సరస్వతీ కాలువ కింద నిర్మల్, లక్ష్మణచాంద, మామడ, ఖానాపూర్‌లో సుమారు 35 వేల ఆయకట్టు ఉంది. రబీలో సరస్వతీ ఆయకట్టుకు నీరందించలేమని అధికారులు స్పష్టం చేస్తున్నారు. స్వర్ణ కింద సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో 8,945 ఎకరాల ఆయకట్టు ఉంది. రబీలో స్వర్ణ నుంచి నీళ్లందించడం సాధ్యం కాద ని తేల్చిచెపుతున్నారు. కడెం ప్రాజెక్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లో 68,158 ఎకరాల ఆ యకట్టు ఉంది. ప్రధానంగా వరి సాగు చేస్తారు. ఈ ఏడాది కడెంలో నీటి సామర్థ్యం ఆందోళన కలిగిస్తోంది. సాగునీరు అందేది కష్టంగా నే కనిపిస్తోంది. సాత్నాల కింద జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లోని 24 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. ఖరీఫ్‌లో 14 వేల ఎకరాల వరకు నీరందుతుంది. టేల్ ఎండ్ వరకు నీరందని పరిస్థితి ఉంది. కేవలం ఖరీఫ్ పంటలకు మాత్రమే సాత్నాల సాగు నీరందిస్తుంది. రబీ పంటలు అంతంత మాత్రంగానే ఉండడంతో సాత్నాల నుంచి నీటి విడుదల లేదు. మత్తడివాగు కింద తాంసి, తలమడుగులోని 8,500 ఎకరాల ఆయకట్టుకు ఖరీఫ్‌లో మాత్రమే నీరందుతుంది. -
డెడ్ స్టోరేజీ
ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాభావ పరిస్థితులతో జిల్లాలోని జలాశయాలు అడుగంటాయి. గతేడాది ఇదే సమయానికి నిండుకుండలను తలపించిన ప్రాజెక్టులు ప్రస్తుతం డెడ్‌స్టోరేజీకి చేరుకున్నాయి. కాలువ మట్టానికి కూడా నీళ్లు లేక ఆయకట్టుకు నీళ్లందని పరిస్థితి నెలకొంది. భారీ వర్షాలు పడితేనే ప్రాజెక్టులు జలకళ సంతరించుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది ఎల్‌నినో ప్రభావంతో భారీ వర్షాలు పడే అవకాశాలు లేవని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొనడంతో ప్రాజెక్టుల కింద సాగు చేస్తున్న రైతులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్టుబడులు కూడా రావని ఆవేదన చెందుతున్నారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు జిల్లాలో సాధారణ వర్షపాతం 173 మిల్లీమీటర్లు కాగా కేవలం 70మిల్లీమీటర్ల వర్షపాతం మా త్రమే నమోదైంది. వర్షపాతం చూస్తే కరువు కోరలను తలపిస్తోంది. ఇప్పటికే విత్తనాలు మొలకెత్తక రూ.కోట్ల నష్టాన్ని రైతులు చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఆశ.. నిరాశ.. గతేడాది భారీవర్షాల కారణంగా ప్రాజెక్టులకు వరద పోటెత్తింది. లక్షల క్యూసెక్కుల నీటిని ప్రాజెక్టు గేట్లు ఎత్తి దిగువనకు వదిలారు. ఈ ఏడాది జిల్లాలోని జలాశయాల పరిస్థితి భిన్నంగా ఉంది. ఈ ఏడాది సాధారణ వర్షపాతం కూడా నమోదు కాకపోవడంతో ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రధానంగా కడెం, స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, వట్టివాగు, గడ్డెన్నవాగు, ఎన్టీఆర్సాగర్, గొల్లవాగుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. గతేడాది కంటే ఈ ఏడాది ఇదే సమయానికి శ్రీరాంసాగర్, కొమురం భీమ్ ప్రాజెక్టుల్లో నీటిమట్టాలు, నీటి సామర్థ్యం అధికంగా ఉంది. శ్రీరాంసాగర్‌లో గతేడాది ఇదే సమయానికి 10 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఈసారి 24 టీఎంసీలు ఉన్నాయి. కొమురం భీమ్ ప్రాజెక్టుకు గతేడాది ఇదే సమయానికి 4.9 టీఎంసీల నీటి సామర్థ్యం ఉండగా ఈసారి 5 టిఎంసీల నీటి సామార్థ్యం ఉంది. వట్టివాగులో గతేడాది ఇదే సమయానికి 1.378 టీఎంసీల నీళ్లు ఉండగా ఈ ఏడాది 1.608 టీఎంసీల నీళ్లు ఉన్నాయి. మిగతా ప్రాజెక్టుల్లో భారీ వర్షాలు కురిసి జలాశయాలు నిండితేనే ఆయకట్టుకు నీరందుతుంది. అడుగంటిన ఆశలు స్వర్ణ, సాత్నాల, మత్తడివాగు, కడెం, ఎన్టీఆర్సాగర్, గొల్లవాగు ప్రాజెక్టులు డెడ్ స్టోరేజీలో ఉన్నాయి. స్వర్ణ కింద సారంగాపూర్, నిర్మల్ మండలాల్లో 8,945 ఎకరాల ఆయకట్టు ఉంది. తడిపంటలకు నీరందాలంటే ఈ ప్రాజెక్టు నిండాల్సిందే. సాత్నాల కింద జైనథ్, బేల, ఆదిలాబాద్ మండలాల్లోని 24 వేల ఎకరాల ఆయకట్టుకు నీరందాల్సి ఉన్నా డెడ్ స్టోరేజీ కారణంగా పరిస్థితి ఆందోళనకరంగా కనిపిస్తుంది. పత్తి, సోయ పంటలు అధికంగా పండించే ఈ ఆయకట్టు రైతులు వర్షాన్ని నమ్ముకొని సాగు చేస్తున్నారు. ఇటు వర్షాలు లేకపోవడం, అటు ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ఆవేదన చెందుతున్నారు. కడెం ప్రాజెక్టు కింద జన్నారం, కడెం, లక్సెట్టిపేట, దండేపల్లి, మంచిర్యాల మండలాల్లో 68,158 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రధానంగా వరి సాగు చేస్తారు. దాదాపు డెడ్స్టోరేజీకు చేరువలో ఉన్న ఈ ప్రాజెక్టు పరిస్థితి రైతులను ఆవేదనకు గురిచేస్తుంది. మత్తడివాగు డెడ్‌స్టోరేజీ నేపథ్యంలో తాంసి, తలమడుగులోని 8,500 ఎకరాల ఆయకట్టు రైతుల్లో దుర్భిక్ష పరిస్థితి ఉంది. గొల్లవాగు, ఎన్టీఆర్ సాగర్‌లది ఇదే పరిస్థితి.