డెడ్‌స్టోరేజికి చేరుకున్న మైలవరం జలాశయం
వైఎస్‌ఆర్ జిల్లా , జమ్మలమడుగు : మైలవరం జలాశయం డేడ్‌స్టోరేజీకి చేరువైంది. ఆరు టీఎంసీల వరకు నీరు నిల్వ ఉండడంతో బోటింగ్ ఏర్పాటు చేశారు. అయితే సరైన వర్షాలు లేక పంటలు ఎండిదశకు చేరడంతో ఉత్తర దక్షిణ కాలువల ద్వారా నీటిని అందించారు. అంతేకాకుండా ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, ఎర్రగుంట్ల మున్సిపాలిటీలకు తాగునీటి అవసరాలను తీర్చేందుకు పెన్నానదిలోకి రెండు టీఎంసీల నీటిని వదిలారు. అయితే ప్రొద్దుటూరుకు నీరు రాకపోవడంతో అదనంగా మరో టీఎంసీ నీటిని వదిలారు. దీంతో జలాశయంలో నీరు డెడ్ స్టోరేజీకి చేరుకుంటోంది. ప్రస్తుతం జలాశయంలో 0.696 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. డెట్ స్టోరేజీ 0.585 టీఎంసీలు. డెట్ స్టోరేజి కంటే 111 క్యూసెక్కుల నీరు ఎక్కువగా ఉంది.
తప్పని తిప్పలు
జలాశయంలో బోటింగ్ చేయడానికి నీరు పుష్కలంగా లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. గతేడాది నుంచి స్పీడ్ బోటింగ్‌తోపాటు షికారు బోటింగ్‌ను ఏర్పాటు చేశారు. కనీసం ఐదు నిమిషాల పాటు పర్యాటకులకు బోటింగ్ షికారు చేయిస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలో నీరు డెడ్‌స్టోరేజికి చేరుతుండడంతో ఎక్కువ దూరం బోటింగ్ చేయలేకపోతున్నామంటూ పర్యాటకులు వాపోతున్నారు.
రెండు టీఎంసీలు ఉంటేనే..
మైలవరం జలాశయంలో కనీసం రెండు టీఎంసీల నీరు ఉంటే బోటింగ్‌తోపాటు, పర్యాటకులకు మంచి ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. డెట్‌స్టోరేజీకి చేరుకుంటున్న మైలవరం జలాశయంలోనికి గండికోటలో ఉన్న నీటిలో నుంచి కనీసం ఒక టీఎంసీ నీటిని విడుదల చేస్తే బోటింగ్‌కు ఇబ్బందిలేకపోవడంతోపాటు, వచ్చిన పర్యాటకులకు నీరు కనువిందు చేస్తుంది.
అభివృద్ధి చేయాలి
మైలవరం జలాశయంలో ఏర్పాటు చేసిన బోటింగ్ మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉంది. పిల్లల ఆనందానికి అవదుల్లేవు. ఆదివారం విద్యార్థులకు సెలవు దినం కావడంతో గండికోట ఉత్సవాలకు అధిక సంఖ్యలో వచ్చారు. బోటు షికారుకు వెళ్లారు. అయితే అభివృద్ధి చేయాల్సి ఉంది. ఎక్కువగా ముళ్లపొదలు, రాళ్లు ఉన్నాయి. – చంద్రిక, పర్యాటకురాలు, ప్రొద్దుటూరు
పెన్నాలోయలోకి తిప్పాలి...
గండికోట ప్రాజెక్టునుంచి మైలవరం జలాశయంలోకి వచ్చె పెన్నానదిలోయలోకి బోటింగ్ షికారు పొడగించాలి. ప్రస్తుతం జలాశయంలో నీరు తక్కువగా ఉండడంతో మైలవరం వైపు మాత్రమే తిప్పుతున్నారు. భవిష్యత్తులో అయినా పెన్నానదిలోయలోకి బోటింగ్ తిప్పేలా చర్యలు తీసుకోవాలి. – నాగేంద్రుడు, జమ్మలమడుగు
Comments
Please login to add a commentAdd a comment