- నేటి సాయంత్రానికి అడుగంటనున్న జలాశయం
- శ్రీశైలం నీరు రాకపోతే జంట నగరాలకు తాగునీటి కటకట
- ఖరీఫ్‌పై ఆశలు వదులుకున్న రైతన్న
నాగార్జునసాగర్: నాగార్జునసాగర్ జలాశయం శుక్రవారం సాయంత్రానికి డెడ్ స్టోరేజీకి చేరుకోనుంది. గురువారం సాయంత్రానికి 510.10 అడుగులు (131.8394 టీఎంసీలు) తగ్గింది. జలాశయం కనీష్ట నీటిమట్టం 500.00 అడుగులు (130.8394 టీఎంసీలు) ఉంటుంది. కేవలం టీఎంసీ మాత్రమే ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఏఎమ్మార్పీ మోటార్ల ద్వారా రోజుకు 1,350 క్యూసెక్కుల నీటిని తోడుతున్నారు. కానీ, ఎగువన ఉన్న జలాశయాలన్నీ ఖాళీగానే ఉన్నాయి. గతంలో జూలైలోనే వరదలు వచ్చి జలాశయాల్లోకి నీరు చేరేది. కానీ, నేడు ఆ పరిస్థితులు కానరావడం లేదు. శ్రీశైలం జలాశయమూ గతంలో ఎన్నడూ లేనంతగా అడుగంటింది. ప్రస్తుతం జలాశయం నీటిమట్టం 802.90 అడుగులు (30.4423 టీఎంసీలు). అయినప్పటికీ శ్రీశైలం జలాశయం నుంచి నీటిని విడుదల చేస్తేనే నాగార్జునసాగర్ ఆయకట్టు పరిధిలోని గ్రామాలకు, పలు జిల్లాల్లోని ఫ్లోరిన్ పీడిత గ్రామాలు, హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు తాగునీరందే పరిస్థితి ఉంది.
గతేడాది ఇదే రోజున సాగర్ జలాశయంనీటిమట్టం 527.00 అడుగులు ఉండగా, 162 టీఎంసీలనీరు నిలువఉంది. పైనుంచి వరద ప్రభావం తీవ్రంగా ఉంది. ఆగస్టు 6వ తేదీన కాల్వలకు నీటిని విడుదల చేయగా సెప్టెంబర్ 4న సాగర్ ప్రాజెక్టు రేడియల్ క్రస్ట్‌గేట్లు 26 ఎత్తి దిగువ కృష్ణానదిలోకి నీటిని విడుదల చేశారు. కానీ, నేడు ఆ నదులన్నీ నీరులేక నీరసించాయి. అతిపెద్ద వర్షాలు కురిస్తే తప్ప ఇప్పట్లో నాగార్జునసాగర్ జలాశయం నిండేలా లేదని రైతులు అయోమయంలో పడ్డారు. ప్రభుత్వం నేటికీ ఏనిర్ణయం తీసుకోక పోవడంతో క్రాప్ హాలిడే ప్రకటిస్తారా లేదా నీరు వస్తే ఆలస్యంగానైనా విడుదల చేస్తారా అనేది రైతుల ముందున్న లక్ష డాలర్ల ప్రశ్న. ఖరీప్‌కు క్రాప్ హాలిడే ప్రకటించి జలాశయాల్లోకి నీరు వస్తే ముందస్తుగా రబీకి నీటిని విడుదల చేస్తే ఎలా ఉంటుందని ప్రభుత్వం వ్యవసాయ శాస్త్రవేత్తలతో యోచిస్తున్నట్లు సమాచారం. 2001 నుంచి నీటిని విడుదల చేసిన సమయంలో జలాశయంలో ఉన్న నీటినిల్వలు ఆయానెలల్లో విడుదల చేసిన తేదీలను పరిశీలిస్తే సాగర్ జలాశయంలో నీరు లేనప్పటికీ శ్రీశైలం జలాశయంలో నీరుండటంతో ఎగువనుంచి వచ్చే వరదను బట్టి కాల్వలకు నీటిని విడుదల చేశారు.