అడుగంటిన సుంకేసుల!
అడుగంటిన సుంకేసుల!
Published Sun, Feb 12 2017 11:17 PM | Last Updated on Wed, Aug 29 2018 9:29 PM
– ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితికి చేరడం మొదటి సారి
- కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి
– వచ్చే నెల 15 వరకు మాత్రమే నీరు సరిపోయే అవకాశం
– ముచ్చుమర్రి నుంచి నీరు ఇవ్వడం సాధ్యమయ్యేనా?
– జీడీపీ నీటిపై అశలు పెట్టుకున్న నగరపాలక సంస్థ
ఓ వైపు కృష్ణా జలాలు అందించి కర్నూలు నగర ప్రజల తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించి ఆచరణలో పెట్టలేదు. మరోవైపు ఆధారమైన సుంకేసుల (కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజీ) డ్యాంలో నీరు అడుగంటింది. వేసవి ప్రారంభంకాక ముందే సుంకేసుల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడం డ్యాం నిర్మించినప్పటి నుంచి ఇదే మొదటిసారి. సత్వరం అధికారులు మేల్కోని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే గతేడాది కంటే ఎక్కువగా ఈసారి దాహం కేకలు వినిపించే పరిస్థితి ఉంది.
కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గంతో పాటు కర్నూలు నగర వాసుల దాహం తీర్చేందుకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ నీరే ఆధారం ఈ బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఫిబ్రవరి నెల రెండో వారానికే అడుగంటి పోయి రాళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 130 క్యూసెక్కుల నీరు తాగు నీటి కోసం వదులుతున్నారు. మరో 50 క్యూసెక్కుల నీరు తెలంగాణ వైపు ఉన్న మోటార్ల ద్వారా ద్వారా తోడేస్తున్నారు. మరో 15 రోజులు ఉంటే డ్యాంలోని నీరంతా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార యాంత్రంగం చెబుతుంది.
ఎస్‌ఎస్‌ట్యాంకులో అరకొర నీరే నిల్వ
నగరంలో సుమారు 5లక్షల జనాభా ఉంది. రోజుకు ప్రతి ఒక్కరికి 155 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఇందులో ప్రస్తుతం సగం కూడా సరఫరా చేయడం లేదు. బ్యారేజీ నుంచి కేసీ ద్వారా నీటిని మునగలపాడు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేస్తారు. దీని సామర్థ్యం 154.308 ఎంసీటీఎఫ్. ప్రస్తుతం ఎస్.ఎస్ ట్యాంకులో 100 ఎంసీటీఎఫ్ నీరు కూడా నిల్వ లేదు. ఇందులో కొంత నీరు ఎండ తీవ్రతకు ఆవిరి అవుతుంది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే తాగునీటి కష్టాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి.
ప్రత్యామ్నాయ చర్యలేవి?
ఇటీవల ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కర్నూలు ప్రజల తాగు నీటి దాహం తీర్చవచ్చు. ఇదే విషయాన్ని పథకం ప్రారంభోత్సవ సమయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా నీటిని అందించాలంటే నగర మధ్యలో పోయే కేసీ కాలువను శుభ్రం చేయాలి. ఇందులోని చెత్తాచెదారాన్ని తొలగించిన తర్వాత నీటిని వదిలేందుకు అవకాశం ఉంది. అయితే, ఇంత వరకు దీనికి సంబంధించిన పని మొదలు పెట్టలేదు. ఇక నగర ప్రజల తాగు నీటి దాహాం తీర్చే మరో ప్రత్యామ్నయ మార్గం గాజులదిన్నె ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా కేసీకి మళ్లీంచాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా నేటికీ మొదలు కాకపోవడంతో వచ్చే వేసవిలో కోడుమూరు, కర్నూలు వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు.
Advertisement
Advertisement