sunkesula
-
కోట్ల బ్యారేజి గేట్లకు మరమ్మతులు
కర్నూలు(సిటీ) : మండల పరిధిలోని సుంకేసుల వద్ద తుంగభద్రనదిపై నిర్మించిన కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజి గేట్ల మరమ్మతులు సోమవారం ప్రారంభమయ్యాయి. క్రస్ట్ గేట్లకు రంగులు వేయడం, రోప్స్, రబ్బర్ సీల్స్, వాక్ వే నిర్మాణం తదితర వాటి కోసం నీరు-చెట్టు కింద రూ.8 కోట్లతో టెండర్లు పిలువగా స్వప్న కన్స్ట్రక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పనులను దక్కించుకుంది. ఇటీవలే ఏజెన్సీతో కేసీ కాలువ ఇంజనీర్లు అగ్రిమెంట్ చేసుకున్నారు. ఈ మేరకు సోమవారం బ్యారేజికి రంగులు వేసే పనులను డీఈఈ జవహర్‌రెడ్డి, ఏఈఈ శ్రీనివాసరెడ్డి పూజ చేసి ప్రారంభించారు. -
కోట్ల బ్యారేజీకి రూ.8.8 కోట్లు
- గేట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు - నీరు-చెట్టు కింద నిధులు మంజూరు - గేట్లకు రంగు, రోప్‌లు, రబ్బర్‌సీళ్లు, వాక్‌వే పనులకు ప్రాధాన్యం - 6 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (సుంకేసుల) బ్యారేజ్‌కి 2009 వరదలు చేసిన గాయానికి చికిత్స మొదలైంది. కర్నూలు-కడప కాల్వ సాగునీటి సరఫరాకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ రిజర్వాయర్ వరదల కారణంగా ఛిద్రమై ఎనిమిదేళ్లుగా ఉండి లేనట్టుగా మారింది. ఎట్టకేలకు నీరు-చెట్టు కింద నిధులు మంజూరు కావడంతో అధికారులు టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. కర్నూలు సిటీ: తుంగభద్ర నదికి 2009లో వచ్చిన భారీ వరద కారణంగా చిద్రమైన కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ గేట్ల మరమ్మతులపై ఎనిమిదేళ్ల తర్వాత జిల్లా అధికార యాంత్రాంగంలో కదలిక వచ్చింది. దెబ్బతిన్న బ్యారేజీ గేట్లను ఏటా సీజన్‌కు ముందు, తరువాత మెకానికల్ ఇంజినీర్లు పరిశీలించి నివేదికలు ఇవ్వడం తప్ప ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఇటీవలే బ్యారేజీని పరిశీలించి నీరు-చెట్టు కింద రూ. 8.8 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు కేసీసీ కర్నూలు డివిజన్ ఇంజినీర్లు రెండు రోజుల క్రితం టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్లో నిబంధన పెట్టారు. కడప, కర్నూలు జిల్లాల సాగు నీటి రంగంలో కేసీ కాలువది కీలకపాత్ర. ఈ డ్యాం నుంచి వచ్చే నీటితోనే కాల్వ కింద 2.65 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే వరదల్లో డ్యాం గేట్లు డెబ్బతినడంతో ఆ పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడంతో గేట్లు తుప్పు పట్టి, రోప్‌లు, రబ్బరు సీళ్లు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు పెరిగిపోయాయి. బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇప్పటికే రీజినల్ వర్క్‌షాపు అండ్ నిర్వహణ విభాగం ఇంజినీర్లు హెచ్చరించారు. ఏటా గేట్ల పరిస్థితిని పరిశీలించి నివేదిక అందిస్తూనే ఉన్నారు. రూ. 8.8కోట్లతో బ్యారేజీకి మరమ్మత్తులు...! సుంకేసుల బ్యారేజీకి స్పిల్‌వేలో 30 రేడియల్ క్రస్ట్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్, స్కవర్ వెంట్‌కు 4 ప్రకారం వర్టికల్ గేట్లున్నాయి. 2009లో బ్యారేజీకి వరద పోటెత్తడంతో గేట్లు దెబ్బతిన్నాయి. నాటి నుంచి ఆ గేట్లను ఎవరూ పట్టించుకోలేదు. వాక్‌వే కొట్టుకుపోవడంతో గేట్ల ఆర్మ్స్‌కు గ్రీజ్ కూడా వేయడంలేదు. రబ్బల్ సీల్స్ మార్చకపోవడంతో లీకేజీలు పెరిగిపోయాయి. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన 2 స్టాప్‌లాక్ గేట్లలో ఒకటి 30 గేటుకే ఫిక్స్ చేశారు. ఉన్న ఒక్కటి తుప్పుపట్టి సక్రమంగా పని చేయడం లేదు. గేట్లన్నింటికీ 2004 తరువాత పెయింటింగ్ కూడా చేయలేదు. నిపుణులు హెచ్చరిస్తున్నా.. బ్యారేజీ గేట్ల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ రెండు సార్లు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. ఇంజనీరింగ్ అధికారులు సైతం బ్యారేజీలో నీటి నిల్వలున్నాయంటూ మరమ్మతుల విషయంలో తప్పించుకునే ధోరణితో వ్యవహారించారు. అయితే ఈ ఏడాది రెండు నెలల క్రితమే పూర్తిగా అంటుగంటిపోవడంతో పనులు చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవలే కలెక్టర్ బ్యారేజీని పరిశీలించి గేట్లకు నీరు-చెట్టు పథకం కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధుల మంజూరుకు అనుమతి రావడంతో టెండర్లు పిలిచారు. మంజూరైన నిధులతో గేట్లు, వాక్‌వే, రోప్‌లు, స్టాక్లాక్ గేట్ మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తారు. మరో రూ. 18 లక్షలతో రబ్బరు సీళ్లు, ఇతర పనులు చేస్తారు. టెండర్లు పిలుస్తున్నాం - ఎస్.చంద్రశేఖర్‌రావు, జల వనరుల శాఖ ఎస్ఈ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజీ(సుంకేసుల) గేట్ల మరమ్మతులు, పెయింటింగ్ కోసం రూ. 8.8 కోట్లతో అంచనాలు రూపొందించాం. టెండర్లు పిలుస్తున్నాం. గేట్ల రోప్‌లు, రబ్బరు సీళ్లు, వాక్‌వేతో పాటు ఇతర చిన్న చిన్న రిపేర్లు చేయనున్నాం. ఇందుకు కలెక్టర్ నీరు-చెట్టు పథకం కింద అనుమతులు ఇచ్చారు. -
సుంకేసుల డెడ్‌స్టోరేజీ!
ఈ దాహం తీరనిది.. - 19 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి - పూర్తిగా అడుగంటిన జలాశయం - గూడూరు నగర పంచాయతీలోనూ నీటి ఇక్కట్లే - ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న అధికారులు కర్నూలు(అర్బన్): కర్నూలు, కల్లూరు, గూడూరు మండలాల్లోని దాదాపు 19 గ్రామాలకు నీరందిస్తున్న సుంకేసుల వాటర్ స్కీం చేతులెత్తేసింది. సుంకేసుల జలాశయం ద్వారా ఈ గ్రామాలకు కనీసం వారానికి రెండు సార్లు అయినా ఇప్పటి దాకా నీరందించారు. జలాశయంలో కనీస నీటి మట్టం 1.2 టీఎంసీలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో 0.02 టీఎంసీకి పడిపోయింది. ప్రస్తుత వేసవిలో డెడ్ స్టోరేజీ కంటే దిగువకు నీరు ఇంకిపోవడంతో జలాశయంలో బురద తేలింది. మే 28, 2016 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్‌ఫ్లో జలాశయంలోకి రాకపోవడంతో 20 ఏళ్ల నాడు ఏర్పడిన నీటి కరువు ఈ ఏడాది ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు 70వేల జనాభా ఉన్న ఈ గ్రామాలకు రోజుకు ఒక మనిషికి 40 లీటర్ల ప్రకారం అనుకున్నా 2.8 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, తుంగభద్ర డ్యాం నుంచి ముందుగానే ఎక్కువ నీటిని నిల్వ చేసుకోకపోవడం వల్ల ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న బోర్లలో ఉప్పు నీరు వస్తుండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను తెలియజేసేందుకు ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ఆర్డబ్ల్యూఎస్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు. గొంతెండిన గ్రామాలు సుంకేసుల, రేమట, ఆర్.కొంతలపాడు, ఆర్కే దుద్యాల, తులశాపురం, బసవాపురం, ఆర్.కానాపురం, గుడిపాడు, పర్ల, ఎ.గోకులపాడు, సల్కాపురం, నెరవాడ, గూడురు నగర పంచాయతీ, మునగాల, మల్లాపురం, జూలేకల్లు, పొన్నకల్లు, కె.నాగలాపురం, పెంచికలపాడు, చనుగొండ్ల గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి. గూడురు నగర పంచాయతీకి తప్పని తిప్పలు సుంకేసుల నీటి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు 20 రోజులుగా బంద్ కావడంతో దాదాపు 25వేల జనాభా ఉన్న గూడూరు నగర పంచాయతీలో తాగునీటి తిప్పలు అధికమయ్యాయి. బోర్ల ద్వారా వారానికి రెండు సార్లు అందిస్తున్న నీరు ఉప్పుగా ఉన్న కారణంగా మెజారిటీ ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. నగర పంచాయతీ హోదా కలిగిన గూడురుకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందింస్తాం సుంకేసుల జలాశయంలో నీరు పూర్తిగా ఎండిపోవడం వల్ల ఈ పథకం కింద ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాం. గ్రామాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లోని రైతుల బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందిస్తున్నాం. అలాగే చేతి పంపులకు మోటార్లు ఫిట్ చేసి నీటి ట్యాంకులకు ఉన్న ౖపైప్‌లైన్ వరకు కొత్త పైప్లైన్లు వేసి నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నాం. నదీ పరీవాహక గ్రామాల్లో రింగుబావుల ద్వారా నీటిని పంపింగ్ చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపుతున్నాం. - కె.మురళీధర్‌రావు, ఆర్డబ్ల్యూఎస్ డీఈఈ, కర్నూలు -
కేసీకి 41 క్యూసెక్కుల నీరు విడుదల
సుంకేసుల(గూడూరు రూరల్): సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు శనివారం 41 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి తెలిపారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను జిల్లా అధికారుల ఆదేశాల మేరకు కేసీ కెనాల్ ద్వారా 41 క్యూసెక్కుల నీటిని సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు వదిలామనా్నరు. ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.235 టీఎంసీ నీరు మాత్రమే నిల్వ ఉందని ఆయన తెలిపారు. -
నీటి ముళ్లు!
కర్నూలుకు తప్పని మంచినీటి ఇక్కట్లు – నెల రోజులకు మించి నీరులేని దుస్థితి – ఎస్ఎస్ ట్యాంకులో నిలవని నీరు – ముచ్చుమర్రి నుంచి ముందుకు సాగని నీటి తరలింపు – గాజులదిన్నె ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొట్టాల్సిందే.. సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరానికి మంచినీటి సమస్య పొంచి ఉంది. 30 రోజులకు మించి నీరు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ఒకవైపు ఎస్ఎస్ ట్యాంకులో నీరు నిలబడని పరిస్థితి కాగా.. మరోవైపు సుంకేసులలో 20 నుంచి 25 రోజులకు మించి నీటి లభ్యత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్నూలు నగరానికి తీవ్ర మంచి నీటి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే రోజు వారీగా 75వేల మిలియన్ లీటర్ల నీటిని కార్పొరేషన్‌లోని జనాభాకు సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం చేస్తోంది 65 మిలియన్ లీటర్లు మాత్రమే. ప్రభుత్వం నుంచి ముందుచూపు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. హంద్రీనీవా ద్వారా పందికోన చెరువును నింపి.. అక్కడి నుంచి గాజులదిన్నెకు నీటిని తరలించి నిల్వ చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ముచ్చుమర్రి ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని తరలించి కూడా సమస్య ఉత్పన్నం కాకుండా చూసే అవకాశం ఉండేది. అయితే, ఈ రెండింటిలో ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో ఎండాకాలంలో మంచినీళ్ల కోసం కర్నూలు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గాజులదిన్నె ఆయకట్టు రైతుల నోట్లో మట్టి కొట్టి కర్నూలుకు నీటిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఎండిపోయిన సుంకేసుల వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్‌కు మంచినీటి అవసరాలు తీర్చేది సుంకేసుల మాత్రమే. అయితే, ప్రస్తుతం సుంకేసుల ఎడారిని తలపిస్తోంది. రిజర్వాయర్‌లో కేవలం 0.28 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు కర్నూలు కార్పొరేషన్‌లోని ప్రజల నీటి అవసరాలను 20 నుంచి 25 రోజులు మాత్రమే తీర్చగలవు. మరోవైపు పురాతన కట్టడమైన ఎస్ఎస్ ట్యాంకులో సగం నీరు కూడా నిలబడటం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న నీరు వారం నుంచి పది రోజుల వరకు మాత్రమే సరిపోతుందని అధికారుల అంచనా. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు నెలకు మించి వచ్చే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ కంటే ముందు కర్నూలు ప్రజలు దాహార్తిని ఎదుర్కోవాల్సి రానుంది. ఈ దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి. ఇలా చేసి ఉండాల్సింది! వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్ నీటి అవసరాలు సుంకేసుల నుంచి తీర్చలేమని ముందుగానే ప్రభుత్వానికి తెలుసు. ఈ నేపథ్యంలో హంద్రీనీవా నుంచి పందికోనకు నీరు ఇచ్చి.. అక్కడి నుంచి గాజులదిన్నెకు తరలించి నిల్వ చేసుకుని ఉండాల్సింది. తద్వారా గాజులదిన్నె నుంచి కర్నూలు కార్పొరేషన్‌కు నీటిని తరలించినా.. ఆక్కడి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఉండేవి కావు. ప్రభుత్వం మాత్రం ఈ పనిచేయలేదు. అంతేకాకుండా హంద్రీనీవా ద్వారా కర్నూలు జిల్లాకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించారు. గత రెండునెలల కాలంలో కర్నూలు జిల్లాకు కేవలం 3 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వగా.. మిగిలిన ప్రాంతాలకు ఏకంగా 43 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలించారు. మరోవైపు గాజలదిన్నె ఆయకట్టు రైతాంగానికి ఇప్పటి వరకు రెండు తడులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం ఆయకట్టు రైతాంగం ఆందోళనతో మూడో తడి నీరు ఇస్తున్నారు. నాలుగోతడి నీరు ఇస్తేనే 7వేల ఎకరాల ఆయకట్టు నిలబడుతుంది. అయితే, ప్రభుత్వం మాత్రం నాలుగోతడి ఇవ్వలేమని ఆయా గ్రామాల్లో చాటింపు వేసి మరీ చెబుతోంది. అంటే గాజలదిన్నె ఆయకట్టు రైతాంగం నోట్లో మట్టి కొట్టి.. ఆ నీటిని కర్నూలుకు తరలించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముందుచూపు లేని తన చేతగాని తనానికి రైతాంగాన్ని బలిపశువు చేయాలని చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. -
అడుగంటిన సుంకేసుల!
– ఫిబ్రవరిలోనే ఈ పరిస్థితికి చేరడం మొదటి సారి - కర్నూలు నగరానికి పొంచి ఉన్న తాగునీటి ఎద్దడి – వచ్చే నెల 15 వరకు మాత్రమే నీరు సరిపోయే అవకాశం – ముచ్చుమర్రి నుంచి నీరు ఇవ్వడం సాధ్యమయ్యేనా? – జీడీపీ నీటిపై అశలు పెట్టుకున్న నగరపాలక సంస్థ ఓ వైపు కృష్ణా జలాలు అందించి కర్నూలు నగర ప్రజల తాగు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ముఖ్యమంత్రి, మంత్రులు, స్థానిక ప్రజాప్రతినిధులు ప్రకటించి ఆచరణలో పెట్టలేదు. మరోవైపు ఆధారమైన సుంకేసుల (కోట్ల విజయభాస్కర్‌రెడ్డి బ్యారేజీ) డ్యాంలో నీరు అడుగంటింది. వేసవి ప్రారంభంకాక ముందే సుంకేసుల డెడ్‌స్టోరేజీకి చేరుకోవడం డ్యాం నిర్మించినప్పటి నుంచి ఇదే మొదటిసారి. సత్వరం అధికారులు మేల్కోని ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టకపోతే గతేడాది కంటే ఎక్కువగా ఈసారి దాహం కేకలు వినిపించే పరిస్థితి ఉంది. కర్నూలు సిటీ: కోడుమూరు నియోజకవర్గంతో పాటు కర్నూలు నగర వాసుల దాహం తీర్చేందుకు కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ నీరే ఆధారం ఈ బ్యారేజీ సామర్థ్యం 1.2 టీఎంసీలు. తుంగభద్ర నది పరివాహక ప్రాంతాల్లో నెలకొన్న వర్షాభావ పరిస్థితులతో ఫిబ్రవరి నెల రెండో వారానికే అడుగంటి పోయి రాళ్లు దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం బ్యారేజీ నుంచి 130 క్యూసెక్కుల నీరు తాగు నీటి కోసం వదులుతున్నారు. మరో 50 క్యూసెక్కుల నీరు తెలంగాణ వైపు ఉన్న మోటార్ల ద్వారా ద్వారా తోడేస్తున్నారు. మరో 15 రోజులు ఉంటే డ్యాంలోని నీరంతా ఖాళీ అయ్యే అవకాశం ఉన్నట్లు అధికార యాంత్రంగం చెబుతుంది. ఎస్‌ఎస్‌ట్యాంకులో అరకొర నీరే నిల్వ నగరంలో సుమారు 5లక్షల జనాభా ఉంది. రోజుకు ప్రతి ఒక్కరికి 155 లీటర్ల నీటిని సరఫరా చేయాలి. కానీ ఇందులో ప్రస్తుతం సగం కూడా సరఫరా చేయడం లేదు. బ్యారేజీ నుంచి కేసీ ద్వారా నీటిని మునగలపాడు దగ్గర ఉన్న సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో నిల్వ చేస్తారు. దీని సామర్థ్యం 154.308 ఎంసీటీఎఫ్. ప్రస్తుతం ఎస్.ఎస్ ట్యాంకులో 100 ఎంసీటీఎఫ్ నీరు కూడా నిల్వ లేదు. ఇందులో కొంత నీరు ఎండ తీవ్రతకు ఆవిరి అవుతుంది. అధికారులకు ముందు చూపు లేకపోవడం, పాలకుల నిర్లక్ష్యమే తాగునీటి కష్టాలకు కారణమనే విమర్శలు వస్తున్నాయి. ప్రత్యామ్నాయ చర్యలేవి? ఇటీవల ప్రారంభించిన ముచ్చుమర్రి ఎత్తిపోతల ప్రాజెక్టు ద్వారా కర్నూలు ప్రజల తాగు నీటి దాహం తీర్చవచ్చు. ఇదే విషయాన్ని పథకం ప్రారంభోత్సవ సమయంలో ముఖ్యమంత్రితో పాటు మంత్రులు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ పథకం ద్వారా నీటిని అందించాలంటే నగర మధ్యలో పోయే కేసీ కాలువను శుభ్రం చేయాలి. ఇందులోని చెత్తాచెదారాన్ని తొలగించిన తర్వాత నీటిని వదిలేందుకు అవకాశం ఉంది. అయితే, ఇంత వరకు దీనికి సంబంధించిన పని మొదలు పెట్టలేదు. ఇక నగర ప్రజల తాగు నీటి దాహాం తీర్చే మరో ప్రత్యామ్నయ మార్గం గాజులదిన్నె ప్రాజెక్టు. ఈ ప్రాజెక్టు నీటిని కాలువ ద్వారా కేసీకి మళ్లీంచాలి. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు కూడా నేటికీ మొదలు కాకపోవడంతో వచ్చే వేసవిలో కోడుమూరు, కర్నూలు వాసులకు తాగునీటి కష్టాలు తప్పేలా లేవు. -
కేసీకి 130 క్యూసెక్కుల నీరు విడుదల
సుంకేసుల(గూడూరు రూరల్) : సుంకేసుల రిజర్వాయర్ నుంచి కేసీ కెనాల్‌కు బుధవారం డ్యాం అధికారులు 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కర్నూలు నగర ప్రజల తాగునీటి అవసరాలను తీర్చేందుకు గాను సమ్మర్ స్టోరేజ్ ట్యాంకుకు కేసీ ద్వారా 130 క్యూసెక్కుల నీటిని విడుదల చేశామని, ప్రస్తుతం రిజర్వాయర్‌లో 0.35 టీఎంసీ మాత్రమే నీరు నిల్వ ఉన్నట్లు డ్యాం వర్క్ఇన్స్పెక్టర్ మునిస్వామి తెలిపారు. తుంగభద్రా డ్యాం నుంచి రావలసిన కోటా పూర్తయిందని, గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి సుంకేసులకు నీరు రావాల్సి ఉందని ఆయన పేర్కొన్నారు. -
కేసీ కాల్వకు 2,600 క్యూసెక్కుల నీరు విడుదల
జూపాడుబంగ్లా: సుంకేసుల జలాశయం నుంచి కేసీ కాల్వకు 2,600క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఏఈ నరేష్ తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో సుంకేసుల జలాశయంలోకి 2,800క్యూసెక్కుల వరదనీరు వచ్చిచేరుతోందన్నారు. అందులో 2,600క్యూసెక్కుల నీటిని కేసీ కాల్వకు విడుదల చేస్తున్నట్లు తెలిపారు. కేసీ కాల్వకు సరఫరా అయ్యే నీటిలో అలగనూరు రిజర్వాయర్‌కు 900, నిప్పులవాగుకు 700, తూడిచెర్ల సబ్‌చానల్‌కు 200క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కేSసీ కాల్వకు కేటాయించిన 3టీఎంసీల నీటిలో ఇప్పటిదాకా3000 క్యూసెక్కులు మాత్రమే వాడుకున్నట్లు ఆయన తెలిపారు. -
‘సుంకేసుల’కు పెరిగిన ఇన్‌ఫ్లో
సుంకేసుల(గూడూరు): మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా తుంగభద్రనది ద్వారా సుంకేసుల రిజర్వాయర్‌కు నీరు చేరుతోంది. గురువారం డ్యాంకు 2700 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉన్నట్లు డ్యాం ఏఈ శ్రీనివాసరెడ్డి తెలిపారు. కేసీ కాల్వకు 2600 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామన్నారు. రిజర్వాయర్ గేటును అర మీటర్‡మేర ఎత్తి దిగువకు 1500 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు. మరో రెండు, మూడు రోజుల పాటు ఇన్‌ఫ్లో కొనసాగే అవకాశం ఉందన్నారు. -
వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడి
పులివెందుల : సింహాద్రిపురం మండలం సుంకేసుల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై తెలుగుదేశం నాయకులు కర్రలు, రాడ్లతో దాడి చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సుంకేసుల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు సోమశేఖరరెడ్డి, తెలుగుదేశం పార్టీ నాయకుడు ఆనంద్‌కుమార్‌రెడ్డిలకు గతంలో దిబ్బ విషయమై గొడవలు ఉండేవి. ఇందుకు సంబంధించి పెద్ద మనుషుల సమక్షంలో గతంలో పంచాయితీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో కక్షలను మనసులో పెట్టుకొన్న టీడీపీ నాయకులు ఆనంద్ కుమార్‌రెడ్డి, చంద్రకళాధర్‌రెడ్డి, రణధీర్‌రెడ్డి, కోటిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి, పరమేశ్వరరెడ్డిలు బుధవారం రాత్రి వైఎస్సార్సీపీ నాయకుడు సోమశేఖరరెడ్డి అన్న మహేశ్వరరెడ్డి ఇంట్లోకి ప్రవేశించి మహేశ్వరరెడ్డితోపాటు వారి బంధువులైన శంకరనారాయణరెడ్డి, రమేష్‌రెడ్డి, సరోజ, సుస్మితలపై కర్రలు, రాడ్లతో దాడి చేశారు. ఈ దాడిలో శంకరనారాయణరెడ్డి తలకు తీవ్ర గాయాలు కాగా.. మిగతా నలుగురికి కూడా గాయాలయ్యాయి. వీరిని పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బాధితులను పరామర్శించిన వైఎస్ భాస్కర్‌రెడ్డి : సుంకేసుల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి జరిగిన విషయాన్ని తెలుసుకున్న వైఎస్సార్సీపీ పులివెందుల నియోజకవర్గ ఇన్‌ఛార్జి వైఎస్ భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిలు స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేరుకొని బాధితులను పరామర్శించి అండగా ఉంటామని ధైర్యం ఇచ్చారు. ఘటన జరిగిన తీరును వారిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వైఎస్ భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ టీడీపీ నాయకుల ఆగడాలు రోజు రోజుకు మితిమీరిపోతున్నాయని.. అనవసరంగా వైఎస్సార్సీపీ నాయకులపై కవ్వింపు చర్యలకు పాల్పడుతూ గ్రామంలో కక్షల వాతావరణాన్ని నెలకొల్పుతున్నారన్నారు. వారికి ప్రజలే బుద్ధి చెప్పే రోజులు దగ్గరపడ్డాయని పేర్కొన్నారు. -
‘సుంకేసుల’కు నిలిచిన ఇన్‌ఫ్లో
సుంకేసుల(గూడూరు): తుంగభద్ర నది ఎగువ ప్రాంతాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో సుంకేసుల రిజర్వాయర్‌కు నీటి చేరిక నిలిచిపోయినట్లు డ్యాం వర్క్ ఇన్స్పెక్టరు మునిస్వామి సోమవారం తెలిపారు. దీంతో కేసీ కాల్వకు నీటి విడుదల నిలిపేసామని, డ్యాంలో 1.15 టీఎంసీ నీరు నిల్వ ఉందని ఆయన పేర్కొన్నారు. -
సుంకేసుల కళకళ
గూడూరు: సుంకేసుల రిజర్వాయర్ నీటితో కళకళలాడుతోంది. మూడు రోజులుగా రిజర్వాయర్ ఎగువన కుండపోతగా వర్షాలు పడుతుండడంతో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఉదయం రిజర్వాయర్‌కు ఇన్‌ఫ్లో పెరగడంతో డ్యాం అధికారులు ఆరు గంటల సమయంలో రెండు గేట్లను మీటర్ మేర ఎత్తి 4 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఉదయం 9 గంటలకు ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కులకు చేరడంతో మరో 2 గేట్లను మీటర్ మేర ఎత్తి మొత్తం నాలుగు గేట్ల ద్వారా 18 వేల క్యూసెక్కుల నీటిని శ్రీశైలం వైపు మళ్లించారు. కేసీ కాల్వకు 2300 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు డ్యాం వర్క ఇన్స్పెక్టర్ మునిస్వామి పేర్కొన్నారు.