నీటి ముళ్లు!
నీటి ముళ్లు!
Published Tue, Feb 21 2017 11:34 PM | Last Updated on Tue, Sep 5 2017 4:16 AM
కర్నూలుకు తప్పని మంచినీటి ఇక్కట్లు
– నెల రోజులకు మించి నీరులేని దుస్థితి
– ఎస్‌ఎస్ ట్యాంకులో నిలవని నీరు
– ముచ్చుమర్రి నుంచి ముందుకు సాగని నీటి తరలింపు
– గాజులదిన్నె ఆయకట్టు రైతుల నోట్లో మట్టికొట్టాల్సిందే..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు నగరానికి మంచినీటి సమస్య పొంచి ఉంది. 30 రోజులకు మించి నీరు అందుబాటులో లేని దుస్థితి నెలకొంది. ఒకవైపు ఎస్‌ఎస్ ట్యాంకులో నీరు నిలబడని పరిస్థితి కాగా.. మరోవైపు సుంకేసులలో 20 నుంచి 25 రోజులకు మించి నీటి లభ్యత లేని పరిస్థితి. ఈ నేపథ్యంలో కర్నూలు నగరానికి తీవ్ర మంచి నీటి ఇక్కట్లు తప్పేలా లేవు. ఇప్పటికే రోజు వారీగా 75వేల మిలియన్ లీటర్ల నీటిని కార్పొరేషన్‌లోని జనాభాకు సరఫరా చేయాల్సి ఉండగా.. ప్రస్తుతం చేస్తోంది 65 మిలియన్ లీటర్లు మాత్రమే. ప్రభుత్వం నుంచి ముందుచూపు లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమనే విమర్శలు వినిపిస్తున్నాయి. హంద్రీనీవా ద్వారా పందికోన చెరువును నింపి.. అక్కడి నుంచి గాజులదిన్నెకు నీటిని తరలించి నిల్వ చేసి ఉంటే ఈ పరిస్థితి ఎదురయ్యేది కాదనే అభిప్రాయం వినిపిస్తోంది. మరోవైపు ముచ్చుమర్రి ద్వారా కేసీ కెనాల్‌కు నీటిని తరలించి కూడా సమస్య ఉత్పన్నం కాకుండా చూసే అవకాశం ఉండేది. అయితే, ఈ రెండింటిలో ప్రభుత్వం ఎలాంటి పరిష్కారం చూపకపోవడంతో ఎండాకాలంలో మంచినీళ్ల కోసం కర్నూలు ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో గాజులదిన్నె ఆయకట్టు రైతుల నోట్లో మట్టి కొట్టి కర్నూలుకు నీటిని తరలించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
ఎండిపోయిన సుంకేసుల
వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్‌కు మంచినీటి అవసరాలు తీర్చేది సుంకేసుల మాత్రమే. అయితే, ప్రస్తుతం సుంకేసుల ఎడారిని తలపిస్తోంది. రిజర్వాయర్‌లో కేవలం 0.28 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ నీరు కర్నూలు కార్పొరేషన్‌లోని ప్రజల నీటి అవసరాలను 20 నుంచి 25 రోజులు మాత్రమే తీర్చగలవు. మరోవైపు పురాతన కట్టడమైన ఎస్‌ఎస్ ట్యాంకులో సగం నీరు కూడా నిలబడటం లేదు. దీంతో ప్రస్తుతం ఉన్న నీరు వారం నుంచి పది రోజుల వరకు మాత్రమే సరిపోతుందని అధికారుల అంచనా. అంటే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు నెలకు మించి వచ్చే పరిస్థితి లేదని అర్థమవుతోంది. ఈ లెక్కన ఏప్రిల్ కంటే ముందు కర్నూలు ప్రజలు దాహార్తిని ఎదుర్కోవాల్సి రానుంది. ఈ దాహార్తిని తీర్చేందుకు ప్రభుత్వం ముందుచూపు లేకుండా వ్యవహరించడమే కారణమన్న విమర్శలు ఉన్నాయి.
ఇలా చేసి ఉండాల్సింది!
వాస్తవానికి కర్నూలు కార్పొరేషన్ నీటి అవసరాలు సుంకేసుల నుంచి తీర్చలేమని ముందుగానే ప్రభుత్వానికి తెలుసు. ఈ నేపథ్యంలో హంద్రీనీవా నుంచి పందికోనకు నీరు ఇచ్చి.. అక్కడి నుంచి గాజులదిన్నెకు తరలించి నిల్వ చేసుకుని ఉండాల్సింది. తద్వారా గాజులదిన్నె నుంచి కర్నూలు కార్పొరేషన్‌కు నీటిని తరలించినా.. ఆక్కడి ఆయకట్టు రైతులకు ఇబ్బందులు ఉండేవి కావు. ప్రభుత్వం మాత్రం ఈ పనిచేయలేదు. అంతేకాకుండా హంద్రీనీవా ద్వారా కర్నూలు జిల్లాకు నీరు ఇవ్వకుండా ఇతర ప్రాంతాలకు తరలించారు. గత రెండునెలల కాలంలో కర్నూలు జిల్లాకు కేవలం 3 టీఎంసీల నీటిని మాత్రమే ఇవ్వగా.. మిగిలిన ప్రాంతాలకు ఏకంగా 43 టీఎంసీల నీటిని శ్రీశైలం రిజర్వాయర్ నుంచి తరలించారు. మరోవైపు గాజలదిన్నె ఆయకట్టు రైతాంగానికి ఇప్పటి వరకు రెండు తడులు మాత్రమే ఇచ్చారు. ప్రస్తుతం ఆయకట్టు రైతాంగం ఆందోళనతో మూడో తడి నీరు ఇస్తున్నారు. నాలుగోతడి నీరు ఇస్తేనే 7వేల ఎకరాల ఆయకట్టు నిలబడుతుంది. అయితే, ప్రభుత్వం మాత్రం నాలుగోతడి ఇవ్వలేమని ఆయా గ్రామాల్లో చాటింపు వేసి మరీ చెబుతోంది. అంటే గాజలదిన్నె ఆయకట్టు రైతాంగం నోట్లో మట్టి కొట్టి.. ఆ నీటిని కర్నూలుకు తరలించాలనే యోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. ముందుచూపు లేని తన చేతగాని తనానికి రైతాంగాన్ని బలిపశువు చేయాలని చూస్తోందనే విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి.
Advertisement
Advertisement