మూడు రోజుల్లో ముప్పు
మూడు రోజుల్లో ముప్పు
Published Tue, Jun 13 2017 10:37 PM | Last Updated on Tue, Sep 5 2017 1:31 PM
కర్నూలు నగరవాసులకు బురద నీరే గతి
– జీడీపీలో కనిష్ట స్థాయికి నీటి నిల్వలు
– ప్రస్తుతం 0.2 టీఎంసీలు మాత్రమే
– మరో 3 రోజుల్లో నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం
– పొంచి ఉన్న తాగునీటి ఇక్కట్లు
కర్నూలు సిటీ/టౌన్: కర్నూలు నగర ప్రజలకు తాగునీటి ముప్పు పొంచి ఉంది. మరో మూడు రోజుల్లో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి నీటి సరఫరా నిలిచిపోనుండటమే అందుకు కారణంగా తెలుస్తోంది. జీడీపీలో నీటి నిల్వలు అత్యంత కనిష్ట స్థాయికి పడిపోవడంతో ఇప్పటికే వారం రోజులుగా బురద నీరు సరఫరా అవుతోంది. ఈ నీటిని ఫిల్టర్ చేయలేక అధికారులు సైతం తీవ్ర ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తోంది. అయినా ప్రజాప్రతినిధులు మాత్రం నోరు మెదపకపోవడం విమర్శలకు తావిస్తోంది. అధికారులకు, ప్రజాప్రతినిధులకు ముందుచూపు లేకపోవడమే తాజా దుస్థితి నెలకొన్నట్లు చర్చ జరుగుతోంది. నాయకులకు పనుల్లో వాటాలపై ఉన్న శ్రద్ధ నీటి సమస్య శాశ్వత పరిష్కారంపై లేకపోవడం వల్లే ఏటా తాగునీటి సమస్య జటిలమవుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెండు నెలలుగా తాగునీటిని అందించిన గాజులదిన్నె ప్రాజెక్టు చరిత్రలోనే అత్యంత దిగువకు నీటి నిల్వలు పడిపోయాయి. ఇప్పటికే నెలన్నర రోజులకు పైగా శివారు కాలనీలకు వారం, పది రోజుల నుంచి నీరందని పరిస్థితి నెలకొంది. అధికారులు మాత్రం నగరంలో ఎక్కడా తాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెబుతుండటం గమనార్హం.
కనిష్ట స్థాయికి నీటి నిల్వలు
హంద్రీనదిపై గోనెగండ్ల మండలం గాజులదిన్నె దగ్గర 4.5 టీఎంసీల సామర్థ్యంతో మధ్యతరహా ప్రాజెక్టు(దామెదరం సంజీవయ్య)ను నిర్మించారు. కోడుమూరు, ఎమ్మిగనూరు నియోజకవర్గంలోని తాగు, సాగు నీటి నీటిని అందించాలనేది దీని ఉద్దేశం. ఈ ఏడాది సుంకేసుల బ్యారేజీ ఎండిపోవడం వల్ల కర్నూలు నగర వాసులకు తాగు నీటి ఇబ్బందులు రావడంతో గాజులదిన్నె ప్రాజెక్టు నుంచి ప్రత్యామ్నాయంగా నీటిని విడుదల చేస్తున్నారు. అయితే ఇందులో కూడా నీటి నిల్వలు కనిష్ట స్థాయికి పడిపోయాయి. ప్రాజెక్టు చర్రితలోనే మొదటి సారి 0.2 టీఎంసీలకు నీటి మట్టం చేరుకుంది.
నగరపాలక సంస్థ పరిధిలోని 51 వార్డుల్లో 5.25 లక్షల జనాభా ఉంది. రోజుకు ఒక కుటుంబానికి 155 లీటర్ల చొప్పున నీరు సరఫరా చేయాలి. అయితే ఆ స్థాయిలో నీటి నిల్వలు లేకపోవడంతో అధికారులు రోజుకు 135 లీటర్ల చొప్పున మాత్రమే సరఫరా చేస్తున్నట్లు గణాంకాలను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతం సమ్మర్ స్టోరేజీ ట్యాంకులో ఉన్న నీటి నిల్వల ప్రకారం పది రోజులకు సరిపడా నీరు ఉన్నట్లు అంచనా. అధికారులు మాత్రం 25 రోజులకు సరిపోతుందని చెబుతుండటం గమనార్హం. అయితే అధికారులు ప్రత్నామ్నాయ ఏర్పాట్లు ఇప్పటికీ చేపట్టకపోవడం నగర ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. మొత్తం మీద కర్నూలు ప్రజల తాగునీటి కష్టాలు తీరాలంటే వరుణుడు కరుణించాల్సి ఉంది.
ఇబ్బంది లేదు..
ఇటీవల కురిసిన వర్షాల వల్ల గాజులదిన్నె ప్రాజెక్టులో 50 ఎంసీఎఫ్‌టీ పరిమాణం పెరిగింది. ఈ నీరు నగరవాసులకు 12 రోజులకు సరిపోతుంది. సమ్మర్‌స్టోరేజీలో మరో 25 రోజులకు పరిపడా నీరు నిల్వ ఉంది. అందువల్ల తాగునీటికి ఎలాంటి ఇబ్బంది లేదు.
– రమణమూర్తి, మున్సిపల్ ఇంజనీర్
Advertisement
Advertisement