సుంకేసుల డెడ్‌స్టోరేజీ!
సుంకేసుల డెడ్‌స్టోరేజీ!
Published Mon, Apr 10 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
ఈ దాహం తీరనిది..
- 19 గ్రామాల్లో తీవ్ర తాగునీటి ఎద్దడి
- పూర్తిగా అడుగంటిన జలాశయం
- గూడూరు నగర పంచాయతీలోనూ నీటి ఇక్కట్లే
- ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న అధికారులు
కర్నూలు(అర్బన్): కర్నూలు, కల్లూరు, గూడూరు మండలాల్లోని దాదాపు 19 గ్రామాలకు నీరందిస్తున్న సుంకేసుల వాటర్ స్కీం చేతులెత్తేసింది. సుంకేసుల జలాశయం ద్వారా ఈ గ్రామాలకు కనీసం వారానికి రెండు సార్లు అయినా ఇప్పటి దాకా నీరందించారు. జలాశయంలో కనీస నీటి మట్టం 1.2 టీఎంసీలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం ఎలాంటి ఇన్‌ఫ్లో లేకపోవడంతో 0.02 టీఎంసీకి పడిపోయింది. ప్రస్తుత వేసవిలో డెడ్ స్టోరేజీ కంటే దిగువకు నీరు ఇంకిపోవడంతో జలాశయంలో బురద తేలింది. మే 28, 2016 నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ఇన్‌ఫ్లో జలాశయంలోకి రాకపోవడంతో 20 ఏళ్ల నాడు ఏర్పడిన నీటి కరువు ఈ ఏడాది ఏర్పడిందని ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 70వేల జనాభా ఉన్న ఈ గ్రామాలకు రోజుకు ఒక మనిషికి 40 లీటర్ల ప్రకారం అనుకున్నా 2.8 మిలియన్ లీటర్ల నీటిని సరఫరా చేయాల్సి ఉంది. ఇప్పటి వరకు ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టకపోవడం, తుంగభద్ర డ్యాం నుంచి ముందుగానే ఎక్కువ నీటిని నిల్వ చేసుకోకపోవడం వల్ల ఏప్రిల్ మొదటి వారంలోనే ప్రజలు తీవ్ర తాగునీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నారు. గ్రామాల్లో అక్కడక్కడ ఉన్న బోర్లలో ఉప్పు నీరు వస్తుండడంతో ప్రజలకు ఇక్కట్లు తప్పడం లేదు. సమస్యను తెలియజేసేందుకు ఆయా గ్రామాలకు చెందిన సర్పంచ్‌లు ఆర్‌డబ్ల్యూఎస్ కార్యాలయం చుట్టు తిరుగుతున్నారు.
గొంతెండిన గ్రామాలు
సుంకేసుల, రేమట, ఆర్.కొంతలపాడు, ఆర్‌కే దుద్యాల, తులశాపురం, బసవాపురం, ఆర్.కానాపురం, గుడిపాడు, పర్ల, ఎ.గోకులపాడు, సల్కాపురం, నెరవాడ, గూడురు నగర పంచాయతీ, మునగాల, మల్లాపురం, జూలేకల్లు, పొన్నకల్లు, కె.నాగలాపురం, పెంచికలపాడు, చనుగొండ్ల గ్రామాలు తీవ్ర మంచినీటి ఎద్దడిని ఎదుర్కొంటున్నాయి.
గూడురు నగర పంచాయతీకి తప్పని తిప్పలు
సుంకేసుల నీటి పథకం నుంచి సరఫరా అయ్యే నీరు 20 రోజులుగా బంద్ కావడంతో దాదాపు 25వేల జనాభా ఉన్న గూడూరు నగర పంచాయతీలో తాగునీటి తిప్పలు అధికమయ్యాయి. బోర్ల ద్వారా వారానికి రెండు సార్లు అందిస్తున్న నీరు ఉప్పుగా ఉన్న కారణంగా మెజారిటీ ప్రజలు నీటిని కొనుగోలు చేయాల్సి వస్తోంది. నగర పంచాయతీ హోదా కలిగిన గూడురుకు నీటి కష్టాలు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు.
ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందింస్తాం
సుంకేసుల జలాశయంలో నీరు పూర్తిగా ఎండిపోవడం వల్ల ఈ పథకం కింద ఉన్న గ్రామాలకు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా నీటిని అందించేందుకు చర్యలు చేపట్టాం. గ్రామాలకు సమీపంలోని వ్యవసాయ భూముల్లోని రైతుల బోర్లను అద్దెకు తీసుకొని నీటిని అందిస్తున్నాం. అలాగే చేతి పంపులకు మోటార్లు ఫిట్ చేసి నీటి ట్యాంకులకు ఉన్న ౖపైప్‌లైన్ వరకు కొత్త పైప్‌లైన్లు వేసి నీటి సమస్యను తీర్చేందుకు చర్యలు చేపడుతున్నాం. నదీ పరీవాహక గ్రామాల్లో రింగుబావుల ద్వారా నీటిని పంపింగ్ చేయించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్‌కు పంపుతున్నాం.
- కె.మురళీధర్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈఈ, కర్నూలు
Advertisement