కోట్ల బ్యారేజీకి రూ.8.8 కోట్లు
కోట్ల బ్యారేజీకి రూ.8.8 కోట్లు
Published Sun, Jun 4 2017 10:42 PM | Last Updated on Tue, Sep 5 2017 12:49 PM
- గేట్ల మరమ్మతులకు ప్రతిపాదనలు
- నీరు-చెట్టు కింద నిధులు మంజూరు
- గేట్లకు రంగు, రోప్‌లు, రబ్బర్‌సీళ్లు, వాక్‌వే పనులకు ప్రాధాన్యం
- 6 నెలల్లో పూర్తి చేసేందుకు చర్యలు
కోట్ల విజయభాస్కర్‌రెడ్డి (సుంకేసుల) బ్యారేజ్‌కి 2009 వరదలు చేసిన గాయానికి చికిత్స మొదలైంది. కర్నూలు-కడప కాల్వ సాగునీటి సరఫరాకు ప్రధాన ఆధారంగా ఉన్న ఈ రిజర్వాయర్ వరదల కారణంగా ఛిద్రమై ఎనిమిదేళ్లుగా ఉండి లేనట్టుగా మారింది. ఎట్టకేలకు నీరు-చెట్టు కింద నిధులు మంజూరు కావడంతో అధికారులు టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
కర్నూలు సిటీ: తుంగభద్ర నదికి 2009లో వచ్చిన భారీ వరద కారణంగా చిద్రమైన కోట్ల విజయ భాస్కర్‌రెడ్డి బ్యారేజీ గేట్ల మరమ్మతులపై ఎనిమిదేళ్ల తర్వాత జిల్లా అధికార యాంత్రాంగంలో కదలిక వచ్చింది. దెబ్బతిన్న బ్యారేజీ గేట్లను ఏటా సీజన్‌కు ముందు, తరువాత మెకానికల్ ఇంజినీర్లు పరిశీలించి నివేదికలు ఇవ్వడం తప్ప ప్రభుత్వంలో చలనం లేకుండా పోయింది. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ ఇటీవలే బ్యారేజీని పరిశీలించి నీరు-చెట్టు కింద రూ. 8.8 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు కేసీసీ కర్నూలు డివిజన్ ఇంజినీర్లు రెండు రోజుల క్రితం టెండర్లు పిలిచారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేసేలా టెండర్‌లో నిబంధన పెట్టారు. కడప, కర్నూలు జిల్లాల సాగు నీటి రంగంలో కేసీ కాలువది కీలకపాత్ర. ఈ డ్యాం నుంచి వచ్చే నీటితోనే కాల్వ కింద 2.65 లక్షల ఎకరాలు సాగవుతున్నాయి. అయితే వరదల్లో డ్యాం గేట్లు డెబ్బతినడంతో ఆ పరిస్థితి లేదు. ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకోక పోవడంతో గేట్లు తుప్పు పట్టి, రోప్‌లు, రబ్బరు సీళ్లు సైతం దెబ్బతిన్నాయి. కొన్ని గేట్ల నుంచి లీకేజీలు పెరిగిపోయాయి. బ్యారేజీకి ప్రమాదం పొంచి ఉన్నట్లు ఇప్పటికే రీజినల్ వర్క్‌షాపు అండ్ నిర్వహణ విభాగం ఇంజినీర్లు హెచ్చరించారు. ఏటా గేట్ల పరిస్థితిని పరిశీలించి నివేదిక అందిస్తూనే ఉన్నారు.
రూ. 8.8కోట్లతో బ్యారేజీకి మరమ్మత్తులు...!
సుంకేసుల బ్యారేజీకి స్పిల్‌వేలో 30 రేడియల్ క్రస్ట్ గేట్లు, హెడ్ రెగ్యులేటర్, స్కవర్ వెంట్‌కు 4 ప్రకారం వర్టికల్ గేట్లున్నాయి. 2009లో బ్యారేజీకి వరద పోటెత్తడంతో గేట్లు దెబ్బతిన్నాయి. నాటి నుంచి ఆ గేట్లను ఎవరూ పట్టించుకోలేదు. వాక్‌వే కొట్టుకుపోవడంతో గేట్ల ఆర్మ్స్‌కు గ్రీజ్ కూడా వేయడంలేదు. రబ్బల్ సీల్స్ మార్చకపోవడంతో లీకేజీలు పెరిగిపోయాయి. బ్యారేజీ నిర్మాణ సమయంలో ఏర్పాటు చేసిన 2 స్టాప్‌లాక్ గేట్లలో ఒకటి 30 గేటుకే ఫిక్స్ చేశారు. ఉన్న ఒక్కటి తుప్పుపట్టి సక్రమంగా పని చేయడం లేదు. గేట్లన్నింటికీ 2004 తరువాత పెయింటింగ్ కూడా చేయలేదు.
నిపుణులు హెచ్చరిస్తున్నా..
బ్యారేజీ గేట్ల పనితీరుపై ఇంజనీరింగ్ నిపుణుల కమిటీ రెండు సార్లు నివేదికలు ఇచ్చినా ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడం గమనార్హం. ఇంజనీరింగ్ అధికారులు సైతం బ్యారేజీలో నీటి నిల్వలున్నాయంటూ మరమ్మతుల విషయంలో తప్పించుకునే ధోరణితో వ్యవహారించారు. అయితే ఈ ఏడాది రెండు నెలల క్రితమే పూర్తిగా అంటుగంటిపోవడంతో పనులు చేసేందుకు అవకాశం వచ్చింది. ఇటీవలే కలెక్టర్ బ్యారేజీని పరిశీలించి గేట్లకు నీరు-చెట్టు పథకం కింద నిధులు మంజూరు చేస్తామని చెప్పడంతో ఇంజనీర్లు ప్రతిపాదనలు పంపారు. ఈ మేరకు నిధుల మంజూరుకు అనుమతి రావడంతో టెండర్లు పిలిచారు. మంజూరైన నిధులతో గేట్లు, వాక్‌వే, రోప్‌లు, స్టాక్‌లాక్ గేట్ మరమ్మతులకు ప్రాధాన్యం ఇస్తారు. మరో రూ. 18 లక్షలతో రబ్బరు సీళ్లు, ఇతర పనులు చేస్తారు.
టెండర్లు పిలుస్తున్నాం
- ఎస్.చంద్రశేఖర్‌రావు, జల వనరుల శాఖ ఎస్‌ఈ
కోట్ల విజయభాస్కర్ రెడ్డి బ్యారేజీ(సుంకేసుల) గేట్ల మరమ్మతులు, పెయింటింగ్ కోసం రూ. 8.8 కోట్లతో అంచనాలు రూపొందించాం. టెండర్లు పిలుస్తున్నాం. గేట్ల రోప్‌లు, రబ్బరు సీళ్లు, వాక్‌వేతో పాటు ఇతర చిన్న చిన్న రిపేర్లు చేయనున్నాం. ఇందుకు కలెక్టర్ నీరు-చెట్టు పథకం కింద అనుమతులు ఇచ్చారు.
Advertisement
Advertisement