అడుగంటిన జీడీపీ
– తలెత్తనున్న తాగునీటి కష్టాలు
గోనెగండ్ల: మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్ట్‌లో నీరు అడుగంటిపోతోంది. దీంతో ప్రాజెక్ట్ కింద ఉన్న మంచినీటి పథకాలకు నీటి పంపింగ్ ఇబ్బందిగా మారింది. ప్రాజెక్ట్ క్యాచ్‌మెంట్ ఏరియాలో ఆశించిన మేర తొలకరి వర్షాలు కురవకపోవడం, హంద్రీనీవా నుంచి నీటి సరఫరా లేకపోవడంతో ప్రాజెక్ట్ డెడ్‌స్టోరేజీకి చేరిపోయింది. ప్రస్తుతం ప్రాజెక్ట్ ద్వారా పత్తికొండ, కృష్ణగిరి, డోన్‌లలోని మంచినీటి పథకాలకు ప్రతి రోజు 10 క్యూసెక్కుల నీటి పంపింగ్ జరుగుతుంది.అదే విధంగా కర్నూలుకు ఎడమ కాలువ ద్వారా ప్రతి రోజు 50 క్యూసెక్కుల నీరు సరఫరా చేస్తున్నారు. 4.5 టీఎంసీల నీరు నిలువ చేసే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 650 ఏంసీఎఫ్‌టీ( 0.65 టీఎంసీ)ల మేర పూడిక పేరుకొని పోయిందని అధికారులు పేర్కొంటున్నారు. కొంత నీరు మిగిలి ఉందని, ఆ నీరు మంచినీటి పథకాలకు 15 రోజులకు మించి సరఫరా చేయలేమని వారు స్పష్టం చేశారు. క్యాచ్‌మెంట్ ఏరియాల్లో వర్షాలు కురవకపోతే రెండు వారాల తర్వాత తాగునీటికి ఇబ్బందులు తప్పేలా లేవు.
వర్షాలు వస్తేనే నీరు: రవి, జీడీపీ ఏఈ
వర్షాలు వస్తేనే ప్రాజెక్ట్‌లో నీరు వచ్చి చేరే అవకాశం ఉంది. ప్రస్తుతం ప్రాజెక్ట్‌లో నిల్వ ఉన్న నీరు 15 రోజుల వరకు మంచినీటి పథకాలకు సరఫరాచేయవచ్చు. వర్షాలు ఆలోగా కురవకపోతే నీటి సమస్య తీవ్రమవుతుంది.